గురువారం, మార్చి 12, 2009

వీరబొబ్బిలి

"కుక్కలకు మాత్రం నీతి ఉండక్కర్లేదనుకున్నావా పాత్రుడూ? ...ఫలానీ రాజు ఫలానీ కుక్కను పెంచి చెడి పోయినాడని జనం చెప్పుకుంటే లోకం లోని కుక్కలన్నిటికీ మచ్చగాదా?" ...ఇదేమిటి? 'కన్యాశుల్కం' మధురవాణి డైలాగు ఒక కుక్క చెబుతోంది? అని ఎవరైనా అనుకున్నారంటే వాళ్లకి 'వీరబొబ్బిలి' తెలియదన్నమాట. రాజుల లోగిళ్ళ లో పుట్టి పెరిగి, మాటలతో పాటు వారి మర్యాదలు, పెంకితనాలు కూడా నేర్చుకున్న గ్రామసింహం వీరబొబ్బిలి. కె.యెన్.వై. పతంజలి దాదాపు మూడు దశాబ్దాల క్రితం సృష్టించిన పాత్ర ఇది. అలమండ కి చెందిన ఉప్పలపాటి ఫకీర్రాజు దివాణం లో బొబ్బిలి బస. "నావల్ల ఈ దివాణానికి కళ, కాంతి. ఈ బొబ్బిలే లేకపోయాక ఈ దివాణం ముఖం చూసే వాడెవడోయ్," అనడానికి సందేహించదు.

బొబ్బిలి వేట కుక్క. అందుకే దివాణానికి కావలి కాయదు. కావలి కుక్కలు మరో నాలుగు ఉన్నాయి, కాని జన్మతా వేట కుక్క కాబట్టి వాటితో కలవదు. ఓ అర్ధరాత్రి దివాణం లోకి ప్రవేశించిన దొంగకి వంటింటి దారి చూపించడం తో పాటు వంటరాజు దాచిన పోలుగుల కూరలో తన వాటా అడిగి మరీ తింటుంది. "నేనే గనక కావలి కుక్కని ఐతేనా.. నున్ను పిక్క పట్టుకుని కరిసీసుందును. వేట కుక్కని కాబట్టి బతికిపోయావు. ఇది నా యింట్లో కూర. ఇందులో నాకు వాటా ఉంది.. రేపైనా నేను తినాల్సిందే.. ఇప్పుడు నాకు తినాలనిపించింది కాబట్టి నిన్ను పెట్టమన్నాను.. ఇది దొంగతనం కాదు తెలిసిందా.." అని దొంగాడితో వాదించగలదు.

ఫకీర్రాజుని చూడవచ్చిన అతని బంధువు ఈటెసూరి ని గుమ్మంలోనే అడ్డగించి దర్పం ప్రదర్శిస్తుంది బొబ్బిలి. "నన్ను చూసి భయపడినట్టు ఒప్పుకో"మంటుంది ఈటెసూరి ని. "రాసోడిని.. ఓ కుక్కకి భయపడతానా?" అని బింకం ప్రదర్శిస్తాడతను. ఇంతలొ ఫకీర్రాజు వచ్చి "భయం లేదు బావా.. చూడడానికి గుర్రం లా ఉంది గానీ, ఇది తిండి దండుగ కుక్క. ఏమి చేయదులే.. అయినా ఇది దాని ఆరోగ్యం ఎంత బాగా కాపాడు కుంటుందనీ.. వేటలో ఏదైనా ఏదైనా పెద్ద జంతువు కానీ కనపడిందా.. ఇది చెట్టెక్కి మరి దిగదు.." అనేసరికి గుడ్ల నీరు కక్కుకుంటుంది బొబ్బిలి.

"భవిషం తీసేశావు కదయ్యా ఫకీరూ.. నీ కుక్కని అవమానిస్తే అది నీకు అవమానం గాదూ.." అని మద్యాహ్నం వరకూ చింతిస్తుంది. అదే ఈటె సూరికి ఫకీరు బొబ్బిలిని కానుకగా ఇస్తాడు. సూరి చేతిలో అవమానానికి గురైన బొబ్బిలి బాధ వర్ణనాతీతం. సూరి తనని తన్నినపుడు "కుడి కాలుతోనే తన్నాడా.. కుడి కాలే అయిఉంటుంది లే.. అయినా ఈ బొబ్బిలిని ఎడం కాలితో తన్నేంత మగదూర్ ఉన్నవాడెవడు?" అనుకుని తృప్తి పడుతుంది.

ఫకీర్రాజు స్నేహితుడు 'గోపాత్రుడు' భూమి బల్లపరుపుగా ఉందని అలమండ వాస్తవ్యులతో వాదిస్తాడు. పాత్రుడికి మొదట మద్దతు పలికింది బొబ్బిలే. "విశ్వాసం ముఖ్యం" అని చెప్పి పాత్రుడింటికి వెళ్ళిపోతుంది. పాత్రుడి భార్య తమ ఇంట బొబ్బిలికి బోయినం ఎంత మాత్రం వీలుపడదు అని కచ్చితంగా చెప్పేసరికి "విశ్వాసం ముఖ్యమా? బోయినం ముఖ్యమా?" అనే సమస్య వస్తుంది బొబ్బిలికి. "ఇప్పుడు నాకు ఆకలి వేస్తోంది కాబట్టి బోయినం ముఖ్యం. బోయినం చేశాక, మళ్ళీ ఆకలి వేసేవరకు విశ్వాసమే ముఖ్యం" అని చెప్పేస్తుంది పాత్రుడికి. బోయినం విషయంలో ఎలాంటి శషభిషలూ లేవు బొబ్బిలికి. భూమాత ఆకారం అనే అంశం మీద అభిప్రాయ భేదాలోచ్చి ఊరు రెండుగా చీలిపోతుంది. ఫకీరు కూడా పాత్రుడిని సమర్ధించడంతో బొబ్బిలి బోయినం సమస్య పరిష్కారం అవుతుంది.

భూ ప్రపంచం లో తన వంటి కుక్క మరొకటి లేదని ప్రగాఢ విశ్వాసం బొబ్బిలికి. ఇదే విషయం లో ఓ దెయ్యం తో వాదన పెట్టుకుంటుంది. ఈటె సూరి దగ్గర నుంచి తిరిగి వచ్చేటపుడు ఓ ఊరి ప్రజల తీర్పు అడుగుతుంది. ఊరిజనం ఫకీరు కి మర్యాద ఇస్తున్నారంటే అది తన వల్లనే అంటుంది బొబ్బిలి. భూమాత ఆకారం ఎలా ఉందో తేల్చుకోడానికి అలమండ బయలు లో రెండు గ్రూపులో యుద్ధానికి తలపడినప్పుడు 'అవతలి గ్రూపులో కుక్కలు ఏవీ లేవే..' అని చింతిస్తుంది బొబ్బిలి. తను మనిషి భాష నేర్చాను కాబట్టి మనిషిలాగే ప్రవర్తించాలనుకుంటుంది.. ఐనప్పటికీ మనుషుల కన్నా తను గొప్పదాన్నని నమ్మకం 'మహారాజశ్రీ' బొబ్బిలికి.

పతంజలి మరణ వార్త తెలియగానే నాకు మొదట గుర్తొచ్చింది బొబ్బిలే.. ఆ తర్వాతే ఫకీర్రాజు, చిట్టెమ్మ, పాత్రుడు, దుంపల దత్తుడు, మీర్జా పెదబాబు..వీళ్ళంతా.. వ్యంగ్యమే కాదు ఏది రాసినా తనకి తానే సాటి అనిపించే రీతిలో రచనలు చేసిన పతంజలి 'రాజుల లోగిళ్ళు' రచన పూర్తి చేస్తారని ఎదురుచూశాను.. ప్చ్..అది చదివే అదృష్టం లేదంతే..ఆయన రాసిన 'వేట కథలు'చదివితే అడవిలో వేటకి వెళ్తున్న అనుభూతి. జంతువుల కదలికలపై ఆయనకీ యెంత అవగాహన..! వేటలో చనిపోయే జంతువు ఆత్మఘోషని ఆయన అక్షరాల్లో చదువు తుంటే కళ్ళు తడవక మానవు. ఆయన చివరి రోజుల తాలూకు విజువల్స్ టీవీలో చూస్తుంటే కళ్ళు మళ్ళీ తడిశాయి. రాచ కురుపు ఆయన్ని పీల్చి పిప్పి చేసింది. మరణం ఎవరికైనా తప్పదు.. కానీ ఆయనకీ మరణం సంభవించిన తీరు మాత్రం కడు బాధాకరం.

పతంజలి రాసిన పది నవలలని కలిపి పతంజలి మిత్ర మండలి 'పతంజలి రచనలు' పేరిట సంపుటిగా విడుదల చేసింది. విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలోనూ లభించే ఈ పుస్తకం వెల రూ. 240. ఆయన మిగిలిన రచనలని కూడా మిత్ర మండలి ప్రచురిస్తుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా అసంపూర్తి రచన 'రాజుల లోగిళ్ళు.'

పతంజలి పై సాక్షి, ఆంధ్రజ్యోతి వ్యాసాలు ప్రచురించాయి.ఎంత రాసినా ఇంకా ఏదో మిగిలిపోతూనే ఉంటుంది పతంజలి రచనల గురించి..

8 కామెంట్‌లు:

  1. మురళి నిజమే "పతంజలి" గురించి ఎంత చెప్పిన తక్కువే . మీరు చెప్పిన పుస్తకం ఒక మిత్రుడు నాకు లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ చేసారు .అది పూర్తిగా చదివేదాక నన్ను అడుగడుగునా గుర్తుచేసేవారు,పూర్తి చేశానా ,లేదా అని .నిన్న పతంజలి మరణ వార్త వినగానే ఒక్కసారే శూన్యం ఆవహించిందండి .ముఖ్యమ్గా ఆయన రాసిన దెయ్యం ఆత్మా కథ మండలికలు గురించి వ్యంగ్య రచన ,జర్నలిస్టుల మనోగతం సంభందించి నవి ఎన్నో తెలియని విషయాలు అందచేసారండి .ఆయన హాస్యం ,వ్యంగ్యం,దుఃఖం పండించారు తన రచనలలో .
    ఆయన 'ఆత్మా" కి శాంతి కలగాలని ,కుటుంబ సభ్యులు ఈ విషాదం నుండి కోలుకోవాలని కోరుకుంటున్న .

    రిప్లయితొలగించండి
  2. బావుంది మురళి గారూ ! వీర బొబ్బిలి .పతంజలి రచనల సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు . పతంజలి గారికి నివాళులు .

    రిప్లయితొలగించండి
  3. నేను మొట్టమొదటిసారి వీరి రచనలు చదివింది ఉదయం దినపత్రికలో. ఎందుకో తనపేరు కేఎన్ వై పతంజలి గానే ముద్రపడిపోయింది నా మనసులొ.మాటల్లో ఎవరైనా పతంజలి అంటే ఇంకెవరో వేరే పతంజలి అనుకునేవాడిని.

    వారి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను..

    రిప్లయితొలగించండి
  4. మురళి గారూ , మీ రచన చదివిన తరువాత, పతంజలి గారి నవలలు చదవాలనిపిస్తుంది. ఇక్కడ మాకు వున్న పరిమితుల వలన ఇవి ఎక్కడైనా నెట్ లో దొరుకుతాయేమో చూడాలి. ఆయన రచనలన్నింటి ని గుర్తు చేసి ఆత్మకు శాంతి కలుగచేశారు.

    రిప్లయితొలగించండి
  5. ఈ పతంజలి గారి గురించి... మీరు చెప్పిన విషయాల గురించి నాకు ఏమాత్రం తెలీదు...
    కొత్త విషయం తెలియజేసారు... ధన్యవాదాలు!

    పతంజలి గారికి... నా నివాళులు!

    రిప్లయితొలగించండి
  6. @చిన్ని: నాక్కూడా అలా పుస్తకాలు ప్రెజెంట్ చేసి, చదివించే స్నేహితులు ఉన్నారండి. ధన్యవాదాలు.
    @పరిమళం: ధన్యవాదాలు
    @ఉమాశంకర్: మొదట్లో నాకూ కొంచం కన్ఫ్యూజన్ ఉండేదండి.. కానీ ఆయన శైలి ఇనిమిటబుల్. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: ధన్యవాదాలు.
    @భాస్కర రామిరెడ్డి: నెట్ లో ఎక్కడ దొరుకుతాయో నాకూ తెలియదండి.. తప్పక చదవవలసిన పుస్తకాలు. ధన్యవాదాలు.
    @చైతన్య: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. ఆ మహా రచయిత రాసిన వాటిలొ చాలామందికి తెలియని ఇంకొ రచన వున్నది , గ్నాపక కథల పేరుతొ ,(బహుశా మహా నగర్ లొ) తను చిన్నట్ట్నుంచి చదువుకున్న కథలన్నింటిని తనదైన శైలిలొ, తన ముద్ర వేసి వ్రాసిన అద్భుత ప్రపంచం అది 5 సంవత్స్రాల కిందట వాటి తాలుకు xerox లు నాకిచ్చారు కాని ఇప్పుదు చూస్తే అవి ఎక్కడున్నయొ కనబడి చావడం లెదు, కొత్తగా పతంజలి గారి రచనలన్ని వెలుగులొకి ఆయన మిత్రులు తెస్తున్న క్రమం లొ అవీని వెలుగు చూస్తాయని, అందరు చదవాలని ఆశ.

    రిప్లయితొలగించండి