ఆదివారం, ఫిబ్రవరి 14, 2010

సీతాకోకచిలుక

అప్పుడే నిక్కర్ల నుంచి ఫేంట్ల లోకి మారిన కుర్రాడూ, కొత్తగా ఓణీ వేసుకోవడం మొదలు పెట్టిన అమ్మాయీ ప్రేమలో పడడం, పెద్దవాళ్ళు ఒప్పుకోక పోవడం, స్నేహితులంతా కలిసి వాళ్ళ ప్రేమని గెలిపించడం.. పదేళ్ళ క్రితం 'యూత్' సినిమాల ప్రభంజనం మొదలయ్యాక ఏటా విడుదలవుతున్న సినిమాల్లో కనీసం ముప్ఫై శాతం సినిమాల కథ ఇదే. నిజానికి తెలుగులో ఈ తరహా ప్రేమ కథలకి నాంది పడింది సుమారు మూడు దశాబ్దాల క్రితం.. తమిళం నుంచి తెలుగులోకి రీమేకైన 'సీతాకోకచిలుక' సినిమా ద్వారా.. దర్శకుడు భారతీరాజా.

తమిళంలో విజయవంతమైన 'అలైగళ్ ఊయివితలై' సినిమాని తెలుగులో పునర్నిర్మించింది పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ సంస్థ. దర్శకుడినీ, హీరోనీ తమిళం నుంచి తెచ్చుకుని, మాటలు రాయడానికి జంధ్యాలనీ, సంగీతానికి ఇళయరాజానీ ఎంచుకుని అందమైన 'సీతాకోకచిలుక' ని ప్రేక్షకులకి బహూకరించింది 1981 లో. ఇది కేవలం అప్పుడే ఈడొచ్చిన పిల్లల ప్రేమ కథ మాత్రమే కాదు, భిన్న మతాలకీ, సామాజిక, ఆర్ధిక నేపధ్యాలకీ చెందిన అమ్మాయికీ, అబ్బాయికీ మొలకెత్తిన ప్రేమ కథ.

రఘు (కథానాయకుడు మురళి, తర్వాతి కాలంలో కార్తీక్ గా మారాడు) ఓ పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. తండ్రి చిన్నప్పుడే కాలం చేయడంతో, తల్లి శారదమ్మ(డబ్బింగ్ జానకి) సంగీతం పాఠాలు చెప్పి అతన్ని పోషిస్తూ ఉంటుంది. అతనికో స్నేహ బృందం. (వీళ్ళలో తర్వాతి కాలంలో కేరక్టర్ నటుడిగానూ, 'స్వరకల్పన' సినిమాతో హీరో గానూ, ఆపై టీవీ నటుడిగానూ మారిన ఏడిద శ్రీరాం, నేటి ప్రముఖ హాస్య నటుడు అలీ ఉన్నారు.) సైకిళ్ళ మీద పొరుగూరు వెళ్లి చదువుకుంటూ, పెద్దల యెడల భయ భక్తులు నటిస్తూ, తగుమాత్రం అల్లరి చేస్తూ రోజులు గడిపేస్తూ ఉంటారు వీళ్ళంతా.

సముద్రపు ఒడ్డునే ఉన్న ఆ ఊరికి ఓ చిన్న సైజు రాజు డేవిడ్ (శరత్ బాబు), భార్య మేరీ (సిల్క్ స్మిత), ఒక చెల్లెలు కరుణ (ముచ్చెర్ల అరుణ). పిల్లలు లేరు. చెల్లెలు పట్నంలో చదువుకుంటూ ఉంటుంది. సెలవుల్లో సొంతూరికి వచ్చిన కరుణ ని రఘు బృందం అల్లరి పెట్టడం, ఆమె పాటని పరిహసించడం, ఆమె పట్టుదలగా జానకమ్మ దగ్గర సంగీతం నేర్చుకుని 'సాగర సంగమమే' అని స్వరయుక్తంగా పాడగానే, రఘు ఆమెతో ప్రేమలో పడిపోయి 'ప్రణయ..సాగర సంగమమే' అంటూ పాట అందుకోవడం చకచకా జరిగిపోతాయి.

కోపిష్టీ, పాపిష్టీ అయిన డేవిడ్ కి ఎదురు పడి మాట్లాడాలంటే ఆ ఊళ్ళో పెద్ద వాళ్ళకే భయం. మరి పిల్లకాయ రఘు తన ప్రేమ గురించి ఎలా చెబుతాడు? ఏ ధైర్యంతో అతని చెల్లెల్ని అడుగుతాడు? ఆ బాధ్యత స్నేహితులంతా తీసుకుంటారు. పెళ్లి పెద్దల వేషంలో పూలూ, పళ్ళూ పట్టుకుని, డోలూ, సన్నాయిని వెంట తీసుకుని డేవిడ్ ఇంటికి వెళ్లి రఘు, కరుణా ప్రేమించుకున్నారనీ, వాళ్ళ పెళ్లి చేయడం పెద్దవాళ్ళ ధర్మమనీ చెప్పి ఒప్పించే విఫల యత్నం చేస్తారు. డేవిడ్ కి వెర్రి కోపం రావడంతో కథ పరుగందుకుని, ప్రేక్షకులు ఊపిరి పీల్చుకునే ముగింపు దగ్గర ఆగుతుంది.
ప్రేమ కథలు ఎప్పుడూ అందమైనవే. అలాంటి ప్రేమకథకి కర్ణ పేయమైన సంగీతం తోడైతే, ఆ కథ ఓ కావ్యమైపోదూ? 'సీతాకోకచిలుక' విషయంలో జరిగింది అదే. ఇళయరాజా సంగీతంలో ప్రతి పాటా దేనికదే ప్రత్యేకమైనది.. ఇక నేపధ్య సంగీతం.. వాయిద్యాలని ఉపయోగించి మాత్రమే కాదు, నిశ్శబ్దం తో సైతం ఎలాంటి మూడ్ ని సృష్టించవచ్చో ఈ 'స్వరజ్ఞాని' కి బాగా తెలుసు. 'మాటే మంత్రము..' 'మిన్నేటి సూరీడు' ఇప్పటికీ తరచూ వినిపిస్తూనే ఉంటాయి. 'అలలు కలలు' పాట చిత్రీకరణలో వంశీ మార్కు కనిపిస్తుంది. ఈ సినిమాకి తను అసోసియేట్ డైరెక్టర్. ప్రధమార్ధం లో కన్నా ద్వితీయార్ధంలో పదునెక్కింది సంభాషణలు రాసిన జంధ్యాల కలం.

అసలు ప్రేమ కథ అంటేనే రొమాన్స్.. అలాంటిది టీనేజ్ ప్రేమ కథలో రొమాన్స్ లేకుండా ఉంటుందా? వెండితెర పై భారతీరాజా పండించిన ఈ ప్రేమకథలో రొమాన్స్ కి కొదవ లేదు. ఇప్పుడు చూస్తే ఎక్కడా శృతి మించనట్టే అనిపిస్తుంది కానీ, అప్పట్లో చాలామంది తప్పట్టేసుకున్నారు. హీరో హీరోయిన్ల ఎంపిక మొదలు, వాళ్ళిద్దరి మధ్యా 'తెలిసీ తెలియని' ప్రేమని మొగ్గ తొడిగించి, దానిని పుష్పించి, ఫలించేలా చేయడంలో తెర వెనుక భారతీరాజా కృషి చాలానే ఉంది. ముచ్చెర్ల అరుణ ఈ సినిమాకి ఒక అసెట్ అయితే, ఆమెకి ఈ సినిమా కెరీర్ కి గట్టి పునాది వేసింది. కరుణ పాత్రలో ఒదిగిపోయింది అరుణ.

రఘు గా మురళి నటననీ తక్కువ చేయలేం.. ముఖ్యంగా ఒక ఆకతాయి కుర్రాడు, ప్రేమికుడిగా మారే క్రమాన్ని చాలా బాగా అభినయించాడు. మిగిలిన పాత్రల్లో మొదట చెప్పుకోవాల్సింది సిల్క్ స్మిత. చాలా గంభీరమైన పాత్ర ఈమెది. యెంతో హుందాగా చేసింది. ఆమెకి చక్కగా నటించడం వచ్చినా అందుకు తగ్గ అవకాశాలు రాలేదని నిరూపించే సినిమా ఇది. కరుణని తన కూతురిగా చూసుకుంటూ, ఆమె ప్రేమకి పరిక్ష పెట్టి, అందులో గెలిచిన కరుణకి సహాయ పడే వదిన పాత్ర లో స్మిత ని చూసిన తర్వాత, మరెవ్వరినీ ఆ పాత్రకి ఊహించలేము.

శరత్ బాబు, డబ్బింగ్ జానకి లకి దొరికినవి టైలర్ మేడ్ పాత్రలు. చర్చి ఫాదర్ గా అతిధి పాత్రలో కనిపిస్తారు కళావాచస్పతి కొంగర జగ్గయ్య. 'ఒరేయ్ అబ్బాయిలూ' అంటూ తనకన్నా పెద్ద పిల్లలకి 'బాబాయ్' గా నవ్వించిన అలీ గురించి చెప్పుకోక పోతే ఎలా?? ఇప్పటికీ అలీ ని చూడగానే గుర్తొచ్చే డైలాగ్ ఇది. కథకి తగ్గట్టుగా నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే కాదు లొకేషన్లు కూడా దొరికాయి ఈ సినిమాకి. సాగర తీరపు సౌందర్యాన్ని చూడాల్సిందే కానీ, చెప్పలేం. టీనేజ్ ప్రేమ కథా చిత్రాలు చూడాలనుకునే వారి తొలి ఎంపిక ఈ 'సీతాకోకచిలుక.'

36 వ్యాఖ్యలు:

 1. అలీ మిత్రబృందం పెళ్ళి పెద్దలుగా వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ కల్పనారాయ్(?) అలీని చితకబాదే సీన్ భలే నవ్వుతెప్పిస్తుంది. అలాగే 'పాడింది పాడింది పట్నాల కాకీ' అంటూ ముచ్చెర్ల అరుణని ఆటపట్టించే పాట బాగుంటుంది. 'మాటే మంత్రం' పాటలో బ్యాక్ గ్రౌండ్లో క్రిస్టియానిటీని ప్రతిభంబిస్తూ కొన్ని కొన్ని ట్యూన్స్ భలే చొప్పించారు రాజా గారు. సిల్క్ స్మిత గురించి మీరు ప్రస్తావించన అంశాలు అక్షర సత్యాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఇళయరాజా గారితో పాటు వేటూరి వారికి, గాయనీ గాయకులకు కూడ నా తరుఫున ఒక కోల.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
  పగలు రేయి ఒరిసే మెరిసే సంధ్యారాగంలో
  ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగం లో....
  వీచే గాలి నాలో జాలి తెలిపేనా నీకు
  మనసు మనసు మనువైపోయే గురుతేనా నీకు
  భలే సినిమా గుర్తు చేసారు ,నా ఎర్లీ టీన్స్ కి వెళ్ళిపోయాను -:):)
  ఇప్పటికి ఆ పాటలు నాకు ప్రాణం .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ప్రేమికుల రోజున ఒక మంచి ప్రేమకథా చిత్రాన్ని గుర్తుచేసారు.అలలు కలలు పాట వంశీ గారి మార్క్ అనడంలో సందేహమే లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. శీర్షిక చూసి "మాటే మంత్రమూ " పాడుకుంటూ వచ్చానండీ.. సినిమా గురించి కాదేమో వేరే ఏదో రాసి ఉంటారు అనుకున్నాను. చాలా చక్కని పరిచయం సంగీతం ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఇద్దరు(భారతీ,ఇళయ) రాజా ల గురించి ఎంత చెప్పినా తక్కువే.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నాకు నచ్చిన పాత సినిమాలలో సీతాకోకచిలుక ఒకటి, ఎన్ని సార్లు చూసానో నాకు తెలిదు. ముక్యంగా ఆలీ కామెడీ(ఆలీ కామెడీ బాల నటునిగా పున్యశ్రీ 1985; రవిరాజ పినిశెట్టి గారు అనుకుంట దర్షకులు నాకు ఇష్టమైన సినిమా), ఇళయరాజా సంగీతం, కార్తీక్, అరుణ నటన.
  ఒక మంచి ఆణిముత్యం లాంటి సినిమా.
  మాటే మంత్రం పాట కుడా Evergreen song.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఎంతో అందమైన పాటలున్న ఈ సినిమా నాకూ ఇష్టమే. అవునండీ, ఇంకా మీ సుమన్ బాబు నాన్ స్టాప్ గురించి ఎప్పుడు రాస్తారా అని ఎదురుచూస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మురళీ గారు మీ టపాలు అన్నీ క్రమం తప్పకుండా చదువుతానుకానీ,ఎప్పుడూ వాక్య రాయలేదు(మీఅంత బాగా రాసేవాళ్ళకి నేను ఏమి రాస్తాను అని).కానీ సితాకోకచిలుక సినిమా గురించి మీరు రాసింది చూశాక నాకుకూడా వ్యాక్య రాయాలనిపించింది.
  మానాన్నగారు మాచిన్నప్పుడు టేప్ రికార్డర్ కొని ఈసినిమా పాటల కేసెట్ తెచ్చారు.అప్పటినుండీ ఈసినిమా అన్నా దీనిలో పాటలన్నా చాలా ఇష్టం ." మాటే మంత్రము" పాటంటే చాలా చాలా ఇష్టం. ఈసినిమాలో లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. కన్యాకుమారీలో తీశారు అని చదివినట్టు గుర్తు . .

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ప్రతీ పాట అద్భుతం ఈ సినిమాలో. ముఖ్యంగా నాకు సాగర సంగమమే పాటంటే ప్రాణం. వాణి జయరాం స్వరం లో (సంగీతం ఉండదు) అద్భుతంగా ఉంటుంది. వేటూరి మాటలకి ఇక అక్షర లక్షలిచ్చినా తక్కువే.

  జానకి కన్నుల జలధి తరంగం
  రాముని మదిలో విరహ సముద్రం
  చేతులు కలిసిన సేతు బంధనం
  ఆసేతు హిమాచల ప్రణయ కీర్తనం

  ప్రత్యుత్తరంతొలగించు
 10. హమ్మయ్య ....కాస్త లేటయినా ప్రేమికులరోజు వెళ్లిపోకమునుపే ఈ ప్రేమకధా చిత్రానికి కామెంట్ రాసేస్తున్నా ...ఈ సినిమా అప్పట్లో చూడలేదు ( అప్పట్లో భక్తిరసప్రధానమైనవి తప్ప ఇటువంటివి చూపించేది కాదులెండి మా అమ్మ )కాని మా క్లాస్ మేట్స్ అంతా (వాళ్ళూ చిన్నవాళ్ళే అయినా :( ) చూసేసి కధలు కధలుగా చెప్పుకొనేవారు . తర్వాత టీవీలో వస్తే చూడటమే!
  అరుణను ఏడిపించే పాటకూడా (కా కా కీ కీ) భలే సరదాగా ఉంటుంది .అలలు కలలు ...పాట చాలా ఇష్టం నాకు !
  అన్నట్టు మురళి గారు నేనుకూడా జయగారిలాగా ఎదురుచూస్తున్నా ! నాన్ స్టాప్ గురించి ఎప్పుడెప్పుడు రాస్తారా అని !అనుకున్నంతా అయ్యింది చూశారా ? ఏదో పాత్ర అనుకుంటే ముఖ్యపాత్రనే పోషించేశారిద్దరూ :) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. అందమైన పాటలున్న ఈ సినిమా నాకూ ఇష్టమే,మాటే మంత్రము పాటంటే చాలా ఇష్టం.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. మురళిగారు
  సీతాకోకచిలుక సినెమా గురించి మీ రివ్యూ చాలా బాగుంది...

  టి రాజేందర్ "ప్రేమసాగరం" కూడా చాలా బాగుంటుంది...పాటలు కూడా..వీలుంటే ఈ సినెమా మీ మాటల్లొ...

  ప్రత్యుత్తరంతొలగించు
 13. హన్నా. ఏవిటిది? పిలకాయల్ని చెడగొట్టేందుకు కంకణం కట్టుకున్నారా? శివరాత్రిరోజు భూకైలాస్ సినిమా రాయాల్సింది పద్నాలుగున సీతాకొకచిలుకా? పాటలను వినిందేతప్ప సినిమాపూర్తిగా చూడలేదండీ. అన్నీముక్కలుగా మొత్తంసినిమా కవర్‌చేశా. మాటేమంత్రం పాటవింటే నాకు తమిళసినిమాలో రాధను రోజారేకులతో కప్పేసేదే గుర్తొస్తుంది. పిల్లకాయలంతా పెద్దరికాన్ని భుజాలపైనవేసుకునే సీన్ సూపర్.
  నాస్పూర్తితోనే బ్లాగుటెంప్లేట్ మార్చారని అందరికీ చెప్పేస్తున్నా.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. పాటలు అన్ని అద్బుతంగా ఉంటాయి , నాకు చా ....ల ఇష్టం .మీరన్నట్టు టీనేజ్ లవ్ స్టోరీస్ తో సిమాలు అప్పట్నించే మొదలయ్యాయి . పిల్లలు స్కూల్ డేస్ నుంచే ప్రేమలో పడటం కూడా ఆ సినిమా తరవాతే అనుకుంట .

  ప్రత్యుత్తరంతొలగించు
 15. కొద్దిగా తేడా వ్యాఖ్య ఇది, కోప్పడకండి.
  ఈ సినిమా నాకు ఆనాడూ నచ్చలేదు, ఇవ్వాళా నచ్చదు. ఆ పిల్లల ప్రేమకథ, మీసాల్లేని ఆ హీరో నచ్చలేదనుకుంటాను. ఆ పాటలు కూడా - ముఖ్యంగా మిన్నేటి సూరీడు - ఏదో డబ్బింగు పాటల్లాగా అనిపిస్తాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. మురళీగారు....ఈ సినిమా నాకు అంతగా నచ్చలేదండి ఎందుకంటే మరీ స్కూల్ ఏజ్ లవ్ స్టోరీగా... పాటలు మాత్రం ఇష్టం.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. అసలు ఈ సినిమాకి "సీతాకోకచిలుక" అన్న టైటిల్ పెట్టడంలోనే ఉంది సృజనాత్మకతంతా.ఆ పేరుకి నూటికి నూరు శాతం న్యాయం (మీ టపాలోని ముందు వాక్యాలు దీనికి సింబాలిజం) చేకూర్చారు తెర వెనుక కళాకారులూ,తెరమీద పాత్రధారులూ కూడా.కొత్త నటులను ఉపయోగించుకోడంలో భారతీరాజా అందెవేసినచెయ్యి(చైతన్య చెప్పినట్టు తమిళ్ లో రాధ సీన్ అదుర్స్)
  "సిల్క్" లాంటి నటిని చిత్రసీమ పూర్తిగా తెరమీద ఉపయోగించుకోలేదన్నది ఆమె అర్ధాంతరపు జీవితపు ముగింపంత నిజం.
  (ముఖ్యంగా ఈ సినిమాలో శరత్ బాబు పనివాడింట్లోంచి వస్తున్నప్పుడు ఆమె చూపిన అభినయం తళుక్కున మెరుస్తూంది,ఇంకా మీరు చెప్పిన సన్నివేశం కూడా)
  "రేస్" గారు చెప్పినట్టు ప్రేమ సాగరం (టి,రాజేందర్,నళిని) పూర్తిగా నూన్ షోస్ తో ఆడించినా అప్పట్లో అద్దరకొట్టేసిన సినిమా అది. ఆ పిచ్చి గడ్డాలాడికోసం కాకపోయినా నళిని కోసం,అందులో పాటల కోసమేనా చూసి తీరాల్సిన సినిమా అది.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. అమ్మొ చాలా రాసెసారండి...మీ బ్లాగ్ జన్మదినం తరువాత రాసిన టపాలన్ని మొత్తం చదివేసానండి..కానీ అన్నింటికీ వ్యాఖ్యలు రాయలేక ఇది ఒక్కటీ రాస్తున్నాను...:)

  ఈ సినిమా ఇప్పటివరకు నేను చూడలేదు కాని డైలాగులన్ని బట్టీ వచ్చు...సినిమాకధ పుస్తకం ఉండేది మా ఇంట్లో..అది చాలాసార్లు చదివేసా..!!

  ప్రత్యుత్తరంతొలగించు
 19. ఈ సినిమాలో పాటలు నాకు చాలా ఇష్టం. కానీ.......సినిమా కధ నాకు పెద్దగా నచ్చలేదు. ఈ విషయంలో చదువరి గారి అభిప్రాయమే నాదీను.
  ఈ సినిమా క్లయిమేక్స్ లో వచ్చే లొకేషన్ ( సముద్రతీరంలో ..కొండమీదగుడి) ఎక్కడో ఎవరైనా చెప్పగలరా ! ఈ ప్రశ్న ఇప్పటికి వందమందినయినా అడిగి వుంటాను .ప్చ్...ఎవ్వరూ చెప్పలేదు. ఆ లొకేషన్ నాకు చాలా నచ్చింది .

  ప్రత్యుత్తరంతొలగించు
 20. @శేఖర్ పెద్దగోపు: కల్పనా రాయేనండీ.. మీ వ్యాఖ్య చూశాక, ఆ సీన్ మళ్ళీ చూశాను.. ధన్యవాదాలు.
  @ఊకదంపుడు: "నువ్వు పట్టు చీర కట్టితేను పుత్తడి బొమ్మా.. ఆ కట్టు చూసి తరించేను పట్టు పురుగు జన్మ.." వేటూరి మాత్రమే రాయగలిగే పాటండీ.. ధన్యవాదాలు.
  @చిన్ని: 'గుర్తుకొస్తున్నాయి...' అన్న మాట మీకు!! ..ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 21. @రఘు: భలే పట్టుకున్నారే!! .. ఏం చేయమంటారు చెప్పండి.. ప్రేమలేఖ రాయడమైనా రాదు మరి :):) ..ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: నిజమనండీ.. ఇద్దరు రాజాల గురించీ యెంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది.. ధన్యవాదాలు.
  @లక్ష్మణ్: 'పుణ్యస్త్రీ' లో అలీ కామెడీ.. భలే గుర్తు చేశారు.. ఏడుపు సినిమా అని ప్రిపేరై వెళ్లి బాగా నవ్వుకున్నాను.. ముఖ్యంగా పెళ్లి చూపులకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ ని కుండ మీద టవల్ కప్పి కూర్చోపెట్టే సీన్.. ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 22. @జయ: పౌరాణికం కాదు కదండీ.. అందుకని చూడలేదు.. ధన్యవాదాలు.
  @రాధిక: అయ్యో.. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఇవన్నీ అవసరం అండీ.. ఏమన్నా చెప్పాలనిపించినప్పుడు మీరు తప్పకుండా చెప్పండి.. లోకేషన్స్ గురించి నాకు అంత బాగా తెలీదండీ.. ఎవరైనా చెబుతారేమో చూద్దాం.. ధన్యవాదాలు.
  @వాసు: అవునండీ.. అందుకే ఇళయరాజా కి వాయిద్యాలు ఉపయోగించి మాత్రమే కాదు, నిశ్శబ్దం తోనూ సంగీతం పలికించడం తెలుసన్నది.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. @పరిమళం: అవునండీ 'పాడింది పాడింది పట్నాల కాకీ..' పాట కూడా బాగుంటుంది.. పౌరాణికం అయితే బాబు మాత్రమే చేయగలరు కాబట్టి చూడాలండీ.. మామూలు సినిమా.. అందర్లాగే.. ప్చ్.. అందుకే చూడలేదు.. మీరు గానీ చూశారా?? ..ధన్యవాదాలు.
  @పద్మార్పిత: మంచి పాట.. ధన్యవాదాలండీ..
  @rays: రాజేందర్ అంటే కొంచం భయం అండీ.. కానీ నళిని కోసం ధైర్యం చేయొచ్చు.. ప్రస్తుతం నా దగ్గర డీవీడీ లేదండీ.. దొరకగానే చూస్తాను.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. @సుబ్రహ్మణ్య చైతన్య; రాదని రోజా రేకులతో కప్పే సీన్ గురించి చెప్పే పిలకాయల్ని నేను కొత్తగా చెడగొట్టడానికి ఏం ఉంటుంది చెప్పండి? :):) వీలైనప్పుడు చూసి తమిళ, తెలుగు సినిమాలని పోలుస్తూ ఒక టపా ప్రయత్నించండి.. మీరు సినిమాల గురించి రాస్తే చదవాలని ఉంది.. ధన్యవాదాలు.
  @అనఘ: నిజమేనండీ పాటలే ప్రాణం ఈ సినిమాకి.. ధన్యవాదాలు.
  @చదువరి: కోపం ఎందుకండీ.. నచ్చడం యెంత సహజమో, నచ్చక పోవడమూ అంతే సహజం కదా.. కార్తిక్ కి అప్పటికి మీసాలు వచ్చేసినా, టీనేజ్ కుర్రాడి పాత్ర కోసం తీసేశారు.. ఆ గెటప్ మిమ్మల్ని ఇరిటేట్ చేసి ఉండొచ్చు.. పాటలు.. తమిళ్.. నాకు అనిపించలేదండీ మరి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. @సృజన: చదువరి గారికి చెప్పిన మాటే మీకూను.. వ్యాఖ్యకి ధన్యవాదాలండీ..
  @శ్రీనివాస్ పప్పు: టైటిల్ జస్టిఫికేషన్ కోసమా అన్నట్టు హీరో ఫ్రెండ్సందరూ హీరోయిన్ గురించి మాట్లాడేటప్పుడు 'ఆ సీతాకోక చిలుక..' అంటూ ఉంటారండీ.. ఈ సినిమా తర్వాత మళ్ళీ స్మిత బాగా నటించిన సినిమా 'బావ బావమరిది' ఆ తర్వాత కొన్నాళ్ళకే చనిపోయింది.. నిజంగానే మంచి నటి అండీ.. రాజేందర్ భయం వాళ్ళ 'ప్రేమ సాగరం' మళ్ళీ చూసే సాహసం చేయలేక పోతున్నానండీ.. ఇంతమంది చెబుతున్నారు కాబట్టి ఈసారెప్పుడైనా ధైర్యం చేస్తాను.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. @తృష్ణ: చాలా రోజుల తర్వాత... ఎలా ఉన్నారండీ?? కుశలమేనా? వ్యాఖ్య.. ఏమీ పర్లేదండీ.. మీరు చదువుతున్నారని తెలిసింది కదా.. ధన్యవాదాలు.
  @లలిత: చదువరి గారికిచ్చిన జవాబే మీకూనండి.. లొకేషన్ నాకూ తెలీదు.. మిత్రులెవరైనా చెబుతారేమో చూద్దామండి. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 27. ఆ చివరి సీన్ వైజాగ్ గంగవరం బీచ్ లో తీసారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. వో ఈ పోస్ట్ మిస్ అయ్యానండోయ్. నాకు పెద్ద గా చ్చదు ఈ సినిమా. పాటలు ఇక చెప్పేదేమి వుంది లే కాని. నాకు టీనేజ్ ప్రేమ కధ లు అంత అప్పీలింగ్ గా వుండవు పాటలు మాత్రం ఇప్పటికి రోజు వినాలనిపిస్తుంది. నా దగ్గర ఇళయ రాజా సినిమాల థీం మ్యూజిక్ కలక్షన్ వుంది అప్లోడ్ చెయ్యాలి. ఆ థీం లో సీతాకోక చిలుక విన్నప్పుడల్లా ఇళయరాజా కు ఇంకోసారి తలవంచి నమస్సులు చెయ్యటమే.

  ప్రత్యుత్తరంతొలగించు
 29. సరదాకన్నన్లెండి నిజంగానే కోప్పడతారని కాదు.:)

  ఆ రోజుల్లో "కళ్ళతో పైకొచ్చానం"టూ ముచ్చెర్ల అరుణ ఇచ్చిన స్టేట్‌మెంటొకటి ఫేమస్సు -ఇప్పటి "కంటిచూపుతో చంపుతానం"త కాకపోయినా అప్పట్లో అది ఫేమస్సే! దానిమీద బానే జోకులేసుకునేవాళ్ళం.:)

  ఈ సందర్భంగా సుహాసిని ముక్కుతోటి, ఆర్ నారాయణమూర్తి మొహంతోటీ నటిస్తారంటూ దేవరపల్లి రాజేంద్ర కుమార్ గారు రాసిన ఒక వ్యాఖ్య గుర్తొచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 30. మంచి సినిమా గుర్తు చేసారు.
  నా హైస్కూల్ రోజుల్లో ఇంట్లో చెప్పకుండా చూసిన సినిమా ఇది.
  చెప్తే ఏమంటారో అని భయం.
  ఈ సినిమా ఎప్పటికైనా గుర్తుండడానికి కారణం మాత్రం స్వరజ్ఞాని ఇళయరాజా యే.

  ప్రత్యుత్తరంతొలగించు
 31. @శ్రీనివాస్ పప్పు: ఆ ముగింపు దృశ్యాలు చూస్తున్నప్పుడు మాత్రం అవి తీయడానికి యెంత కష్ట పడి ఉంటారో కదా అనిపిస్తుందండీ.. ముఖ్యంగా కెమెరా.. రాత్రి నుంచి సూర్యోదయానికి మారే దృశ్యాలు.. ధన్యవాదాలండీ..
  @భావన: సినిమా విజయంలో సంగీతానికి కీలక పాత్రండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 32. @చదువరి: చక్కని టపా, బహు చక్కని వ్యాఖ్యలూ చదివించారు.. ధన్యవాదాలండీ..
  @బోనగిరి: చూశారా మీరు కూడా... నిజమేనండీ.. ఇళయరాజాని హీరో గా చెప్పాల్సిన సినిమాల్లో ఇదొకటి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. హమ్మో ....సుమన్ బాబు సినిమా చూడటమే ....మీఅంత ధైర్యశాలిని కాదు మురళిగారు ! అన్నట్టు రాత్రి "wow "లో రికార్డు సృష్టించాడు చూశారా ..:) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 34. @పరిమళం: అవునండీ.. ఎవరూ సాధించలేని పని చేసి మరోసారి తను 'అసాధ్యుడు' అని నిరూపించుకున్నాడు బాబు..

  ప్రత్యుత్తరంతొలగించు
 35. ఈ సినిమా పాటల గురించి చెప్పాలంటే... వావ్..సూపర్, ఎక్సెలెంట్, అద్భుతం.. ఇలాంటి మాటలన్నీ వాడెయ్యచ్చు. ముఖ్యంగా నాకు బాగా నచ్చే వాణీ జయరాం గారి స్వరంలో పాటలున్నాయి. సినిమా మాత్రం నేనింకా చూడలేదు :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 36. @మధురవాణి: మీకు నచ్చే వాణీ జయరాం గారి పాటల కోసమే అయినా మీరోసారి సినిమా చూస్తె బాగుంటుందండీ :-) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు