ఆదివారం, జనవరి 31, 2010

ఓ అడుగు పడింది..

గడిచిన రెండు రోజులుగా టీవీ చానళ్ళ, ముఖ్యంగా వార్తా చానళ్ళ, ప్రసారం లో వచ్చిన మార్పు నిత్యం టీవీ చూసే వాళ్ళలో చాలా మందిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఉన్నట్టుండి చానళ్ళన్నీ సంయమనం వహించడం మొదలు పెట్టాయి. ఏ చిన్న వార్త దొరికినా దానిని అతి చేసి హడావిడి చేసే తమ నైజాన్ని పక్కన పెట్టాయి. యెంతో ప్రాముఖ్యత ఉన్న (చానళ్ళ దృష్టిలో) వార్తలని సైతం ఆచి తూచి ప్రసారం చేశాయి.

అడ్డూ అదుపూ లేకుండా వార్తల పేరుతో నిరంతర ప్రసార స్రవంతిని జనం మీదకి వదులుతున్న చానళ్ళకి మార్గ దర్శకాలు విడుదల చేసిన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కి తొలి వందనం. వార్తల ముసుగులో ప్రసారం చేస్తున్న హింసాత్మక, అశ్లీల కార్యక్రమాల పట్ల హైకోర్టు ఒకింత ఘాటుగానే స్పందించింది. టీవీల్లో చూపిస్తున్న దృశ్యాలు, ఉపయోగిస్తున్న భాష, వివిధ రకాల కార్యక్రమాలు, వాటిని రూపొందించి ప్రసారం చేస్తున్న తీరుని నిశితంగా పరిశీలించిన మీదట ఉత్తర్వులని జారీ చేసింది.
రెండు రోజుల టీవీ కార్యక్రమాలు చూసినప్పుడు హైకోర్టు ఉత్తర్వులు అమలవ్వడం మొదలయ్యాయనే అనిపించింది. రెండు రోజులుగా ప్రమాదాలు జరిగినా మృతదేహాలని క్లోజప్ లో చూపలేదు. గాయాల మీద కెమెరా ఉంచి ప్రసారాలు చేయలేదు. రక్త దృశ్యాలని సాధ్యమైనంత వరకూ చూపకుండా ఉండడానికి దాదాపు "అన్ని చానళ్ళూ" ప్రయత్నించాయి. తెలుగు ప్రేక్షకులకి ఇదొక శుభ పరిణామం.

నిజానికి ప్రజాస్వామ్యంలో మిగిలిన వ్యవస్థలతో సమాన గౌరవాన్నీ, హోదాన్నీ అందుకున్న మీడియా ఇలా "చెప్పించుకోవాల్సి రావడం" ఓ దురదృష్టకర పరిణామం. ప్రజలకి మంచి-చెడు చెప్పాల్సిన, వాళ్లకి మార్గదర్శకత్వం వహించాల్సిన మీడియా మరో వ్యవస్థ చేత చెప్పించుకోవడం అంటే తన విలువనీ, గౌరవాన్నీ తగ్గించుకోవడమే.

అయితేనేం.. హైకోర్టు చెప్పింది మెజారిటీ ప్రజల, ప్రేక్షకుల మనోభీష్టానికి అనుకూలంగా ఉంది. వార్తల పేరిట ప్రసారమవుతున్న వికృత కార్యక్రమాల పట్ల జనం ఎంతగా విసిగిపోయారో తెలుసుకోడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు.. 'కూడలి' లేదా 'జల్లెడ' చూస్తే చాలు. బరి తెగించిన టీవీ ప్రసారాల గురించి ప్రతి రోజూ టపాలు కనిపిస్తున్నాయిక్కడ.

ఇప్పుడింక టీవీ కార్యక్రమాల ప్రసార సరళి పూర్తిగా మారిపోయినట్టేనా? ఈ ప్రశ్నకి జవాబు ఇప్పటికిప్పుడు చెప్పగలిగేది కాదు. కొన్నాళ్ళు వేచి చూసి తెలుసుకోవాల్సిన విషయం. అయితే, టీవీ కార్యక్రమాల ప్రసారాలని నిత్యం గమనిస్తూ ఉండడానికి, దారి తప్పిన/తప్పుతున్న చానళ్ళపై తక్షణ చర్యలు తీసుకోడానికీ ఒక బలమైన, చురుకైన వ్యవస్థ అవసరాన్ని ఈ పరిణామం మరోసారి నొక్కి చెప్పింది.

21 కామెంట్‌లు:

 1. నిజమేనండీ!ఇది మంచి పరిణామమే ..ఇది ఇలాగే కొనసాగిస్తే బావుండును .

  రిప్లయితొలగించు
 2. చానెళ్ళన్నీ ఇదే విధంగా నడుచుకుంటాయని ఆశిద్దాం.

  అన్నట్టు మీ బ్లాగు టెంప్లేట్ బాగుంది.

  రిప్లయితొలగించు
 3. Though I haven't observed it for myself, good to know about this development.

  రిప్లయితొలగించు
 4. ఓ ముందడుగు,శుభసూచకమే అనుకుందాము.ఎంతయినా ఆశాజీవులం కదా(కొంపదీసి ఉత్పరివర్తనం గానీ మొదలవట్లేదు కదా?).

  రిప్లయితొలగించు
 5. నిజంగానే ఇదొక శుభ పరిణామమేనండీ. కాకపోతే వేచి చూడాలి ఈ పరిణామం కొనసాగుతుందా లేదా అనేది.
  అన్నట్టు నెమలికన్ను చాలా అందంగా తీర్చిదిద్దారండీ..అభినందనలు.

  రిప్లయితొలగించు
 6. ఇంకా చాలా మార్పు రావాల్సి ఉంది. యువతను రెచ్చగొట్టే రీతిలో ఉంటున్న అర్ధరాత్రి సెక్స్ ప్రసారాలకు కూడా అడ్డుకట్ట పడాలి. ఇవన్నీ చూస్తుంటే ఓ బాధ్యతాయుతమైన సెన్సారుషిప్పు ఉంటేనే మేలని పిస్తున్నది.

  రిప్లయితొలగించు
 7. నిజమేనండీ, మీరు చెప్పిన మార్పైతే కనిపిస్తోంది మరి. చాలా దృశ్యాలను బ్లర్ చేయటం కూడా గమనించాను. మీరన్నట్లు మంచి పరిణామానికే దారితీస్తోందేమో!

  రిప్లయితొలగించు
 8. మీకొత్త టెంప్లేట్ బావుంది చదవటానికి చాలా కంఫర్ట్ గా ఉందండి.

  రిప్లయితొలగించు
 9. అవును మంచి పరిణామమే . కొన్ని రోజులైనా ఇలా మేంటేన్ చేయగలుగు తే , నియంత్రించకలుగుతే నా లాంటివాళ్ళు టి.వి చూసే ధైర్యం చేయొచ్చు .

  రిప్లయితొలగించు
 10. మంచి పరిణామం :)
  ఇది మూన్నాళ్ళ ముచ్చట కాకుండా... ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని ఆశ!

  రిప్లయితొలగించు
 11. మురళి గారు ,
  నిజంగా ఇది శుభ పరిణామం,దీని గురించి మహిళా సంఘాలు, రాజకీయపార్టీలు ధర్నాలు చేసేరు,ఎవరు పట్టించుకోలేదు .హైకోర్ట్ ఉత్తర్వుల పుణ్యమా అని చానల్స్ దారికి వచ్చాయి .కాని ,ఇంతకు ముందు కూడా ఇలాగె ఉత్తర్వులు ఇచ్చేరంట ,కొంత కాలం బుద్దిగా ఉండి మల్లిమొదలు పెట్టేరంత కదా!

  రిప్లయితొలగించు
 12. హేమిటో మురళి రాను రాను' కృష్ణుడు' అయిపోతున్నారు -:)
  శుభపరిణామం .బాగుంది.

  రిప్లయితొలగించు
 13. కోర్టు చాలా సార్లు విభిన్న సందర్భాలలో, విభిన్న అంశాలకు సంభందించి ఉత్తర్వులను ఇచ్చిందండీ..ఆ అన్ని సందర్భాలలో అమలు పర్చ బడ్డవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి...మీడియా విషయంలో నాకైతే లాంగ్ రన్ లో ఈ సంయమనం పాటిస్తారని నమ్మకం లేదు...

  రిప్లయితొలగించు
 14. మీరన్నట్టు ఇది శుభ పరిణామమే. మీరు చెప్పేవరకు ఇలా కోర్టు ఉత్తరువులు జారీ చేసిందని నాకు తెలియదు. కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయో కూడా ఇంకా పరిశీలించలేదు.

  కొత్త టెంప్లేట్ ఎక్కువ చదవడానికి వీలుగా ఉంది కానీ పాతదే ఇంకా అందంగా ఉందేమో :)

  రిప్లయితొలగించు
 15. అవునా, పోని లెండీ మీకు మంచి రోజులొస్తున్నాయేమో. మీ కొత్త టెంప్లేట్ బాగుంది కాని పైన నెమలి పురి విప్పుకోవటం చూడగానే లక్ష్మి ప్రసన్న బేనర్ గుర్తొచ్చింది, సారి అంది మిమ్ములను అవమానించాలని కాదు.:-) మీ ప్రొఫైల్ కు వేణువూ కలిసిందే.. బాగుందండి.

  రిప్లయితొలగించు
 16. ఆహా అభినందించదగిన పరిణామమే.. చూద్దాం ఎన్ని రోజులు ఆ చట్టాలను అనుసరిస్తారో..

  రిప్లయితొలగించు
 17. @పరిమళం: ధన్యవాదాలండీ.
  @రవిచంద్ర: మీకు నచ్చిందన్నమాట.. ధన్యవాదాలు.
  @సూర్యుడు: ఇలాగే కొనసాగాలని ఆశిద్దామండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 18. @శ్రీనివాస్ పప్పు: ఉత్పరివర్తనం :-) :-) ధన్యవాదాలండీ..
  @ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..
  @నరసింహ (వేదుల బాలకృష్ణ మూర్తి): అసలంటూ ఒక మార్పు మొదలయ్యింది కదండీ.. నెమ్మదిగా ఒక్కోదాని మీదా దృష్టి పెడతారేమో.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 19. @జయ: చూడాలండీ, మనం ఆశాజీవులం కదా.. ధన్యవాదాలు.
  @పరిమళం: ధన్యవాదాలండీ..
  @మాలాకుమార్: అందరినీ ఇబ్బంది పెడుతున్నాయండీ టీవీ కార్యక్రమాలు.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 20. @చైతన్య: ఎంతైనా మనం ఆశాజీవులం అండీ.. ధన్యవాదాలు.
  @అనఘ: ఈసారైనా ఏదైనా పర్మనంట్ ఏర్పాటు చేస్తారేమో చూద్దామండీ.. ధన్యవాదాలు.
  @చిన్ని: మురళి ఎప్పుడూ కృష్ణుడేనండీ :-) ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 21. @శేఖర్ పెద్దగోపు: నిజానికి సందేహం నాకూ ఉందండీ.. అంతకు మించి అమలు జరిగితే బాగుండునన్న ఆశ ఉంది.. ధన్యవాదాలు.
  @వాసు: కనీసం టెంప్లేట్ లో అయినా కొత్తదనం చూపిద్దామని ఈ ఏర్పాటండీ :-) ధన్యవాదాలు.
  @భావన: అనాల్సిన మాట అనేసి 'అవమానించడానికి కాదు' అన్నంత మాత్రాన నా మనో భావాలు దెబ్బతినకుండా ఉంటాయనుకున్నారా? :-) :-) 'నెమలి' తప్ప నాకూ, ఆ సంస్థకీ ఎలాంటి పోలికా లేదని మనవి చేసుకుంటున్నా :-) ..ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: వీలైనన్ని ఎక్కువ రోజులు అమలు చేయాలని కోరుకుందామండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు