ఆదివారం, జనవరి 10, 2010

చిన్ని చిన్ని కన్నయ్యా..

ఏడు పదుల జీవితం.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ముళ్ళు..మరెన్నో పూలు.. స్వర సామ్రాజ్యంలో అధిరోహించిన శిఖరాలు ఎన్నో ఎన్నెన్నో.. భక్తి గీతం ఆలపిస్తున్నప్పుడు ఆ స్వరంలో వినిపించే ఆర్తి, విషాద గీతానికి స్వరం అందించేటప్పుడు అలవోకగా తొణికిసలాడే భావోద్వేగం అనితర సాధ్యం. కట్టసేరి జోసెఫ్ ఏసుదాస్ అంటే చాలా మందికి తెలియక పోవచ్చేమో కానీ.. కేజే ఏసుదాస్ అన్నా, క్లుప్తంగా జేసుదాస్ అన్నా ఆ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది ఓ హృద్యమైన స్వరం.. నా అభిమాన స్వరరాజుకి డెబ్భయ్యో జన్మదిన శుభాకాంక్షలు.



పాటల ప్రవాహం చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న క్షణాలివి. ఆ స్వరరాగ గంగా ప్రవాహంలో మునక వేయగలగడమూ ఒక అదృష్టమే. కె. బాలచందర్ అపూర్వ సృష్టి 'అంతులేని కథ' నాకు చేరువ చేసిన ఇద్దరిలో ఒకరు జేసుదాస్. 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..' పాట వస్తున్నప్పుడు తెరమీద కనిపిస్తున్న దృశ్యం లో కన్నా వినిపిస్తున్న గొంతులోని ఆర్ధ్రతే ముందుగా మనసుకి తాకింది. సినిమా పూర్తయినా ఆ గొంతు వెంటాడుతూనే ఉంది.. అది కేవలం ప్రారంభం.. ఆ తర్వాత ఎన్ని పాటలో..

రేడియోలో జేసుదాస్ పాట వస్తూ ఉంటే, ఎంత అర్జెంటు పని ఉన్నా పాట పూర్తయ్యేవరకూ కదలకపోవడం నిన్ననో మొన్ననో జరిగినట్టుగా ఉంది. గ్రామ ఫోన్ రికార్డు మీద గడ్డం తో ఉన్న జేసుదాస్ ఫోటో ఇంకా తడి ఆరని జ్ఞాపకం లాగా ఉంది. జేసుదాస్ పాటలు ఉన్న ఆడియో కేసెట్ల టేపులు తెగిపోవడం రాను రాను చాలా మామూలు అనుభవం అయిపోయింది.. మామూలు సందర్భాలలో కన్నా మనసు బాగోలేనప్పుడో, బరువెక్కినప్పుడో జేసుదాస్ పాటలు వినడం ఓ గొప్ప అనుభవం.. ఘనీభవించిన దిగులునంతటినీ ఓ చిన్ని కన్నీటి చుక్కగా మార్చి చెక్కిలి చివరి నుంచి జార్చేయగలగడం ఆ స్వరం చేసే మాయాజాలం.

యాభయ్యేళ్ళ కెరీర్ లో జేసుదాస్ పదిహేడు భాషల్లో నలభైవేల పాటలు పాడినా, నేను విన్నవి - కేవలం మూడు భాషల్లో - కొన్ని వందలు మాత్రమే. వాటిలో ఒక్కసారి మాత్రమే విన్నవి బహుశా లేవేమో. తను తెలుగు వాడు కాదు అన్న విషయం తెలిసింది అతి కొద్ది సందర్భాలలో మాత్రమే.. అదికూడా అతి చిన్న ఉచ్చారణా దోషాల వల్ల. భాష, భావం విషయంలో జేసుదాస్ తీసుకునే శ్రద్ధ పరభాషా గాయకులందరికీ ఆదర్శనీయం.

జేసుదాస్ పాటలు విని ఆనందిస్తూ, కేవలం తన పాటల కోసమే ఇష్టం లేకపోయినా కొన్ని సినిమాలు చూస్తున్న నాకు జేసుదాస్ కచేరీకి హాజరయ్యే అవకాశం వచ్చినప్పుడు అదృష్టం నా ఇంటి తలుపు తట్టినట్టు అనిపించింది. నిజానికి ఇప్పటివరకూ ఆ అదృష్టం రెండుసార్లు కలిగింది నాకు. మొదటిది శాస్త్రీయ సంగీత కచేరీ కాగా, రెండోది భక్తి సంగీత విభావరి. రవీంద్రభారతి స్టేజిపై డిం లైట్ల కాంతిలో శ్వేత వస్త్రధారియై "వాతాపి గణపతింభజే.." తో ప్రారంబించి దాదాపు రెండున్నర గంటలపాటు సాగించిన కచేరీ యావత్తు ప్రేక్షకుల్నీ ఏవేవో లోకాల్లో తిప్పి తీసుకొచ్చింది.

రెండోది ఓ ఆరుబయటి పందిరిలో జరిగిన అయ్యప్పభజన. భక్తి పూరిత వాతావరణం. "శరణమయ్యపా.." అంటూ జేసుదాస్ గళం విప్పగానే పరమ నాస్తికులు సైతం భక్తి పారవశ్యంలో మునిగిపోక తప్పదనిపించింది. వినాయకుడిని స్తుతించినా, అయ్యప్ప పాటలు పాడినా, సాయిబాబా లీలలు వర్ణించినా అవన్నీ జేసుదాస్ గొంతులో కొత్తగా వినిపిస్తాయి నాకు. ఆ గొంతులో వినిపించే ఆర్తి కట్టి పడేస్తుంది నన్ను. మంచు వర్షంలా కురుస్తున్న ఆ ధనుర్మాసపు రాత్రి, జేసుదాస్ భక్తిగాన వర్షంలో తడవడం ఓ జీవితకాల జ్ఞాపకం.

ఊహించని అదృష్టం ఎదురైనప్పటికీ ఇంకా ఏదో కావాలనుకోడం మానవ నైజం కదా.. అందుకేనేమో, ఓ కోరిక చిన్నగా మొలకెత్తి మెల్లగా మహా వృక్షమయ్యింది.. కొన్ని క్షణాలు..కనీసం అతి కొద్ది క్షణాలైనా జేసుదాస్ తో మాట్లాడాలని.. ఆయన అలవాట్లని గురించి తెలుసుకున్నప్పుడు ఇది సాధ్యమయ్యే పనిలా అనిపించలేదు.. కానీ ఏమో.. ఎవరికి తెలుసు? ఎప్పటికైనా సాధ్యమవుతుందేమో.. జేసుదాస్ శతాధిక జన్మదినాలు జరుపుకోవాలని, అత్యధికకాలం మధురమైన గొంతుతో పాటలు పాడిన గాయకుడిగా కొత్త రికార్డు స్థాపించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ.. కన్నయ్యకు మరోమారు జన్మదిన శుభాకాంక్షలు..

32 కామెంట్‌లు:

  1. నా అభిమాన గాయకుల్లో ఈయన ఒకరు.....మీ పోస్ట్ బాగుందండి.

    రిప్లయితొలగించండి
  2. మురళి మీ కోరిక ఎప్పటికైనా తీరుతుంది .నాకు జేసుదాస్ చాలా ఇష్టం .ఆయనకీ జన్మదిన శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగా రాశారు. జేసుదాసుకు జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. మహాగాయకుడి గురించి చక్కటి టపా వ్రాసారు. జేసుదాసు గొంతువింటేనే మేనుపులకరిస్తుంది. అది లలితమైనా, కర్ణటకమైనా ఆగొంతుఅర్ధ్రతతో నిండి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  5. జేసుదాసు గారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేయగలిగే అదృష్టాన్ని కలిగించినందుకు మీకు నా ధన్యవాదాలు. అతని గానామాధుర్యాన్ని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. ఇంకా, ఇంకా, తనివి తీరా వీరి పాటలు కొనసాగుతూనే ఉండాలని నా కోరిక. ఆ నాదం లోని ప్రత్యేకత ఎన్నటికీ మరువలేనిది..తనివి తీరనిది. ఈ సారి హైద్రాబాద్ లో ప్రోగ్రాం ఉంటే నేను తప్పకుండా పోతాను.

    రిప్లయితొలగించండి
  6. చాలా బాగా రాసారండీ. ఇవాళ ఆయన పుట్టిన రోజని తెలిపి నాకు ఆయన మధురమైన పాటలన్నీ ఇవాళ "టపా" ద్వారా మరోసారి గుర్తు చేసుకునే అవకాశం కల్పించినందుకు మీకు "ప్రత్యేక ధన్యవాదాలు".

    రిప్లయితొలగించండి
  7. జేసుదాసు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  8. tenderly written.
    జేసుదాస్ లో నాకు నచ్చిన ఇంకో విషయం (తృష్ణగారి బ్లాగులో రాసినవి కాక) తెలుగు హిందీ భాషల్లో యాస ఇంచుమించు లేకుండా పాడ్డం. సిగలో అవి విరులో, తెలవారదేమో లాంటి పాటలు యాస కనబడకుండా పాడ్డం అంత సామాన్యం కాదు. ఇక హిందీలో దక్షిణ యాస బీభత్సం వినాలంటే బాలు పాడిన ఏ హిందీ పాట అయినా సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  9. యేసుదాసు గారి గురించి బాగా చెప్పారండి . ఈ మద్యనే నేను శ్రుతిలయలు లోని , "తెలవారదేమో స్వామి " పాట నా కమ్మటి కలలు లో పెట్టుకున్నాను . ఆ పాట నాకు చాలా ఇష్టం .

    జేసుదాసు గారికి జన్మదిన శుభాకాంక్షలు .

    ఈ అవకాశము కలిగించిన మీకు ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి
  10. " ఘనీభవించిన దిగులునంతటినీ ఓ చిన్ని కన్నీటి చుక్కగా మార్చి చెక్కిలి చివరి నుంచి జార్చేయగలగడం ఆ స్వరం చేసే మాయాజాలం."

    ఆ మహాగాయకుడి పాట విన్నాక కలిగే భావాన్ని ఎంత కరెక్ట్ గా చెప్పారో! ఎంతో హృద్యంగా ఉంది మీ టపా! ఆయనతో మాట్లాడాలనే మీ కోరిక త్వరలో తీరాలని కోరుకుంటున్నాను..

    పనిలో పనిగా ఓ నాలుగైదు ఆణిముత్యాలకి లింక్స్ ఇచ్చేస్తే, ఈ టపా చదివిన వెంటనే ఆయన గానామృతాన్ని ఆస్వాదించాలనుకునే నాలాంటి వాళ్ళకి చాలా మేలు చేసినవాళ్ళవుతారేమో :-)

    రిప్లయితొలగించండి
  11. ఆయన గళాన్ని ఆరాదించేవారిలో నేనూ ఒకరిని..

    రిప్లయితొలగించండి
  12. i am also a fan of the greatsinger jesudas.wishing him a happy bday

    రిప్లయితొలగించండి
  13. జేసుదాసుగారి గానామాధుర్యాన్ని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. జేసుదాసుగారికి జన్మదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  14. పొద్దున్న నుండి నా చెవుల్లో ఆయన పాటలే, రిపీట్ మోడ్ లో పెట్టి మరీ వింటున్నా. అనుకోకుండా మీ బ్లాగు చూడటమూ అందులో ఆయన గురించి ఇంత హృద్యంగా రాసిన టపా చదవటమూ చాలా బాగుంది. నిజమే ఆ గొంతులోని ఆ మార్దవానికి ఏమి పేరు పెట్టాలో తెలియదు కానీ "వానకారు కోయిలనై" అన్నా, "లాలించు ఇల్లాలిగా దేవీ, పాలించు నా రాణిగా" అన్నా ఆ సాహిత్యానికి అది కేవలం యేసుదాసు గారి స్వర మాధుర్యం తోడైంది కాబట్టే అవి అజరామరాలైపోయాయేమో అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  15. నిషిగంధగారూ, ఓసారి మరి నా బ్లాగ్ పై కూడా దృష్టి సారిస్తే మీక్కావలసిన లింకుఉ దొరుకుతాయి...:) :)

    @కొత్తపాళీ:"ఇక హిందీలో దక్షిణ యాస బీభత్సం వినాలంటే బాలు పాడిన ఏ హిందీ పాట అయినా సరిపోతుంది"
    గొప్పగా చెప్పారు...(అభిమానులు క్షమిస్తే..)
    100% agreed!!

    మురళిగారూ, మిగతా జవాబులు మీరే రాసుకోండి...నేను రాయనులెండి..:) :)

    రిప్లయితొలగించండి
  16. జేసుదాసు గారి గొంతుని ఇష్టపడని వారుండరేమో అనిపిస్తుంది నాకైతే..! మురళి గారు మీ కోరిక త్వరలోనే తీరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా..

    రిప్లయితొలగించండి
  17. సినిమాకి ఒక్క పాట పాడినా ఆ ఒక్కటీ అద్భుతం కావడం జేసుదాస్ గొప్పతనం.
    మళయాళీలు ఉపయోగించుకున్నంతగా మన తెలుగు వాళ్ళు ఆయనను ఉపయోగించుకోలేదు.

    కొత్తపాళీ గారు, శంకరాభరణం పాటలు బాలు గారు ఎంత గొప్పగా పాడినా జేసుదాస్ పాడితే ఎలా ఉంటుందా అనిపిస్తుంది ఒకోసారి.

    రిప్లయితొలగించండి
  18. చాలా బాగా రాశారు మురళి. నాకు కూడా 2003 లో అమెరికాలో ఆయన లైవ్ ప్రోగ్రాం చూడగలిగే అవకాశం దక్కింది కాకపోతే అన్నీ సినిమా పాటలు తెలుగు తమిళ మళయాళ భాషల నుండి పాడారు. నా అదృష్టం ఏమిటంటే ఆ కార్యక్రమానికి విచ్చేసిన సుశీలమ్మగారు కూడా ఆరోజు తన గొంతు కలపడం. మీకోరిక త్వరలో తీరాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  19. "ఘనీభవించిన దిగులునంతటినీ ఓ చిన్ని కన్నీటి చుక్కగా మార్చి చెక్కిలి చివరి నుంచి జార్చేయగలగడం ఆ స్వరం చేసే మాయాజాలం"..
    ఆయన పాట లాగే వుంది మీ టపా.."హరివరాసనం స్వామీ విశ్వమోహనం" పాట లాగా ఎంతో మార్ధవంగా.."సిగలో అవి విరులో"..లాగా భావుకంగా..

    కొంచం ఆలస్యంగా మీ బ్లాగ్ ద్వారా జేసుదాసు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  20. One more feather to the legend, In Sabarimala, in Ayyappa sannidhanam, all songs by Jesudaas only. I have seen people excited about Harithathmazam especially. Uh. Salutes to the great singer. Long live sir.

    రిప్లయితొలగించండి
  21. A very nice article. I am also a great fan of Jesudas. Naa korika, ayana mundu kurchoni ayanato "Lalitha Priya Kamalam Virisinadi" paata from Rudraveena padinchukovalani.
    Happy Birthday to Jesudas.

    రిప్లయితొలగించండి
  22. జేసుదాసు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

    మీ పోస్టు బాగుంది...
    ఆయన పాటలు నచ్చనివారు ఎవరూ ఉండరేమో..
    నేను చిన్నప్పుడు... (అంటే.. నా ఐదోఏట) "గాలివానలో వాన నీటిలో.. పడవ ప్రయాణం" పాట ఎక్కువగాపాడేవాడినట.., తరువాత తెలిసింది.. అది జేసుదాసు పాడినపాటవలనేమో అని..., ఆ పాట ఇప్పటికీ మరచిపోలేనిది...నాకు చాలా ఇష్టం. :)

    రిప్లయితొలగించండి
  23. @ప్రేరణ: ధన్యవాదాలండీ..
    @చిన్ని: అంతకన్నానా.. ధన్యవాదాలండీ..
    @శిశిర: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  24. @వల్లూరి సుధాకర్: నిజమేనండీ.. ఆ గొంతులో ఏదో మేజిక్ ఉంది.. ధన్యవాదాలు.
    @జయ: తప్పకుండా చూడడమే కాకుండా ఆ విశేషాలు మాతో పంచుకోవాలండీ.. ధన్యవాదాలు.
    @తృష్ణ: పాటలన్నీ భలే గుది గుచ్చారే.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  25. @చిలమకూరు విజయ మోహన్: ధన్యవాదాలండీ..
    @కొత్తపాళీ: అతి కొద్ది పాటలు, అది కూడా బాగా శ్రద్ధగా విన్నప్పుడు కొన్ని పదాలు పలకడం లో తప్పించి, జేసుదాస్ పాటల్లో యాస వినిపించదండీ.. ధన్యవాదాలు.
    @మాలాకుమార్: నాక్కూడా ఆ పాత చాలా ఇష్టమండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. @నిషిగంధ: నాలుగైదు పాటల లంకెలు ఇవ్వొచ్చనుకోండి.. కానీ ఏ నాలుగూ అన్నది మొదటి సమస్య.. అవి మాత్రమే ఇస్తే మిగిలిన పాటలు నన్ను చూసి నవ్వవా? అన్నది మరో సందేహం.. అయినా అడిగిన పాటలు ఇవ్వడానికి గూగులమ్మ ఉంది కదండీ.. ధన్యవాదాలు.
    @మరువం ఉష: 'జలపుష్పాభిషేకం' లాగా జేసుదాస్ స్వరాభిషేకం ఏదన్నా ప్లాన్ చేయండి.. పాట కలపడానికి ఇక్కడ యెంత మంది ఉన్నారో చూడండి.. ఏమంటారు? ధన్యవాదాలు.
    @స్వాతి మాధవ్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  27. @పద్మార్పిత: ధన్యవాదాలండీ..
    @లక్ష్మి: మీతో ఏకీభవిస్తున్నా.. ధన్యవాదాలు.
    @మధురవాణి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  28. @బోనగిరి: జేసుదాస్ స్వతహాగా మలయాళీ కాబట్టి, ఎవరైనా మాతృభాషకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి, అక్కడ ఎక్కువ పాటలు పాడి ఉండవచ్చండీ.. మీరన్నట్టుగా తన టాలెంట్ కి తగ్గట్టుగా మనవాళ్ళు మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: అదృష్టవంతులు.. ధన్యవాదాలండీ..
    @ప్రణీత స్వాతి: హమ్మో.. చాలా పెద్ద పోలిక పెట్టేశారండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. @Damo: ఆ దృశ్యం ఊహించుకోడానికే ఎంతో బాగుందండీ.. మీరు చాలా లక్కీ.. ధన్యవాదాలు.
    @అను వంశీ: మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానండీ.. ధన్యవాదాలు.
    @శ్రీనివాస రాజు: నాకు ఇష్టమైన పాటల్లో అదీ ఒకటండీ.ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  30. కొద్దిగా పని వత్తిడిలోఉండి ఒక వారంగా ఇటు వైపు రావడం కుదరలేదు. అలా ఈ టపా మిస్స్ ఐయ్యాను. మిమ్మల్ని కాస్త కుళ్ళుకునేట్లు:-) చేసే ముచ్చట చెప్పనా? నేను 10th లోనో ఇంటర్లోనో (సరిగ్గా గుర్తులేదు) ఉన్నప్పుడు గుంటూరులో ఆయన సంగీత కచేరీ, పాటల విభావరి పెడితే నాన్న వాళ్ళు మొదటిదానికి వెళ్ళి విభావరికి నన్ను పంపించారు. ముక్క హిందీ రాకుండా మిగిలిన జనాలతో పాటు నోటికొచ్చిన మాటలు ట్యూను కలిపి పాడేసాను ఆయనతో. స్టేజీమీద ఆయన పాడితే కుర్చీలో నేను అన్నమాట. ఎవరికి తెలుసు అంతగోల లో. నాకు నచ్చిన పాటలు రాస్తే అదే పెద్ద టపా అవుతుంది. మీకోరిక త్వరలోనే తీరాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  31. ఆయన పాడిన "హరివరాసనం" వింటుంటే అమృత ధార జాలువారుతున్న అనుభూతి ! ఆయనకు శుభాకాంక్షలు చెబుతూనే ఆయన పాటలను గుర్తుచేసుకోనేలా మంచి టపా రాశారు .ఆయన నూరేళ్ళు ఆయురారోగ్యాలతో పాడుతూనే ఉండాలని కోరుకుంటూ ..

    రిప్లయితొలగించండి
  32. @సునీత: ఒక్క క్షణం యెంత కంగారు పడ్డానో.. మీరు జేసుదాస్ తో కలిసి స్టేజి మీద పాడారేమో అనీ, గాయని సునీత మీరేనేమో అనీ.. ఇలా బోల్డన్ని ఆలోచనలు.. మొత్తం మీద కొంచం అసూయ కలిగిన మాట నిజమేనండీ :) ..ధన్యవాదాలు.
    @పరిమళం: యెంత చక్కగా చెప్పారండీ.. నిజంగానే అమృత ధార.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి