ఆదివారం, మార్చి 15, 2009

ఒక విందు కథ

ఒక స్నేహితురాలి నుంచి డిన్నర్ కి ఆహ్వానం వచ్చింది నిన్న. సందర్భం తన పుట్టిన రోజు. స్థలం ఓ ప్రముఖ రెస్టారెంట్. బయట తినడం వీలైనంత వరకు తగ్గించమని డాక్టరు సలహాలా కాకుండా కొంచం హెచ్చరింపు గానే చెప్పడంతో ఈ మధ్య బయటకి వెళ్ళడం తగ్గింది. ఈ రెస్టారెంట్ మాత్రం పూర్వాశ్రమం లో నేను చాలాసార్లు సందర్శించిందే. ఎప్పుడూ అతిధులతో కళకళ లాడుతూ ఉండేది. అలాంటిది వీకెండ్ రోజున కూడా పెద్దగా జనం కనిపించ లేదు.'ఔరా..ఆర్ధిక మాంద్యం ప్రభావం' అనుకున్నాను. ఐతే జనం పల్చబడడానికి అసలు కథ వేరే ఉందని అర్ధం అవడానికి కొంచం సమయం పట్టింది.

మేము మొత్తం ఆరుగురం స్నేహితులం ఓ గుండ్ర బల్ల చుట్టూ కూర్చున్నాం (రౌండ్ టేబిల్ అని వేరే చెప్పాలా?).. మేము ఆర్డర్ చెప్పేంతవరకు నక్షత్రకుడి తమ్ముడిలా మా వెంటపడ్డ సర్వరుడు తర్వాత పత్తా లేదు. మేమేమో ఆ విషయం పెద్దగా ఆలోచించకుండా కబుర్లలో పడ్డాం. కార్నర్ టేబిల్ అవడం, పెద్దగా జనం లేకపోవడంతో చర్చలు కాస్తా వాదనలోకి వెళ్ళాయి. కాసేపటికి టమాటా సూప్ వచ్చింది. పొగలు చిమ్ముతూ ఉంటుందనుకున్నది కాస్తా గోరువెచ్చగా అనిపించింది. సందర్భం కాదు కానీ నాకు 'గోరు వెచ్చని సూరీడమ్మా..' పాట గుర్తొచ్చింది. సూప్ కన్నా మా వాదనలే వేడిగా ఉండడంతో బౌల్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు.

తర్వాత రొట్టెలు వచ్చాయి.. వీటినే రోటీలంటారు.. ఇవి కూడా గోరు వెచ్చగానే ఉండడంతో అప్పుడు వచ్చింది సందేహం. వాటిని లాగిస్తూనే చుట్టూ చూడడం గమనించాం.. జనాకర్షక పథకాల్లో భాగంగా ఆ రెస్టారెంట్ వాళ్ళు ఓ గోడకి హోం థియేటర్ ఫిక్స్ చేశారు. వచ్చిన అతిథులతో పాటు, బాసు-బంటు తేడా లేకుండా స్టాఫ్ అందరూ టీవీకి కళ్ళప్పగించారు. హిందీ చానెల్ లో డాన్స్ ప్రోగ్రాం రియాలిటీ షో వస్తోంది. ఎక్కువగా మేకప్, పొదుపుగా దుస్తులు ధరించిన నర్తకీమణులు పాత, కొత్త హిందీ పాటలు మరియు వాటి రిమిక్సులకి ఒళ్ళు మరచి నర్తిస్తున్నారు. టెస్ట్ చేద్దామని సర్వర్ని పిలిచాం.. అబ్బే.. స్పందన లేదు.. ఓ పది నిమిషాల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. టీవీ వైపు చూస్తే కమర్షియల్స్ వస్తున్నాయి. ప్రోగ్రాం కి బ్రేక్ అన్నమాట.

నాకైతే రెస్టారెంట్ కి వచ్చిన వాళ్ళ మీద చిరాకు అనిపించింది. ఇంట్లో ఉన్నంత సేపు ఎలాగు టీవీ చూస్తారు. రెస్టారెంట్లో కూడా టీవీ ఏనా అని.. మా హోస్టు చాలా బాధ పడ్డారు. 'అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చాను.. వేరే చోటకి వెళ్ళాల్సింది' అని. మా ఫ్రెండ్ ఒకతను వెంటనే 'పోన్లెండి నెక్స్ట్ బర్త్ డే కి వేరే చోటకి తీసుకెల్దురు గాని' అంటూ ఆవిడని ఓదార్చాడు. అయినా కూడా స్టాఫ్ నుంచి స్పందన లేదు. నాట్యం లో మునిగిపోయారు. 'వచ్చే బర్త్ డే కి ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు కాని, ఇక్కడికి రాలేం' అన్నాను నేను.. మా వాళ్ళు ప్రశ్నార్ధకంగా చూడడం తో 'అప్పటివరకు ఈ రెస్టారెంట్ ఉండాలి కదా' అని పూర్తి చేశా.. మాకు కొంచం దూరంగా నిలబడి టీవీ చూస్తున్న సర్వరుడికి వినబడేలా.. 'ఇలాంటివి చాలా విన్నాం' అన్నట్టుగా అతను తదేక దృష్టితో నృత్యం తిలకిస్తున్నాడు. 'ఇంత చిన్న వయసులోనే యెంత స్థిత ప్రజ్ఞత?' అనిపించి ముచ్చటేసింది.

'బహుశా వీళ్ళ కిచెన్ లోంచి కూడా టీవీ చూసే వీలుందేమో.. వాళ్ళు కూడా డాన్స్ చూస్తూ వంట చేస్తున్నారేమో..' ఇలా కామెంట్స్ చేసుకుంటూ ప్లేట్స్ ఖాళీ చేస్తున్నాం. టీవీ లో కొందరు పార్టిసిపెంట్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొంచం ఆలశ్యంగా వచ్చిన ఫ్రెండ్ కోసం ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాం. మాకెవరికీ దాని మీద పెద్దగా హోప్స్ లేవు. ఆశ్చర్యం ఏమిటంటే ఆర్డర్ చేసిన పదో నిమిషంలో పొగలు కక్కుతున్న ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి వినయంగా వడ్డించాడు సర్వరుడు. ఇంతలో ఎంత మార్పు అని అందరూ ఆశ్చర్యపోవడమే.. మా కామెంట్స్ విని జ్ఞానోదయం పొందారేమో అని కూడా అనేసుకున్నాం.

'పోనిలెండి.. కనీసం ఇదొక్కటీ అయినా బాగుంది' అని మా హోస్టు కూడా చాలా సంతోష పడ్డారు.. అల్ప సంతోషి.. ఇందులో మతలబు ఏమిటా అని ఆలోచిస్తూ చుట్టూ చూశా.. అప్పుడు తెలిసింది అసలు రహస్యం. టీవీ లో నృత్య కార్యక్రమం ఐపోయింది. ఆనందంగా బిల్లు పే చేస్తున్నహోస్టు కి ఈరహస్యం చెప్పలేదు. మరోసారి 'హ్యాపీ బర్త్ డే' చెప్పి ఇంటికి బయలుదేరా..

7 కామెంట్‌లు:

  1. ఆలస్యంగా వచ్చిన స్నేహితుడు అదృష్టవంతుడండి...
    తరువాత ఇంకో టీ.వీ.ఎస్ సరిగమనో టెలికాస్ట్ కాలేదు...
    సంతోషం!!

    రిప్లయితొలగించండి
  2. బావుంది :)..

    దాదాపు నాకూ ఇదే అనుభవం. హోటల్లో కాదు, సెలూన్ లో..
    దృష్టి పైన మూలన తగిలించిన టీవీ మీద, అప్పుడప్పుడు నా తల మీద...

    సీరియస్ సీన్లొచ్చినప్పుడు భారంగా, కామెడీ సీన్లపుడు ఎగెరెగిరిపడి నవ్వుతూ కదిలింది కత్తెర నా తలమీద..

    రిప్లయితొలగించండి
  3. క్రికెట్ మాచ్ లకే అనుకున్నా ....ఇప్పుడు వీటిక్కూడానా .......:)

    రిప్లయితొలగించండి
  4. @పద్మార్పిత, చిన్ని, పరిమళం, నేస్తం: ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: మీరు మాత్రం ఓ టపా రాయాల్సిందేనండి, సేలున్ అనుభవాలతో. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. ఏవండి మురళి గారు ఉమా శంకర్ గారు టపా రాయటం సంగతి పక్కన పెట్టండి పాపం సెలూన్ వాళ్ల కత్తెర నుంచి చుర కత్తి లా వేగంగా బయట పడి వుంటారు పాపం ఏమంటారు ఉమా శంకర్ గారు? ఈరోజుల్లో ఇలాంటివి చాలా జరుగుతూనే వున్నాయి అక్కడక్కడ.

    రిప్లయితొలగించండి