బుధవారం, జనవరి 06, 2010

గాలివాన

కొందరు రచయితలు ఉంటారు.. వాళ్ళ మానాన వాళ్ళు రాసుకు పోతారు.. మిగిలిన విషయాల మీద వాళ్ళకి పెద్దగా దృష్టి ఉండదు. అలాంటి వాళ్ళ రచనలు చదివినప్పుడు మనకి అనిపిస్తుంది, వాళ్లకి రావల్సినంత పేరు రాలేదని. తెలుగు కథకి అంతర్జాతీయ స్థాయి లో పేరు తెచ్చిన పాలగుమ్మి పద్మరాజు గారి కథలు చదివినప్పుడు నాకు అలాగే అనిపించింది. వస్తు వైవిధ్యం మొదలు, భావ వ్యక్తీకరణ వరకూ 'తెలుగు కథ' కి ఒక రిఫరెన్స్ గా చెప్పగలిగిన కథలు రాసినా, ఆయన గురించి అందరికీ తెలిసింది తక్కువ.

పాలగుమ్మి పద్మరాజు రచించిన అరవై ఆరు కథలతో (యాభై తొమ్మిది తెలుగు కథలు, ఏడు అనువాదాలు) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ గత సంవత్సరం ఒక సంపుటం తెచ్చింది. ఈ సంస్థ ప్రచురిస్తున్న 'పాలగుమ్మి పద్మరాజు రచనలు' సిరీస్ లో మొదటి పుస్తకం ఇది. ఇవన్నీ ఏకబిగిన చదివే కథలు కాదు. చదివి, ఆలోచనల్లో పడి, తేరుకుని, మళ్ళీ చదివి.. మనసుతో పాటు, మెదడుకి పట్టించుకునే కథలు. మొత్తం కథల గురించి చెప్పబోవడం సాహసమే అవుతుంది కాబట్టి, 'గాలివాన' కథ గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.న్యూయార్క్-హెరాల్డ్ ట్రిబ్యూన్ 1956 లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కథల పోటీలో రెండో బహుమతి పొందిన కథ 'గాలివాన.' నాకు తెలిసినంత వరకూ, తెలుగు కథకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మొదటి కథ. ప్రధాన పాత్ర రావుగారు. సంఘంలో గౌరవ ప్రదమైన వ్యక్తి. వకీలుగా పని చేసి, కొడుకు న్యాయవాద పరీక్షలు నెగ్గాక, తన వృత్తిని అతనికి అప్పగించి విశ్రాంత జీవితం గడుపుతూ ఉంటారు. జీవితం పట్ల కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్న రావు గారు తన నలుగురు పిల్లల్నీ చాలా క్రమశిక్షణతో పెంచారు.

రావుగారి క్రమశిక్షణ ఎంతటిదంటే తన ఇద్దరు కూతుళ్ళూ ఎలా తల దువ్వుకోవాలో కూడా ఆయనే నిర్ణయించారు. స్వీయ నియంత్రణల మధ్య జీవితం చాలా సాఫీగానూ, సంతోషంగానూ గడిచిపోతూ ఉంటుంది రావుగారికి. ఉపన్యాసాలమీద ఆసక్తి ఉన్న రావు గారు, వివిధ సంస్థల ఆహ్వానాల మేరకు భిన్న అంశాల మీద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. 'సత్వము-తత్వము' 'ప్రకృతి-పరిష్క్రుతి' ..ఇలా ఉంటాయి ఉపన్యాసాల కోసం ఆయన ఎంచుకునే అంశాలు. ఆయన ఉపన్యాసాల శీర్షికలు శబ్దాలంకారాలను బట్టి నిర్ణయమవుతాయి కానీ అర్ధ స్ఫురణని బట్టి కాదని ఆయన స్నేహితులు కొందరు ఆయన్ని వేళాకోళం చేస్తూ ఉంటారు.

'ఆస్తిక మహా సమాజము' వారి ఆహ్వానం మేరకు 'సామ్యవాదము-రమ్య రసామోదము' అనే అంశం మీద ఉపన్యాసం ఇవ్వడానికి రావుగారు రైల్లో బయలుదేరినప్పుడు చిన్నగా వర్షం మొదలై, ఆయన గమ్యస్థానం చేరేసరికి గాలివానగా తీవ్ర రూపం దాలుస్తుంది. రైల్లో తను బిచ్చం వెయ్యకుండా అసహ్యించుకున్న ముప్ఫై ఏళ్ళ యువతి మాత్రమే ఆయనకి సాయంగా ఉంటుంది ఆ రాత్రి, కూలిపోడానికి సిద్ధంగా ఉన్న వెయిటింగ్ రూములో. క్షణ క్షణానికి ఉద్ద్రుతమవుతున్న గాలివానని చూసి ధైర్యం కోల్పోతారు రావుగారు. కానీ ఆమె దేని గురించీ బాధ పడదు, గాలివానను గురించి కూడా.

"జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకి సజీవమైన అనుబంధం, గడిచిన కాలపు స్మృతుల బరువుగానీ, రాబోయే రోజుల గూర్చిన ఆశలుగానీ ఆమెకు లేవు. ఆమె నడవడిని నిర్ణయించే సూత్రాలు లేవు. ఆ సూత్రాలలో నిషేధాలసలే లేవు. నిత్యమూ ధర్మాధర్మ చింతతో బాధపడే అంతరాత్మగానీ, నాగరికులకు సహజమయిన సంకీర్ణ మనస్తత్వమగానీ ఆమెకు లేవు.." ఆయన ప్రాణభయంతో వణుకుతుంటే "సరిగ్గా కూకోని నా సుట్టూ సేతులేసుకోండి.. కాంత ఎచ్చగుంటది పాపం!" అనగలదు ఆమె.

ప్రకృతి ప్రళయ భీభత్సాన్ని చూపిన ఆ రాత్రి, ఏ విలువలకీ లొంగని జీవితాన్ని గడుపుతున్న బిచ్చగత్తె, రావుగారు తను నమ్మిన విలువలూ, నియమాలూ, ధర్మచింతా, వేదాంతం.. వీటన్నింటినీ త్యజించడానికి సిద్ధపడేలా ఎలా చేయగలిగిందన్నది కథ చదివి తెలుసుకుంటేనే బాగుంటుంది. పుస్తకం ముందుమాటలో ఏటుకూరి ప్రసాద్ చెప్పినట్టుగా పద్మరాజు గారి కథలు చాలా భాగం పాఠకుల "గుండెకు కాకుండా మెదడుకు గురిపెట్టినవే!" కథలని ఇష్టపడేవాళ్ళు చదివి తీరాల్సిన ఈ 499 పేజీల పుస్తకం వెల రూ. 250, విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ దొరుకుతుంది.

16 కామెంట్‌లు:

 1. బాగుందండీ పరిచయం ...ఆ దిక్కు దృస్టిసారిస్తాం

  రిప్లయితొలగించు
 2. "చదివి, ఆలోచనల్లో పడి, తేరుకుని, మళ్ళీ చదివి.." గత రెండు రోజులుగా నా పరిస్థితి ఇదే మురళి గారు. ఇంకోతి కొమ్మచ్చి తో పాటు బాపు కార్టూనులు, ఈ పుస్తకం కూడా కొన్నాను మొన్న గుంటూరులో. ముందు అవిరెండూ ముగించి రెండు రోజులు క్రితమే ఈ కథలు మొదలుపెట్టాను. ఇలాటి కథల పుస్తకాలు ఒక వరుసలో కాకుండా అక్కడక్కడా కథలు ఎన్నుకుని చదవడం నాకు అలవాటు.

  "నాకు మృత్యువు అంటే ఇష్టం" అని పద్మరాజు గారు చెప్పుకున్న మాటలు అక్షరసత్యాలను చేస్తున్నట్లు గా నేను చదివిన ఐదారు కథలు మృత్యువు తోనో లేదా అంతే తీక్షణమైన అంశంతోనో ముడి పెట్టుకున్నవే... ఈ కథలు చదివి ఆలోచనల వేడి భరించలేక బాపు కార్టూన్ లు ఒక నాలుగైదు పేజీలు చదివితే కానీ మాములు మనిషిని కాలేకపోతున్నాను. అలా అని పుస్తకం చదవడమూ మానలేకపోతున్నాను. ఇంతవరకూ నే చదివిన కథల పుస్తకాలలో పూర్తి వైవిధ్యభరితమైన కథల పుస్తకం ఇది. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఈ గాలివాన కథ చదివేస్తాను.

  రిప్లయితొలగించు
 3. కొంటానో కొననో తెలీదు కానీ కొనాల్సిన పుస్తకాల లిస్ట్ మాత్రం పెరిగిపోతోంది...:)
  కధ వేరే అయినా రైల్వే స్టేషన్ ...వైటింగ్ రూమ్ అనగానే నాకు ఇష్టమైన "ijaazat" అనే హిందీ సిన్మా గుర్తొచ్చింది...cinema రైల్వేవైటింగ్ రూం సీన్ తో మొదలై వైటింగ్ రూం సీన్ తో ఆఖరౌతుంది.Good film with good songs..!

  రిప్లయితొలగించు
 4. చాలా చక్కటి పుస్తకం గురుంచి చెప్పారు మురళీ గారు...తప్పకుండా చదివి తీరుతాను.

  రిప్లయితొలగించు
 5. బాగుందండి ఆశ పెట్టి వదిలేస్తారు !
  మాలాంటి వాళ్ళకి ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి , దయచేసి మొత్తం కదా చెప్పలిసిందే ఇంకొక టపా లో.
  అలాగే , నేను కూడా బ్లాగ్ ఓపెన్ చేసుకున్నానండి. కానీ కొన్ని విషయాలు అసలు అర్ధం కావట్లేదు , లే అవుట్ డిజైన్ ఎలా చేసుకోవాలో చెబుతారా.

  రిప్లయితొలగించు
 6. మంచి పరిచయం. గాలివాన, పడవ ప్రయాణం అత్యుత్తమ కధలు.

  రిప్లయితొలగించు
 7. ఆసక్తికరమైన కథల పుస్తకానికి బహు చక్కటి పరిచయం చేసారు మురళి గారూ.. నేనెప్పుడు ఇవన్నీ చదవగలనో.. ఏంటో :(

  రిప్లయితొలగించు
 8. సహజంగా నాకు, సాహిత్యం అంటే ఇంట్రెస్ట్ లేదు కాని,
  ఎందుకో మీ ఈ పరిచయం నచ్చింది.
  అదీ కాక, రచయిత గురించి వేణు శ్రీకాంత్ గారి వ్యాఖ్య
  _________________________
  "నాకు మృత్యువు అంటే ఇష్టం"
  _________________________
  చూసాక, చదవాలనిపిస్తోంది.

  రిప్లయితొలగించు
 9. మొన్న హైద్రాబాద్ బుక్ ఎక్షిబిషన్ లో ఈ బుక్ చూసానండి. కాని చదవగలనో, లేదో అని భయమేసి తీసుకోలేదు. వేరే బుక్స్ కొనుక్కొని వొచ్చేసాను. కాని మీ పరిచయం చదివిన తరువాత అర్ధం చేసుకోగలనులే అనిపిస్తోంది. తిలక్ కథలు, కోతికొమ్మచ్చి కొనుక్కున్నాను. ఇంకా వెరే బుక్స్ కూడా కొనుక్కున్నాను. కాని ఏవిటో...మరి ఎందుకు ఈ బుక్ కొనుక్కో లేదో నాకే తెలియదు.

  రిప్లయితొలగించు
 10. Interesting that Padmaraju's stories are discussed in two blogs on the same day. More on this story later.

  రిప్లయితొలగించు
 11. @చిన్ని: ధన్యవాదాలండీ..
  @వేణూ శ్రీకాంత్: నాకు బాగా నచ్చింది కూడా 'మృత్యువు' గురించి ఆయన రాసిన విదానమేనండీ.. ఏ రెండు కథల్లోనూ ఒకేలా ఉండదు.. ధన్యవాదాలు.
  @తృష్ణ: ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 12. @కిషన్ రెడ్డి: తప్పక చదవండి.. మిమ్మల్ని నిరాశ పరచదు.. ధన్యవాదాలు.
  @మహీపాల్: బ్లాగు వారైనందుకు అభినందనలు.. ప్రారంభంలో కొంచం కన్ఫ్యూసింగ్ గానే ఉంటుంది.. మెయిల్ ఐడీ పంపండి.. వివరంగా మెయిల్ రాస్తాను..
  @వెంకటరమణ: నిజమండీ.. నాక్కూడా 'పడవ ప్రయాణం' బాగా ఇష్టం.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 13. @మధురవాణి: మొదలు పెడితే ఎంతసేపు చెప్పండి? ..ధన్యవాదాలు.
  @వీరుభొట్ల వెంకట గణేష్: తప్పక చదవండి అయితే.. సాహిత్యం చదవడానికి మంచి ప్రారంభం అవుతుంది మీకు.. ధన్యవాదాలు.
  @జయ: మీకు తిలక్ కథలు నచ్చితే ఈ పుస్తకం తప్పక నచ్చుతుంది.. ఈసారి మిస్సవ్వకండి.. ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: ఎదురు చూస్తూ... ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 14. పాలగుమ్మి గారి కధలన్ని బాగుంటాయి. నా దగ్గర ఆయన కధా సంపుటాలు వున్నాయి. బాగుందండి పరిచయం యధా విధి గా. :-)

  రిప్లయితొలగించు
 15. @భావన: కథలతో పాటు ఆయన ఇతర రచనలన్నీ 'విశాలాంధ్ర' వాళ్ళు మళ్ళీ ప్రచురిస్తున్నారండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 16. ఓ మంచి సినిమా..., ఓ మహానటి.., ఓ గొప్ప దృశ్యకావ్యం.., అంతకన్నా అద్బుంగా చెప్పిన విదానం బహుబాగుగా ఉన్నది.. ఓఇంటర్వూ కొసమని అంజలీదేవి గారిని కలిసి మాట్లాడినపుడు ఈ చిత్రం ప్రస్తావన వచినపుడు ఆమెలో ఆనందం మాటల్లో చెప్పలేనిది ..

  రిప్లయితొలగించు