సోమవారం, ఫిబ్రవరి 16, 2009

పెద్దలకు మాత్రమే

అసలు సెన్సార్ బోర్డ్ పనిచేస్తోందా? అన్న ప్రశ్న సెన్సార్ బోర్డ్ అంత పాతది. అసభ్య, అశ్లీల సన్నివేశాలు, భయానక భీభత్స దృశ్యాలు ఉన్నసినిమాలు విడుదలైన ప్రతిసారీ ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంటుంది. విడుదలవుతున్న సినిమాలను గమనిస్తే గడిచిన పదేళ్ళలో సినిమాలను సెన్సార్ చేసే విషయంలో సదరు బోర్డు మరింత ఉదారంగా, ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అనిపిస్తోంది. అంటే అంతకు ముందు కఠినంగా వ్యవహరించిందని కాదు.. ఇప్పుడు మరీ చూసీ చూడనట్టు పోతోందని. సినిమాలను సెన్సార్షిప్ విధించడానికి గల ప్రధాన కారణాల్లో చిన్నపిల్లలను హింస, అశ్లీలం, అసభ్యత ఉన్న సినిమాలకు దూరంగా ఉంచడం ఒకటి. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చిందంటే పన్నెండు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు ఆ సినిమాను తల్లిదండ్రులతో మాత్రమే చూడాలి. అదే A సర్టిఫికేట్ సినిమా ఐతే పద్దెనిమిదేళ్ళ లోపు వాళ్లు ఆ సినిమా చూడడానికి అనర్హులు.

ఈ నిబంధనలు ఎంతవరకు అమలవుతున్నాయి? తెలుసుకోడానికి పరిశోధనలే అవసరం లేదు. ఏదైనా సినిమా హాల్ దగ్గర చూడండి చాలు. ఒకప్పుడు సినిమాకి సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ఇచ్చిందంటే పోస్టర్ల మీద ఆ సర్టిఫికేట్ ను ప్రముఖంగా ప్రచురించేవారు. పోస్టర్ మీద ఓ పెద్ద సున్నాలో ఉన్న ఎర్రటి A ని రహస్యంగా, కుతూహలంగా చూసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. పిల్లలెవరైనా ఆ పోస్టరును చూసినా పెద్దవాళ్ళ నుంచి అక్షింతలు పడేవి. ఇప్పటి పోస్టర్లమీద A ని చూడాలంటే కళ్లు చికిలించి చూడాలి. ఎక్కడో రంగుల్లో కలిసిపోయి ఉంటుంది. దానిగురించి ఎవరికీ పెద్దగా పట్టింపు ఉన్నట్టు కూడా కనిపించదు. థియేటర్ యాజమాన్యాలు సదరు సినిమాల టిక్కెట్లు పిల్లలకి అమ్మకూడదు, పిల్లలని హాలులోకి రానివ్వకూడదు. చట్టంలో ఇందుకు శిక్షలు కూడా ఉన్నాయి. కాని, ఫిర్యాదు చేసేవారెవరు?

సెన్సార్ బోర్డు లోనే కాదు, సినిమాలు తీసే వారి ఆలోచనా ధోరణిలోనూ మార్పు వచ్చింది. మొన్నటిదాకా క్లీన్ U సర్టిఫికేట్ వస్తే ఆయా నిర్మాత, దర్శకులు ఆ విషయాన్ని గర్వంగా ప్రకటించుకునే వాళ్లు. 'సెన్సార్ బోర్డు మమ్మల్ని ప్రశంసించింది' అని ప్రముఖంగా ప్రచారం చేసుకునే వాళ్లు. ఐతే ఇప్పుడు పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ తరం ప్రముఖ దర్శకుల సినిమాలన్నీ దాదాపుగా A సర్టిఫికేట్ పొందినవే. విపరీతమైన హింస, రక్తపాతాలను తెరకెక్కించడంపై వీరికి ఉన్న మమకారమే ఇందుకు కారణం. పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళ సినిమాలకి U సర్టిఫికేట్ వచ్చిందంటే అది పెద్ద వార్త అయ్యేలా. విషాదం ఏమిటంటే వీళ్ళ సినిమాలకి పిల్లలు, కాలేజి కుర్రకారే పెద్ద ఫాన్స్. స్కూళ్ళు, కాలేజీలు ఎగ్గొట్టి మరీ క్యూలలో నిలబడి టిక్కెట్టు కొనుక్కుని ఈ సినిమాలు చూస్తున్నారు వాళ్లు.

'పోకిరి' సినిమా విడుదలైనప్పుడు ఈ విషయమై టీవీ చానళ్ళు కొంచం హడావిడి చేశాయి. ఐతే అది సినిమాకి పబ్లిసిటీ గానే ఉపయోగపడింది. ఈ ట్రెండ్ కి తాజా ఉదాహరణ 'అరుంధతి.' ఈ సినిమా పెద్దలకు మాత్రమే. కాని ఎక్కడ చూసినా పిల్లలు కనిపిస్తున్నారు. అక్కడక్కడ తప్పించి థియేటర్ యజమానులు ఇందుకు పెద్దగా అభ్యంతర పెట్టడం లేదు. కేవలం థియేటర్ వాళ్ళనే తప్పుపట్టలేం. తల్లితండ్రులూ చూసీ చూడనట్టే ఉంటున్నారు. కొందరైతే పిల్లలని చూడమని ప్రోత్సహిస్తున్నారు కూడా. పోస్టర్లు చూడడాన్ని తప్పు పట్టిన తరం నుంచి, పిల్లల్ని సినిమా చూడమని ప్రోత్సహించే తరానికి వచ్చాం. క్లీన్ U సర్టిఫికేట్ ని గర్వంగా ఫీలైన రోజులనుంచి, A సర్టిఫికేట్ రావడం చాలా మామూలు విషయం అనుకునేంతగా సినిమా వాళ్ళూ ఎదిగారు. కొంచమైనా నిబంధనలు పాటిద్దాం అన్న స్టేజి నుంచి సర్టిఫికేట్ ఇవ్వడం ఓ మొక్కుబడి అనే స్టేజి కి సెన్సార్ బోర్డూ వచ్చేసినట్టే ఉంది. ఇంకా ఈ సర్టిఫికేట్ల విభజన అవసరమా...?

10 కామెంట్‌లు:

  1. ఒక రెండు రోజుల క్రితం శశిరేఖా పరిణయం చూడగానే నాకు ఇదే ఆలోచన వచ్చింది. అందులో ఆహుతి ప్రసాద్ మాట్లాడే మాటలన్నీ....

    అస్సలు సెన్సారువారు ఎలా అనుమతించారు అనేది నాకు అర్ధం కాలేదు... తెర మీద ఆ పదాలు పూర్తిగా మాట్లాడనంత మాత్రాన అది ఆమోదయోగ్యమైపోతుందా? ఖర్మ.. భావ దారిద్యం అనుకున్నాను ఇన్నాళ్ళూ, భాష దారిద్యం కూడా మొదలైంది.. సెన్సారు వారి చేతకానితనం, నిర్లక్ష్యానికి రెండో అంకం మొదలయింది.

    రిప్లయితొలగించండి
  2. సెన్సార్ బోర్డ్ లో కూడా రాజకీయ నాయకులు, వాళ్ళ బంధువులు ఉన్నారు. మన రాజకీయ నాయకులు ఎందులో జోక్యం చేసుకుంటే అది దరిద్రమే అయిపోతుంది.

    --- మార్తాండ

    రిప్లయితొలగించండి
  3. సెన్సార్ బోర్డ్ లో కూడా రాజకీయ నాయకులు, వాళ్ళ బంధువులు ఉన్నారు.....వీరు 'మాత్రమె' ఉంటారు. వేరే ఎవరకి చోటు ఉండదు. ఇప్పుడు సంగతి నాకు తెలియదు కాని... ఒకప్పుడు మాత్రం.. బోర్డు సభ్యుల చుట్టాలకి, వారి పిల్లలకి సినిమా ఛాన్స్ ఇవ్వమని, సూటుకేసులు ఇవ్వమని, ఫారిన్ చాన్స్ ఇవ్వమని ఇలా ఎన్నో షరతులు పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చేవారట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. సెన్సారు బోర్డు ఉన్నా లేకపోయినా ఒకటే. ఉండి ఊడబొడిచేది ఏమి లేదు అని ఎక్కువ మంది అబిప్రాయం.

    రిప్లయితొలగించండి
  4. మీరుసినిమాల గురించి నవతరంగంలో రాయండి ,,ఇక్కడ అవి చూడగానే నిరాశగా ఉంటది .

    రిప్లయితొలగించండి
  5. @ఉమాశంకర్, durgeswara, మార్తాండ, Krishna Rao Jallipalli, చిన్ని: ధన్యవాదాలు. నా ఆసక్తులలో సినిమా కూడా ఒకటి అండి. కాబట్టి సినిమా టపాలు తప్పవు.

    రిప్లయితొలగించండి
  6. The real Terrorists are staying amongs us. The cine directors,producers and writers should be KILLED.

    రిప్లయితొలగించండి
  7. @Sathish: కొన్ని సినిమాలు చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. కాని వాళ్ళేమో జనం చూస్తున్నారు కాబట్టే తీస్తున్నాం అంటారు. మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. మురళి గారు,

    మీరు చెప్పింది నిజమే... sensorboard ఏమి చేస్తుంది అనేది పక్కన పెడితే ఈ సినిమాల వికృత ప్రవర్తన కు మనం ఎంత భాద్యులము అనిపిస్తోంది... పిల్లల చిన్నపటినుంచి వాళ్ళ ముందే సినిమా లు చూసి వాటి గురించి మాట్లాడుకుని పిల్లలకు ఆ లేకి dances నేర్పించి జీవితం లో ప్రపంచం లో మంచి చెడు చెప్పి ఆ రెండిటి ని విడ దడిసి చూడగలగటం నేర్పే తల్లి తండ్రులే ఆ విష వలయం లో పడి పిల్లలను పాడు చేస్తున్నారు అనిపిస్తోంది నాకైతే... ఏమంటారు..

    రిప్లయితొలగించండి
  9. @భావన: ధన్యవాదాలు. చాలా మంది తల్లితండ్రులు 'ఫలానా పిల్లల తలిదండ్రులు' అనే ఉనికి కోసం తాపత్రయ పడుతున్నారని అనిపిస్తోందండి. ఈ క్రమం లో పిల్లల ఆసక్తులను కూడా గమనించడం లేదు వాళ్ళు .

    రిప్లయితొలగించండి