ఆదివారం, మార్చి 29, 2009

తరం మారుతోంది..

దాదాపు పదిహేనేళ్ళ తర్వాత మా ఊరి అమ్మవారి జాతర చూశాను. ఈ పదిహేనేళ్ళలో కొన్ని ఉగాదులు మా ఊళ్ళో జరుపుకున్నాను.. ఉగాది రోజు ఉదయాన్నే ఊళ్ళో దిగి, సాయంత్రం మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతూ.. ఈసారి మాత్రం ముందస్తుగానే ప్లాన్ చేసుకోడం వల్ల పండుగను బాగా ఆస్వాదించ గలిగాను. ఉగాదికి రెండు రోజుల ముందు సాయంత్రం భోజనం కానిచ్చి, పంట పొలాల మధ్యలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్లాను, గతాన్ని నెమరు వేసుకుంటూ..

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్ లో గుడి మెరిసిపోతోంది.. జనం మాత్రం పల్చగా ఉన్నారు. గుడి అరుగు మీద కూర్చుని కొందరు 'పెద్ద మనుషులు' లెక్కలు చూసుకుంటున్నారు. వాళ్ళలో కొందరు నాతో కలిసి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. గుడి ఆవరణలో ఎరువుల బస్తాల సంచులతో కుట్టిన బరకాలు పరిచారు. గుడి అరుగు మీద కొందరు పిల్లలు కూర్చున్నారు. బరకాల చుట్టూ, కొంచం వెనకగా పంట కాలువ గట్టుమీద నిలబడి మరికొందరు జరుగుతున్న కార్యక్రమం చూస్తున్నారు.

వ్యవసాయం చేసే వాళ్ళందర్నీ ఒక దగ్గరికి చేర్చే వేడుక మా ఊరి జాతర. కుండలు చేసే కుటుంబానికి చెందిన వాళ్ళు గుడి నిర్వహిస్తారు. అమ్మవారు వడ్రంగం పని చేసే వారి ఇంటి ఆడపడుచు. కాబట్టి వాళ్ళు దగ్గర లేనిదే ఏ కార్యక్రమం ప్రారంభం కాదు. జాతర నిర్వహించాల్సిన బాధ్యత రైతులది. ఖర్చు మొత్తం రైతులంతా పంచుకోవాలి. వ్యవసాయ పనులు చేసే కూలీలకి ఈ జాతర ఓ ఆట విడుపు. ఏ వినోదం లేని రోజుల్లో అతి పెద్ద వినోదం. చిన్నప్పుడు అర్ధం కాలేదు కాని, ఇప్పుడు ఆలోచిస్తే అర్ధం అవుతోంది.. జాతర వెనుక ఎంత చక్కని ఉద్దేశ్యం ఉందో..

ఎనమండుగురు 'ఆసాదులు' నృత్యం చేస్తున్నారు.. డోలు, సన్నాయి వాద్యాలకి అనుగుణంగా. నృత్యం తో పాటు మధ్య మధ్యలో నోటి నుంచి పెద్ద తాడు తీయడం, బ్లేళ్ళు తినడం లాంటి ట్రిక్కులు చేసి చూపిస్తున్నారు. మా చిన్నప్పుడు నోరంతా తెరుచుకుని వాళ్ళ విన్యాసాలు చూసేవాళ్ళం. ఇప్పుడు బాగా చిన్నపిల్లలు, వయసు మళ్ళిన వాళ్ళు చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. కొందరు యువకులు ఓ చోట నిలబడి సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. ఎన్నికలు, ప్రజారాజ్యం, డీఎస్సీ నోటిఫికేషన్.. ఇలా రకరకాల విషయాలు. అతి కొద్ది మంది మాత్రం నన్ను గుర్తు పట్టి పలకరింపుగా నవ్వారు.

గుండాట లేదు.. కనీసం కాఫీ హోటల్ కూడా లేదు. జనం లేకపోవడంతో గిట్టుబాటు కాక వాళ్ళెవరూ రావడం లేదట. నేను మా 'పెద్ద మనుషుల' దగ్గరికి వెళ్లాను. జనం వచ్చే ప్రోగ్రాములు పెట్టొచ్చు కదా అని చనువుగా కోప్పడ్డాను. వాళ్ళ కష్టాలు వాళ్ళవి. రికార్డింగ్ డాన్స్ పెడితే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా జనం వస్తారు, కానీ పోలీసులు ఒప్పుకోరు. "డాన్స్ అమ్మాయిలకి ఎంత ఇస్తామో, పోలీసులకి కూడా అంత ఇవ్వాలి.. డబ్బు ఖర్చు పెట్టినా ప్రోగ్రాం జరుగుతుందన్న గ్యారంటీ లేదు.." అన్నాడో మిత్రుడు. "ఈసారి స్పెషల్ డప్పులు.. వస్తాయి చూడు.." అన్నాడు తనే.. పిల్లల చదువులు, ఉద్యోగాలు, పంటలు, రాజకీయాల మీదుగా చర్చలు సాగుతుండగా డప్పుల వాళ్ళు వచ్చేశారు ఓ వాన్ లో.

అప్పటివరకు ఆసాదుల డాన్స్ చూసిన వాళ్ళంతా డప్పుల వాళ్ళ చుట్టూ మూగిపోయారు. నెమ్మదిగా జనం పెరిగారు. మా గణేష్, మరికొందరు మిత్రులు వచ్చారు. అందరం చిన్నప్పటి రోజులకి వెళ్ళిపోయాం. అప్పట్లో ఏనుగులు, లొట్టి పిట్టలు, గేదెల డాన్స్, రమడోలు ఇలాంటివన్నీ ఉండేవి. మేము కబుర్లలో ఉండగానే డప్పుల వాళ్ళు ప్రదర్శన మొదలు పెట్టేశారు. డప్పుల తో పాటు వంటికి కిరోసిన్ రాసుకుని, నిప్పుతో కాల్చుకోడం, ఒకరి భుజాలపై మరొకరు నిలబడి డప్పు కొట్టడం.. ఇలా రిస్కుతో కూడిన విన్యాసాలు. ఒళ్ళు గగుర్పొడిచేలా.. జనం లేకపోవడం తో ఆసాదులు డాన్స్ ఆపేసి, గుడి వెనక్కి వెళ్లిపోయారు చుట్టలు కాల్చుకోడానికి.

అర్ధరాత్రి దగ్గర పడుతుండగా గుడి పూజారి అందర్నీ తొందర పెట్టాడు.. ఊరేగింపు మొదలు పెట్టాలని. ఆసాదులంతా 'గరగలు' నెత్తిమీద పెట్టుకుని ఒళ్ళు మరచి ఆడడం మొదలు పెట్టారు. సాంబ్రాణి మేఘాలు దట్టంగా అలముకున్నాయి. వచ్చిన జనంలో సగం మంది ఇంటి దారి పట్టారు. ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళకి పూనకాలు వస్తాయని సందేహించాం కాని, పూజారి భార్య వాళ్లకి వేపాకు వేసిన మంచినీళ్ళు తాగించి చల్ల బరచేసింది. ముందుగా డప్పుల వాళ్ళు, వెనుక ఆసాదులు, ఆ వెనుక పూజ ఘటం.. ఇలా ఊరేగింపు మొదలైంది.

ఊరేగింపులో ఎక్కువమందిని ఆకర్షించేది 'గవాట.' వాడుక భాషలో చెప్పాలంటే అమ్మవారికి కోడిపెట్టని బలి ఇవ్వడం. ఇది ఎలా జరుగుతుందంటే గరగ నెత్తిమీద పెట్టుకున్న ఆసాదుకి కోడిపెట్టని వాసన చూపించి అతన్ని దాన్ని అందుకోవల్సింది గా కవ్విస్తారు. ఆసాదుని ఇద్దరు కుర్రాళ్ళు కంట్రోల్ చేస్తారు. మరో కుర్రాడు కోడిపెట్ట తో పరిగెడతాడు..అందీ అందకుండా అందిస్తూ.. ఆసాదు కోడిపెట్టని అందుకునే వరకు ఇది కొనసాగుతుంది. ఊరి ముఖ్య కూడళ్ళలో గవాట జరుగుతుంది. కాసేపు చూసి, మా ఇంటి వరకు ఊరేగింపుతో కలసి వచ్చి, మిత్రులకి బై చెప్పి ఇంట్లోకి నడిచా..

4 కామెంట్‌లు:

  1. మురళీగారు..... మీ టపా ద్వారా ఒక క్రొత్త ఉగాది సంబరాల గూర్చి తెలుసుకో గలిగాను. కళ్ళకు కట్టినట్టు వ్రాసారు.

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు welcome back!చాలా బాగా రాశారు
    మా ఊరి సోమాలమ్మ జాతర గుర్తొచ్చింది .గరగాలూ ...గారడీ వాళ్ళూ ...బళ్లమీద వేషాలూ ...ఓహ్ ..ఆసంబరాలే వేరు .thanks.

    రిప్లయితొలగించండి
  3. @పద్మార్పిత, కొత్తపాళీ, పరిమళం: ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి