గురువారం, జనవరి 28, 2010

నా రెండో కథ...

నా మొదటి కథ 'బెల్లం టీ' కి మీ నుంచి వచ్చిన స్పందన నన్ను మరో కథ రాసేలా ప్రోత్సహించింది.. ఫలితమే 'ఉత్పరివర్తనం.' "బాల్య జ్ఞాపకాలతో ఏమాత్రం సంబంధం లేని ఇతివృత్తం తీసుకుని కథ రాయమని" నాకు పరిక్ష పెట్టిన బ్లాగ్మిత్రులు, 'మానసవీణ' బ్లాగరి నిషిగంధ గారికి, కథను ప్రచురించిన 'పొద్దు' వారికీ కృతజ్ఞతలు. నేను పరిక్ష రాసేశాను.. నిర్మొహమాటంగా ఫలితం చెప్పాల్సింది మీరే..
*****

 "ఆకస్మికముగా సంభవించే గుణాత్మక వైవిధ్యములను ఉత్పరివర్తనములు అందురు.." నిశ్శబ్దంగా ఉన్న క్లాసు రూములో ఖంగుమంటోంది మధు సార్ గా పిలవబడే రాజా మధుసూదన వరప్రసాద రావు గొంతు. పల్లెకి ఎక్కువ, పట్టణానికి తక్కువగా ఉన్న ఆ ఊరి ఎయిడెడ్ స్కూల్లో ఏడో తరగతి లోకి అడుగు పెట్టబోతున్న పిల్లలంతా తల వంచుకుని శ్రద్ధగా నోట్సు రాసుకుంటున్నారు. అప్పుడప్పుడూ పిల్లలు నోట్ పుస్తకాల పేజీలు తిప్పుతున్న సవ్వడి వినిపిస్తోంది. ఎండ ప్రచండంగా ఉంది. మే నెల మధ్యాహ్నం కావడంతో సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. అప్పుడప్పుడూ వడగాలి కెరటంలా వచ్చి వెళ్తోంది.   

ఇరవై ఎనిమిదేళ్ళ మధు ఆలోచనలు డార్విన్ పరిణామ సిద్ధాంతం దాటి మరెటో వెళ్ళిపోయాయి. "వస్తుందా? రాదా?" గత కొద్ది రోజులుగా అతన్ని వేధిస్తున్న ప్రశ్న దగ్గర ఆ ఆలోచనలు మరోసారి ఆగాయి. కొద్దిగా మాసినట్టుగా అనిపించే నీలంరంగు జీన్స్ ఫ్యాంట్ లో, అదే రంగు నిలువు చారలున్న చొక్కాని ఇన్ చేశాడు . టేబిల్ కి ఆనుకుని నిలబడి పాఠం చెబుతున్నా, అలవాటు చొప్పున భుజాలని కొద్దిగా ముందుకు వంచి నేల వైపు చూస్తున్నాడు.

ఐదడుగుల పదకొండంగుళాల పొడవుండే మధు భుజాలువంచిన తీరు చూసేవాళ్ళం దరికీ "భూభారం అంతా ఇతనే మోస్తున్నాడా?" అనిపిస్తుంది.  నోట్సు రాయడం పూర్తి చేసిన పిల్లలు అతను చెప్పబోయే పాఠం కోసం ఎదురు చూస్తున్నారు. సమ్మర్ క్లాసులు మొదలైనప్పటి నుంచీ మేష్టారలా ఉన్నట్టుండి ఆలోచనల్లోకి  వెళ్ళిపోతూ ఉండడాన్ని గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు.  వెనుక బెంచీల్లో కలకలం మొదలవ్వడంతో ఈ లోకంలోకి వచ్చాడు మధు.  నోట్సు ఆగిపోవడం తో వెనుక బెంచీ పిల్లలు కబుర్లలో పడ్డారు.
 
'ఉత్పరివర్తనము' గురించి ఇప్పుడు తను వివరించినా పిల్లలు పాఠం వినే మూడ్ లో లేకపోవడం గమనించి "ఈ పాఠం రేపు చెప్పుకుందాం.." అంటూ పిల్లలకి భోజనాలకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చేసి, తను ప్రిన్సిపాల్ గది వైపు బయలుదేరాడు మధు. అలవాటు చొప్పున గది బయట 'ఎస్. త్రినాధ మూర్తి, ప్రిన్సిపాల్' అన్న నీలం రంగు బోర్డు కేసి ఒక్క క్షణం తదేకంగా చూసి లోపలికి అడుగుపెట్టాడు. ఒక సేవా సంస్థ, ప్రభుత్వ సాయంతో నడుపుతున్న ఆ ఎయిడెడ్ స్కూల్లో ఇంగ్లీష్ మేష్టారుగా చేరి, పదోన్నతిపై ప్రిన్సిపాల్ అయిన యాభయ్యేళ్ళ త్రినాధ మూర్తిది స్వతహాగా జాలిగుండె.

ఆ స్కూల్లో చదివే పిల్లల్లో ఎక్కువ మంది రోజు కూలీల పిల్లలే కావడం, తల్లిదండ్రులు సెలవుల్లో తమ పిల్లలని పనికి పంపే ప్రయత్నాలు చేస్తుండడం గమనించి, వేసవి సెలవుల్లో పిల్లలకి బడిలోనే లెక్కలు, ఇంగ్లీష్, సైన్సు క్లాసులు చెప్పే ఏర్పాటు చేశాడాయన. కొద్దిమంది సీనియర్లకి మినహా, మిగిలిన టీచర్లకి సెలవుల్లో జీతాలు చెల్లించే అవకాశం లేకపోవడంతో, ఈ ఏర్పాటు వల్ల మధు లాంటి మేష్టార్లకి కొంత వెసులుబాటు ఉంటుందన్నది ఆయన ఆలోచించిన మరో విషయం.

గదిలోకి అడుగుపెట్టగానే ఫ్యాను గాలి ఒక్కసారిగా తాకి వెన్నులో వణుకు వచ్చినట్టు అనిపించింది మధుకి. ఎప్పటిలాగే తల వంచుకుని మౌనంగా నిలబడ్డాడు ప్రిన్సిపాల్ ముందు. ఇంటర్నెట్ లో సులభంగా పిల్లలకి చెప్పే ఇంగ్లీష్ పాఠాల వివరాలు వెతుకుతున్న త్రినాధ మూర్తి అలికిడికి తలెత్తారు. "ఒకే మధూ.. రేపు మొదటి క్లాసు మీరే తీసుకోవాలి. 'బి' సెక్షనే చూసుకోండి. సాయిరాం 'ఏ' సెక్షన్ వాళ్లకి మేథ్స్ చెబుతారు.. పది గంటలకల్లా వచ్చేయండి..," అనగానే, ఆ మాటకోసమే ఎదురు చూస్తున్నట్టుగా  వెను తిరిగాడు మధు.

పచ్చని పసిమి చాయతో మెరిసిపోయే ఆ కుర్రాడు, ఎండ వేడికి కందిపోవడం చూసి చివుక్కు మనిపించింది త్రినాధ మూర్తికి. వెళ్తున్న మధుని చూసి 'పూర్ ఫెలో' అనుకున్నారు. రెండేళ్లుగా మధు ఆ స్కూల్లో పని చేస్తున్నా, అతను ఆయనతో మాట్లాడింది తక్కువ. తను అతని తండ్రికి స్నేహితుడూ, ఇదే స్కూలు నుంచి తండ్రి రిటైరయ్యాక బీయీడీ క్వాలిఫికేషన్ లేకపోయినా పిలిచి ఉద్యోగం ఇచ్చిన వాడూ అవడం వల్ల తనంటే అతనికి భయంతో కూడిన గౌరవం అనుకుంటారు త్రినాధ మూర్తి.
స్ట్రాపాన్ బ్యాగ్ భుజాన తగిలించుకుని తల వంచుకుని నడుస్తూ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ చేరుకునేసరికి, ట్రైన్ వస్తోందన్న ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. ఎర్రటి ఎండలో ఆ పది నిమిషాల నడకా ఎన్నో గంటల శ్రమలా అనిపించిందతనికి. అక్కడినుంచి గంటసేపు రైల్లో ప్రయాణం చెయ్యాలి, అతను కలవాలనుకుంటున్న వ్యక్తిని చేరుకోడానికి.. ఇది అతను తరచూ చేసే ప్రయాణమే.

ఎప్పటిలాగే ఖాళీగా ఉంది ఆ పాసింజరు బండి. కిటికీ పక్క సీట్లో కూర్చున్నాడు మధు. ఎదుటి సీట్లో ఓ పల్లెటూరి దంపతులు, వాళ్ళ కాళ్ళ దగ్గర కోళ్ళ గంప. ఎండ వేడికి నిద్రావస్తలో ఉన్నాయి ఆ గంపలో ఉన్న రెండు కోళ్ళూ. వాటిని చూడగానే మధుకి తన బాల్యం గుర్తొచ్చింది, అప్రయత్నంగా. మధుకి ఊహ తెలిసిన నాటినుంచి వాళ్ళింట్లో ప్రతి ఆదివారం ఉదయం కనిపించే దృశ్యం ఒకటే. కొడుకుని దగ్గర కూర్చోపెట్టుకుని, బజారు నుంచి తెచ్చిన కోడిని ముక్కలుగా కోసేవారు మధు తండ్రి, అప్పటికే  రంగారావు మేష్టారుగా మారిన రాజా రంగారావు.

తమ వంశపు పూర్వ వైభవానికి గుర్తుగా ఆయన దగ్గర మిగిలిన పాతకాలం నాటి పిడిబాకుతో యెంతో కష్టపడి కోడిని కోసేవారు రంగారావు మేష్టారు. వెండి పిడిమీద బంగారు లతల డిజైన్లో ఉన్న ఆబాకు,  కోడిని కోసేందుకు ఏమాత్రం అనువుగా లేకపోయినా, దానిని ఉపయోగించ గలగడమే అదృష్టంగా భావించేవారాయన. "మా తాతగారు, అంటే మీ ముత్తాతగారైన శ్రీ రాజా మధుసూదన వరప్రసాద రావు గారు వేటకి ఉపయోగించిన పిడి బాకు ఇది. దీనితో వారు ఏకంగా పెద్ద పులినే చంపేశారు," అంటూ గుర్తు చేసుకునే వారు తన్మయంగా. 

నిజానికి రంగారావు మేష్టారికి తన తాతగారు అంతబాగా తెలీదు. ఈయనకి జ్ఞానం వచ్చేసరికే ఆ పెద్దాయన కాలంచేశాడు. అయితే ఆయన వీరగాధలు జనం నోళ్ళ నుంచి విని, అంతటి గొప్పవాడికి మనవడిగా పుట్టినందుకు గర్వపడ్డారు.. ఇద్దరు ఆడపిల్లలకి మధ్యలో పుట్టిన తనకొడుక్కి ఆయన పేరే పెట్టుకున్నారు. ఉన్న జమీని విందువినోదాలకీ, వేట సరదాలకీ, మేజువాణీలకీ ఖర్చు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేసినా, ఆ తాత గారంటే వల్లమాలిన గౌరవం రంగారావు మేష్టారికి.

తను ఎంత గొప్ప వంశానికి వారసుడో కొడుక్కి తెలియాలని ఆయన తాపత్రయం. ఆదివారపు ఉదయాన్ని అందుకోసం వెచ్చించేవారు. అయితే తండ్రి చెప్పే కథలకన్నా, కోడి శరీర భాగాలు ఎక్కువ ఆకర్షించేవి మధుని. "అన్ని పక్షులు, జంతువుల శరీర నిర్మాణం ఒకేలా ఉంటుందా?" లాంటి సందేహాలెన్నో వచ్చేవి. అలా తనకి తెలియకుండానే జీవ శాస్త్రం మీద మక్కువ పెంచుకున్నాడు  మధు. ఇంటర్మీడియట్  రోజుల్లో  జువాలజీ మీద అతనికున్న ఆసక్తి లెక్చరర్లని ఆశ్చర్య పరిచింది. 

మెజారిటీ స్టూడెంట్లు అయిష్టతతోనో, తప్పనిసరి అన్నట్టో చేసే డిసెక్షన్ని చాలా ఇష్టంగా చేసేవాడు మధు. డిసెక్షన్ టేబిల్ మీద అతని పొడవాటి వేళ్ళ కదలికల్ని ప్రత్యేకంగా చూసేవారు జువాలజీ లెక్చరర్ "నీవి సర్జరీ చేయాల్సిన వేళ్ళు మధూ.. నువ్వు మెడిసిన్ లో చేరాల్సిందే," అనే వారు ప్రతిసారీ.. ఇంటర్మీడియట్ పరిక్షలు అయ్యాక ఓ ఆదివారం ఉదయం కోడిని కోస్తుండగా, తనకి మెడిసిన్ లో చేరాలని ఉందని తండ్రికి చెప్పాడు మధు.

రంగారావు మేష్టారు మొదట ఆనంద పడ్డారు.. ఆ తర్వాత బాధ పడ్డారు. "అంతా తాతగారి పేరు మహత్యం.. అందుకే అంత గొప్ప ఆలోచన వచ్చింది.." అంటూ చాలా సేపు ఆ తాతగారిని తలుచుకుని,  "మనకి ఆస్తులు ఉంటే వాటిని అమ్మైనా మెడిసిన్లో చేర్చేవాడిని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నావల్ల కాదు," అని తేల్చేశారు చివరికి.

బుట్టలో పడుకున్నరెండు కోళ్లలో ఒకటి నిద్ర లేచి 'కొక్కోక్కో..' అని గొంతెత్తి కూయడంతో ఉలిక్కిపడి, ఆలోచనల నుంచి బయటకి వచ్చాడు మధు. పల్లెటూరి ఆసామీ సీసాలో నీళ్ళని ఓ చిన్న గిన్నెలోకి వంచి కోళ్ళ ముందు పెట్టగానే ఆ గిన్నెని ముక్కుతో పొడవడం మొదలు పెట్టాయి ఆరెండు కోళ్ళూ. అది చూడగానే తనకీ దాహం వేస్తున్నట్టు అనిపించింది మధుకి. బ్యాగులో ఉన్న ప్లాస్టిక్ సీసా తీస్తుంటే, నీళ్ళ సీసాతో పాటు ఉన్న స్టీలు బాక్స్ కనిపించి, తను ఏమీ తినలేదన్న విషయం గుర్తొచ్చింది.

ముందుగా గొంతు తడుపుకుని, లంచ్ బాక్స్ మూత తీశాడు. ఉదయం స్కూలికి బయలుదేరేటప్పుడే మధ్యాహ్నం టౌనుకి వెళ్ళే పని ఉందని చెప్పగానే తల్లి ఇచ్చిన బాక్సు అది. మూత తీయగానే వచ్చిన ఘాటైన వాసన, కనిపించిన ఎర్రటి ఆవకాయ అన్నాన్ని చూడగానే తల్లి మీద కోపం ముంచుకొచ్చింది.. అది కూడా ఒక్క క్షణం మాత్రమే.

ముప్ఫై ఐదేళ్ళ క్రితం రాజా రంగారావుని (అప్పటికింకా ఆయన మేష్టారు కాదు) పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చిన ఆమె బయటి వాళ్ళతో మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళతోనూ మాట్లాడేది అంతంత మాత్రమే. అద్దె కట్టడం ఆలస్యం అవుతోందని ఇంటి ఓనరు వచ్చి కేకలేసినా, జన్మానికో శివరాత్రి అన్నట్టుగా భర్త కొత్త చీర తెచ్చినా ఆవిడ స్పందన ఒకటే, నిశ్శబ్దంగా చూడడం. 

రెండేళ్ళ క్రితం ఆ ఇంటి రెండో ఆడపిల్ల పెళ్లి జరగడం, రంగారావు మేష్టారు రిటైరవ్వడం ఒకేసారి జరగడంతో ఆ ఇంటి ఆర్ధిక పరిస్థితి మరికొంచం దిగజారింది. రంగారావు మేష్టారు మాత్రం తమకి పూర్వ వైభవం ఉండి ఉంటే  జమిందార్లంతా వచ్చి తన కొడుక్కి పిల్లనిస్తామంటూ తన ఇంటి ముందు నిలబడే దృశ్యాన్ని అప్పుడప్పుడూ ఊహించుకుంటూ తన్మయులవుతున్నారు.

ఓ చిన్న స్టేషన్లో రైలాగడం, మజ్జిగ పొట్లాలమ్మే ఓ కుర్రాడు బోగీలోకి రావడం ఒక్కసారే జరిగింది. వాడిని చూడగానే ప్రాణం లేచొచ్చింది మధుకి. ఆవకాయ కారానికి మండుతున్న నోటిని మజ్జిగతో శాంతింప జేశాడు. ఎదుటి సీటు పల్లెటూరి ఆసామీ భార్య మజ్జిగ పేకెట్ ని నేరుగా తాగకుండా తనతో తెచ్చుకున్న గ్లాసులో వంపుకోడం  చూసిన మధుకి మేరీ సువార్త కళ్ళముందు మెదిలింది. అతను మొదటిసారిగా ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు  ఇలాగే షాపు నుంచి తెప్పించిన మజ్జిగ పేకెట్ ని గాజు గ్లాసులోకి వంపి ఇచ్చింది మేరీ సువార్త.

డిగ్రీ నుంచి కలిసి చదువుకున్నా, మధుకి ఆమె పరిచయమైంది యూనివర్సిటీ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే. అది కూడా తనంతట తానుగా ఆమె వచ్చి పరిచయం చేసుకున్నప్పుడు. ఎమ్మెస్సీ లో గోల్డ్ మెడల్ కి మధుతో పోటీ పడి, రెండో స్థానం తో సరిపెట్టుకుంది సువార్త. ఆమె  బహూకరించిన 'ది సెవెన్ హేబిట్స్ అఫ్ హైలీ ఎఫిక్టివ్ పీపుల్' పుస్తకాన్ని బ్యాగ్ లోనుంచి తీసి, అందులో లీనమైపోయాడు మధు. మరి కాసేపట్లో ఒక్క కుదుపుతో గమ్యస్థానంలో ఆగింది రైలు. దిగడానికి కంగారు పడుతున్న పల్లెటూరి దంపతులని దిగనిచ్చి, వాళ్ళ వెనుక తను నింపాదిగా రైలు దిగాడు మధు.

అక్కడినుంచి కోచింగ్ సెంటర్ కి పదినిమిషాల నడక. అన్నిరకాల పోటీ పరీక్షలకి శిక్షణ ఇచ్చే సెంటర్ అది. సువార్త కనిపిస్తుందేమో అని వెతుకుతూ, తనకి బాగా పరిచయమైన క్లాసు రూముల్ని దాటుకుని డైరెక్టర్ గది వైపు వెళ్ళాడు మధు. ఆమె కనిపించక పోవడంతో కొంచం రిలీఫ్ గా అనిపించింది. అంతలోనే తనకి కావాల్సిన వ్యక్తి కనిపించడంతో  అప్పటివరకూ తను పడ్డ శ్రమంతా మర్చిపోయి "హాయ్ శివా.." అంటూ పలకరించాడు మధు.

ఐదారేళ్ళ స్నేహం  వాళ్ళిద్దరిదీ.. అప్పుడే మొదలైన బట్టతల, నలుపు తెలుపు కలగలిసిన గడ్డం, సర్వకాలాల్లోనూ కళ్ళని అంటిపెట్టుకుని ఉండే కళ్ళజోడూ.. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ నలభై ఏళ్ళ శివకుమార్ ని చూడగానే ఎవరికైనా 'ఇంటలెక్చువల్' అనిపించక మానదు. అతని కళ్ళలో విజ్ఞానం తొణికిసలాడుతూ ఉంటుంది. భౌగోళిక శాస్త్రాన్ని అతనిలా చెప్పగలిగే వాళ్ళు ఆ చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో లేరంటారు. ప్రపంచంలో ఏ దేశాన్ని గురించైనా నిద్రలో లేపి అడిగినా మ్యాప్ గీసి మరీ వివరించగలడు అతను.

"ఒకటి రెండు రోజుల్లో మీ రిజల్ట్స్ రావొచ్చట.." శివ మాట వినగానే అప్పుడే ఆగిన టెన్షన్ మళ్ళీ మొదలయ్యింది మధుకి. "ఇప్పుడింక మళ్ళీ ప్రిలిమ్స్ రాసే పని కూడా లేదు.." అన్నాడు మధు. మెడిసిన్లో చేర్చనందుకు తండ్రి మీదా, తమ ఆర్ధిక పరిస్థితి మీదా కోపం వచ్చింది మధుకి. తన దగ్గర డిసెక్షన్  నేర్చుకున్న మిత్రులు మెడిసిన్లో చేరితే బాధ పడకుండా ఉండడం అతని వల్ల కాలేదు. చాలా రోజులు తండ్రితో మాట్లాడలేదు కూడా. డిగ్రీలో చేరాక తను అందరిలాంటి ఉద్యోగం చేయకూడదు అనుకుని, కలెక్టర్ కావడాన్ని తన లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. ఐదేళ్లుగా తను పడుతున్న శ్రమ కళ్ళముందు సినిమా రీలులా తిరిగింది మధుకి. తనకెంతో ఇష్టమైన జువాలజీ, శివకి కొట్టిన పిండైన జాగ్రఫీ ఆప్షన్స్ గా సివిల్ సర్వీసు పరిక్ష రాస్తున్నాడు.

పీజీ తర్వాత రెండేళ్ళ పాటు కష్టపడి చదివి, ప్రిలిమ్స్ రాసి విజయం సాధించినా మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాడు. ఏడాది గ్యాప్ తీసుకుని చేసిన రెండో ప్రయత్నంలోనూ అంతే. . ఈలోగా ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. త్రినాధ మూర్తి గారి మంచితనం వల్ల, ఉద్యోగంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, ప్రిపరేషన్ కి మునుపటి సమయం కేటాయించడం కష్టమయ్యింది. ఆ టైములో మధుకి మోరల్ సపోర్ట్ ఇచ్చినవాడు శివ. మూడోసారి ఇంటర్వ్యూ వరకూ వెళ్ళినా ఫలితం అనుకూలంగా రాలేదు. ఈ మధ్యనే నాలుగోదీ, చివరిదీ అయిన ప్రయత్నంలో ఇంటర్వ్యూకి వెళ్లి వచ్చాడు.

"నువ్వూ, సువార్త ఇద్దరూ సెలక్ట్ అవుతారులే.." అన్నాడు శివ. ఇరవై మంది సివిల్ సర్విస్ స్టూడెంట్స్ బ్యాచిలో ఇంటర్వ్యూకి వెళ్ళింది వాళ్లిద్దరే. సువార్త ప్రస్తావన రాగానే, గత సంవత్సరం ఇంటర్వ్యూ ఫలితాలు వచ్చినప్పుడు శివతో జరిగిన వాగ్వాదం గుర్తొచ్చింది మధుకి. సువార్త మెయిన్స్ క్వాలిఫై కాలేదు అప్పుడు.

"నాకున్నది ఇంకొక్కటే అవకాశం శివా.. లైఫ్ అండ్ డెత్.. ఆమెకి అలాంటి సమస్య లేదు.. రాస్తూనే ఉండొచ్చు.. ఇది అన్యాయం కాదూ?" మధు ప్రశ్న వినగానే అతని మానసిక సంఘర్షణ అర్ధమయ్యింది శివకి.  "జనరల్ స్టడీస్ కోసం పాలిటీ చదివావ్.. రిజర్వేషన్లు ఎందుకు పెట్టారో మర్చిపోయావా?.."  అంటూ క్లాసు తీసేసుకున్నాడు శివ.

"రాజ్యాంగం రాసిన నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు.. ఇద్దరం చదువుతున్నాం.. ఇద్దరం పరిక్ష రాస్తున్నాం.. పైగా నాకన్నా ఆమెది ఆర్ధికంగా ఉన్నత స్థితి. ఆమెకి అవకాశాలు ఇచ్చి నాకు ఇవ్వకపోవడం అన్యాయం కాదూ?"  శివ దగ్గర మిగిలింది ఇక ఒకటే అస్త్రం, దానినే  ప్రయోగించాడు. "ఒక్కసారి ఆమె తాత ముత్తాతలు ఎలా బతికారో, మీ వాళ్ళు ఎలాంటి జీవితం గడిపారో ఆలోచించు.. నీకే అర్ధం అవుతుంది.."  శివ నుంచి తాత ముత్తాతల ప్రస్తావన వచ్చేసరికి ఒక్కసారిగా పట్టరాని కోపం వచ్చింది మధుకి.. బలవంతాన అదిమి పట్టాడు.

జరిగిందంతా గుర్తొచ్చి, సువార్త గురించి ఏమీ మాట్లాడలేదు మధు. ఇంటర్వ్యూ నుంచి వచ్చాక మధు, సువార్తని కలవలేదని తెలుసు శివకి. ఆ టాపిక్ మళ్ళీ తీసుకు రాకుండా, మధుకి మరోసారి ధైర్యం చెప్పాడు.. "తప్పకుండా సర్విస్ తెచ్చుకుంటావు మధూ.. మన కోచింగ్ సెంటర్ పేరు రాష్ట్రమంతా మారుమోగుతుంది," ఈ మాటలు వినగానే చాలా రిలీఫ్ గా అనిపించింది మధుకి. కాసేపు శివ తో కబుర్లు చెప్పి సాయంత్రం రైలుకి ఇంటికి బయలుదేరాడు.

"రిజల్ట్స్ వచ్చేస్తాయి" అన్నమాట పదే పదే గుర్తొచ్చి ఆ రాత్రి చాలాసేపటి వరకూ నిద్ర పట్టలేదు మధుకి. మొట్ట మొదటిసారిగా సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టి పొరపాటు చేశానా అన్న ఆలోచన తొలిచేసింది అతన్ని. మరేదైనా మంచి ఉద్యోగం ప్రయత్నించి ఉంటే జీవితం ఈ పాటికే మరికొంచం బాగుపడేది కదా అనిపించింది. వంటింటి నుంచి వినిపిస్తున్న గిన్నెల చప్పుడుకి కలత నిద్ర నుంచి మెలకువ వచ్చింది మర్నాడు ఉదయం.  "మా తాతగారిది పెద్ద చెయ్యి.. దాన ధర్మాలకి లోటు చేయలేదు వారు.." ఎదురింట్లో కొత్తగా వచ్చిన వాళ్లకి తన వంశం గొప్పదనాన్ని కథలు కథలుగా వర్ణిస్తున్నారు రంగారావు మేష్టారు.

ఎందుకో ఒక్కసారిగా నీరసం ఆవహించింది మధుకి. స్కూలికి వెళ్లాలనిపించక పోయినా బలవంతంగా సిద్ధమయ్యాడు. ముందురోజు వేసుకున్న షర్ట్ కొంచం మాసినట్టుగా అనిపించడంతో, బీరువా తీసి చేతికందిన బూడిద రంగు టీ షర్ట్ తీసుకున్నాడు. భుజాలు కొంచం గూనిగా వంచే అలవాటు వల్ల, అతని వంటిమీద ఆ నలిగిన టీషర్ట్ అచ్చం చిలక్కొయ్యకి తగిలించినట్టుగా ఉంది.

ఎప్పటిలాగే స్కూలికి నడక మొదలు పెట్టాడు. ఉదయపు ఎండైనా వంటిమీద మంటలు పుట్టిస్తోంది. మోటార్ సైకిళ్ళమీద వెళ్తున్న వాళ్ళని చూసినప్పుడు తనూ ఒక మోటర్ సైకిల్ కొనుక్కోగలిగితే బాగుండేది అని మరోసారి అనిపించింది మధుకి. ఇంతలో అతని పక్కనుంచే మోటర్ సైకిల్ మీద వెళ్తూ కనిపించాడు మేథ్స్ టీచర్ సాయిరాం. ప్రిన్సిపాల్ ని మినహాయిస్తే, ఆ స్కూల్లో మోటర్ సైకిల్ ఉన్న టీచర్ అతనొక్కడే. అతని భార్య రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఎల్డీసీ గా పనిచేయడం, అతను ఇంటి దగ్గర ట్యూషన్లు చెబుతూ ఉండడం వల్ల ఆ వెసులుబాటు కలిగింది.
 
సహోద్యోగి తన పక్కనుంచే వెళ్తున్నా నోరు తెరిచి లిఫ్ట్ అడగలేకపోయాడు మధు. ఎప్పుడూ మధు పరోక్షంలో అతని మీద జోకులేసే సాయిరాం లిఫ్ట్ ఆఫర్ చేసే ప్రయత్నం చేయలేదు. ప్రిన్సిపాల్ కి ఒకసారి కనిపించి, నేరుగా తన క్లాసుకి వెళ్ళాడు.మధు.  క్లాసు కోలాహలంగా ఉంది. తన అలవాటు ప్రకారం ముందు బెంచీలో కూర్చున్న అమ్మాయిని క్రితం రోజు రాసిన నోట్సు చదవమన్నాడు మధు. ఆ అమ్మాయి పేరు చంద్రిక. అదే పేరుతో ఒక సౌందర్య సబ్బు మార్కెట్లో ఉండడంతో, మిగిలిన పిల్లలంతా ఆమెని 'సబ్బూ' అని పిలుస్తూ ఉంటారు. ఆ క్లాసులో మధుకి ఇష్టమైన స్టూడెంట్ ఆమె.

లేచి నిలబడి, క్లాసందరి వంకా ఒకసారి గర్వంగా చూసి, తను రాసుకున్న నోట్సు చదివింది సబ్బు.. "ఆకస్మికముగా సంభవించే గుణాత్మక వైవిధ్యములను ఉత్పరివర్తనములు అందురు.."  అంటూ..   ముందుగా  నోట్సు చెప్పి తర్వాత పాఠం చెప్పడం అలవాటు మధుకి.

"హ్యూగో డివ్రిస్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన ఈ ఉత్పరివర్తన సిద్ధాంతం ప్రకారం చుట్టూ ఉండే వాతావరణం లో వచ్చే మార్పులకి అనుగుణంగా జీవులు  మనుగడ  సాగించడం కోసం వాటి శరీర నిర్మాణంలో మార్పులు జరుగుతాయి.." తను యెంతో ఇష్టంగా చదువుకున్న సబ్జెక్టుని పిల్లలకి అర్ధమయ్యేలా వివరించడాన్ని ఒక చాలెంజ్ గా తీసుకున్నాడు మధు. వాళ్ళ ముఖాలు చూడడం తోనే తను చెప్పింది పిల్లలకి కొద్దిగానే అర్ధంయ్యిందనీ, మరింత వివరంగా చెప్పాల్సిన అవసరం ఉందనీ గమనించాడు. 

జీవశాస్త్రం మీద అతనికి ఉన్న ప్రేమ కారణంగా చాలాసార్లు పాఠాలు సిలబస్ పరిధిని దాటేస్తూ ఉంటాయి.  ఇంగ్లండ్ లో మాత్ లపై వందేళ్ళ పాటు జరిగిన పరిశోధనని వివరించేందుకు సిద్ధమయ్యాడు.  "ఇంగ్లండ్ లో మన సీతాకోక చిలుకలని పోలిన మాత్ లు చెట్ల కాండాలపై నివాసం ఏర్పరచుకుని ఉంటాయి. అక్కడి చెట్ల కాండాల్లాగే ఈ మాత్ లు కూడా తెల్ల రంగులో ఉండేవి. ఇంగ్లండ్ అభివృద్ధి చెంది పరిశ్రమలు పెరగడంతో, కాలుష్యం పెరిగి చెట్ల కాండాలు నలుపు రంగులోకి మారడం మొదలయ్యింది. దీనితో నల్లగా మారిన కాండాలపై నివాసం ఏర్పరచుకున్నతెల్లని మాత్ లు సులువుగా వాటి శత్రువుల కళ్ళలో పడి ప్రాణాలు పోగొట్టుకునేవి.."  పిల్లలంతా పాఠంలో లీనమై పోవడం గమనించాడు మధు. అతనికి ఉత్సాహం పెరిగింది.

"ఇక మాత్ జాతి అంతరించిపోతుందా  అనిపించే సమయంలో ఒక విచిత్రం జరిగింది. మాత్ ల సంతతిలో నలుపు రంగు మాత్ లు కనిపించడం మొదలయ్యింది. కాలక్రమంలో తెల్ల మాత్ ల సంఖ్య తగ్గుతూ, నల్ల మాత్ ల సంఖ్య పెరిగింది. ఇలా జరగడానికి కారణం ఉత్పరివర్తనం. ఉత్పరివర్తనమే జరగక పోతే మాత్ జాతికి మనుగడ ఉండేది కాదు," క్లాసులో సూది పడితే వినిపించేతంత నిశ్శబ్దం. . "ఇది ఇక్కడితో  అయిపోలేదు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాన్ని గురించి ప్రజలు ఆందోళనలు చేయడంతో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాతావరణంలో మార్పులు జరిగి చెట్ల కాండాలు మళ్ళీ తెల్లగా మారడం మొదలయ్యింది.." అప్పటికే పిల్లలంతా ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచేశారు.

"అప్పటికి తెల్ల మాత్ ల సంఖ్య బహు స్వల్పంగా ఉంది. చెట్ల కాండాలు తెల్లబడడంతో నల్ల మాత్ ల మనుగడకి ముప్పు వచ్చింది. తెల్లని కాండంపై నల్లని మాత్ లు దాగి ఉండలేక శత్రువుల కళ్ళ పడేవి. దీనితో నల్ల మాత్ ల సంఖ్య తగ్గి తెల్ల మాత్ ల సంఖ్య పెరగడం మొదలయ్యింది. ఈ మొత్తం ప్రక్రియ వంద సంవత్సరాల కాలంలో జరిగింది.." అక్కడివరకూ చెప్పి ఆగాడు మధు అతని బుర్రలో మ్యూటేషన్స్ థియరీ, హ్యారిసన్ పరిశోధన, దానిపై వచ్చిన భిన్నాభిప్రాయాలు గిర్రున తిరుగుతున్నాయి. పిల్లలకి మాత్రం పాఠం విన్నట్టుగా కాక ఏదో చందమామ కథ విన్నట్టుగా అనిపించింది.

"సార్ నాకో డౌటు.." అంటూ లేచి నిలబడింది సబ్బు. "జాతులు అంతరించిపోతున్నప్పుడు మాత్రమే ఉత్పరివర్తనాలు జరుగుయాయా సార్?" ఆమె ప్రశ్నని మధు అర్ధం చేసుకునే లోపునే "అంటే.. ఇంక వేరే ఏ కారణానికీ జరగవా?" అంటూ తన ప్రశ్న పూర్తి చేసింది. జవాబు చెప్పడానికి మధు సిద్ధ పడుతుండగానే ఓ వడగాలి కెరటం బలంగా తాకి వెళ్ళింది. పరుగులాంటి నడకతో త్రినాధ మూర్తి గారు క్లాసుకి వచ్చారు. ఉన్నట్టుండి ప్రిన్సిపాల్ రావడంతో పిల్లలంతా లేచి నిలబడ్డారు. "ఫిఫ్టీంత్ ర్యాంక్ మధూ.. ఐఏఎస్..కంగ్రాట్స్.." ఎప్పుడూ సీరియస్ గా ఉండే త్రినాధ మూర్తి, ఆక్షణంలో తన ఉద్వేగాన్ని దాచుకునే ప్రయత్నం ఏదీ చేయలేదు.

మధుకి విషయం అర్ధం కావడానికి అర నిమిషం పట్టింది. అర్ధం కాగానే నిటారుగా నిలబడ్డాడు. భుజాలు వెనక్కి వెళ్లి చాతీ ముందుకు పొంగడం తో టీ-షర్ట్ శరీరానికి అతుక్కుపోయిందా అనిపించేలా అయింది.  కళ్ళెత్తి సూటిగా చూశాడు త్రినాధమూర్తి వైపు. ఇంకా ఉద్వేగంలోనే ఉన్న త్రినాధ మూర్తి గారు మధు చేతులు పట్టుకోబోతుండగా, వారించి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, బలంగా. మధూ సార్ కలక్టర్ కాబోతున్నారని అర్ధమయ్యింది పిల్లలకి. వాళ్ళంతా అభినందన పూర్వకంగా చప్పట్లు కొట్టడంతో, ఆ సందడికి పక్క రూంలో క్లాసు చెబుతున్న సాయిరాం, ఆ సెక్షన్ పిల్లలూ, స్టాఫ్ రూం లో ఉన్న టీచర్లు, స్టాఫ్ అంతా అక్కడికి చేరిపోయారు. అందరి అభినందనలనీ హుందాగా అందుకున్నాడు మధు.

"ఇంటికి వెళ్లి మీ నాన్నకి చెప్పు మధూ.. చాలా సంతోషిస్తాడు," అన్నారు త్రినాధ మూర్తి. ఏకవచన ప్రయోగానికి చురుక్కున చూశాడు మధు. ఇప్పుడతని శరీరంలో శ్రీ రాజా మధుసూదన వరప్రసాద రావుగారి రక్తం పరవళ్ళు తొక్కుతోంది. "శివకి ఈ వార్త చెప్పడం ఎలా?" అన్న ఆలోచన ఒక్క క్షణంలో వచ్చి మాయమయ్యింది. "రిజల్ట్స్ చూసి తనే వస్తాడులే.." అనుకున్నాడు.

మోటార్ సైకిల్ తెచ్చి క్లాసు ముందు ఆపి వినయంగా ఆహ్వానించాడు సాయిరాం "రండి..ఇంటిదగ్గర దింపుతాను.." అంటూ. ఎవ్వరివైపూ చూడకుండా, ఏమీ మాట్లాడకుండా ఠీవిగా వెళ్లి మోటార్ సైకిల్ వెనుక సీటుమీద కూర్చున్నాడు మధు. మేష్టర్లే కాదు, పిల్లలు కూడా వింతగా చూశారు ఆ దృశ్యాన్ని. "జాతులు అంతరించిపోతున్నప్పుడు మాత్రమే ఉత్పరివర్తనాలు జరుగుయాయా సార్?" అని అడిగిన సబ్బు కూడా వాళ్ళలో ఉంది.

32 కామెంట్‌లు:

  1. ఉత్పరివర్తనం అన్న ఒక పదాన్ని మనుష్యులకు అన్వయించి బాగా రాసారు. కథ.
    అభినందనలు. - శ్రీకర్

    రిప్లయితొలగించండి
  2. అతి సహజమైన మానవ నైజాన్ని చాలా బాగా ఆవిష్కరించారు.

    రిప్లయితొలగించండి
  3. అభినందనలు మురళి గారు !కధ చదువుతున్నంత సేపూ "ఉత్పరివర్తన" చెందుతూనే ఉన్నాను కధను నాలుగు భాగాలు చేస్తే ప్రతిభాగం లోనూ వేరే కోణం.... అంటే నేననుకున్నట్టు కాకుండా కధ నడిచింది మీరు చెప్పదలుచుకొన్నది , టైటిల్ అర్ధం ...అంతా చివరికి గాని తెలియలేదు . బావుందండీ ...మురళిగారు , మీ మూడోకధకోసం ఎదురుచూస్తామిక !
    * అన్నట్టు నా కవిత ??? :) :)

    రిప్లయితొలగించండి
  4. హుమన్ నేచర్ చక్కగా విశ్లేషించారు. మీ రెండవ కధ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. కథ చాలా బాగుందండీ....

    రిప్లయితొలగించండి
  6. నాదీ నిషిగంధ గారి మాటే...మీరు డిస్టింక్షన్ లో పాసయ్యారు. ఇహ మీరు పై చదువులకి (మరిన్ని రచనలకి) శ్రీకారం చుట్టడమే ఆలస్యం :)

    రిప్లయితొలగించండి
  7. చాలా బాగుందండి. పాత్రల చిత్రణ బాగుంది.

    రిప్లయితొలగించండి
  8. మీ మొదటి కధ కూడా ఈ రోజే చదివాను. అద్భుతంగా ఉంది. చాలా చాలా నచ్చింది నాకు. కధలో పూర్తిగా లీనమైపోయాను. కధలో images అన్నీ ఇప్పటికీ మనసులో అలానే ఉండిపోయాయి.చాలా భారమైన ముగింపు - కంటతడిపెట్టించింది.

    రిప్లయితొలగించండి
  9. మొదటి కథ కన్నా రెండోది చాలా బాగుంది. విభిన్న కథాంశం, సరళమైన కథనం. నిజానికి మీరు దీన్ని వెబ్ పత్రికల్లో కాకుండా ఏ ఈనాడుకో, ఆంధ్రజ్యోతికో పంపి ఉండాల్సింది. ఎక్కువ మంది చదివే అవకాశం ఉండేది. ఆదివారం అనుబంధాల రొడ్డకొట్టుడు కథలు మారాలంటే ఇలాంటి కథలు అచ్చేయటం అత్యవసరం.

    ముఖ్యంగా, క్లైమాక్స్ చాలా చాలా బాగుంది. 'ఆకస్మికముగా సంభవించే గుణాత్మక వైవిధ్యములను ఉత్పరివర్తనములు అందురు' అని మొదట్లోనే చెప్పించి చివర్లో మధు పాత్రతో అలా ప్రవర్తింపజేయటం కూడా బాగుంది. 'సబ్బు' ప్రశ్నకి 'కాదు' అని చెప్పకుండానే చెప్పటం ఇంకా బాగుంది.

    ఇన్ని సార్లు 'బాగుంది' అని నేను మరే కథకీ రాయలేదేమో! Keep it up. Expecting more such stories from you.

    రిప్లయితొలగించండి
  10. కధ చదువుతున్న కాసేపు నేను ఎక్కడ వున్నానో మర్చి పోయి అలా మధు ఎదురు గా అదృశ్య రూపం లో నుంచుని చూస్తున్నట్లు వుంది. అధ్బుతం మురళి గారు. నాకు తెగ నచ్చేసింది, వో పెద్ద పెద్ద గా విశ్లేషించకుండా వుత్పరివర్తనం పూర్తి గా అర్ధం అయ్యింది. మీరు కధ లు చాలా బాగా రాయగలరు. నా వోటు పడి పోయింది మీకు.

    రిప్లయితొలగించండి
  11. ఇక్కడ వ్యాఖలు చూశాకా మళ్ళీ చదివాను కథని.
    నాకు మాత్రం మొదటి కథే బాగా నచ్చింది రెండవ దాని కంటే. కాకపోతే రెండవది రాయడం చాలా కష్టమని అనిపించింది.

    నేను సరిగ్గా ఫాలో అవ్వలేదో ఏమో మరి - ఉత్పరివర్తనం ఎవరిలో అన్నది నాకింకా స్పష్టంగా తెలియట్లేదు. ఒక వేళ మధు లో ఐతే అతని లో సడన్ గా వచ్చిన మార్పు ఏంటి ? కలెక్టర్ అవ్వడమా ? ఒక వేళ మిగతా వారిలో ఐతే “జాతులు అంతరించిపోతున్నప్పుడు మాత్రమే ఉత్పరివర్తనాలు జరుగుతాయా" అన్న దాంట్లో అర్థం ఏంటి ? అది ముగింపు గా ఎలా కుదురుతుంది.

    ఏమో నాకు కథే సరిగ్గా అర్థం కాలేదా అని అనుమానం వస్తోంది ఇప్పుడు.

    రిప్లయితొలగించండి
  12. ఎందుకో బెల్లం టీ అంత రుచిగా అనిపించలేదు నాకయితే,లేకపోతే మీ బాల్యజ్ఞాపకాలకి అలావాటుపడిపోయిందో నా బుర్ర(ఇలా రాయడానికే ఇంత టైం తీసుకోవాల్సొచ్చింది).ఇంత మంది వ్యాఖ్యలు చూసాక మళ్ళీ మరొక్క సారి చదవాలేమో(ప్రత్యేకించి అబ్రకదబ్ర గారి కామెంటుకోసమయినా)లేక నాలో ఏమయినా ఉత్పరివర్తన వచ్చిందేమో చూడాలి.

    రిప్లయితొలగించండి
  13. @Vasu:

    >> "ఒక వేళ మధు లో ఐతే అతని లో సడన్ గా వచ్చిన మార్పు ఏంటి ? కలెక్టర్ అవ్వడమా"

    కాదండీ. కలెక్టర్ అవబోతున్నాడన్న సంగతి తెలీగానే అతనిలో అమాంతం పెరిగిపోయిన ధీమా, తలెత్తిన పొగరు. అప్పటిదాకా దిగాలుగా భుజాలు కుదేసుకుని ఉన్నవాడల్లా ఒక్క వార్త వినగానే నిటారుగా ఐపోవటం. మొత్తమ్మీద అతని స్వభావంలో వచ్చిన కొట్టొచ్చే తేడా. అదీ అతని విషయంలో 'ఉత్పరివర్తనం'

    >> " "జాతులు అంతరించిపోతున్నప్పుడు మాత్రమే ఉత్పరివర్తనాలు జరుగుతాయా" అన్న దాంట్లో అర్థం ఏంటి ? అది ముగింపు గా ఎలా కుదురుతుంది"

    అది అతను చెప్పిన సైన్సు పాఠానికి సంబంధించిన ప్రశ్న. సమాధానం అతని ప్రవర్తనలో ఉంది - 'కాదు' అని. తన హోదా పెరగనుందని తెలిసిన క్షణాన అతనిలో వచ్చిన ఆకస్మిక మార్పది. చక్కని ముగింపే. కాదా?

    నాకిది నచ్చటానిక్కారణం మేరీ సువార్తతో మధుకి ప్రేమ కథ నడిపించకపోవటం, సైన్సు సంగతులు (కొంచెం ఎక్కువయినట్లనిపించింది; అయినా ఫర్వాలేదు) తెలివిగా చొప్పించటం, మానవ నైజాన్ని సైంటిఫిక్ థియొరీల్లో ఇరికించలేమని తేల్చటం. వీటన్నిటికీ మించి చంద్రిక ప్రశ్నకి మధు ప్రవర్తన ద్వారా సమాధానం ఇప్పించటం (అది కూడా - రచయితో, మరే పాత్రో వ్యాఖ్యానం రూపంలో చెప్పకపోవటం). వీటన్నిటితో పాటు కథనంలో తెలుగుదనం మిళాయించటం, జమీందారీ గతాల గొప్పలు చెప్పుకునే తండ్రి పాత్ర చిత్రణ.

    రిప్లయితొలగించండి
  14. బావుందండీ. చాలా చక్కగా వ్రాశారు.

    రిప్లయితొలగించండి
  15. @ అబ్రకదబ్ర - థాంక్సులు. వివరంగా చెప్పారు. ఇప్పుడు ఇంకా బావుంది కథ.

    "అది అతను చెప్పిన సైన్సు పాఠానికి సంబంధించిన ప్రశ్న. సమాధానం అతని ప్రవర్తనలో ఉంది - 'కాదు' అని"

    ఇది నేను పట్టుకోలేక పోయాను.

    "సైన్సు సంగతులు (కొంచెం ఎక్కువయినట్లనిపించింది)" -
    ఇది నిజం. నాలాగ తెలుగులో సైన్స్ చదవుకోని వాళ్ళకి కొంచం ఇబ్బంది.

    రిప్లయితొలగించండి
  16. @శ్రీకర్ బాబు: ఒక చిన్న ప్రయత్నం అండీ.. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
    @వెన్నెల కోన: ధన్యవాదాలండీ..
    @శిశిర: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  17. @పరిమళం: కవిత..?! ప్రయత్నపూర్వంకంగా వచ్చేది కాదని మీకూ తెలుసు.. అందరూ రాయగలిగేది కాదనీ మీకు తెలుసు.. అయినా ఇలా అడుగుతుంటే ఏం చెప్పను చెప్పండి? :-) ...ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..
    @రవిచంద్ర: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  18. @నిషిగంధ: అయ్యబాబోయ్.. డిష్టింక్షనే.. పాస్ చేసినందుకే బోల్డంత సంతోషంగా ఉందండీ.. ధన్యవాదాలు.
    @మధురవాణి: రాయడం నాకూ ఇష్టమేనండీ.. అన్నీ కుదరాలి కదా.. ధన్యవాదాలు.
    @భవాని: ధన్యవాదాలండీ.. 'బెల్లం టీ' గత నెలలో ప్రచురితమయ్యింది..

    రిప్లయితొలగించండి
  19. @సునీత: ధన్యవాదాలండీ..
    @అబ్రకదబ్ర: "ఇన్ని సార్లు 'బాగుంది' అని నేను మరే కథకీ రాయలేదేమో!" I feel I am honoured.. కథని మీరు అర్ధం చేసుకున్న విధానం.. మీరు నాలో పరకాయ ప్రవేశం చేశారా అనిపించింది. 'ఈనాడు' 'ఆంధ్రజ్యోతి' లకి పంపడం అంటే రెండు సందేహాలండీ..ప్రచురించడానికి ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు. వాళ్లకి ఇలాంటి కథలు నచ్చుతాయో లేదో అంతకన్నా తెలీదు.. అసలు పాఠకుల స్పందన ఎలా ఉంటుందో అని నాకూ సందేహమే, ప్రచురితమయ్యే వరకూ.. ఇక సైన్సు సంగతులు అంటే.. కొద్దిగా మాత్రమే చెబితే కొందరికి మాత్రమే అర్ధమవుతుంది.. అందరికీ అర్ధం కావాలంటే ఆ మాత్రం వివరించక తప్పదని అనిపించిందండీ.. మీ సూచనని దృష్టిలో ఉంచుకుంటాను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @భావన: వోటు వేసినందుకు ధన్యవాదాలండీ..
    @వాసు: డార్విన్ పరిణామ సిద్ధాంతం తర్వాత, ఉత్పరివర్తన సిద్ధాంతం వస్తుందండీ.. అందుకే మొదట్లో 'అతని ఆలోచనలు డార్విన్ సిద్ధాంతాన్ని దాటి ఎటో వెళ్ళిపోయాయి..' అని రాశాను. ఇంగ్లీష్ మీడియం ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని "అతని బుర్రలో మ్యుటేషన్స్ థియరీ, హ్యారిసన్ పరిశోధన...." అన్నది. సైన్సు సంగతుల విషయంలో మీ సూచన దృష్టిలో ఉంచుకుంటాను.. ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: బహుశా మీరు 'బెల్లం టీ' లాంటి మరో కథని ఊహించడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. కధ చాలా బావుంది.నాకు కూడా ముగింపు చాలా బాగా నచ్చింది.అయితే మీకు సవాలు విసిరితే మరీ బాగా రాసేస్తారన్న మాట.గుర్తుంచుకుంటాము :)

    రిప్లయితొలగించండి
  22. మార్చిన టేంప్లేట్ చాలా బాగుందండి. కథ ఇంకా బాగుంది. కంగ్రాట్స్...

    రిప్లయితొలగించండి
  23. Wow!! Awesome!! మురళి గారు, మొన్నొక రోజు మొదటి పేరా చదివి అబ్బా సైన్సు కథ మనకవసరమా అని పక్కన పెట్టేశాను (పూర్తిగా మర్చిపోయిన తెలుగు సైన్సుపాఠాలు ఒక కారణం కావచ్చు:-). ఈరోజు మొత్తం చదివాను. కాస్త ముందుకు వెళ్ళాక ఇక ప్రయాస పడనవసరం లేకపోయింది. క్లైమాక్స్ లో చంద్రిక ప్రశ్న, దానికి మీరు చెప్పిన జవాబు అద్భుతం.

    ఇది పొద్దులో మీ కథకు రాసిన కామెంట్. మీకు సవాల్ విసిరి మంచి కథను మాకందించేలా చేసిన నిషిగంధ గారికి ధన్యవాదాలు. అది సరే కానీ మురళి గారు నాకో విషయం చెప్పండి. మీ అసలు పేరు ఏమిటి ? మీరో ప్రముఖ రచయిత అయి ఉంటారు ఇలా అఙ్ఞాతంగా బ్లాగు రాస్తున్నారు అన్న వాదన నిజమే అనిపిస్తుంది ఈ కథ చదివాక. బాబ్బాబు ఈ సస్పెన్స్ తట్టుకోలేను చెప్పేద్దురూ!!

    అన్నట్లు మీ కొత్త టెంప్లేట్ బాగుంది కానీ ఎందుకో నెమలి కాస్త కళ తగ్గినట్లు అనిపిస్తుంది. బహుశా కాంట్రాస్ట్ వలనో రిజల్యూషన్ వలనో అయి ఉండచ్చు.

    రిప్లయితొలగించండి
  24. @రాధిక: మీ ఇంటర్ ప్రిటేషన్ బాగుందండీ :-) ..ధన్యవాదాలు.
    @జయ: ధన్యవాదాలండీ..
    @వేణూ శ్రీకాంత్: నాకు ఎలాంటి ఫ్లాష్ బ్యాకులూ లేవండీ.. కళ తగ్గింది నెమలికా లేక టపాలకా :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. హన్నన్నా ఎంత మాట !! టపాలకు కాదండీ బాబు, నెమలి ఫోటో గురించి నేను చెప్పింది :-) వదిలేయండి లే బహుశా అది నా కంప్యూటర్ రిజల్యూషన్ వలన కూడా అయి ఉండచ్చు.

    రిప్లయితొలగించండి
  26. @వేణూ శ్రీకాంత్: సరదాగా అన్నానండీ.. ఇంతకన్నా మంచి టెంప్లేట్ దొరకగానే మార్చేస్తాను.. అప్పటివరకూ కూసింత ఓపిక పట్టండి..

    రిప్లయితొలగించండి
  27. కధ చాలా బావుంది
    మురళి గారు అభినందనలు

    రిప్లయితొలగించండి