మంగళవారం, జనవరి 26, 2010

శంభో..శివ శంభో...

విజయవంతమైన తమిళ సినిమా 'నాడోడిగళ్' కి తెలుగు రీమేక్ 'శంభో..శివ శంభో..' సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో, మిగిలిన రెండింటితో పోలిస్తే ప్రచారంలో ఒకింత వెనుకబడిన సినిమా అయినా, నేను మొదటగా చూద్దామనుకున్నది ఈ సినిమానే. కొంచం ఆలస్యంగా చూడగలిగాను. స్టార్ హీరో అన్నీ తానై సినిమాని తన భుజాల మీద మోస్తున్న ప్రస్తుత ట్రెండ్ కి భిన్నంగా ఈ సినిమాలో ముగ్గురు కథానాయకులు ఉన్నారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా ఒక్క డ్యూయట్టూ లేదు.. ఈ సినిమా కథే వేరు.

ఓ పిల్లా పిల్లాడూ ప్రేమించుకోడం, రెండువైపుల పెద్ద వాళ్ళూ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోక పోవడం, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ స్నేహం కోసం, ప్రేమని గెలిపించడం కోసం అన్నీ తామే అయ్యి వాళ్ళ పెళ్లి జరిపించడం అన్నది గత పడి, పన్నెండేళ్ళుగా తెలుగు సినిమాల్లో బాగా నలిగిన ఫార్ములా. ఇంత మంది, ఇన్ని త్యాగాలు చేసి పెళ్లి జరిపిస్తే, ఆ జంట సవ్యంగా కాపురం చేస్తుందా? పెళ్లి జరిపించిన మిత్రుల పట్ల వాళ్లకి గౌరవం, కృతజ్ఞత ఉంటుందా? సరిగ్గా ఈ పాయింట్
నే పట్టుకుని తమిళ దర్శకుడు సముద్రఖని ఈ తెలుగు సినిమాని తీశారు.

అందరూ కర్ణ అని పిలుచుకునే కరుణాకర్ (రవితేజ) ఆశయం ప్రభుత్వ ఉద్యోగి కావడం. బీయే గోల్డ్ మెడల్ తెచ్చుకుని, సర్విస్ కమిషన్ పరిక్షలు రాస్తూ ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగం ఎందుకంటే అతనికి మామ (తనికెళ్ళ భరణి) కూతురు (ప్రియమణి) అంతే ప్రేమ. ఆ మామకేమో తన అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అవ్వాలని కల. గవర్నమెంట్ జాబ్ చేసేవాదికే తన కూతుర్ని ఇస్తానని తరచూ చెబుతూ ఉంటాడతను. కర్ణ ప్రాణ స్నేహితులు మల్లి (అల్లరి నరేష్), చంద్ర (శివ బాలాజీ). కర్ణ చెల్లెలు పవిత్ర (అభినయ), చంద్ర ప్రేమించుకుంటూ ఉంటారు. చూసీ, చూడనట్టు నటిస్తూ ఉంటాడు కర్ణ.

మాజీ ఎంపీ భవాని (రోజా) కొడుకు సంతోష్ ('వినాయకుడు' ఫేం అల్తాఫ్). ఇతను కర్నూల్ ఫ్యాక్షనిస్ట్ నరసింహా రెడ్డి (ముఖేష్ రుషి) కూతురితో ప్రేమలో పడతాడు. ఇరువైపులా పెద్దలూ రాజకీయ కక్షల వల్ల పెళ్ళికి అంగీకరించారు. తమ పెళ్లి జరిపించాల్సిందిగా ప్రాణ స్నేహితుడు కర్ణ ని కోరతాడు సంతోష్. కర్ణ తన స్నేహితులతో కలిసి హీరోచితంగా సీమకి వెళ్లి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి సంతోష్ తో పెళ్లి జరిపిస్తాడు. ఇందుకోసం చంద్ర ఒక కాలినీ, మల్లి తన వినికిడి శక్తినీ 'త్యాగం' చేయాల్సి వస్తుంది. కర్ణ పోలీసు కేసులో ఇరుక్కుని గవర్నమెంట్ జాబ్ కి పనికి రాకుండా పోతాడు. తర్వాత ఏం జరిగిందన్నదే అసలు కథ.

సినిమా చూస్తున్నంతసేపూ తెలుగు నటులంతా తమిళంలో నటిస్తున్నట్టు అనిపించింది. ఇంకొంచం వివరంగా చెప్పాలంటే, తమిళ దర్శకుడు, తమిళ కథకి తెలుగు నటులని ఎంచుకుని, రాజమండ్రి, కర్నూలులో తమిళ సినిమా తీసి దానిని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసినట్టుగా ఉందీ సినిమా. ఒక్కమాటలో సినిమాకి నేటివిటీ లోపించింది. చూస్తున్నంతసేపూ ఎక్కడా ఇది మన పక్కన జరుగుతున్న కథ అన్న భావన కలుగలేదు. నటీనటుల ఆహార్యం, మాటలు, పాటలు, చివరికి కృష్ణ భగవాన్ మీద పెట్టిన కామెడీ ట్రాక్ కూడా తమిళ వాసనే కొట్టింది.

యువకుడిగా కనిపించడం కోసం రవితేజ బానే చిక్కాడు కానీ, అతను పరిక్షలు రాయడం లాంటివి అసహజంగా అనిపించాయి. రవితేజ కి భిన్నంగా శివబాలాజీ కొంచం (బాగానే) వొళ్ళు చేశాడు. మరికొంచం వొళ్ళు చేయకుండా జాగ్రత్త పడాలి. ముగ్గురు హీరోల్లోనూ మంచి మార్కులు కొట్టేసినవాడు అల్లరి నరేష్. దర్శకుడు కనుక మల్లి పాత్రను తీర్చి దిద్దడం మీద మరికొంచం శ్రద్ధ పెట్టి ఉంటే ఈ పాత్ర నరేష్ కి మరో 'గాలి శీను' పాత్ర అయి ఉండేది.

ప్రియమణి తక్కువ మేకప్ తో కనిపించింది కానీ, నటించడానికి పెద్దగా ఏమీ లేని పాత్ర. వినికిడి శక్తి లేని, మాట్లాడలేని అమ్మాయి అభినయ పవిత్ర పాత్ర బాగా చేసింది. రెండు మూడు మంచి సన్నివేశాలు దొరికాయి ఈ అమ్మాయికి. రాజకీయ నాయకురాలి పాత్రలో రోజాని చూసినప్పుడు, ఒక మహిళా నేతని అనుకరించే ప్రయత్నం చేసిందని అనిపించింది. ఆహుతి ప్రసాద్, సుధా లవి రొటీన్ తల్లిదండ్రుల పాత్రలు కాగా, రాధాకుమారి అంతగా ప్రాధాన్యం లేని నాయనమ్మ పాత్రలో కనిపించింది. టీవీ నటిగా స్థిరపడ్డ ఒకప్పటి సిని నటి కిన్నెర తనికెళ్ళ భరణి భార్యగా ఒక్క డైలాగూ లేని పాత్రలో నటించింది.

కృష్ణ భగవాన్ మీద తీసిన కామెడీ ట్రాక్ ప్రస్తుత 'పబ్లిసిటీ రాజకీయాల' మీద మంచి సెటైర్.. ముఖ్యంగా అతని మీద తీసిన 'రాజువయ్యా.. మహ రాజువయ్యా..' బిట్ థియేటర్ మొత్తాన్ని నవ్వించింది. హీరోల కర్నూలు స్నేహితుడిగా సునీల్ తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఎల్బీ శ్రీరామ్ ది బొత్తిగా ప్రాధాన్యత లేని పాత్ర. కోటి తండ్రిగా కోట బాగా చేశాడు. నటీ నటులెవ్వరినీ దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదనిపించింది.

దర్శకత్వం గురించి చెప్పాలంటే.. సముద్రఖని తెలుగు నేటివిటీని అర్ధం చేసుకుని ఉంటే బాగుండేది. కథని స్ట్రెయిట్ నేరేషన్ లో చెప్పడం వల్ల మొదటి సగం చాలా నెమ్మదిగానూ, రెండో సగం హడావిడిగానూ సాగిపోయినట్టు అనిపించింది. ప్రేమ గురించీ, స్నేహం గురించీ రవితేజ, రావు రమేష్ ల చేత చెప్పించిన 'పవర్ఫుల్' డైలాగులు సినిమాలో నాటకీయతని పెంచాయి. రావు రమేష్ ప్రేమ సలహాలిచ్చే పాత్రలు తగ్గించుకోక పోతే ఒక బ్రాండ్ పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అంగ వికలుర చేత హాస్యం పుట్టించడాన్ని ఇంకా ఎన్నాళ్ళు చూడాలో ఏమిటో.

ముత్తయ్య సినిమాటోగ్రఫీ బాగుంది. సుందర్ సి. బాబు సంగీతాన్ని గురించీ, పాటల గురించీ చెప్పుకోడానికి ఏమీ లేదు. తెలుగు రీమేక్ అనుకునే కన్నా, తమిళ్ డబ్బింగ్ సినిమా అనుకుని చూస్తే బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. సినిమాకీ, టైటిల్ కీ ఉన్న సంబంధం ఏమిటో మాత్రం నాకింకా అర్ధం కాలేదు.

18 కామెంట్‌లు:

 1. hi muraligaru,
  ముందుగ happy republic day. ఇంక మీరు రాసిన పోస్ట్ చదవితే గాని సినిమాలో ఇన్ని లోపాలు ఉన్నయా అని అనిపించలేదు.మీరు చెప్పినవి కరెక్టే ఐన కూడా నేను మటుకు సినిమా చుస్త్తునంతసేపు చాల enjoy చేసననిపించింది.తమిళ్ nativity ఒక్కటే బాగా చూసే ప్రేక్షకుడికి వెంటనే అనిపించే విషయమేమో.కానీ నేను చాల రోజుల తరువాత మంచి మూవీ చూసాను అనిపించిందండి.

  రిప్లయితొలగించు
 2. నిజమేనండి ఇదంతా అరవ వాసనే అని విన్నా.ఒక్క "అభినయ" అభినయం(పేరుకి తగ్గట్టుగానే)తప్ప.
  ఉన్నోళ్ళంతా ఎదవలయితే మన తెలివితేటలకేం తక్కువా అంటాడు ఎంటీవోడు "గుండమ్మ కధ" సినిమాలో రమణారెడ్డితో.
  మన తెలుగు సినిమా పరిస్థితిని,ఈ అరవ వాసనని చూస్తుంటే అదే గుర్తొస్తోంది నాకు.

  రిప్లయితొలగించు
 3. కరెక్ట్ గా చెప్పారండి. సినిమా మొత్తం తమిళ వాసనలే కనిపిస్తాయి

  రిప్లయితొలగించు
 4. ఒక రకంగా అనుకోవాలంటే తెలుగు పరిశ్రమలో తెలుగు దర్శకులు, తెలుగు నటీనటులతో తీయడానికి సాహసించని కాన్స్పెప్ట్ ని ఒక తమిళ దర్శకుడు, అదీ తెలుగులో తన మొదటి సినిమాని సాహసంతో తీసాడన్నమాట. ఈ మాత్రం గట్స్ మన దర్శకులకు ఎప్పుడొస్తుందో మరి!!
  >>>అంగ వికలుర చేత హాస్యం పుట్టించడాన్ని ఇంకా ఎన్నాళ్ళు చూడాలో ఏమిటో..
  మన సెన్సార్ బోర్డులో పనీ పాట లేని వాళ్ళు మాత్రమే మెంబర్లుగా ఉన్నంతకాలం మనకీ దౌర్భాగ్యం తప్పదేమోనండీ..

  రిప్లయితొలగించు
 5. tamila vaasanalaaa?


  telugu vaasanalu anni unna gopi gopika godari yemayyindi:D

  only actions undatame tamila vasanalu ante elaa?

  ila ayithe mana telugu netivity lo , ee cinima type lo unna manchi cinima cheppukondi chooddam?


  story ne tamila vasanalatho unnadi....endukante aa feelings telugollaki undav:P

  రిప్లయితొలగించు
 6. థ్యాంక్స్ అండి చెప్పి బతికించారు. డీవీడీ తప్ప సినిమా హాల్ కోసం ఎదురు చూడం.

  రిప్లయితొలగించు
 7. సమీక్ష తృప్తికరంగా ఉంది. మీరన్నట్లు తమిళ్ సినిమా డబ్బింగ్ చూస్తున్నామనుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. వైవిధ్యమైన కధే ఈ సినిమాకు ప్రాణం. కధ ముగింపు చెప్పకుండా ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెంచారు. అభినందనలు. మీరు నవతరంగంలో సమీక్షలు చెయ్యగలరు.

  రిప్లయితొలగించు
 8. నాకెందుకో ట్రైలెర్ చూస్తేనే సినిమా చూడక్కర్లేదు కాదు చూడకూడదు అనిపించింది. నాకు తమిళ్ డబ్బింగ్ లాగానే కనపడింది రీమేక్ అయినా కూడా. అంత తమిళ్ నేటివిటీ తట్టుకోవడం నా వల్ల కాదు.


  "నేను మొదటగా చూద్దామనుకున్నది ఈ సినిమానే" ఇది చదవగానే షాక్ తిన్నాను :).

  రిప్లయితొలగించు
 9. అభినయ గురించి ఈ మధ్య టి.వి. లో చాలా ఇంటెర్వ్యూలే చూసాను. ఆ అమ్మయి నిజ జీవితమే ఈ సినిమాలో కూడా పాత్రన్నమాట. అమ్మయి చాలా బాగుంది. సినిమా చూడాలి. సమీక్ష బాగుంది.

  రిప్లయితొలగించు
 10. నేను ఈ సినిమా మొన్న వీకెండ్ లో చూద్దాం అనుకున్నా కాని... టికెట్స్ అయిపోయాయి.
  ఈ సారి వీకెండ్ లో అయినా చూడాలి అనుకుంటున్నాను. ఎలాగూ చూడాలి కదా అని... మీ టపా చదవకూడదు అనుకున్నాను. ఎందుకంటే reviews చదివెసి ఆ impressions తో సినిమా చూడటం నాకు నచ్చదు. కానీ చూస్తూ చూస్తూ చదవకుండా ఆగటం భలే కష్టం సుమీ!

  రిప్లయితొలగించు
 11. ఈ సినిమా నేనూ చూశాను అప్పటికే అభినయ గురించి పత్రికలో చదివి ఆ అమ్మాయి ఎలా నటించిందో చూద్దామని వెళ్ళా ...సినిమాకి సంపూర్ణమైన ముగింపు ఏ పాత్రవైపునుండి కూడా ఇవ్వలేదనిపించింది .చివరికి మీ టపా చివరలో మీరువెలిబుచ్చిన సందేహమే నాకూ కలిగింది .

  రిప్లయితొలగించు
 12. మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ www.jeevanianantapur.org ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.
  kathasv@gmail.com
  jeevani.sv@gmail.com

  మీ,

  జీవని.

  రిప్లయితొలగించు
 13. @స్వాతి మాధవ్: లోపాలు వెతకడం నా ఉద్దేశ్యం కాదండీ.. ఇంకొంచం జాగ్రత్తలు తీసుకుని ఉంటే మంచి సినిమా అయ్యి ఉండేది కదా అనిపించి రాశాను.. ధన్యవాదాలండీ..
  @శ్రీనివాస్ పప్పు: అన్నగారు ఏంటో ముందు చూపుతో చెప్పారనిపిస్తుందండి ఆ డైలాగు.. ధన్యవాదాలు.
  @నెలబాలుడు: ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 14. @శేఖర్ పెద్దగోపు: మంచి కాన్సెప్ట్, అసంతృప్తి కరమైన టేకింగ్ అండి.. ధన్యవాదాలు.
  @Mauli: యాక్షన్ సీన్స్ గురించి నేనసలు ప్రస్తావించలేదు కదండీ.. ధన్యవాదాలు.
  @భావన: చూడొద్దని కాదండీ. కొంచం ప్రిపేరై చూడమని... ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 15. @cbrao: నేను 'నవతరంగం' కి రాయడం మొదలు పెట్టి, ఆ తర్వాతే బ్లాగుల్లోకి వచ్చానండీ.. ధన్యవాదాలు.
  @వాసు: నాకు స్టార్లు, వారసుల సినిమాలంటే కొంచం భయమండీ.. మరీ తప్పనిసరి అయితే తప్ప చూడను.. ధన్యవాదాలు.
  @జయ: మీరు పొరబడ్డారండీ.. అభినయ నిజజీవిత పాత్ర కాదు.. సినిమాలో 'పవిత్ర' మామూలు అమ్మాయే.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 16. @చైతన్య: చూసి మీ అభిప్రాయం రాయండి.. ధన్యవాదాలు.
  @పరిమళం: చూసేశారన్న మాట ఐతే.. ధన్యవాదాలండీ..
  @జీవని: అయ్యో.. క్షమాపణలు ఎందుకండీ.. మంచి పని కోసం నడుపుతున్న వెబ్ సైట్ మీది.. నావరకు, మీరు టెంప్లేట్ మార్చాలండీ మొదట..

  రిప్లయితొలగించు
 17. ఈ సినిమా నేను తమిళ్ లొ చూసా .. బాగానే వుంది... తమిళ్ నుండి తెలుగు నేటివిటికి మార్చేసరికి కొంత ఎమొషన్ మిస్స్ అయ్యి తెలుగులొ అంత బాలేదు..ఉదా: ఇందులొ ముగ్గురు హీరొలు ఎదొ ఒకటి కొల్పొతారు కదా.. తమిళ్ లొ హీరొ (రవి తెజ పాత్రదారి ) హీరొయిన్ (ప్రియమణి) ని కొల్పొతాడు.. హీరొయిన్ వాళ్ళ తండ్రి వెరె పెళ్ళి చెస్తాడు (గవర్న్మెంట్ ఉద్యొగితొ) ..తెలుగులొ అలా ఎక్కదు కాబట్టి ..రవితెజ అమ్మమ్మ ని చంపినట్టు పెట్టాడు..

  రిప్లయితొలగించు
 18. @మంచుపల్లకీ: తెలుగుకి వచ్చేసరికి హీరోల ఇమేజ్ దృష్టిలో పెట్టుకున్నట్టు ఉన్నారండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు