శనివారం, ఏప్రిల్ 11, 2009

నాయికలు-రాజమ్మ

అందంగా పుట్టడం అన్నది ఏ ఆడపిల్లకైనా శాపం అవుతుందా? రాజమ్మకి మాత్రం ఆమె అందమే శాపమైంది. కాపురంలో కలతలకి కారణమయ్యింది. ఏ కొడుకు కోసం తాను బతకాలనుకుందో అదే కొడుకుని ఆమెకి దూరం చేసింది. జైలు గోడల మధ్య ఆమె తనను ఉరి తీయమనేలా (హేంగ్ మీ క్విక్) చేసింది. బీనాదేవి రాసిన 'పుణ్యభూమీ కళ్ళుతెరు' నవలలో నాయిక రాజమ్మ.

పట్టపు రాణి సరదాగా బీద వేషం వేసుకున్నట్టు ఉండే రాజమ్మది ఉత్తరాంధ్రలో ఓ పల్లెటూరు. కూటికి పేదలైనా కులానికి కాదు. ఆమె ఉయ్యాలలో ఉన్నప్పుడే మామ సింహాచలం తో పెళ్లి నిశ్చయమై పోయింది. ఈడేరిన రాజమ్మ, తన తల్లికి బదులుగా బుగత గారింట్లో పనిసాయానికి వెళ్ళింది.

బుగత గారబ్బాయి రాజమ్మ చేతిలో అర్ధరూపాయి పెట్టి, ఆమె బుగ్గ కొరికేస్తే తోక తొక్కినా తాచులా లేచిన రాజమ్మ అతని డబ్బు అతని మొఖాన కొట్టి ఇంటికి తిరిగొచ్చింది. కందిన బుగ్గ చూసిన తల్లి రాజమ్మనే తప్పు పట్టింది.. ఆమె చెప్పేది వినకుండా వీపు చిట్లకొట్టింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.

సింహాచలాన్ని పెళ్ళాడి, ఓ కొడుక్కి తల్లైంది రాజమ్మ. ఆర్ధిక సమస్యలతో పొలాన్ని పోగొట్టుకున్నాడు సింహాచలం. తప్పని పరిస్థితుల్లో కూలిపనికి వెళ్ళిన రాజమ్మ, అక్కడి మేస్త్రి ప్రవర్తన కారణంగా పనిలో సాగలేక పోతుంది. పల్లెటూళ్ళో బతుకు తెరువు లేక కుటుంబాన్ని పట్నానికి మారుస్తాడు సింహాచలం. చేయి పట్టుకున్న స్టూడెంటు కుర్రాళ్ళు, శీలాన్ని గురించి చెడుగా మాట్లాడిన ఓ ఇంటి యజమానురాలు.. ఇలా అక్కడా చేదు అనుభవాలే ఆమెకి.

అద్దె రిక్షా తో జీవనోపాధి వెతుక్కున్న సింహాచలం ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన గొడవలో కాలు పోగొట్టుకుంటాడు. పార్టీ వాళ్ళు చేసిన సాయంతో ఆస్పత్రి ఖర్చులు, ఓ మూడు నెలలు కుటుంబ ఖర్చులు గడుస్తాయి. ఓ కాలేజి ప్రిన్సిపాల్ గారింట్లో పనికి చేరిన రాజమ్మ వాళ్లకి తలలో నాలుకలా మారుతుంది.

మరోపక్క కుంటికాలితో ఇంటికే పరిమితమైన సింహాచలం రాజమ్మని అనుమానిస్తూ, ఆమెకి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లో యజమానురాలు ఆత్మహత్య చేసుకోవడంతో, రాజమ్మ మీద హత్యానేరం పడుతుంది. హత్య చేసినదాన్ని తన ఇంట్లో పెట్టుకోనంటాడు సింహాచలం. తనని కేసునుంచి విడిపించిన ప్రిన్సిపాల్ బాబుకి లొంగిపోతుంది రాజమ్మ.

సింహాచలం, కొడుకు జ్వరంతో మూసిన కన్ను తెరవడంలేదని తెలుసుకుని, ప్రిన్సిపాల్ జేబులోనుంచి డబ్బు తీసుకుని తన ఇంటికి, అక్కడినుంచి ఆస్ప్రత్రికి పరుగెడుతుంది రాజమ్మ. అప్పుడే పిల్లవాడికి టీబీ ఉందన్న విషయం తెలుస్తుంది. పది రోజుల తర్వాత ప్రిన్సిపాల్ గారింటికి వెళ్ళేసరికి ఇల్లు తాళం వేసి ఉంటుంది.. పిల్లల్ని తీసుకుని ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు.

కొడుకుని బతికించుకోడానికి రాజమ్మకి మిగిలి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఒళ్లమ్ముకోవడం. కొడుకుని చంపుకోలేక అందుకు సిద్ధ పడుతుంది. బ్రోతల్ హౌస్ యజమానురాలు ఆమెనో ఇంగ్లీష్ దొర దగ్గరికి పంపుతుంది. మనశ్శాంతి వెతుక్కుంటూ ఇండియా కి వచ్చిన ఆ దొర, రాజమ్మని తాకనైనా తాకకుండా ఆమెకి డాలర్లు, బహుమతులు ఇచ్చి పంపుతాడు. తెల్లారేసరికి రాజమ్మ ఇంటిముందు పోలీసులు. దొరని హత్య చేసిందనే అభియోగంపై. దొర ఇచ్చిన కానుకలు వాళ్లకి సాక్ష్యంగా పనికొచ్చాయి.

కటకటాల వెనుక ఉన్న రాజమ్మని చూడడానికి వచ్చిన ఆమె రోగిష్టి కొడుకుని బూటు కాలుతో తన్ని వెనక్కి పంపేస్తాడు పోలీసు జవాను. అక్కడినుంచి జైలుకి మారిన రాజమ్మ తన భర్తా, కొడుకు లోకం నిందలు పడలేక ఎక్కడికో వెళ్లిపోయారని తెలుసుకుంటుంది. అప్పుడే దొర దేశం నుంచి ఓ జర్నలిస్టు వస్తాడు. రాజమ్మ చేతిలో చనిపోయిన వాడు తమ దేశం లో గొప్ప వాడనీ, అతన్ని ఎలా చంపిందో తనకి ఇంటర్వ్యూ ఇస్తే ఆమెకి కేసునుంచి బయట పడేందుకు సాయపడతాననీ ప్రతిపాదిస్తాడతను.

వ్యవస్థ ఎలా కుళ్ళి పోతోందో, పేదవాడికి ఏరకమైన అన్యాయాలు జరుగుతున్నాయో వివరిస్తూ రాసిన ఈ నవలలో రచయత (త్రి) (బీనాదేవి అంటే బి. నరసింగ రావు + బాలా త్రిపుర సుందరి దేవి, ఇద్దరూ భార్యాభర్తలు..కలిసి రచనలు చేశారు) అన్ని వ్యవస్థల బోలుతనాన్నీ కళ్ళకు కట్టారు. ఆస్పత్రిలో వైద్యం, కోర్టులో న్యాయం ఎలా అందుతాయో, డబ్బున్న వాళ్ళు తమకి కావాల్సిన వాటిని ఎలా సాధించుకో గలరో వివరించారు.

కష్టాలు భరించీ భరించీ ఓ దశలో తాను స్త్రీననే సంగతి మర్చిపోతుంది రాజమ్మ. ఆకలి కన్నా, సమస్యలకన్నా సింహాచలం తనని అనుమానించడం ఎక్కువ బాధిస్తుంది ఆమెని. సింహాచలం ఎప్పటికైనా తనని అర్ధంచేసుకుంటాడన్న ఆశతో ఉన్న రాజమ్మకి, అతను తనని వదలి ఎక్కడికో వెళ్లి పోయాడన్న వార్త ఓ ఆశనిపాతం. ఇంటర్వ్యూ చేయడానికొచ్చిన జర్నలిస్టుని "మీ డబ్బు వద్దు, మీ బ్రతుకు వద్దు, సేతనైతే సెప్పి ఉరితీయించి పెట్టు బాబూ.." అని అడుగుతుంది.

విశాలాంధ్ర ప్రచురించిన 'పుణ్యభూమీ కళ్ళుతెరు' ప్రస్తుతం మార్కెట్ లో లేదు.

5 వ్యాఖ్యలు:

 1. నవల మొత్తాన్ని ఒకే టపా లో బాగా చెప్పారు. కథ లోని మలుపు కలచివేసింది.
  మురళిగారు నాదొక చిన్న ప్రశ్న, మీ దగ్గర ఎన్ని పుస్తకాలు వున్నాయేమిటి ? :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కొడుకుని బూటు కాలు తో తన్నిన పోలీసు ని తలుచుకుంటే గుండె మండిపోతుంది ...బయటి వ్యవస్థ ఇంతే కదా ప్చ్..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఒక గ్రందాలయమే ఉంది ఉంటుంది . ఏమంటారు మురళి గారు ?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పరిచయం చదవగానే మనసు వికలం అయింది, ఇక అసలు నవల చదివితే ఇంకెలా ఉంటుందో ఊహించగలను.డబ్బులేని వారికి ఆలేమికన్నా ఈ వ్యవస్థ వారి పట్ల ప్రవర్తించే తీరే ఎక్కువ బాధిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @భాస్కర రామిరెడ్డి, చిన్ని, పరిమళం, ఉమాశంకర్: ధన్యవాదాలు. చదవదగ్గ పుస్తకం ఇది. నాదగ్గర చెప్పుకోదగ్గ సంఖ్యలో పుస్తకాలు లేవండి. చిన్నప్పుడే చదవడం మొదలు పెట్టడం, మిస్ కాకూడని పుస్తకాలని సూచించే స్నేహితుల పుణ్యమా అని మంచి పుస్తకాలను చదవగలిగాను.

  ప్రత్యుత్తరంతొలగించు