మంగళవారం, ఫిబ్రవరి 09, 2010

గెడ్డం పెట్టి

"రేయ్..ఆ పెట్టి ఇలా పట్టుకురా.." అని నాన్న కేకేశారంటే నాకు కూసింత గర్వం, కుతూహలం, భయం కలగాపులగంగా కలిగేవి. వీధి గదిలోకి పరిగెత్తి, ఇంట్లో అందరం మొక్కల పీట గా పిలుచుకునే ముక్కాలి పీట ఎక్కి, ముని వేళ్ళ మీద నిలబడి, సరంబీ మీద ఉన్న చిన్న పెట్టిని జాగ్రత్తగా దింపే వాడిని. అక్కడక్కడా తుప్పు మరకలు కనిపించే పసుపురంగు రేకు పెట్టి అది. ఆ పెట్టి తీసుకెళ్ళి వీధిలోనో, పెరట్లోనో ఉన్న నాన్నకి ఇచ్చేసి, ఆ పెట్టి పక్కనే ఓ చెంబుడు నీళ్ళు పెట్టేశానంటే నా డ్యూటీ అయిపోయినట్టే. ఈ డ్యూటీ సాధారణంగా సత్యం రాని ఆదివారాల్లో ఉండేది.

ఇక అది మొదలు నాన్నని రహస్యంగా గమనిస్తూ ఉండేవాడిని. ముందుగా చెంబులో నీళ్ళతో ముఖం కడుక్కుని, పెట్టి మూత తీసేవాళ్ళు. అందులో ఉన్న చిన్న సబ్బు ముక్క అందుకుని గెడ్డానికి రాసుకునే వాళ్ళు. ఆ పెట్టిలో ఏముంటాయో నేను నిద్రలో లేపి అడిగినా చెప్పగలను. ఒక చిన్న అద్దం, ఇత్తడి పిడి ఉన్న పాత కుచ్చు బ్రెష్షూ, ఇత్తడి కత్తెరా, ఇవి కాకుండా మరో బుల్లి పెట్టి. అంటే పెట్టిలో పెట్టన్న మాట. ఆ బుల్లి పెట్టిలో రేజరూ, బ్లేళ్ళూ ఉండేవి. సబ్బు రాసుకోవడం అవగానే, బ్రెష్షు ని నీళ్ళలో ముంచి స్పీడుగా గెడ్డానికి రాసుకుంటే బోల్డంత నురగ వచ్చేసేది. "ముసలి నాన్న" అని నవ్వుకునే వాడిని అప్పుడు. గెడ్డం తెల్లగా అయిపోయిందంటే ముసలాళ్ళై పోయినట్టే కదా మరి..ఐతే నా నవ్వు ఎంతోసేపు ఉండేది కాదు. సబ్బు రాసుకున్నాక తర్వాత పని రేజరులో బ్లేడు మార్చుకోవడం. ఒక్కోసారి ప్రశాంతంగానే జరిగి పోయేది కానీ, కొన్నిసార్లు (అంటే నా టైం బాగోనప్పుడు) మాత్రం మా ఇంట్లో ఓ చిన్న సైజు ప్రళయం వచ్చేసేది. ప్రళయానికి కారణం ఇంకెవరో కాదు, సాక్షాత్తూ నేనే. ఐదో తరగతి వరకూ పెన్నంటే తెలియక పోయినా, పెన్సిళ్ళతో మాత్రం చిన్నప్పటి నుంచే పరిచయం. ఇంటి నిండా పెన్సిల్ ముక్కలు దొర్లుతూ ఉండేవి. పెన్సిల్ తో రాయడం, బొమ్మలేయడం బాగుంటుంది కానీ, ముక్కు అరిగిపోయినప్పుడు చెక్కడం మాత్రం భలే పెద్ద పని.

పెద్దాళ్ళని ఎప్పుడడిగినా "ఇప్పుడు కాదు.. తర్వాత" అని కసురుతారు కదా. అందుకని నాకు వచ్చినట్టుగా నేనే పెన్సిల్ చెక్కేసుకునే వాడిని. అక్కడికీ ఇంట్లో వాళ్ళు బ్లేళ్ళ లాంటి మారణాయుధాలు చిన్న పిల్లాడికి అందకూడదని బోల్డన్ని జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు. కానీ నాకు గెడ్డం పెట్టి అడ్రస్ తెలుసు కదా. రేజర్ లో బ్లేడు బిగిస్తూ నాన్న పిలిచారంటే, నేను పెన్సిల్ చెక్కుకున్న విషయం తెలిసి పోయిందన్న మాట. అక్కడికీ 'నాన్నకి ఎలా తెలుస్తుందా?' అని ఆలోచనలు చేసి, నా వంతుగా నేను బోల్డన్ని జాగ్రత్తలు తీసుకునే వాడిని.

నా వేలి నుంచి వచ్చిన రక్తం (పెన్సిల్ చెక్కినప్పుడు రక్తం తప్పకుండా వస్తుంది) బ్లేడు కాగితానికి అంటుకోడం వల్ల దొరికిపోతున్నానని తెలిసి, వేలు తెగ్గానే నోట్లో పెట్టేసుకునే వాడినా? పెన్సిల్ గీతలు బ్లేడు మీద పడి నాన్న కంట పడుతున్నాయని తెలిసి, వాటిని తుడిచేసే వాడినా.. ప్చ్.. అయినా కూడా దొరికిపోయే వాడిని. సరే.. దొరికి పోయినందుకు గాను ఒకటో, రెండో దెబ్బలు పడేవి. కరడు కట్టిన బాల నేరస్తుడిలా నేను వాటిని పట్టించుకునే వాడిని కాదు. ఎందుకంటే నేను చూడాల్సింది చాలానే ఉంది మరి.

నాన్న పాటికి నాన్నని గడ్డం చేసుకోనివ్వకుండా అమ్మ కాఫీ గ్లాసుతో వచ్చేసేది. అసలు గడ్డం చేసుకునేటప్పుడు కాఫీ తాగడం ఎందుకో నాకు అర్ధమయ్యేది కాదు. నాన్న కాఫీ తాగుతుంటే, వాళ్ళిద్దరూ మాట్లాడుకునే వాళ్ళు. ఆపూట వంటేం చెయ్యాలి లాంటి ముఖ్యమైన విషయాల మొదలు, పిల్లాడి చదువు లాంటి మామూలు విషయాల వరకూ.. (ప్రాధాన్యతా క్రమాలు నాచే నిర్ణయింపబడినవి) వాటిని 'కష్టం సుఖం' అంటారని తర్వాత తెలిసింది నాకు. బామ్మ వంటింట్లో పని చేసుకుంటూ "అల్లమ్ము బెల్లమ్ము ఆలి మాటల్లు.. తాటాకు మంటల్లు తల్లి మాటల్లు.." అని పాడుకునేది. గిన్నెలు, చెంబులు సంగీతం సమకూర్చేవి.

కాఫీ తాగేసరికి సగం గెడ్డానికి ఉన్న నురగలు ఆరిపోతాయి కదా.. మళ్ళీ ఇంకోసారి బ్రెష్ తో రాసుకోవాలన్న మాట. ఇంక ఇక్కడి నుంచీ నేనస్సలు రెప్ప వేసేవాడిని కాదు. చిన్న అద్దం ముక్కలో ముఖం చూసుకుంటూ, బ్లేడు బిగించిన రేజర్ ని చెంప మీద పెట్టుకుని నెమ్మదిగా కిందకి లాగుతూ ఉంటే రేజర్ జారినంతమేరా నురుగు ఖాళీ అయిపోయేది. ఒక్కసారి పెన్సిల్ చెక్కితేనే నాకు వేలు తెగిపోతుంది కదా.. మరి రేజర్ తో అలా గీసుకుంటే నాన్నకి రక్తం రాకుండా ఎలా ఉంటుంది? అని పెద్ద డౌట్ నాకు. నా చూపు ప్రభావమో ఏమిటో తెలీదు కానీ, అప్పుడప్పుడూ ఆ ముచ్చటా జరిగేది.

నాన్నకి గెడ్డం తెగిందని తెలియడం ఆలస్యం, కాఫీ పొడుమో పసుపో పట్టుకుని బామ్మ పరుగున వచ్చేసేది. "ఏవీ అక్కర్లేదమ్మా.." అని నాన్న విసుక్కున్నా సరే. రెండు చెంపలు, గెడ్డం.. ఇలా తెల్ల నురుగంతా ఖాళీ అవ్వగానే మళ్ళీ నురుగు పట్టించేవాళ్ళు. ఎన్నిసార్లు, ఎంత సేపు చూసినా తెగకుండా ఉండే కిటుకేమిటో అస్సలు అర్ధమయ్యేది కాదు. ఒసారిలాగే నాన్నకి సత్యం గెడ్డం చేస్తుండగా రహస్యంగా చూస్తూ సత్యానికి రెడ్ హెండెడ్ గా పట్టుబడి పోయా. "ఆయ్.. ఏటండలా సూత్తన్నారు.. పదేల్లాగేరంటే తవరికీ ఒత్తాదండి గెడ్డం.. నేను సూడక పోతానా, సెయ్యకపోతానా" అనేశాడు.

నాకు మామూలు భయం వెయ్యలేదు.. కాస్త గట్టి పిండాన్ని కాబట్టి తట్టుకున్నాను కానీ లేకపొతే జడుపు జ్వరం వచ్చేసేది.. అసలు నేను పెద్దవాడిని అవుతాననీ, నాక్కూడా గెడ్డం వస్తుందనీ అప్పటి వరకూ ఆలోచించలేదు. సత్యం పుణ్యమా అని ఆలోచన మొదలయ్యింది. అది మొదలు ఖాళీ దొరికినప్పుడల్లా అద్దం ముందు కూర్చోవడం.. గెడ్డం, మీసం వస్తే నేను ఎలా ఉంటానో ఊహించుకోవడం.. బ్లేడు తెగకుండా గెడ్డం చేసుకోగలనో, లేదో అని బెంగ పడడం.. కనీసం ఎవరికీ చెప్పుకోగలిగే సమస్య కూడా కాదు కదా.

ఇప్పటికే నెలకోసారి సత్యానికి తల అప్పగిస్తున్నా.. అప్పుడింక గెడ్డం కూడానా అని మరో భయం. నేను కుదురుగా కూర్చోలేదని వంక పెట్టి, గెడ్డం చేస్తూ సత్యం నా ముఖం మీద కత్తితో గాట్లు పెట్టేసినట్టు కలలు.. ఆ నరకాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. కథలు, కాకరకాయలు చదవడం మొదలు పెట్టాక మరోరకం కష్టం.. నాలుగైదు కథలు చదివితే అందులో కనీసం ఒక కథలో అయినా, నిరుద్యోగి కొడుకుని "గెడ్డానికి బ్లేడు కూడా కొనుక్కోలేవు" అని ఈసడించే తండ్రి పాత్ర ఉండేది. నాన్న చేత ఇప్పుడు తింటున్న తిట్లు చాలక, కొత్త తిట్లు కూడా తినాలా అని బెంగ.

హైస్కూలు దాటి కాలేజీలో అడుగు పెట్టాక మరో రకం బెంగ. గీసిన గెడ్డాలూ, గుబురు మీసాలతో ఉంటే క్లాస్మేట్లని చూసి బోల్డంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వాళ్ళు హైస్కూల్లోనే గజనీ దండయాత్రలు చేసొచ్చారన్న సంగతి అప్పట్లో అర్ధం కాలేదు. లెక్చరర్లు కూడా వాళ్ళంటే కొంచం భయంతో మెలగడం, అమ్మాయిలు వాళ్ళ వంక ఆరాధనా భావంతో చూస్తుండడం (ఇలా చూస్తున్నారని మన ఫీలింగ్ అన్నమాట) ఇవన్నీ రాని గెడ్డం మీద బోల్డంత కోపం తెప్పించేశాయి ఆ రోజుల్లో. అదృష్టవ శాత్తూ మూతి మీద మీసం చిక్కబడే నాటికి నేను 'ఉద్యోగస్తుడిని' అయిపోయా. నా మొదటి నెల జీతం రాగానే నేను మొదటగా కొనుక్కున్నది ఏమిటో చెప్పలేదు కదూ.. 'షేవింగ్ కిట్.'

44 వ్యాఖ్యలు:

 1. కరడు కట్టిన బాల నేరస్తుడిలా నేను వాటిని పట్టించుకునే వాడిని కాదు

  గిన్నెలు, చెంబులు సంగీతం సమకూర్చేవి.

  అయ్యా బాబోయ్ భలే నవ్వుకున్నానండీ.........

  "ముసలి నాన్న" అని నవ్వుకునే వాడిని అప్పుడు

  నాకిది అర్థం కాలేదు.....

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Nice one. :)
  Your style is very unique while narrating nostalgia.
  I like all of your posts with the label 'జ్ఞాపకాలు'.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. హ్హహ్హ... భలే ఉందండీ...
  నా చిన్నప్పుడు నేను పెన్సిల్ చెక్కడానికి బ్లేడులు తీసుకుని ఇలానే దొరికిపోతూ ఉండేదాన్ని.. ప్చ్... :(

  >>నా మొదటి నెల జీతం రాగానే నేను మొదటగా కొనుక్కున్నది ఏమిటో చెప్పలేదు కదూ.. 'షేవింగ్ కిట్.'
  నిఝ్ఝంగానా..?!?!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. బలే బా రాశారండీ..నాకూ నాన్న చిన్నప్పుడు నాన్న గడ్డం చేస్కుంటుంటే చూట్టం భలే సరదా...మీలానే నేను కూడా గడ్డం వచ్చాక తెగకుండా ఎలా చేసుకోవాలా అని తెగ ఇదైపోయేవాణ్ణి...నాన్న కిట్ లోంచి బ్లేడుతీసి పెన్సిళ్ళు చెక్కడం,వీపు విమానంమోత మోగడం అన్నీ షరా మామూలే...

  "బామ్మ వంటింట్లో పని చేసుకుంటూ "అల్లమ్ము బెల్లమ్ము ఆలి మాటల్లు.. తాటాకు మంటల్లు తల్లి మాటల్లు.." అని పాడుకునేది. గిన్నెలు, చెంబులు సంగీతం సమకూర్చేవి.".....ః)ః)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఇంతకీ మీరిప్పుడు షేవింగ్ ఎలా చేసుకుంటున్నారో చెప్పలేదు. నేను మాత్రం మీ నాన్నగారు ఎలా చేసుకుంటారో అలానే చేసుకుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. "ముసలి నాన్న...కరడు కట్టిన బాల నేరస్తుడిలా...కుదురుగా కూర్చోలేదని వంక పెట్టి, గెడ్డం చేస్తూ సత్యం నా ముఖం మీద కత్తితో గాట్లు పెట్టేసినట్టు కలలు... నిరుద్యోగి కొడుకుని "గెడ్డానికి బ్లేడు కూడా కొనుక్కోలేవు" అని ఈసడించే తండ్రి పాత్ర ..." అబ్బ...నవ్వీ నవ్వీ అలసిపోయానండీ...బాల్యం నించి యవ్వనం లోకి ఎదిగే క్రమంలో మగపిల్లల కష్టాలు చాలా చక్కగా చెప్పారు. ఎప్పటిలాగే చాలా బాగుందండీ టపా.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చాలా బాగుందండీ మీ గడ్డం పెట్టె కథ. ఇంకా ఇకిలిస్తూనే వున్నా. అర్జెంట్ గా మా అబ్బాయి కి చదివి వినిపించాలి. నేను కూడా చిన్నప్పుడూ మా నాన్న షేవింగ్ కిట్ అంటే బలే కుతూహలం గా చూసే దానిని. మా నాన్న ఆ టైం లో మాతో పక్కన కూర్చో పెట్టూకుని ఆ గీసుకున్న నురగను వెయ్యటానికి పేపర్ ను సమానమైన సైజు లో ముక్కలు గా కట్ చేయించి పెట్టెలో పెట్టించే వారు లేక పోతే ఎక్కాలప్పచెప్పే పనో. నురగ పేపర్ ముక్క మీద కుంచెం నీళ్ళలో కుంచెం ఎందుకలా చేసేవారో..ఎవరికైనా ఐడియా వుందా ఎందుకలా? ఎప్పుడూ అడుగుదామని నీకెందుకే గడ్డం గోల అని తిడతారని వూరుకునే దానిని. (అలానే కదా ఒక ఐన్ స్టీన్ కు చెల్లి రాబోయి ఆగి పోయింది)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. :)))) టపా సూపర్.. మీ బామ్మ గారి పాట సూపరో సూపర్!!
  బ్లేడ్స్ అసలు మాకు అందనిచ్చేవాళ్ళు కాదండీ.. పెన్సిల్ చెక్కే మరలు ఉండేవి :-)

  భావనా, సేం పించ్! నాకూ అదే డ్యూటీ వేసేవారు మా నాన్న.. పేపర్ ముక్కలు కట్ చేసి (చేత్తోనే, మధ్యకి మడిచి, గోటితో గీసి గీసీ చింపాలి) ఇస్తే ఆ డబ్బాలో దాచుకునేవాళ్ళు.. నీ డౌట్ కి సమాధానం ఇదో కాదో నాకూ తెలీదు కానీ, పేపర్తో నురగ తీసేసి ఆ రేజర్ ని నీళ్ళల్లో జలకాలాడించి వెంట్రుకలు తీసేసేవాళ్ళు.. లేకపోతే నీళ్ళన్నీ నురగమయం అయిపోయి ప్రతిరెండుసార్లకీ ఫ్రెష్ చెంబు నీళ్ళు ఉంచాలి... అనుకుంటా!?!?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఒక మామూలు విషయాన్ని కూడా ఇంతందంగా ఎలా చెప్పగలరండీ ! బాపూ గీతలు మీ రాతలూ ఒకటే .

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మా అబ్బాయి మూడేళ్ళ పిల్లవాడప్పుడు , మావారు గడ్డం చేసుకొని , ఎవరో వస్తే మాట్లాడటానికి వెళుతూ కిట్ అక్కడే వుంచి వెళ్ళారు , వెంటనే వాడు బ్రెష్ తో , అద్దం లో చూసుకుంటూ , సబ్బు గడ్డానికి రాసుకొని , రేజర్ తీసుకొనే సమయం లో నేను చూసాను . ఎంత భయం వేసిందో . ఎంత టెన్షన్ వేసిందో . గబ గబా తీసేసరికి చాలా ఏడ్చేసాడు .మీ టపా చదవగానే ఆ సంఘటన గుర్తొచ్చింది . బాగా రాసారు .

  ప్రత్యుత్తరంతొలగించు
 11. బాగుందండి.ఇంత గుర్తుగా పాత జ్ణాపకాలలో విహరించ గలిగే మీరు నిజంగా చాలా అదృష్టవంతులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. మీ పోస్ట్ చదువుతుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఇలాగే ఫోర్త్ క్లాస్ లో వాళ్ళ నాన్నని రోజూ చూసి చూసి తనకు కూడా చేసుకోవాలనిపించి ఏం షేవింగ్ చేసుకోవాలో తెలీక ఐబ్రోస్ గీసేసుకున్నాడు. వాళ్ళ అమ్మ బాగా వాయించి ఐబ్రోస్ మళ్ళీ పెరిగేదాక పెన్సిల్తో గీసేది రోజూ .

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఆ పైన ఫోటోలో కప్పు చూసి, గడ్డం నీళ్ళకి మీరు అంత ఖరీదైన కప్పు వాడతారా? :-\

  ప్రత్యుత్తరంతొలగించు
 14. బాగు బాగు.
  నాన్న గడ్డం చేసుకుంటుంటే చూడ్డం మగ పిల్లలకి ఒక గొప్ప థ్రిల్లు.
  బాగా పట్టుకున్నారు మీ మాటల్లో

  ప్రత్యుత్తరంతొలగించు
 15. అద్దరకొట్టారు, మొక్కలిపీట, బామ్మ పాట, సత్యం రాని రోజు, అమ్మ కాఫీ, అమ్మానాన్న చర్చలు, సత్యం డైలాగూ, మొదటిజీతంతో మొదటికొనుగోలు (కాకపొతే నెత్తురొచ్చిన్నా కొట్టే అవకాశం లేకుండా పారెయ్యమని ఇచ్చే పాత బ్లేళ్ళు కబ్జా చేసేవాళ్ళం అంతే)

  ఇలాంటి పోస్టుల అద్దాల్లో నా మొహం చూసుకుంటుంటే మీ ప్రతిబింబం కనిపిస్తోంది అంతే :)

  ప్రత్యుత్తరంతొలగించు
 16. చాలా బాగా చెప్పారండి.. మీ టపాలు చదువుతుంటే అంతా కళ్ళ ముందే జరిగినట్టు ఉంటుందండి ....చెప్పలేదు కదూ నాకు కాలేజీ లో ఉన్నప్పుడు గడ్డంతో ఇలానే అవస్థపడే వాడినండీ ....జ్ఞాపకాల దొంతరలో దొర్లించారు ....కృతజ్ఞతలు

  ప్రత్యుత్తరంతొలగించు
 17. మురళి గారూ....మీ టపా అల్ట్రా సూపర్..(మరేం చెయ్యను..ఇంతకంటే పేద్ద పదం దొరకలేదు నాకు)..ఆద్యంతం ఆసక్తి కలిగించేలా రాయటం మీకు కొత్తకాకపోయినా మళ్ళీ చెబుతున్నాను..చాలా బాగుంది టపా..

  ప్రత్యుత్తరంతొలగించు
 18. భలే సరదాగా ఉన్నాయండీ మీ 'గడ్డం పెట్టి' జ్ఞాపకాలు :) నా చిన్నప్పుడు మా నాన్న కూడా ఆదివారాలు సాయంత్రం పూట ఇంటెనకాల బల్ల మీద కూర్చుని ఇలానే గడ్డం గీసుకునేవాళ్ళు. ఆ ప్లాస్టిక్ పెట్టె ఎప్పుడూ ఒకే చోట ఉండేది. అవన్నీ గుర్తొచ్చాయి మీ పోస్ట్ చదివాక :)
  పెన్సిల్ చెక్కివ్వడానికి మా అమ్మ అప్పుడప్పుడూ ఆ పెట్టెలోంచి నాన్న వాడేసిన బ్లేడ్లు తీస్కోని చెక్కి ఇచ్చేది. నాకెలాగు భయమే బ్లేడుతో చెక్కాలంటే ;-) కొన్నాళ్ళకి, ఎలాగూ పెన్సిల్ చెక్కే మరలు కొనిచ్చారనుకోండి. ఇహ అప్పుడు మాత్రం రోజుకి ఓ పది సార్లయినా చెక్కడమే చెక్కడం ;-)

  ప్రత్యుత్తరంతొలగించు
 19. మురళి గారు , మాఇంట్లో నాన్నగారికి గెడ్డం పెట్టి నేనే అందించేదాన్ని అమ్మాయినైనా ! నేనే చేస్తానని మారాం చేసేదాన్ని కూడా :) బుల్లి మురళి ఎక్కడదొరికాడో భలే ముద్దుగా ఉన్నాడు ...ఇంతకూ మీ కలలు నిజమవలేదన్నమాట !
  "మూతి మీద మీసం చిక్కబడే నాటికి నేను 'ఉద్యోగస్తుడిని'అయిపోయా మొదటి నెల జీతం రాగానే కొనుక్కున్నది'షేవింగ్ కిట్.'" :)
  ఏమైనా బామ్మగారు మాత్రం సూపరండీ !

  ప్రత్యుత్తరంతొలగించు
 20. మీ ఆర్టికల్ మమ్మల్ని ఒక 20 years వెనక్కి తీసుకుని వెళ్ళిందండీ. మా నాన్న ఒక చిన్న bucket లాంటిది వాడేవారు. ఎప్పుడు కూడా అదే వాడుతున్నారు. మేము scissor తీసి పేపర్స్ అవి కట్ చెయ్యటము వల్ల scissor పదును పోయి మీసాలు సరిగ్గా trim అయ్యేవి కావు.అప్పుడు చుడండి నా పని..మా అన్న పని. మా అమ్మ ఏదోలా కూల్ చేసేది. మీకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. @శిశిర: :):) ధన్యవాదాలండీ..
  @శ్రీకర్ బాబు: సరి చేశానండీ.. ధన్యవాదాలు.
  @వీరుభొట్ల వెంకట గణేష్: Thank you very much..

  ప్రత్యుత్తరంతొలగించు
 22. @మేధ: నిజ్జంగా నిజమండీ.. ధన్యవాదాలు.
  @అక్షర మోహనం: Thank you very much..
  @నాగ: థాంక్స్ అండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 23. @కౌటిల్య: మీరూ నాలాగే అన్నమాట!! ధన్యవాదాలండీ..
  @చిన్ని: ధన్యవాదాలండీ..
  @ఇనగంటి రవిచంద్ర: సబ్బు బదులుగా క్రీం లేదా ఫోమ్మ్ అండి.. చెంబు నీళ్ళకి బదులుగా ట్యాప్.. పెన్సిల్ చెక్కడానికి ఏమాత్రం ఉపయోగపడని బ్లేడు :( ..ఇదండీ ప్రస్తుతం నడుస్తున్న కథ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. @ప్రణీత స్వాతి: దాటేసిన కష్టాలు అందంగానే ఉంటాయి కదండీ.. ధన్యవాదాలు..
  @భావన: మీ అబ్బాయి ఫీడ్ బ్యాక్ కూడా చెప్పరూ... మీ సందేహానికి నిషిగంధ గారు జవాబు ఇచ్చేశారు చూడండి.. ఐన్ స్టీన్ కి చెల్లెళ్ళు ఎందుకు లేరా? అనుకునే వాడిని.. జవాబు ఇప్పుడు తెలిసింది సుమా :);) ..ధన్యవాదాలండీ..
  @నిషిగంధ: అస్సలు మీది భలే నిశిత పరిశీలన అండీ.. కాగితం ముక్క రహస్యం ఇట్టే చెప్పేశారు కదా.. బామ్మ పాటలు మరికొన్ని గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను.. గుర్తు రాగానే చెబుతా.. ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 25. @లలిత: ఎక్కడికో వెళ్ళిపోయాను లలిత గారూ.. అక్కడినుంచి కానీ పడ్డానంటే మీరు బోల్డన్ని టపాలు మిస్సైపోతారు మరి :):) అర్హతకి మించిన ప్రశంశ ఇచ్చారండీ, ధన్యవాదాలు.
  @మాలాకుమార్: ఒళ్ళు జలదరించిందండీ.. మీరు కొంచం ఆలస్యం చేసి ఉంటే.... వ్యాఖ్యకి ధన్యవాదాలు.
  @రఘు: కొన్ని కొన్ని విషయాలు బాగా గుర్తుంటాయండీ.. ఒక్కోసారి వరం.. కొన్ని సార్లు శాపం కూడా :( ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. @విజయశ్రీ: మీరు రాసింది చదవగానే నవ్వుతో పాటు ఆ అబ్బాయి గెడ్డం గీసుకునే ప్రయత్నం చేసి ఉంటే అన్న ఆలోచన కూడా వచ్చిందండీ.. మీ జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
  @సునీత: ధన్యవాదాలండీ..
  @పద్మార్పిత: :):) ..ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 27. @పానీపూరీ: అబ్బే.. అంత దృశ్యం లేదండీ.. ఫోటోలు గూగులమ్మ ఇచ్చింది.. నేనసలు కప్పే వాడను.. ధన్యవాదాలండీ..
  @కొత్తపాళీ: నేను ఒక్కడినేనేమో అనుకున్నానండీ.. మీరంతా తోడున్నారన్న మాట.. ధన్యవాదాలు.
  @శ్రీనివాస్ పప్పు: నాకు పాత బ్లేళ్ళు పారేయమని కూడా ఇచ్చేవారు కాదండీ.. అంత నమ్మకం నేనంటే :):) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. గెడ్డం పెట్టి కబుర్లు అదరహో... :-) చాలా బాగున్నాయండీ.. చిన్నపుడు ఇంచుమించు నేను కూడా ఇంతే... బ్లేడ్ జోలికి మాత్రం వెళ్ళే వాడ్ని కాదు. నాన్న వాడేసిన బ్లేడ్ తో తనే నా పెన్సిల్ చెక్కి ఇచ్చేవారు. తర్వాత మరలొచ్చేశాయ్...

  ప్రత్యుత్తరంతొలగించు
 29. @వీరేంద్ర సుంకవల్లి: మాక్కూడా గెడ్డాలు రాని బ్యాచ్ ఒకటి ఉండేదండీ.. సామూహికంగా విచార పడేవాళ్ళం :):) ..ధన్యవాదాలు.
  @శేఖర్ పెద్దగోపు: 'అల్ట్రా సూపర్' బాగుందండీ కొత్త పదం.. ధన్యవాదాలు.
  @మధురవాణి: మీకో నిజం చెప్పేయాలి.. ఈ టపా పురుష బ్లాగర్లు బాగా ఎంజాయ్ చేస్తారు, మహిళలకి అంతగా నచ్చక పోవచ్చు అనుకున్నా.. కానీ స్పందన నన్ను బాగా ఆశ్చర్య పరిచింది.. మీకు సైతం గెడ్డం పెట్టె అనుభవాలన్న మాట.. ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 30. @పరిమళం: తండ్రికి కూతురు గెడ్డం చేయడం.. తల్చుకోడానికి భలేగా ఉందండీ.. మీరంతా మా బామ్మకి అభిమాన సంఘం పెట్టేసేలా ఉన్నారు :):) ..ధన్యవాదాలు.
  @నాగ వర్మ మంతెన: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 31. @Anjaas: నేను కత్తెర ముట్టుకునే ధైర్యం ఎప్పుడూ చేయలేదు లెండి :):) ..ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: ఎప్పుడూ వేలు కోసుకోలేదన్న మాట మీరు.. నేను చా...లా సార్లు కోసుకున్నానండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 32. నిజమే ఒక మాములు విషయాన్ని ఎంత అందంగా రాసారు ..చాల బాగుంది ..బ్లేడ్ తో పెన్సిల్ చెక్కినపుడు నేను మీ పాట్లే పడేదాన్ని తెలియనివ్వ కూడదని :) మరి వాళ్ళు చెక్కరు,మనం చెక్కితే తీడతారు ..భలే తంటా :)

  ప్రత్యుత్తరంతొలగించు
 33. "ఒక మామూలు విషయాన్ని కూడా ఇంతందంగా ఎలా చెప్పగలరండీ ! బాపూ గీతలు మీ రాతలూ ఒకటే ."

  భలే అందంగా చెప్పారు లలిత గారు. నాకు ఇదే అనిపించింది.

  వాడి వాడి గడ్డం పెట్టె తోనూ అందులో వస్తువులతోనూ వాళ్ళకి ఏదో ఒక బంధం ఏర్పడిపోతుంది అనుకుంటా. నేను కొత్త రేజర్, ఫోం అన్నీ కొనిచ్చినా నాన్న ఆ సబ్బు, ఇనప రేజర్, సబ్బు వాడటానికి ఇష్టపడేవారు. అమ్మ పోరు పెట్టగా పెట్టగా ఏడాది తరువాత వాడారు. బోలెడు జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చారు. నెనర్లు.

  ప్రత్యుత్తరంతొలగించు
 34. @నేస్తం: బ్లేడు కష్టాలు మీకూ తప్పలేదన్నమాట !! హమ్మయ్య.. నాలాగే మరికొందరు ఉన్నారు కదా.. ధన్యవాదాలండీ..
  @వాసు: "బోలెడు జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చారు." ఎప్పుడు పంచుకుంటున్నారు మాతో?? ..ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 35. మురళిగారు,
  "గెడ్డంపెట్టి "చాలాబాగా రాసేరు ,దాదాపు అందరి అనుభవాలు ఒక్కటే .పెన్సిల్స్ చేక్కుకోవడానికి మేము ఆపనే చేసేవాళ్ళం .మేము తీసినట్లు ఎలాతెలిసేదో అర్ధమయ్యేది కాదు .మాతో పాటు అమ్మకు కూడా తిట్లుపడేవి,ఎందుకు తీయనిచ్చావని! అమ్మకు తెలిస్తేగా మేము తీసినట్టు .ఒకసారి పెద్దక్క బ్లేడ్ తీసి సిక్రెట్ గ పెన్సిల్ చేక్కుతుంది ,నాకు తెలియక దగ్గరకు వెళ్లి ఏదో చప్పబోయాను ,అంతే!సర్రున కొత్త బ్లేడ్ నా గెడ్డాన్ని తాకింది లోతుగా కట్ అయ్యింది .నా ఏడుపుకి అమ్మ పరిగెత్తుకు వచ్చింది .నాఫ్రాక్ ,అక్క ఫ్రాక్ బ్లడ్ తో తడిసిపోయింది ,అమ్మ కంగారుతో తన చీరకొంగుని గాయనికి అడ్డం పెట్టింది , చీరంత తడిసి పొయ్యింది .నాన్న గారికి తెలిస్తే ఎమౌద్దొఅని వణికిపోయము తరవాత కథ మీరు ఉహించుకోవచ్చు ......

  ప్రత్యుత్తరంతొలగించు
 36. ప్రతికొడుక్కి తనతండ్రిలో రోల్‌మోడల్ని చూసుకోవడం ఈసీన్ నుంచే మొదలవుతుందనుకుంటా.

  ప్రత్యుత్తరంతొలగించు
 37. @అనఘ: చాలా పెద్ద గాయమే అన్నమాట.. మీరు రాసిన దానిని బట్టి చూస్తే ఆ గాయం గుర్తుగా మచ్చ మిగిలిపోయి ఉండాలి బహుశా.. నావన్నీ చిన్న చిన్న గాయాలేనండీ.. ఏవీ మిగలలేదు ఇప్పుడు.. ధన్యవాదాలు.
  @సుబ్రహ్మణ్య చైతన్య: నిజమేనేమోనండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు