శనివారం, జనవరి 09, 2010

నాలుగో స్థంభం

రాష్ట్రంలో ఊహించని పరిణామాలు కొన్ని శరవేగంగా జరుగుతున్నాయి. టీవీ చానళ్ళు తాము తలచుకుంటే చేయగలిగింది ఏమిటో నిరూపించిన ఇరవై నాలుగు గంటలు గడవక మునుపే పోలీసులు తమ శక్తి సామర్ధ్యాలు ప్రదర్శించారు. వైఎస్ మరణం వెనుక రిలయన్స్ సంస్థల కుట్ర దాగి ఉందన్న రష్యన్ వెబ్సైట్ కథనాన్ని ఆధారంగా చేసుకుని మూడు నాలుగు గంటలపాటు కథనాలు ప్రసారం చేసిన మూడు టీవీ చానళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కల్లోలాన్ని సృష్టిస్తే, జరిగిన పరిణామాలకి టీవీ చానళ్ళని బాధ్యులని చేస్తూ మొదటగా ఆ కథనాన్ని ప్రసారం చేసిన చానల్ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు పోలీసులు.

జరిగిన దానికి పోలీసుల ఓవర్ యాక్షన్ కారణమని ఆ చానల్ ప్రతినిధులు, చానల్ వారి అతి వల్లనే అరెస్టులు తప్పనిసరి అయ్యాయని పోలీసులూ చెబుతున్నారు. అయితే, చానళ్ళ వారికి పెద్ద ఎత్తున మద్దతు లభించక పోవడం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం. గతంలో పత్రికలలో పనిచేసే వారి మీద ఎలాంటి దాడి జరిగినా, సంస్థల మధ్య వ్యాపార పోటీనీ, లావాదేవీలనీ పక్కన పెట్టి, అన్ని పత్రికల ఉద్యోగులూ ప్రదర్శనలు చేయడాన్ని మనం చూశాం. జరిగిన దాడిని పత్రికా స్వేచ్చ మీద దాడిగా అభివర్ణిస్తూ నల్ల బ్యాడ్జీలు, జెండాల ప్రదర్శన జరిగేది.

ఐతే ప్రస్తుత సంఘటనలో, ఒకపక్క అరెస్టులు జరుగుతూ ఉండగా, రష్యన్ పత్రిక కథనాన్ని ప్రసారం చేయని చానళ్ళు 'మీడియా బాధ్యత' ని గురించి చర్చా కార్యక్రమాలు నిర్వహించి, ఆ మూడు చానళ్ళనీ ఇతోధికంగా తప్పు పట్టడమే కాక, సుద్దులు చెప్పే ప్రయత్నాలు సైతం చేశాయి. అరెస్టులు జరిగిన టీవీ చానళ్ళ రిపోర్టర్లు మాత్రం, జరుగుతున్న పరిణామాలని లైవ్ లో చూపిస్తూ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందేనని వక్కాణించారు. గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా దూరం నుంచైనా సరే మీడియా పనితీరుని గమనిస్తున్న వారికి ఇది ఒక ఆసక్తి కరమైన పరిణామం.

జనం సంగతి పక్కన పెట్టి, సాటి మీడియా సంస్థల నుంచే ఆ మూడు చానళ్ళూ మద్దతు పొందలేక పోడానికి కారణం కేవలం వార్తా కథనంలో విశ్వసనీయత లేకపోవడం మాత్రమేనా? మరి అలా అయితే, గతంలో ఎన్నో సందర్భాలలో మీడియాని పరోక్షంగానే అయినా 'సీజర్స్ భార్య' గా అభివర్ణించి ప్రభుత్వ చర్యలని ముక్త కంఠంతో వ్యతిరేకించారు కదా.. మరి ఇప్పుడు ఒక్కరు కూడా ఆ మూడు చానళ్ళకి మద్దతుగా మాట్లాడడం లేదేం? జరిగిన పరిణామం రాష్ట్ర రాజకీయాలని కుదిపెసిదే కావడం వల్లనా లేక ఒక పెద్ద కార్పోరేట్ సంస్థ కి నష్టం కలిగించడం వల్లనా?

మద్దతు పలకడం మాట పక్కనుంచి, సుద్దులు చెప్పడానికి ఒకరితో ఒకరు పోటీ పడడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది. "మాది చాలా బాధ్యత గల మీడియా సంస్థ.. అలాంటి కథనాలు మేమెప్పుడూ ప్రసారం చేయలేదు.. చేయబోము.." అని చెప్పుకోడానికి మిగిలిన చానళ్ళు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నవ్వొస్తోంది. ఓ నాయకుడు మరణించగానే, వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ ప్రతినిదులకి లైవ్ లో ఫోన్ చేసి ఎక్కడ ఎన్ని బస్సులు తగలబడుతున్నాయో లెక్కలు తీయడం.. 'మీ ఊళ్ళో ఇంకా మొదలవ్వలేదా?' అని పరోక్షంగా జనాన్ని రెచ్చగొట్టడం, వార్తల మాటున బూతు ప్రసారాలు తదితర తప్పులన్నీ ఈ విధంగా ప్రక్షాళన చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టున్నాయి.

గడిచిన రెండు మూడేళ్ళలో చానళ్ళ సంఖ్య విపరీతంగా పెరగడం, దాదాపు ప్రతి చానలూ అస్తిత్వ పోరాటంలో భాగంగా దొరికింది దొరికినట్టు ప్రసారం చేయడం.. ఈ అతికి ఏదో రూపంలో కళ్ళెం పడితే బాగుండు అనుకున్న సామాన్య ప్రేక్షకులకి మాత్రం జరిగిన పరిణామం ఊరటని ఇచ్చిందనే చెప్పాలి. మీడియాలో వర్గపోరు, వివిధ రాజకీయ పక్షాలకి కొమ్ము కాసే విధానం గురించి ఇప్పుడు అందరికీ స్పష్టంగా తెలియడం వల్ల మన నాయకులు, అధికారులు మీడియాకి 'భయపడడాన్ని' తగ్గిస్తారు బహుశా.. ఒక వార్తాసంస్థ ఏదైనా వ్యతిరేక కథనం ప్రసారం చేసినా, మరో సంస్థ దానిని ఖండించే పని చూసుకుంటుంది కదా.. ప్రజాస్వామ్యం తాలూకు నాలుగు మూల స్తంభాల్లోనూ మూడింటి మీద ఇప్పటికే సడలిన నమ్మకం, ఇప్పుడు నాలుగో స్థంభం వైపుకి కూడా విస్తరించింది.

15 కామెంట్‌లు:

 1. బాగుందండీ ఫోర్త్ ఎస్టేట్ తీరు . ఆంద్ర ప్రదేశ్ కి ఏమైందో కాని ఆందోళన మీద ఆందోళనలు .ప్రకృతి వైపరీత్యలె కుదిపేశాయి అనుకుంటుంటే మరోప్రక్క రాజ్యాల కోసం ఇంకోప్రక్క వేతనాల కోసం బంద్ లు నిరసనలు వెల్లువెత్తి సామాన్యుని జీవనానికి అంతరాయం కలిగిస్తున్నాయి .ఒకప్పుడు ప్రశాన్తంద్ర లా వున్నా రాష్ట్రం నిప్పుల కుంపటి లా వేడి సెగలు విరజిమ్ముతుంది

  రిప్లయితొలగించు
 2. I just want all these TV news channel CEOs to have a live discussion in one of the channels and discuss their future dispassionately. Its better they discuss how to regulate themselves. Otherwise, days are not far off V.C. Shukla will come back and impose censorship V. C. Shukla was I&B Minister during Emergency imposed by Indira Gandhi in 1975. He banned Kishore Kumar songs from playing in Vividh Bharati just because Kishore refused to sing in Sanjay Gandhi's Meetings.

  Media has lost its credibility long back and the present incident is one more example.

  Better the news papers and others who are calling themselves media to wake up from them arrogant mental state that they are champions of free press and immediately think of their survival, as general public is utterly exasperated with them. People would be very happy if the Cable/Dish operator disconnects all news channels.

  రిప్లయితొలగించు
 3. రోజు కో రకంగా జరుగుతున్న పరిణామాలకి ఇదీ కారణం అని చెప్పే పరిస్థితి ఏనాడో చేయిదాటి పోయింది. "ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు" అనుకుంటూ సామాన్యుడు మౌనంగా, గుడ్డిగా వీక్షిస్తున్న సమయమిది. రాష్ట్రపతి పాలన తో మాత్రం ఒరిగేదేముంది. ఈ రాష్ట్రం నుంచి అన్ని తరలి వెళ్ళి పోయిన తరువాత, "పిల్లిపోరు" కథ లాగానే ఉంటుంది. తిరోగమనమో...పురోగమనమో...ఇంక కాలమే చెప్పాలి. కాదంటారా?

  రిప్లయితొలగించు
 4. ఆంధ్ర ప్రదేశ్ కి ఏమయ్యింది?
  శని పట్టింది.

  దేశవ్యాప్తంగా Media కి Arrogance పెరిగిపోయింది.
  వాళ్ళేం చూపిస్తే అది ప్రజలు, ప్రభుత్వం నమ్మాలని వాళ్ళ అభిప్రాయం.

  కాళీపట్నం రామారావుగారు "కుట్ర" అనే కధలో ఇలా అంటారు.
  ఈ దేశంలో ప్రెస్సూ, ప్లాట్ ఫారం (వేదిక) చేతిలో ఉంటే ఏమైనా చెయ్యవచ్చు.

  రిప్లయితొలగించు
 5. అప్పుడే ఏమయ్యింది?మరొక పద్నాలుగు న్యూస్ ఛానల్స్ అవును 14 ప్రసారాలాకు అనుమతినిమ్మని దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం అదీ తెలుగులో వార్తల కొరకు,అవీ వస్తే కానీ....

  రిప్లయితొలగించు
 6. మనిషికి తదనుగుణం గా గుంపు, తదనుగుణం గా సమాజానికి నైతిక విలువల మీద ఆసక్తి పోయి ధన సంపాదనే ముఖ్యమయ్యిందనటానికి ఒక నిదర్శనం ఈ పేపర్ లు, మీడియా లు, అంతే మురళి. నాకు అమెరికా లో కూడా మనవాళ్ళు కుల మత ప్రాంత అభిమాన దురాభిమానాలతో వ్యక్తి గత సమర్ధనలు చేస్తుంటే విరక్తి వచ్చేస్తోంది మొత్తం గా.

  రిప్లయితొలగించు
 7. వీళ్ళ నగ్నత్వం ఇలా బయటపడి సామాన్యజనానికి అర్థమవ్వడం ఈనాటి మంచి. కానీ దీనివలన వార్తా సంస్తల క్రెడిబిలిటీ దెబ్బతిని ప్రభుత్వాల అజమాయిషీ పెరిగి నిజాలను నిస్సిగ్గుగ చంపెస్తారు.
  http://sahacharudu.blogspot.com/2010/01/blog-post_08.html#comments

  రిప్లయితొలగించు
 8. చాల చక్కగా చెప్పారు .. ఇవన్ని చూస్తుంటే నాకు మాత్రం తిరిగి మన దూరదర్శన్ లోని శాంతి స్వరూప్ వార్తల కాలం తిరిగి వస్తే బాగుంటుంది అనిపించింది

  రిప్లయితొలగించు
 9. A very true article. People should respond to the right things.
  good one

  రిప్లయితొలగించు
 10. @సూర్యుడు: నిజమేనండీ.. ధన్యవాదాలు.
  @చిన్ని: రేపేం జరగబోతోందో ఊహించే పరిస్థితి లేదండీ.. ధన్యవాదాలు.
  @శివ: మంచి ఆలోచనండీ.. కానీ పిల్లి మేడలో గంట కట్టేదెవరు? ..ధన్యవాదాలు

  రిప్లయితొలగించు
 11. @జయ: నిజమండీ.. ధన్యవాదాలు.
  @బోనగిరి: పెరుగుట విరుగుట కొరకే అన్నారు కదండీ.. ధన్యవాదాలు.
  @.రాజేంద్రకుమార్ దేవరపల్లి: మరో పద్నాలుగా?? మరో ఆర్నేల్లో, ఏడాదో పోయాకా ఇప్పుడు ఉన్నవాటిలో ఎన్ని మిగులుతాయో చూడాలని నేను అనుకుంటున్నానండీ.. మరీ ఇంట సులువైపోయిండా మీడియా వ్యాపారం?? ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 12. @భావన: మీడియా సమాజానికి అద్దం పడుతుంది అంటారు కదండీ.. మీడియా బాగోలేదంటే సమాజం కూడా బాగా లేదనే కదా అర్ధం.. ధన్యవాదాలు.
  @కేక్యూబ్ వర్మ: ప్రసార సాధనాలకి సమాజం పట్ల బాధ్యత తగ్గిపోతూ ఉండడం వాళ్ళ జరుగుతున్న పరిణామాలండీ ఇవన్నీ.. బాగుంది మీ టపా.. ధన్యవాదాలు.
  @మహేష్ ఖన్నా: ఇలాగే కొనసాగితే అందరూ అదే కోరుకుంటారండీ.. ధన్యవాదాలు.
  @అను వంశీ: ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 13. " ప్రజాస్వామ్యం తాలూకు నాలుగు మూల స్తంభాల్లోనూ మూడింటి మీద ఇప్పటికే సడలిన నమ్మకం, ఇప్పుడు నాలుగో స్థంభం వైపుకి కూడా విస్తరించింది" ప్చ్ .....

  రిప్లయితొలగించు
 14. @పరిమళం: నిజమే కదండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు