బుధవారం, ఏప్రిల్ 08, 2009

మాంద్యమేనా?

ఎండ భయంకరంగా కాస్తున్న మిట్ట మద్యాహ్నం వేళ బయటికి వెళ్ళాల్సి వచ్చింది. పోస్టాఫీస్ లో కొంచం పని పడి. ఇదే పని కోసం ఇప్పటికి మూడు సార్లు వెళ్లాను. మొదటి సారి టైం అయిపొయింది, రెండోసారి వాళ్లకి సెలవు, మూడోసారి లంచి బ్రేక్. ఇక ఇవాళ ఏమైనా ఆ పని పూర్తి చేయాల్సిందే అని నిర్ణయించుకుని బయట పడ్డా.. చాలా పెద్ద క్యూ ఉంది. కొన్ని లోకల్ కొరియర్లు మూత పడడంతో పోస్టాఫీస్ వాళ్లకి పని పెరిగిందిట. హమ్మయ్య నా పని పూర్తయ్యింది. ఇంతలొ రెండు మూడు రోజులుగా సూపర్ మార్కెట్ పని పెండింగ్ లో ఉన్నవిషయం గుర్తొచ్చింది. తిరిగొస్తూ అక్కడికి వెళ్లాను.

నిజానికి నేను ఎప్పుడూ వెళ్ళే సూపర్ మార్కెట్ వేరు. అక్కడి ప్రతి సెక్షనూ నాకు పరిచయం. అక్కడ ఏ వస్తువు ఏ చోట ఉంటుందో స్టాఫ్ కన్నా నాకు బాగా తెలుసు. అక్కడి వస్తువుల క్వాలిటీ గురించి మిత్రులకి వర్ణించి చెప్పేవాడిని. కొందరు నవ్వేవారు కూడా. ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్న ఆ సూపర్ మార్కెట్ మూడు నెలల క్రితం మూత పడింది. దానితో పాటు మరో రెండు మార్కెట్లు కూడా శాశ్వతంగా మూత పడ్డాయి, ఆర్ధిక మాంద్యం దెబ్బకి.. అలవాటైన మార్కెట్ ని వదల్లేక పోయినా, చేసేది లేక ప్రత్యామ్నాయం వెతుకున్నాం నా లాంటి వాళ్ళం.

కలర్ సోడా (సాఫ్ట్ డ్రింక్) నుంచి కలర్ టీవీ వరకూ దొరికే ఈ సూపర్ మార్కెట్లో పెద్దగా జనం లేరు.. మార్కెట్ వాళ్ళేమో రకరకాలు ఆఫర్లు ప్రకటించారు. నా పాత సూపెర్ మార్కెట్ స్టాఫ్ నలుగురైదుగురు కనిపించారు.. కొంచం సంతోషం అనిపించింది. ఓ అబ్బాయి నాకు సాయం చేస్తూనే రహస్యంగా చెప్పాడు 'ఇక్కడ కూడా సేల్స్ పెద్దగా లేవు సార్..' అతని కళ్ళల్లో ఉద్యోగం భయం. ఆర్ధిక మాంద్యం ప్రభావం మరీ ఇంతగా ఉందా? అనిపించింది. సీజన్ ఐపోయాక కూడా కనిపిస్తున్న డిస్కౌంట్ ఆఫర్ బోర్డులు గుర్తొచ్చాయి.

తిరిగి వస్తుండగా దారిలో ట్రాఫిక్ జాం. ఎన్నికల్లో నిలబడ్డ ఓ మహా నాయకుడి ర్యాలీ. ఎయిర్ కండిషన్డ్ వాహనం టాప్ మీద మెడ నిండా దండలతో నిలబడ్డ సదరు నాయకుడు, ఎండనీ, ట్రాఫిక్ నీ, నాయకుడినీ కలిపి తిట్టుకుంటున్న జనమందరికీ అభివాదం చేస్తూ సాగుతున్నాడు. పార్టీ జెండాలు పట్టుకుని వందలాది మంది 'కార్యకర్తలు' జీపుల్లోనూ, మోటార్ సైకిళ్ళ మీదా అనుసరిస్తున్నారు. 'కనీసం మనిషికి వంద రూపాయలు అనుకున్నా.. మొత్తం ఎంత అవుతుంది.. వీళ్ళందరికీ భోజనాలు, ఇతర ఖర్చులు...' నేను మనసులో లెక్కేస్తున్నాను.

సాయంత్రం మిత్రులని కలిసినప్పుడు 'నానో' కార్ల గురించి చర్చ. నాలుగు వేలు అడ్వాన్సు కట్టిన వాళ్లకి టోకెన్ నెంబర్ ఇస్తున్నారట. కార్లు రాగానే టోకెన్ నంబర్ల వారీగా పంపిణీ చేస్తారట. మోడళ్ళు, రంగులు, ఫీచర్ల గురించి వివరిస్తూ మిత్రుడు అన్నాడు 'మిడిల్ క్లాస్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుందట..అందరూ క్యూ లో నిలబడి అడ్వాన్సు లు కడుతున్నారట..ఓవరాల్ గా నానో క్లిక్ అయినట్టే.. '

ఉదయం నుంచీ జరిగినవన్నీ గుర్తుచేసుకుంటే నాకు ఒకటే సందేహం.. ఇంతకీ ఆర్ధిక మాంద్యం ప్రభావం ఉన్నట్టా, లేనట్టా?

9 కామెంట్‌లు:

  1. నాకు ఆర్ధిక మాంద్యం వుందో లేదో అర్ధం కాలేదు కాని మీ పాత సూపర్ మార్కెట్ వాళ్ళు కనబడగానే చాల ఆనందం గా వున్నారని అర్ధం అవ్వింది ,అందుకే పంచుకోవడానికి టపా పెట్టేసారని అర్ధం అవ్వింది .ఇంతకి కావలసినవాళ్ళు కనబడ్డారా? లేదా?

    రిప్లయితొలగించండి
  2. మురళిగారు,
    అసలు మీకెందుకండి ఆ సందేహం వచ్చింది?? రాజకీయ నాయకుడు అంతమంది కార్యకర్తలకు మాంద్యం టైం లో డబ్బులు ఎలా ఇచ్చున్టాడన మీ అనుమానం?....ఒక వేళ ప్రపంచం అంతా తీవ్ర సంక్షోభంలో ఉన్నాసారే తన ఎ సి రూంలో కూర్చొని బి ఎం డబ్ల్యు కారు బుక్ చేసుకునే సత్తా వున్నోల్లు మన నాయకులు....

    చాలా సూపర్ మార్కెట్లపై ఆర్దిక మాంద్యం ప్రభావం పడటం స్పష్టంగా తెలుస్తుంది.

    ఇక నానో బుకింగ్స్ విషయానికి వస్తే మధ్య తరగతి వాళ్ళు డబ్బు ఖర్చుపెట్టడంలో కాస్తా ఆచి తూచి అడుగు వేస్తారు కదా...ఆ ముందు చూపే ఇప్పుడు వాళ్ళు దర్జాగా నానో బుక్చేసుకునేటట్టు చేసింది అనుకుంటా.....

    రిప్లయితొలగించండి
  3. ఉన్నట్టు, లేనట్టు. అదెలా అని అడక్కండి. :):)

    రిప్లయితొలగించండి
  4. ఈ ఆర్ధిక మాంద్యం పుణ్యమాని నేనొక విషయం గమనించాను. పేపరుమీద అంకెలెలా ఉన్నా జనాల మెదళ్ళలో మాత్రం ఆ భయం భయంకరంగా నాటుకుంటోంది. చలామణిలో ఉన్న మాంద్యం కన్నా ఓ పదింతలు పెరిగేలా ఈ భయాందోళనలు మరింత ఆజ్యం పోస్తున్నాయేమోనని అనిపిస్తోంది..

    రిప్లయితొలగించండి
  5. నాకు మొన్నామధ్య ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.. కొంచెం పని ఉండి, విజయవాడ లో వన్-టౌన్(విజయవాడ లో షాపింగ్ కి పెట్టింది పేరు) కి వెళ్ళాను.. ఆర్ధిక మాంద్యం కదా, జనాలు తక్కువగా ఉంటారేమొ అనుకుంటూ వెళ్ళా.. తీరా చూస్తే, అక్కడ ఇసకేస్తే, రాలనంత జనం ఉన్నారు.. చిన్న-పెద్ద షాప్ తేడా లేదు, ఫుట్ పాత్- ఎ.సి. షోరూమ్ తేడా లేదు.. ఎక్కడ చూసినా జనం-జనం.. ఒక్కొక్కళ్ళ చేతుల్లో, కనీసం 2/3 బ్యాగులు.. అసలు ఏ షాప్ చూసినా, జనం కిటకిటలాడిపోతున్నారు..!!! అప్పుడు అనిపించింది, ఆర్ధిక మాంద్యం ఎక్కడైనా ఉందేమో కానీ, విజయవాడలో మాత్రం లేదు అని!!!

    రిప్లయితొలగించండి
  6. ఇలా బేతాళ ప్రశ్నలు వేస్తే ఎలా అండి

    రిప్లయితొలగించండి
  7. ఎవరిదో మెయిల్లో సిగ్నేచర్ చూశా .. ఒక వ్యవస్థ నిర్మాణంలో డబ్బు చేసుకోడానికి ఎంత అవకాశం ఉందో, ఒక వ్యవస్థ కూలిపోతున్నప్పుడు కూడా అంతే అవకాశం ఉందని. సోవియట్ రాజ్యం పునాదుల్తో కదిల్నప్పుడు అదనుచూసి బిలియన్లు పండించుకున్న మారాజులకి తెల్సు ఈ రహస్యం. ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ వంతు. ఎప్పుడైనా కూలేది కూలోడే, సేఠు కాదు!

    రిప్లయితొలగించండి
  8. @చిన్ని: ధన్యవాదాలు.. 'కావాల్సిన వాళ్ళు..?' అర్ధం కాలేదండి..
    @శేఖర్ పెద్దగోపు: నిజమేనండి.. మన నాయకులు ఏమైనా చేయగలరు. 'కొత్తొక వింత' అన్నది కూడా మధ్యతరగతికి బాగా వర్తిస్తుందేమో అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలు.
    @భాస్కర్ రామరాజు: అడగోద్దన్నారు కదా.. ఇక అడగను:) ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: గడిచిన దశాబ్ద కాలంగా వ్యవసాయ రంగం ఎదుర్కొన్న సంక్షోభం ఫలితమే ఈ మాంద్యం అనిపిస్తోందండి.. ఒక్క ఇండియా నే కాదు, ప్రపంచ వ్యాప్తంగా.. జాగ్రత్త పడడం మంచిదే కదా.. ధన్యవాదాలు.
    @మేధ: కొన్ని విషయాల్లో చాలా కలిక్యులేటేడ్ గా ఉండే జనం, మరికొన్ని చోట్ల అనాలోచితంగా ఖర్చు పెట్టేస్తారేమో అనిపిస్తుందండీ.. ఇలాంటివి చూసినప్పుడు. ధన్యవాదాలు.
    @నేస్తం: అంతే అంటారా? ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: కూలోడికి కూల్చడం రాదు కదండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. ఆర్ధిక మాంద్యం అనేది నల్ల దబ్బు కి వర్తించదు. గమనించండి.

    రిప్లయితొలగించండి