మంగళవారం, ఫిబ్రవరి 23, 2010

బ్లాగులు-ఏటిగట్టు

నేను ఒక బ్లాగు టపా చదివి, "ఇవాల్టికి ఇంకేమీ చదవలేను" అనిపించి, ఆ రోజంతా బ్లాగుకి దూరంగా ఉన్న సంఘటన గత ఏడాది కాలంలోనూ కేవలం ఒకే ఒక్కసారి జరిగింది. ఆ టపా గురించి చెప్పడానికి ముందు ఆ బ్లాగు గురించి. పేరు 'ఏటిగట్టు' ..'మాట్లాడుకోడానికి మంచి ప్రదేశం' అనేది ట్యాగ్ లైన్. బ్లాగర్ పేరు శేఖర్ పెద్దగోపు.

ఏముంటుంది ఏటిగట్టు మీద? ప్రవహించే నదీ, పలకరించే పిల్ల గాలీ, చేపలు పట్టడానికో, వ్యాహాళికో వచ్చిన మనుషులూ, వాళ్ళు చెప్పుకునే కబుర్లూ.. ఆ కబుర్లలో కష్టం, సుఖం, వెరసి జీవితం. సరిగ్గా ఈ బ్లాగులో మనకి కనిపించే, మనసుని స్పృశించే అంశాలూ ఇవే. తన టపాలతో శేఖర్ మనల్ని నవ్విస్తారు, మనసుల్ని మెలి పెడతారు... అంతిమంగా మన కళ్ళు తడిసేలా చేస్తారు. నవ్వినా, ఏడిచినా వచ్చేవి కన్నీళ్ళే కదా మరి.

నాలుగేళ్ళుగా బ్లాగుల్లో ఉన్న శేఖర్ 'ఏటిగట్టు' ని మొదలు పెట్టింది మాత్రం గత సంవత్సరం జనవరి 27న. 'నాలోనేను లేనేలేను' అనే టపాతో. ట్విస్ట్ ఏమిటంటే, ఈ టపా ఆయన స్వానుభవం కాదు.. తన మిత్రుడి అనుభవాలకి అక్షర రూపం ఇచ్చారు. ఈ బ్లాగులో నేను చదివిన మొదటి టపా మాత్రం 'జ్ఞాపకమొచ్చెలే... బాల్య స్మృతులన్నీ...' పల్లెటూళ్ళో బాల్యాన్ని గడిపిన నాలాంటి వాళ్ళంతా 'గుర్తుకొస్తున్నాయి..' అని పాడుకునే టపా ఇది. తనకి తీరిక దొరకగానే దీనికి కొనసాగింపు రాస్తానని శేఖర్ గారు మాట ఇచ్చారు కానీ, మనకింకా ఆ రెండో భాగం చదివే అదృష్టం కలగలేదు.

నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించినా మరో టపా 'మళ్ళీ చందమామతో ఒక ఆట ఆడాలి... పాట పాడాలి...' మనం కోల్పోతున్న చిన్న చిన్న సంతోషాలని మన కళ్ళ ముందు ఉంచుతుందీ టపా. లెక్కలంటే నాకు మాత్రమే భయం అనుకున్నాను కానీ, ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా ఒకప్పుడు గణితం బాధితుడే అని తెలిసినప్పుడు మాత్రం బోల్డంత ఆశ్చర్య పోయాను. మొత్తానికి ఎలాగైతేనేం లెక్కల మీద విజయం సాధించేశారు.


అసలు శేఖర్ గారు టపా రాయడానికి ముడిసరుకు పెద్దగా అవసరం లేదు. ఓ నాలుగు ఫోటోలు ఇస్తే అలవోకగా ఒక కథ అల్లేయగలరు. అన్నట్టు ఈయనలో ఉన్న కథకుడి విశ్వరూపం చూడాలంటే 'హ్యాపీడేస్ - నెరజాణ' ని పలకరించాల్సిందే. ఈ టపా చదివాక ఈయన నుంచి రాబోయే కథల కోసం ఎదురు చూడడం మొదలు పెట్టాన్నేను. కథల కన్నా ముందు కవితలు రాయడం మొదలు పెట్టేశారు.. ప్రస్తుతానికి తన బ్లాగులోనే అప్పుడప్పుడూ కవితలని మెరిపిస్తున్నారు.

అప్పుడప్పుడూ అనగానే చెప్పాల్సిన మరో విషయం గుర్తొచ్చింది. ఈ బ్లాగులో టపాలు అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తాయి.. ఇప్పటివరకూ రికార్డైన హయ్యెస్ట్ స్కోర్ నెలకి నాలుగు టపాలు. గత ఏడాది కాలంలో రాసినవి కేవలం ఇరవైనాలుగు. అయితేనేం.. ప్రతి టపా చదివి తీరాల్సిందే.. 'అజ్ఞాత' భక్తులని ఆలోచించమని చెబుతూ మనల్ని ఆలోచనల్లో పడేసినా, కత్తెర కూడా భయపడే టైలర్ చిట్టిబాబు గురించి చెప్పి కడుపుబ్బా నవ్వించినా అందులో 'శేఖర్ మార్కు' అనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

సినిమాల గురించి ఎప్పుడూ టపా రాయకపోయినా, సినిమాల మీద శేఖర్ గారికి ఉన్న ఆసక్తిని పట్టిచ్చే టపా 'బ్లాగుల చుట్టూ తిరిగే కొన్ని సినిమాల పేర్లు, వాటి కథలు టూకీగా..' ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల మీద బోల్డన్ని సెటైర్లు కనిపిస్తాయి ఈ టపాలో. తన బ్లాగంటే ఈయనకి ఎంత ఇష్టమంటే, వినాయక చవితి రోజున పుస్తకాలకి బదులు తన బ్లాగుకి పూజ చేసేటంత. ఇలా చేసిన మొదటి బ్లాగర్ శేఖర్ గారే కావొచ్చు బహుశా.

కొన్ని కొన్ని టపాలతో ఎంతగా నవ్విస్తారో, ఇంకొన్ని టపాలతో అంతగా మనసుని మెలి పెడతారీయన. ఎప్పుడు రాఖీ చూసినా 'మరపురాని బంధం' గుర్తు రాక మానదు మనకి. అంతే కాదు.. ఎప్పుడు ఈ బ్లాగుని తలచుకున్నా నాకు మొదట గుర్తొచ్చే టపా 'పల్లేటి -- చెదరని, ఎప్పటికీ చెదిరిపోని ఒక జ్ఞాపకం' . మొదటి పేరా లో నేను చెప్పిన టపా ఇదే. ఇంత చక్కగా రాసే మీరు మరికొంచం తరచుగా టపాలు రాయాలి శేఖర్ గారూ..

25 వ్యాఖ్యలు:

 1. మురళి గారు,
  చాలా మంచి పరిచయం. నేను కూడా ఏటిగట్టుని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. స్మూత్ ఫ్లోతో, చక్కని విరుపులు, చమక్కులతో శేఖర్ టపాలు ఆకట్టుకుంటాయి. అతని హాస్యటపాలు నాకు బాగా నచ్చుతాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వావ్ !నాకు చాలా చాల ఇష్టం .ముఖ్యంగా "పల్లేటి జ్ఞాపకం " నేను మరచిపోలేనిది . నవరసాలు పండించడంలో దిట్ట అని కితాబు ఇచ్చేయొచ్చు .విషాదం ,హాస్యం ,ప్రణయం అన్నిరకాలు అలవోకగా రాసేస్తుంటారు .మరపురాని భంధం ,యాపి న్యూ ఇయర్ అంటూ తను సొట్టలు గా వేసిన రంగవల్లులు ,మొన్న రాసిన మొగిలి హ్మం ...దేనికదే ప్రత్యేకం .ఏవిటో మురళి నాకు నచ్చేవి వరుసగా రాసేస్తున్నారు ...తరువాత ఏంటో ?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శేఖర్ టపాలు బాగా రాస్తాడు. అంతకన్నా మక్కువగా, చక్కగా అందరి బ్లాగుల్లోనూ కామెంట్లు పెడతాడు. సర్వబ్లాగు మిత్రుడు అన్నా అతిశయోక్తి కాదేమో. అతనింకొంచెం తరచుగా టపాలు రాస్తే బావుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాలా బాగా రాసేరు మురళి గారు. నేను మిస్ అయిన ఎన్నొ పోస్ట్ లు కూడా చదివించేరు. కంగ్రాట్స్ శేఖర్ గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నేను తప్పకుండా చదివే బ్లాగులలో ఇది కుడా వకటి . పరిచయం బాగుంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నా బ్లాగులో వ్యాఖ్యలు రాయటం ద్వారా శేఖర్ గారు నాకు పరిచయం.

  కొత్తపాళీగారు చెప్పినట్టూ సర్వబ్లాగు మితృడు శేఖర్ .
  వారి టపాలు నేను చదివింది తక్కువే కారణం వారు ఎక్కువగా కూడలిలో కనిపించకపోవటం ( నేరం నాది కాదు షేఖర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్)

  మీరు టపా లింకులు ఇచ్చారుకదా అవన్నీ చదివి అక్కడే నా అభిప్రాయం చెపుతా.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చక్కని పరిచయం ,శేఖర్ ఏమి వ్రాసినా చదవడానికి బాన్నే అనిపిస్తుంది కానీ విషాదం వ్రాసారో నాకు భయం మనసు పిండేసి వ్రాస్తారు

  ప్రత్యుత్తరంతొలగించు
 8. "టైలర్ చిట్టిబాబు" చదివిన దగ్గరనుండి ఏటిగట్టుకి విసినకర్ర (ఫాన్ ని అయిపోయాను అని వెరైటీ కోసం) ని అయిపోయానుగా:):)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. నిజం మురళీ గారూ..శేఖర్ గారు తన హాస్య టపాలతో ఎంతగా నవ్విస్తారో..అలాగే కొన్ని టపాలతో గుండెని పిండేస్తారు.
  శేఖర్ గారు మరిన్ని మంచి టపాలు రాయాలని ఆకాంక్షిస్తూ.. చక్కని బ్లాగ్ ని మరింత చక్కగా పరిచయం చేసినందుకు ధన్యవాదాలండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. శేఖర్ గారు రాసే ప్రతిఒక్కటీ మనస్పూర్తిగా చదువుకోవాలనిపిస్తుంది. చిన్నప్పుడు ఏటిగట్టున కూచొని నీటిలో ఒదిలి సాగిపోతున్న కాగితం పడవ చూసినంత సంబరంగా ఉంటుంది. మీరు ఉదహరించిన టపాలు మేలి ముత్యాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఏటిగట్టు అనే పేరు, ఆ పడవ, ఆ నీరు చూడగానే మనసు మా ఊరెళ్ళొచ్చేస్తుంది. మంచి బ్లాగు, చక్కటి పరిచయం.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. నా బ్లాగు గురించి ఓ టపానే మీ బ్లాగులో రావటం చూసి కల కాదని నిర్ధారించుకోడానికి మొదట ప్రక్కనే ఉన్న ఫ్రెండుని కొంచెం గిల్లమన్నాను. వాడు పాత కక్షలు మనసులో పెట్టుకుని గట్టిగా గిల్లేసరికి ఈ లోకంలోకి వచ్చాను. :-)
  మీ చేతిలో ఎంత బాగా ముస్తాబయ్యింది నా బ్లాగు!
  Thank you so much మురళి గారు....

  @మురారి గారు,
  @భావన గారు,
  @పద్మార్పిత గారు,
  @ప్రణీత గారు,
  @మాలా కుమార్ గారు,
  థాంక్యూ..

  @చిన్ని గారు,
  చాలా పెద్ద కితాబు ఇచ్చారండి..థాంక్యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్..

  @కొత్తపాళీ గారు,
  మొన్న బాబురావ్..ఈ రోజు సర్వబ్లాగ్మిత్రుడు...:))
  తరచుగా రాయడానికి ప్రయత్నిస్తానండి.
  థాంక్యూ..

  @లలిత గారు,
  అవునండి..'నేరం మీది కాదు కూడలిది' :)
  మరంతే కదండి..కూడలిలో ఓ టపా ఎక్కువసేపు కనిపించదు కదా...
  థాంక్యూ..

  @నేస్తం గారు,
  భయపడొద్దండి...ఇకనుంచి విషాద టపాలు రాసేటప్పుడు మీలాంటి మిత్రులను దృష్టిలో పెట్టుకుంటాను. థాంక్యూ..

  @జయ గారు,
  మురళి గారు తనదైన శైలిలో 'ఏటిగట్టు' గురించి అందంగా ఎలా చెప్పారో అలా మీరు కూడా కమెంట్ అంతే అందంగా రాసారండి. థాంక్యూ...

  ప్రత్యుత్తరంతొలగించు
 13. నాకు బాగా నచ్చిన బ్లాగుల్లో శేఖర్ గారిది ఒకటి. చక్కటి పరిచయం చాలా బాగారాశారు మురళి గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. మురళిగారు మీ పరిచయం ఎంత బావుందంటే మళ్ళీ వెళ్లి శేఖర్ గారి టపాలన్నీ చదిసి వచ్చా ఇప్పుడే .....ఆయన బ్లాగ్ టైటిల్ తోనే సగంఅభిమానుల్ని సంపాదించుకొని ఉంటారుఅనిపిస్తుంది నాకు ! మేమందరం "నెమలికన్నులో మా బ్లాగ్ "అని మా అదృష్టం గురించి ఒక్కో పోస్ట్ రాసేసుకోవచ్చండీ. మాకు నచ్చిన బ్లాగులన్నీ మరింత అందంగా పరిచయం చేస్తున్నందుకు థాంక్స్ !

  ప్రత్యుత్తరంతొలగించు
 15. అందమైన బ్లాగు గురించి అంతే అందమైన పరిచయం. పైన అందరూ చెప్పినట్టు.. బ్లాగు పేరు, రూపానికి తగ్గాట్టు అంతే ఆహ్లాదంగా ఉంటాయి శేఖర్ గారి పోస్టులు :-)
  ఈ బ్లాగులో నేను చదివినవి చాలా తక్కువ. చదవని టపాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడవన్నీ చదివేసే పనిలో పడతా :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 16. 'ఏటి గట్టు ' నాకు కాస్త ఆలశ్యంగా పరిచయమైనా ఆ గట్టున కూర్చుంటే వినబడే గలగలలు మాత్రం చాలా పరిచితంలా అనిపిస్తాయి.. చతురతే కాకుండా 'నేస్తం' చెప్పినట్లు విషాదం కూడా ఉద్వేగభరితంగా ఉంటుంది! శేఖర్ మీకు హృదయపూర్వక అభినందనలు..

  మురళి, మరొక ఆణిముత్యాన్ని సమీక్షించి కాస్త మరుగునపడ్డ గులకరాళ్ళను వెలికితీసి మళ్ళీ గట్టు మీదకి పడేసినందుకు మీకు కృతజ్ఞతలు :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 17. "ఏటి గట్టు" బ్లాగ్ పేరు ,పిక్చర్ ఎంతో బాగుంటాయి .చూడగానే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది ,నేను ఎక్కువసేపు పిక్చర్ నే చూస్తుంట ,శేఖర్ గారి టపాలన్నీ ఫాలో అవుతాను ,చాలాబాగా రాస్తారు .మీరు బ్లాగ్ గురించి చాల అందంగా పరిచయంచేసేరు .

  ప్రత్యుత్తరంతొలగించు
 18. @మురారి: ఈ మధ్యనే మీ 'ఫ్రీ హగ్స్ ' చూశానండీ.. చదవడం మొదలు పెట్టాను.. పూర్తి చేయాలి.. శేఖర్ గారు రాసే హాస్యం చాలా సహజంగా ఉంటుందండీ, హాస్యం కోసం రాసినట్టుగా ఉండదు.. ధన్యవాదాలు.
  @చిన్ని: నా జాబితా అంతా మీరు చెప్పేశారు!! తర్వాతా...? చూడాలండీ.. ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: 'సర్వ బ్లాగు మిత్రుడు' బాగుందండీ.. ఖాయం చేసేద్దాం. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. @భావన: చెప్పాలంటే ప్రతి పోస్టు గురించీ చెప్పాల్సిందేనండీ.. కొన్ని టపాలు చదివాక మిగిలినవి ఎలాగూ వదిలిపెట్టలేరు కదా అని.. ధన్యవాదాలు.
  @మాలాకుమార్: ఒకసారి చదివిన వాళ్ళెవరూ విడిచిపెట్టరండీ.. ధన్యవాదాలు.
  @లలిత: లంకెలు ఇవ్వని టపాలు కూడా ఉన్నాయండీ.. అవి కూడా చదవాలి మరి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. @నేస్తం: నాకైతే అలా రాయగలగడం ఆయనికి దొరికిన 'రేర్ గిఫ్ట్' అనిపిస్తుందండీ.. ఆయనకీ దొరికే ఫ్రీ టైం గురించి మనకి తెలీదు కానీ, కొంచం సమయం రాయడానికి కేటాయిస్తే మంచి కథా రచయిత అవుతారు. ధన్యవాదాలు.
  @పద్మార్పిత: ఏ ఒక్క టపా చదివినా విసన కర్రో ఏసీనో అయిపోవాల్సిందేనండీ.. ధన్యవాదాలు.
  @ప్రణీత స్వాతి: ఆయన కీబోర్డుకి రెండు వైపులా పదునేనండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. @జయ: యెంత అందంగా చెప్పారండీ!! ..ధన్యవాదాలు.
  @శిశిర: నా మనసు కూడా అంతేనండీ.. అలా అలా గోదారి దగ్గరికి వెళ్లి వచ్చేస్తూ ఉంటాను. ధన్యవాదాలు.
  @శేఖర్ పెద్దగోపు: "వాడు పాత కక్షలు మనసులో పెట్టుకుని గట్టిగా గిల్లేసరికి.." :-) :-) ఇక్కడ కూడా మీ మార్కు చూపించారు కదా!! నేను చేసింది ఏమీ లేదండీ, మీ బ్లాగుని ఓ చిన్న అద్దంలో చూపించడం తప్ప. ఈ సందర్భంగా ఒక విషయం.. ఈ టపా చదివిన మిత్రులొకరు "ఆ బ్లాగు గురించి ఇంకా బాగా రాయొచ్చు" అన్నారు పరోక్షంగా.. అదండీ సంగతి. ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
  @పరిమళం: అబ్బే.. అది పరిచయం గొప్పదనం కాదండీ.. ఆయన టపాల గొప్పదనం. నిజం.. బ్లాగ్ టైటిల్ అంటే ప్రత్యేకమైన ఇష్టం నాకు. మొదటి సారి చూసినప్పుడు ఈ టైటిల్ నేనెందుకు పెట్టుకోలేదు అనిపించిందండీ నాకు. ధన్యవాదాలు.
  @మధురవాణి: వీలు చిక్కినప్పుడల్లా చదివేయండి.. మీరు మొదలు పెడితే చాలు, చదివించే పనిని టపాలే చూసుకుంటాయి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. @నిషిగంధ: "ఆ గట్టున కూర్చుంటే వినబడే గలగలలు మాత్రం చాలా పరిచితంలా అనిపిస్తాయి.." కవితలో వాక్యంలా అనిపిస్తోందండీ.. హమ్మో.. పేపర్లతో పోలిక అస్సలు వద్దండీ.. వాళ్ళ కంట్లో పడితే లక్షల మందికి తెలుస్తుంది బ్లాగు. నేను చదివే పుస్తకాలు, చూసే సినిమాల గురించి రాసుకుంటున్నట్టే, చదివే బ్లాగుల గురించీ అప్పుడప్పుడూ ఇలా... ధన్యవాదాలు.
  @అనఘ: క్రెడిట్ అంటూ ఏమన్నా ఉంటే అది ఆ బ్లాగుదీ, నిర్వహిస్తున్న శేఖర్ గారిదీనండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. స్పందించిన మిత్రులకు ఆలస్యంగా ప్రతిస్పందిస్తున్నందుకు మన్నించాలి.

  @శిశిర గారు,
  @వేణు గారు,
  @మధుర వాణి గారు,
  @అనఘ గారు,
  థాంక్యూ..

  @పరిమళం గారు,
  థాంక్యూ...అవునండీ మీరన్నట్టు మనందరం 'నెమలికన్ను లో నా బ్లాగు' అని మన అదృష్టం గురించి ఓ టపా రాసేసుకోవచ్చు.

  @నిషిగంధ గారు,
  "ఆ గట్టున కూర్చుంటే వినబడే గలగలలు మాత్రం చాలా పరిచితంలా అనిపిస్తాయి.."
  ఏం రాసారండీ..నాకు మీ వ్యాఖ్య కూడా కవితలానే అనిపించిందండి.
  థాంక్యూ..

  ప్రత్యుత్తరంతొలగించు
 25. నేను తరచూ చూసే బ్లాగుల్లో ఒకటైన ఏటిగట్టు గురింఛి బాగా రాసారండీ...

  ప్రత్యుత్తరంతొలగించు