మంగళవారం, మార్చి 17, 2009

ఒక మలుపు

ఉదయం కరిగి మధ్యాహ్నం మొదలవుతున్న వేళ రోడ్డు పక్కన నెమ్మదిగా నడుస్తున్నా.. నా ఆలోచనలో నేను ఉన్నాను.. 'హూ..హా..' అన్న కేకలు వినిపించి ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాను. రోడ్డు మీద వరుసగా బస్సులు వెళ్తున్నాయి. బస్సులనిండా కిటకిటలాడుతూ టీనేజ్ విద్యార్ధులు. వేగంగా వెళ్తున్న బస్సుల్లోంచి చేతులు బయటికి ఊపుతూ ఆనందం ప్రకటిస్తున్నారు. మరికొందరు ఉత్సాహవంతులు కాగితాలు చించి రోడ్డు మీదకి విసురుతున్నారు.. రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళ మీద పడుతున్నాయి ఆ కాగితం ముక్కలు. కొందరు పాదచారులు విసుక్కుంటున్నారు. నాకు మాత్రం ఆ పిల్లల సంతోషం చూస్తె ఉత్సాహంగా అనిపించింది.

ఓ నాలుగు బస్సులు వెళ్ళాయి.. వాటి వెనుక మోటార్ సైకిళ్ళు.. ఒక్కో మోటార్ సైకిల్ పై ఇద్దరు, ముగ్గురు పిల్లలు.. అదే సంతోషం.. అవే కేకలు.. విషయం ఏమిటా అని ఆలోచిస్తుండగానే నా పక్క ఆయనతో వెనుకతను చెబుతున్నాడు ఇంటర్ మొదటి సంవత్సరం వాళ్లకి ఇవాల్టితో పరిక్షలు అయిపోయాయట. వీళ్ళు పరీక్ష రాసి వస్తున్నారన్న మాట.. అదీ ఆనందం. నిజమే..పరీక్షలు అయిపోవడం అంటే గుండెల మీద భారం దిగిపోడమే. నైట్ ఔట్లు, కంబైండ్ స్టడీస్, బిట్లు గుర్తుంచు కోడానికి చిట్కాలు, సులభంగా బొమ్మలు గీసే పద్ధతులు., పొడుగాటి ఈక్వేషన్లను కుదించుకుని కోడ్ భాషలో గుర్తుపెట్టుకోవడం.. అబ్బా చాలా పెద్ద పనులు..

ఈ పిల్లలంతా ఇప్పుడు ఏం చేస్తారు? బహుశా ఇంటికెళ్ళి భోజనం చేసి నిద్రపోతారు.. సాయంత్రం సినిమాలు, షికార్లు.. మరి రేపటినుంచి? అప్పుడు చూశాను ఆ బస్సుల వైపు.. ప్రైవేట్ కాలేజీలవి. తెలిసి పోయింది.. వీళ్ళంతా కాబోయే ఇంజనీర్లు, డాక్టర్లు అని.. రేపటినుంచో, ఎల్లుండి నుంచో వీళ్ళకి ఇంటర్ రెండో సంవత్సరం క్లాసులు మొదలవుతాయి. ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉండనే ఉంటుంది. ఇంకా ఐ.ఐ.టీ. కోచింగ్ తప్పనిసరి. ఇవాళ ఒక్క రోజే అన్నమాట వీళ్ళ సంబరాలు. రేపటినుంచి మళ్ళీ పుస్తకాలు, పాఠాలు, చదువులు, ట్యూషన్లు.. అమ్మ, నాన్నల పలకరింపులు కూడా ఎలా చదువుతున్నావు అని మాత్రమే.. వేలకి వేలు ఫీజులు కడుతున్నారు మరి.

నిజమే.. ఇంటర్మీడియట్ అనేది విద్యార్ధి జీవితం లో ముఖ్యమైన మలుపు. ఇప్పుటి నిర్ణయాలు అతని/ఆమె భవిష్యత్ ని శాసిస్తాయి. విద్యార్ధులే కాదు, తల్లిదండ్రులూ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఐతే ప్రశ్న, ఈ జాగ్రత్త అన్నది కేవలం చదువు విషయంలో తీసుకుంటే సరిపోతుందా? మంచి మార్కులు, రాంకులు, సీట్లు, చదువు, ఇంటర్వ్యూ, ఉద్యోగం, మంచి జీతం.. ఇంతేనా.. ఇది కేవలం ఒక ఉద్యోగిని తయారు చేసే ప్రక్రియ. పిల్లలని కేవలం ఉద్యోగులుగా తయారు చేస్తే సరిపోతుందా? పరిపూర్ణ వ్యక్తులుగా, మంచి చెడులను తెలుసుకునే విచక్షణా శక్తి ఉన్నవారిగా తీర్చి దిద్దనవసరం లేదా?

టీనేజ్ చాలా ముఖ్యమైన దశ. ఈ వయసులో పిల్లలకి చదువుతో పాటు ఇంకా చాలా కావాలి. ముఖ్యంగా తల్లితండ్రుల ప్రేమతో కూడిన మార్గదర్శకత్వం. కోర్సుల ఎంపిక మాత్రమే కాదు, జీవితాన్ని చూడడానికి తమదైన దృక్కోణాన్ని ఏర్పరుచుకోడానికీ ఇది అవసరం. టీనేజ్ పిల్లలు ఎటెన్షన్ ని, ప్రేమని కోరుకుంటారు. ఇంట్లో ఇవి దొరకనప్పుడు బయట వెతుక్కుంటారు. టీనేజ్ ప్రేమల పర్యవసానాలు ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. దురదృష్టవశాత్తూ ఇప్పుడొస్తున్న సినిమాల్లో అధికశాతం టీనేజ్ పిల్లల ఎమోషన్స్ ని రెచ్చగొట్టేవే.

కానీ ఎంతమంది తల్లిదండ్రులు ఈ విషయాలని ఆలోచించ గలుగు తున్నారు? తమ పిల్లల వ్యక్తిత్వ వికాసం గురించి ఆలోచిస్తున్నారు? సరైన సమయం లో తల్లితండ్రుల నుంచి తమకి కావలసినవి అన్నీ పొంద గలిగే పిల్లలు కేవలం ఉత్తమ ఉద్యోగులు గా మాత్రమే కాదు.. ఉత్తమ పౌరులు గానూ మార గలుగుతారు. మరి వీళ్ళలో ఎందరు తలిదండ్రులు ఆ దిశగా కృషి చేస్తారో..? ...బస్సులు, మోటార్ సైకిళ్ళు వెళ్తూనే ఉన్నాయి.. కాగితం ముక్కలతో రోడ్డంతా నిండిపోతోంది..

7 కామెంట్‌లు:

  1. " పిల్లలని కేవలం ఉద్యోగులుగా తయారు చేస్తే సరిపోతుందా? పరిపూర్ణ వ్యక్తులుగా, మంచి చెడులను తెలుసుకునే విచక్షణా శక్తి ఉన్నవారిగా తీర్చి దిద్దనవసరం లేదా?"
    మంచి పాయింట్ అలా చెయ్యాలి అంటే ముందు మనకి తెలియాలి కదా.. మన దృష్టి లోనే జీవితమంటే నిర్వచనం మంచి వుద్యోగం బాగా డబ్బులు(ఎలా ఐనా సంపాదించు సంపాదించు చాలు)ఐనప్పుడూ మంచి చెడు విచక్షణ ఎలా నేర్ప గలం. ఇంకా లోతు గా వెళితే అసలు మంచి చెడు ఈ విద్యా విధానం వాటి అన్నిటి నిర్వచనాల గురించే అనుమానాలు వస్తాయి కదా.. :-)
    మీ అందరికి కోటి వందనాలండీ ఎలా రాయ గలుగుతారు అలా 10 నిమిషాల లో వచ్చిన ఆలోచన ను అంత చక్కగా వాక్యాలలో... :-|

    రిప్లయితొలగించండి
  2. చాల చక్కగా రాసారు . బహుశా మీ పిల్లల్ని అదే రీతి లో పెంచుతూ వుండివుంటారు .

    రిప్లయితొలగించండి
  3. మురళి ఒక్కసారిగా ఇంటర్మీడియెట్ రోజులు గుర్తుకు వచ్చాయి. మా ఫిజిక్స్ లెక్చరర్ మమ్మల ముద్దుగా ఇంటెరిమ్-ఇడియెట్స్ అని తిట్టేవాడు. ఇప్పటి వాతావరణం చూస్తుంటే ఒక్క 15 సంవత్సరాలలోనే ఎంత మార్పో అనిపిస్తుంది.ఒక్కక్కసారి 15 years too long అని పిస్తుంది. ఒక్కక్కసారి అప్పుడే 15 years అయిందా అనిపిస్తుంది. ఏమైనా అన్ని రకాల విద్యలకు వుపాధి లభిస్తే కానీ ఈ సమస్య కి పరిష్కారం దొరకదు.

    రిప్లయితొలగించండి
  4. మురళి గారూ ! మంచి టపా రాశారు .ఇప్పుడు పిల్లలకు అవసరానికి మించిన ,వయసుకు మించిన సౌకర్యాలు అందించడం లో తలమునకలైన తల్లితండ్రులే ఎక్కువ శాతం కనిపిస్తున్నారు .మిగిలిన శాతం పిల్లలకు తమ స్నేహితులు చేతిలో సెల్ పెట్టుకుని ,నిముషానికో మెసేజ్ చేస్తూ ,బైక్ ల మీద తిరుగుతుంటే ....అవి కొనలేని తమ తల్లితండ్రుల అసక్తత మీద ద్వేషం పెంచుకుంటూ ..ఆత్మన్యూనతతో తమ అసహనాన్ని తల్లితండ్రులపైనే చూపుతున్నారు .వారికి మంచి చెడు వివరించినా చాదస్తంగా కొట్టి పడేస్తారు తప్ప అర్ధం చేసుకోరు .ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తమ ఉద్యోగులు కాక ఉత్తమ పౌరులు తయారవ్వాలంటే కష్టమే ....కాని అసాధ్యం మాత్రం కాదు .తల్లితండ్రుల ,అధ్యాపకుల సహకారం ఉంటే .....

    రిప్లయితొలగించండి
  5. ఫ్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లొ ప్రతి తల్లీ, ప్రతి తండ్రీ కొరుకొనేది ఒక్కటే. వాళ్ళ పిల్లలు చిన్నప్పటినుంచి కేవలం చదువుకొంటూ ప్రపంచంతో సంబంధం లేకుండా పెరిగి ఎంసెట్ వ్రాసి ఇంజినీరింగ్ సీట్ సంపాదించి కేంపస్ లో మంచి కంపనీలొ జాబ్ తెచ్చుకోవాలి.కోడి గుడ్డుని పొదిగినట్లు పిల్లలని తల్లిదండ్రులు పెంచుతున్నారు. సమాజం తొ సంబంధం లేకుండా కనీసం న్యూస్ పేపర్లు కూడా చదవకుండా వీళ్ళు సాధించేదేవిటి?

    తల్లిదండ్రులరా మీరు పిల్లలని కనేది మీ కొసమా? సమాజం కొసమా? లేక సాఫ్ట్ వేర్ కంపెనీల కోసమా?

    రిప్లయితొలగించండి
  6. మంచి టపా.

    ఎంతసేపూ చదువు, చదువు అంటూ వాళ్ళ మనసుల మీద వత్తిడి పెంచడం అంత మంచిది కాదు.

    ఒక్కసారి చదువు అయిపోయి బాహ్య ప్రపంచం లోకొచ్చాక బ్రతకడానికి అవసరమయ్యే పాఠాలు ఏపుస్తకాల్లోనూ ఉండవు.. వాటిని తల్లితండ్రులే నేర్పాలి పిల్లలకి..

    రిప్లయితొలగించండి
  7. @భావన: విచక్షణ తెలియక కాదండి.. కాలంతో పాటు మారాలి అనే భావన కావొచ్చు. ధన్యవాదాలు.
    @చిన్ని: :) ధన్యవాదాలు.
    @భాస్కర్ రామిరెడ్డి: మేము చదివే రోజుల్లో క్లాస్ రూమ్ లో చాలా విషయాల మీద చర్చలు ఉండేవి. ఇప్పుడు పిల్లలకి చదువుకోడానికే సమయం చాలడం లేదు. మీకు ధన్యవాదాలు.
    @పరిమళం: 'మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు' అని మాత్రమే ఆలోచిస్తున్నారండి.. చాలామంది. పిల్లలకి కష్టపడడం అంటే ఏమిటో తెలియకుండా పెంచాలన్న తపన. ధన్యవాదాలు.
    @బోనగిరి: ధన్యవాదాలు
    @ఉమాశంకర్: ఒకసారి ఓ కార్పోరేట్ కాలేజి కి వెళ్ళినప్పుడు, ఓ విద్యార్ధి కాలేజి ఆవరణలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటికి క్లాసు పూర్తీ చేసుకుని వచ్చిన అతని క్లాస్ మేట్స్ 'అంకుల్ ఇక్కడ ఏం జరిగింది?' అని అడిగితే ఏం చెప్పాలో అర్ధం కాలేదండి. మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి