శుక్రవారం, ఏప్రిల్ 03, 2009

నాయికలు-మందాకిని

తూర్పున వెలుగు రేకలు విచ్చుకో బోతున్న వేళ కళ్ళాపి జల్లిన వాకిట్లో ఓ అందమైన పడతి తన పొడవాటి జడను వెనక్కి తోసుకుంటూ శ్రద్ధగా ముగ్గేస్తూ ఉంటే .. కేవలం ఆమెని, ఆమె ముగ్గునీ చూడడం కోసమే రాత్రంతా నిద్ర మేల్కొని ఎదురు చూసిన ఓ పదహారేళ్ళ కుర్రాడు ఇంటి అరుగు మీద కూర్చుని ఆమెనే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటే.. ముగ్గు పూర్తి చేసి అలసటగా తనవైపు చూసిన ఆమెని అతను కళ్ళతోనే అభినందిస్తే.. అతని పేరు కచ్చితంగా సోమయాజి.. సరైన సమయంలో అతని జీవితం లో అడుగుపెట్టి, పక్కదారి పట్టబోతున్న ఆ కుర్రాడిని సరైన దారిలో నడిపించిన ఆమె 'మందాకిని' కాక మరెవరు?

జీవితాన్ని గురించి అందమైన కలలు కన్నది మందాకిని . పుట్టింది సంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలో అయినా, తండ్రి ప్రోత్సాహంతో చదువుకుంది ఆమె. కేవలం బడి చదువే కాదు, కావ్య గ్రంధాలలో ప్రపంచాన్నీ చదివింది. ఆమెకి పాడడం తెలుసు, చిత్రలేఖనం లోనూ అభినివేశం ఉంది. ఓ అందమైన పొదరింట్లో తను, తనని అర్ధం చేసుకునే భర్త .. ఇది మందాకిని కల. ఫుట్ బాల్ ఆటగాడు, ఓ చిరుద్యోగి ఐన సుబ్బారావుతో వివాహమైంది ఆమెకి.. "రాముడు పేరేం బాగుంది.. అయినా సీత పెళ్లి చేసుకోలేదూ.." అనుకుంటుంది మందాకిని.

తను కలగన్న జీవితానికి, వాస్తవానికి మధ్య పూడ్చలేనంత అగాధం ఉన్నదని తెలిసేసరికి జీవితం పట్ల ఓ నిర్లిప్తత ఏర్పడి పోతుంది మందాకినికి. సుబ్బారావు చెడ్డవాడేమీ కాదు.. కానీ ఆమె మనసుని అర్ధం చేసుకోలేదు అంతే .. ఓ కొడుకుని కనాలని, వాడిని స్త్రీ మనసు అర్ధం చేసుకునే మగవాడిగా తీర్చిదిద్దాలనీ కోరుకుంటుంది మందాకిని . సరిగ్గా అప్పుడే ఆమెకి సోమయాజి పరిచయమవుతాడు. చిన్నప్పుడే తల్లినీ, తండ్రినీ కోల్పోయిన అతనికి, టీనేజ్ లో తాతయ్యని పోగొట్టుకోవడం ఓపెద్ద షాక్. అప్పటివరకు తనవాళ్ళు అనుకుంటున్న వాళ్ళ ముసుగు వెనుక రూపాలు తెలియడం మరో పెద్ద షాక్.

ప్రపంచం పట్ల ద్వేషం పెంచుకుంటున్న సోమయాజిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది మందాకిని. ఓ మద్యాహ్నం సోమయాజి బడినుంచి వచ్చి, ఇంట్లో తనకి సరిపోయే అన్నం లేకపోవడం చూసి, ఆగ్రహించి మందాకినికి చెబితే ఆమె అడిగిన మొదటి ప్రశ్న 'నీ వయస్సెంత?' అంతేనా.. ఆ వయసు కుర్రాళ్ళు కష్ట పడి పనిచేసి రెండు అరటిపళ్ళు కొనుక్కుని తినగలరని చెబుతుంది. చిన్నప్పుడే తాతయ్య సహచర్యంలో వేదాలని ఔపోసన పట్టిన సోమయాజి, ఆ మద్యాహ్నం వేళ పని వెతుక్కుంటూ రోడ్డెక్కుతాడు. ఓ క్షురకుడి దగ్గర సహాయకుడిగా చేరి వారం రోజుల్లో సొంతం గా సంపాదించడం మొదలు పెడతాడు.

ఆకలంటూ వచ్చిన కుర్రాడికి, మందాకిని స్థానం లో మరే స్త్రీ ఉన్నా విస్తరేసి భోజనం వడ్డించేదేమో.. అలా చేయలేదు కాబట్టే ఆమె మందాకిని అయ్యింది. సోమయాజి తెలివితేటల్ని సరైన దారిలో పెట్టింది. అతనికో చనిపోయిన తన తండ్రిని చూసుకుంది. మందాకినిలో తన తాతయ్యని చూసుకున్నాడు సోమయాజి. ఐతే అతడు ఆమెని అపార్ధం చేసుకున్న సందర్భమూ లేకపోలేదు.. మందాకినిని సోమయాజి ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నించినప్పుడు ఆమె స్థాణువే అయ్యింది. 'ఇక నీతో మాట్లాడను' అని మందాకిని చెప్పిన వాక్యం సోమయాజి చెవిలో పిడుగుపాటే.

ఎవరిచేతో మోసగింపడి గర్భవతి అయిన తమ కుమార్తెను గుట్టు చప్పుడు కాకుండా సోమయాజికి ఇచ్చి పెళ్లి చేసేయాలని బంధువులంతా నిర్ణయించుకున్నపుడు, అతను తన ఆవేదనను పంచుకున్నది మందాకినితోనే. 'వెళ్ళిపో సోమూ.. వీళ్ళకి దూరంగా వెళ్ళిపో.. నీ బతుకు నువ్వు బతకగలవు' అని మార్గదర్శనం చేస్తుంది మందాకిని. పేకాటలో సర్వం పోగొట్టుకున్న భర్త తో కలిసి కొత్త జీవితం ప్రారంభించడానికి గోదారి ఒడ్డునున్న తమ ఊరికి వెళ్ళిపోతుంది ఆమె. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకున్నారా? అన్న ప్రశ్నకి జవాబు యండమూరి వీరేంద్రనాథ్ రాసిన 'ఆనందో బ్రహ్మ' నవల. (నవసాహితి ప్రచురణ, వెల రూ. 60)

...ఇది నా యాభయ్యో టపా...

13 కామెంట్‌లు:

 1. యండమూరి నవలలు చాలానే చదివాను గానీ.. ఆనందోబ్రహ్మ చదవలేదండీ :(
  కాకపోతే చదవాల్సిన లిస్టులో ఉంది. మీరు చేసిన మందాకినీ పరిచయం ఇంకా ఆసక్తిని పెంచింది.

  రిప్లయితొలగించు
 2. అన్నట్టు మరచాను.
  క్రికెట్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ లాగా.. మీక్కూడా ఏదన్న బిరుదు ఇవ్వాలనిపిస్తుంది ;)
  50 అంకె అని కాకుండా.. అన్నీ మంచి మంచి పోస్టులు.. అదీ ఇంత తక్కువ కాలంలో రాసినందుకు గానూ..!
  ఇలాగే ఇంకా మంచి టపాలు రాయడానికి మీకు తీరికా, ఓపికా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
  శుభాభినందనలతో..
  మధుర

  రిప్లయితొలగించు
 3. టైటిల్ చూసి ఒకప్పటి హీరోయిన్ మందాకినీ గురించి రాసారేమో అనుకున్నానండి :)
  మీ పోస్ట్ మొత్తం ఇంకా చదవలేదు...చదివి మళ్లీ కామెంట్ చేస్తా...

  రిప్లయితొలగించు
 4. మురళి గారూ ! అభినందనలండీ ! మధురవాణిగారన్నట్టు సంఖ్యకాదు ముఖ్యం .అన్నీ మంచి టపాలు ...ఏకబిగిని చదివేయాలనిపించే పుస్తక (పాత్రల) పరిచయాలు...ఇంకా మీపోస్టుల గురించి చెప్పుకుంటూ పొతే ఇదొక పోష్టు అవుతుందేమో .... :) నెమలికన్ను మురళిగారుగా మీ స్థానం మా హృదిలో పదిలం .మీకు త్వరలోనే వందో పోష్టు అభినందనలు తెలపాలని కోరుకుంటున్నా ...

  రిప్లయితొలగించు
 5. మందాకిని పాత్ర నాకు చాలా ఇష్టం ...ఆనందోబ్రహ్మ లో యండమూరిగారంటారు స్త్రీ ..స్త్రీత్వానికి దూరమై ..ఆకారంలో పురుషునికి దగ్గరై ....అని ..కానీ ఆ పుస్తకం ఉన్నన్నాళ్ళూ మూర్తీభవించిన స్త్రీత్వాన్ని అందరూ గుర్తుంచుకునేలా ఉంటుంది మందాకిని .నాకు చాలా నచ్చిన ఆయన రచనల్లో ఆనందో బ్రహ్మ ఒకటి .పరిచయం చేసినందుకు ధన్యవాదాలండీ .మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు .

  రిప్లయితొలగించు
 6. నేనైతే మల్లాది గారి మందాకిని ని పరిచయం చేస్తున్నారేమో అనుకున్నా..

  అప్పుడే యాభై? :) బావుంది..

  రిప్లయితొలగించు
 7. @మధురవాణి: తప్పక చదవండి, మిమ్మల్ని నిరాశ పరచదు.. అంకె కోసం కాదండి, నేను టపా పబ్లిష్ చేసేటపుడు చూసి, చివర్లో ఓ వాక్యం రాశాను. మీ అందరి అభిమానానికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
  @చైతన్య: అండర్ వరల్డ్ వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు చెప్పండి? :) అందుకే యండమూరి మందాకిని గురించి రాశాను. ధన్యవాదాలు.
  @పరిమళం: మందాకిని నాకు కూడా చాలా ఇష్టమైన పాత్ర అంది. మీ అభిమానానికి ధన్యవాదాలు.
  @ఉమాశంకర్: మల్లాది వారి మందాకిని క్యూ లో ఉందండి:) 'యాభై' నాక్కూడా ఆశ్చర్యంగానే ఉంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 8. మీరు పుస్తకం.నెట్ చూస్తారా? మీరు చదివిన పుస్తకాల గురించి అక్కడ రాయగలరా? మిమ్మల్ని ఎలా సంప్రదించడం ఈ విషయం పై? నాకు ఓ సారి ఈ మెయిల్ చేయగలరా..మీకు వివరాలు తెలుపగలను...

  రిప్లయితొలగించు
 9. ఇప్పుడే ఆనందోబ్రహ్మ పూర్తి చేసి లేచాను..వెంటనే మీకు ధన్యవాదాలు చెప్పాలనిపించింది.
  చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు.
  స్త్రీత్వం..వ్యక్తిత్వం కలబోసిన మందాకినీ, పదహారేళ్ళకే యెంతో మానసిక పరిణితి సాధించిన సోమయాజి...ఎంత గొప్ప అనుబంధం వారిద్దరిదీ...ఎండమూరి చాలా అద్భుతంగా ఆవిష్కరించారు వారి బంధాన్ని.
  యండమూరిగారు చెప్పిన యాంత్రిక జీవనం చూడడానికి 2054 వరకూ ఆగనవసరం లేదేమోననిపించింది. ధన్యవాదాలు మురళిగారూ.

  రిప్లయితొలగించు
 10. చాలా రోజుల క్రితం ఆనందోబ్రహ్మ దూరదర్శన్లో సీరియల్ గా వచ్చినట్టు చిన్న జ్ఞాపకం..సోమయాజి తాతగారు చనిపోవడం, అతను వేరే వూరు వెళ్ళడం..అంతే గుర్తు నాకు.

  రిప్లయితొలగించు
 11. @ప్రణీత స్వాతి: పుస్తకం చదవగానే నా టపాని గుర్తు పెట్టుకుని ఇక్కడికి వచ్చి మీ అనుభూతిని పంచుకున్నందుకు ధన్యవాదాలు.. నేను అప్పుడప్పుడూ తిరగేస్తూ ఉంటాను.. మొత్తం నవల చదవకపోయినా, మందాకిని ఉన్న భాగాన్ని వదలను.. 'గోధూళి వేళ.. కానీ మాసం పుష్యమి కావడంతో...' కంఠతా వచ్చు నాకు :-)

  రిప్లయితొలగించు
 12. మీ టపా చదివాకే ఆనందోబ్రహ్మ కొన్నానండి..అందుకే చదివిన వెంటనే నా అనుభూతులు చెప్పాను.

  రిప్లయితొలగించు
 13. మీ రివ్యూ లంటే నాకు చాల ఇష్టం మురళి గారు . ఆనందో బ్రహ్మ నేను చాలా సార్లు చదివిన నవల . మీరు రివ్యూ రాసారేమోనని చూస్తె ఈ లింక్ దొరికింది ."కొందరికి చెప్పటానికి చాలా ఉన్నా విప్పటానికి నోరుండదు అంటూ గోదావరి గురించి రాసినా , పెద్దతనం తో పెద్దక్కయ్య , చిరునవ్వుతో చిన్నక్కయ్య , మూతి బిగింపు కొత్తల్లుడూ అంటూ సంక్రాతి గురించి రాసినా , మనిషికీ మనిషికీ మధ్య హక్కులూ బాధ్యతలూ ఇవేనా ఉండేదీ అంటూ మానవీయ సంబంధాల గురించి రాసినా ,ఆకాశం లో వెళ్ళే అప్సరస ఇంటి ముందుకొచ్చి ముగ్గేస్తుంది అని కవితాత్మకం గా రాసినా" అన్ని వాక్యాలూ అద్భుతాలే ! మీ రివ్యూ కి ధన్యవాదములు

  రిప్లయితొలగించు