బుధవారం, ఏప్రిల్ 15, 2009

ధనలక్ష్మి

భార్యా భర్తల్లో, భర్త కన్నా భార్య తెలివైనది ఐతే...? ఆ తెలివి తేటలు కుటుంబానికి ఉపయోగ పడుతున్నప్పటికీ ఆ భర్తలో అసూయని పెంచుతున్నట్టైతే...? తెలివైన ఆ భార్య తనకి వచ్చే సమస్యలని ఎలా పరిష్కరించుకుంటుంది, తను చేయాలనుకున్నవి భర్త చేతే ఎలా చేయిస్తుంది అన్న పాయింట్ ని హాస్యభరితంగా చెబుతూ శ్రీరమణ రాసిన కథ 'ధనలక్ష్మి.'

ఇది ఓ పల్లెటూరి కిరాణా కొట్టు యజమాని ఈశ్వరయ్య గారి పెంపుడు కొడుకు రామాంజనేయులు, అతని భార్య ధనలక్ష్మి ల కథ. కథకుడు, అతని భార్య, పిల్లల విశేషాలూ ఉంటాయి. ఆకుపచ్చ హంబర్ సైకిల్ మీద హైస్కూలుకి వచ్చే రామాంజనేయులంటే ఎంతో ఆరాధన కథకుడికి. చాలా ముభావంగా ఉండే రామాంజనేయులు కథకుడితో మాత్రం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. రామాంజనేయులికి హోం వర్క్ చేసిపెట్టి, నోట్స్ లు రాసిపెట్టి అప్పుడప్పుడు ఆ సైకిల్ మీద రౌండ్లు కొట్టి సంతోషపడుతూ ఉంటాడు కథకుడు.

ఈశ్వరయ్య గారికి అనారోగ్యం చేయడంతో పెంపుడు కొడుకు పెళ్లి కళ్ళారా చూడాలన్న కోరికతో ఎనిమిదో తరగతి చదువుతున్న రామాంజనేయులికి అదే స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ధనలక్ష్మి నిచ్చి పెళ్లి చేసేస్తారు. తీరా పెళ్ళయ్యాక ఈశ్వరయ్యగారు కోలుకుంటారు. రామాంజనేయులు మీద అకాల పెద్దరికం వచ్చిపడుతుంది. ఓ రోజు క్లాసులో సైన్సు మేష్టారు చేసిన అవమానం భరించలేక చదువు మానేస్తాడు రామాంజనేయులు. అతని వెంటే ధనలక్ష్మి.

కొట్లో కుర్రాళ్ళంతా కలిసి దొంగ లెక్కలు రాసి ఆస్తి దోచేశారన్న నిజం ఈశ్వరయ్య గారి మరణం తర్వాత బయట పడుతుంది. వేరే కొట్లో పొట్లాలు కట్టే ఉద్యోగం చేస్తానన్న రామాంజనేయులుని వారించి, తన నగలు తాకట్టు పెట్టి పిండి మర పెట్టిస్తుంది ధనలక్ష్మి. ఇందుకు కథకుడు మాట సాయం చేస్తాడు. ధనలక్ష్మి తెలివి తేటలు, రామాంజనేయులు కష్టం ఫలించి వాళ్ళ వ్యాపారం పుంజుకుంటుంది. వీధి గదిలో కిరాణా కొట్టు తిరిగి మొదలవుతుంది. వాళ్లకి 'ఈశ్వర్' పుడతాడు.

ఊరి చివర ఓ పల్లపు స్థలం కొని దాన్ని గోడౌన్ గా మారుస్తాడు రామాంజనేయులు. ఓ ఎరువుల కంపెనీ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి ఏజెన్సీ ఇస్తారు. అలా 'ఈశ్వర్ ఏజెన్సీస్' వెలుస్తుంది. రాజీవ్ గాంధీ హత్య తర్వాత, రైల్లో రావాల్సిన ఎరువుల లోడు ఆలస్యం కావడం తో రేటు బాగా పెరిగి విపరీతంగా లాభాలు వస్తాయి. ఎనిమిదో తరగతికి వచ్చిన ఈశ్వర బాబుని పట్నంలో చదివించాలని ధనలక్ష్మి కోరిక. తామూ ఉప్పు, చింతపండు అమ్మితే తన కొడుకు ఏ,బీ,సీడీలు అమ్మాలంటుంది.

'చదువుకొని మేమేం సాధించాం, చదువుకోక మా రామాంజనేయులు ఏం చేదు మేశాడని' అడిగిన కథకుడితో ధనలక్ష్మి ఇలా అంటుంది: "అన్నయ్యా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. తోడ బుట్టిన లాంటి వాడివి కనక చెబుతున్నా. అన్నిత్తో నా మాటే నేగ్గుతోందని తెగ ఉక్రోస పడి పోతున్నాడు. పనిగట్టుకుని కుళ్ళు మాటలు అంటాడు. అన్నీఉండి సంసారంలో సుకం లేకపోతె ఏంటి లాబం? కాపరం అన్నాక తగ్గూ మొగ్గూ ఉంటే సర్దుకు పోవాలి గండా.. లక్క బంగారం అంటి పెట్టుకుని ఉంటేనే తాళి బొట్టు నిండుగా ఉండేది. ఎవరో ఒకరు తగ్గితే పోలా?"

కథకుడు ప్రశ్నార్ధకంగా ముఖం పెడితే ఆమె ఇలా కొనసాగిస్తుంది: "మనసులో పెట్టుకో అన్నయ్యా. చిట్టీ పాడి పాతికవేలు స్థలం వాళ్లకి ఇచ్చా.. ఎంత అవసరానికి అమ్మితే సలీసుగా ఇస్తారా.. ఇదంతా తన తెలివి అని మురిసి పోతున్నాడు. ఆ గుంటలో నన్ను నిలబెట్టి సమాధి చేస్తానన్నాడు మీ ఫ్రెండు. గోడౌను ఆలోచన నాది. కాపరం కోసం ఆ కిరీటం ఆయనకే పెట్టా.. తన తెలివి గుర్తించానని తెగ సంబరపడి పోతున్నాడు లే. పదేళ్ళు ఎనక్కి వెళ్లి పోయాడంటే నమ్ము.."

ఈశ్వరబాబుని పట్నం లో చదివించడానికి రామాంజనేయులు ని ధనలక్ష్మి ఎలా ఒప్పించిందన్నది ఈ కథ ముగింపు. 'నవోదయ' ప్రచురించిన 'మిధునం' కథల సంపుటి లోదీ కథ. శ్రీరమణ రాసిన 'షోడా నాయుడు' కథ గురించి పరిచయం ఉమాశంకర్ గారి 'అనంతం' బ్లాగులోనూ, 'మిధునం' కథ ఆధారంగా తీసిన మళయాళ సినిమా 'ఒరు చెరు పుంచిరి గురించి 'నవతరంగం' లోనూ చూడొచ్చు.

6 వ్యాఖ్యలు:

 1. మురళి గారు, ఎన్నో విన్నూత్న కధలను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.. అదే పెద్దమనసుతో ఒక సాయం చేయగలరా? వీలైతేనే! మీ దగ్గర ఈ కధల ప్రింట్ కాపీ ఉంటే దయచేసి స్కాన్ చేసి మీ బ్లాగ్ లో పెట్టగలరా?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మురళి గారూ,

  మీకిది భావ్యమా? ఇప్పుడీ కథ ఎక్కడని వెతకను? :(

  సరదాగా అన్నానులెండి. "మిథునం" సంకలనాన్ని నా ఫ్రెండొకడు ఇండియానుంచొస్తూ తెస్తున్నాడు ఈరోజే. అందులో అన్ని కథలూ ఆణిముత్యాలని విన్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అవును ధనలక్ష్మి మంచి తెలివైన భార్య. ఈ రోజులలో ఇలాంటి తెలివే కావాలి అనిపిస్తుంది ఆ కథ చదువుతుంటే.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. :)

  భార్యా భర్తల్లో, భర్త కన్నా భార్య తెలివైనది ఐతే...? ఆ తెలివి తేటలు కుటుంబానికి ఉపయోగ పడుతున్నప్పటికీ ఆ భర్తలో అసూయని పెంచుతున్నట్టైతే...? - When I read these two lines in koodali, instant response was.. "Go.. read sri ramana's dhanalaxmi. You'll have your answers". To comment the same when I came here, the rest of the lines completed the story.

  Nice post!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. "మనసులో పెట్టుకో అన్నయ్యా. చిట్టీ పాడి పాతికవేలు స్థలం వాళ్లకి ఇచ్చా.. ఎంత అవసరానికి అమ్మితే సలీసుగా ఇస్తారా.. ఇదంతా తన తెలివి అని మురిసి పోతున్నాడు. ఆ గుంటలో నన్ను నిలబెట్టి సమాధి చేస్తానన్నాడు మీ ఫ్రెండు. గోడౌను ఆలోచన నాది. కాపరం కోసం ఆ కిరీటం ఆయనకే పెట్టా.. తన తెలివి గుర్తించానని తెగ సంబరపడి పోతున్నాడు లే. పదేళ్ళు ఎనక్కి వెళ్లి పోయాడంటే నమ్ము.."

  iDE Baaryala daggara vuMDE kiTuku ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @నిషిగంధ: కాపీ రైట్ సమస్యలు ఉంటాయనుకుంటానండి.. ధన్యవాదాలు.
  @ఉమాశంకర్: సో, 'మిధునం' గురించి ఒక టపా మీ బ్లాగులో చదవ బోతున్నామన్న మాట.. ధన్యవాదాలు.
  @సిరిసిరి మువ్వ, పూర్ణిమ, భాస్కర రామిరెడ్డి: ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు