ఆదివారం, ఫిబ్రవరి 08, 2009

ఒక వి'చిత్రం'

మూడు సినిమాలు..వాటిని తీసింది ఆయా కాలాల్లో పెద్ద పేరు తెచ్చుకున్న దర్శకులు..ఆ మూడు సినిమాలూ గొప్ప పేరు తెచ్చుకోడమే కాదు..ఇప్పటికీ ఏదో విధంగా చర్చల్లో ఉంటాయి. మరి విచిత్రం ఏమిటి? ఆ మూడు సినిమాల కథా ఒక్కటే! ఒకే మూల కథని కాల మాన పరిస్థితులకి అనుగుణంగా మార్పులు చేసి, తెరకెక్కించి ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు విజయాన్ని చవిచూడడం అంటే చిన్న విషయం కాదు కదా.

మొదటి సినిమా వాహిని వారి 'మల్లీశ్వరి.' 1951 లో విడుదలైన ఈ చిత్రానికి బి.ఎన్. రెడ్డి దర్శకుడు. భానుమతి, ఎన్.టి.ఆర్. నాయికా నాయకులు. సాలూరి రాజేశ్వర రావు సంగీతం లో దేవులపల్లి కృష్ణ శాస్త్రి రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. శిల్పి నాగరాజు మరదలు మల్లీశ్వరి అల్లరిపిల్ల. బావ మరదళ్లిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనగా మల్లీశ్వరికి రాణివాసం అవకాశం వస్తుంది. కొంత విరహం తరువాత బావా మరదళ్లిద్దరూ ఏకం కావడం తో సినిమా ముగుస్తుంది. ఈ సినిమా కథ విషయం లో కొంత అయోమయం ఉంది. 'బుచ్చిబాబు' రచన అని కొందరూ, Illustrated Weekly లో వచ్చిన కథ అని కొందరూ, ఆ రెంటినీ కలిపి బి.ఎన్. కథను తయారు చేశారని మరికొందరూ అంటారు. ఏమైనప్పటికీ ఈ సినిమా పెద్ద హిట్. ఇప్పటికీ వంక పెట్టలేని సినిమా.

ఇదే ఇతివృత్తంతో కళాతపస్వి కె. విశ్వనాథ్ తీసిన సినిమా 'సీతామాలక్ష్మి.' 1978 లో విడుదలైన ఈ సినిమాకి విశ్వనాథె కథ సమకూర్చారు. మాటలు జంధ్యాల రాశారు. కె. వి. మహదేవన్ సంగీతం. 'మల్లీశ్వరి' కి పాటలు రాసిన దేవులపల్లి ఈ సినిమాకి కూడా కొన్ని పాటలు రాశారు. తాళ్ళూరి రామేశ్వరి, చంద్రమోహన్ ముఖ్య పాత్రలు పోషించారు. వీళ్ళిద్దరూ ఓ టూరింగ్ టాకీస్ లో పనిచేస్తూ ప్రేమలో పడతారు. పెళ్లి సమయానికి నాయికకి సినిమా హీరోయిన్ గా అవకాశం వస్తుంది. నాయికా నాయకుల మధ్య దూరం పెరుగుతుంది. సిని నటిగా తన కెరీర్ ను నాయకుడి కోసం వదులుకుని నాయిక మళ్ళీ పల్లెటూరి సీతామాలక్ష్మి గా మారిపోవడం ఈ సినిమా కథ. అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్. పాటలు ఇప్పటికీ సిని సంగీత ప్రియుల ఇళ్ళల్లో వినిపిస్తూ ఉంటాయి.

ఇక మూడో సినిమా సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'రంగీలా.' ఈ హిందీ సినిమాని 'రంగేళి' పేరుతో తెలుగులో విడుదల చేశారు. 1995 లో విడుదలైన ఈ సినిమాకి కథ రాంగోపాల్ వర్మ సమకూర్చారు. ఊర్మిళ ప్రధాన పాత్ర పోషించగా, ఆమెని ఆరాధించే పాత్రలో అమీర్ ఖాన్, సిని దర్శకుడిగా జాకీ ష్రాఫ్ కనిపిస్తారు. ఐతే ఇక్కడ నాయకుడు అమీర్ ఖాన్ ది వన్ సైడ్ లవ్. మధ్య తరగతి అమ్మాయి అయిన నాయిక తన చిరకాల స్వప్నమైన సిని నటి కావాలనే కోరిక ఎలా నిజం చేసుకుందన్నదే ఈ సినిమా. రెహమాన్ సంగీతంలో 'యాయిరే' పాట దేశాన్ని ఓ ఊపు ఊపింది. సినిమా కూడా పెద్ద హిట్.

ఇంతకీ ఇలా ఎందుకు జరిగింది? కేవలం యాదృచ్చికమేనా? కథల కొరత ఉండడం వల్లనా? లేక హిట్ సెంటిమెంట్ తోనా? బి.ఎన్. సినిమాను తరువాతి కాలం లో ప్రముఖులైన ఇద్దరు దర్శకులు మళ్ళీ తీయడం ఆ సినిమా మీద వారికిగల ప్రేమను సూచిస్తుందా? ఇదే కథతో గత సంవత్సరం కొత్త తారలతో 'ఇట్లు నీ వెన్నెల' అనే సినిమా వచ్చింది. చిత్రీకరణ లో లోపాలవల్ల ఆ సినిమా హిట్ కాలేదు. గుర్తు పెట్టుకునే పాటలు కూడా అందులో లేవు.

8 కామెంట్‌లు:

  1. మీరు చెప్పిన ఈ మూడిట్లలో నేను 'సీతామాలక్ష్మి. మాత్రం చూసాను. అందులో రావికొండల రావు, తాళ్ళూరి రామేశ్వరి, చంద్రమోహన్ మధ్యన సాగే "మావి చిగురు తినగానే,..." పాట నాకు చాలా ఇష్టం. ఇకపోతే ఈ కథని తిరిగి వాడటం నిరంతర వాహిని మన సినీలోకంలో. ఇవొక్కటే కాదు మరెన్నో సినిమాలు ఈ మూస కోవలోకి వస్తాయి. కాకపోతే కొన్నిటి కథనం చెప్పే తీరు, నటినటుల ప్రభావం మనకి ఆ విషయాన్ని పెద్దదిగా చూపవు. ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  2. యాధృచ్చికమా పాడా? కధ డిస్కషన్లు జరిగేటప్పుడు దాదాపు అదేకధతో సినిమా అంతకుముందే వచ్చినట్లు వాళ్ళకు తెలియదనుకోను..

    ఇంకా చాలా సినిమాలు ఈ కోవలోకొస్తాయి. పేర్లు చెప్పాలంటే కష్టం గానీ, కొన్నిట్లో హీరోయిన్ సింగర్గానో, నవలా రచయిత్రి గానో, సినిమా హీరొయిన్ గానో పేరుతెచ్చుకోవడం, ఇద్దరిమధ్య దూరం పెరగడం..

    చెట్లు పుట్లెమ్మట తిరిగే నార్మల్ త్రికోణం ప్రేమకధల కంటే ఇవి కొంత బెటరు.... కనీసం కధలో ఇన్వాల్వ్ అవటానికి ఎంతో కొంత ఆస్కారం ఉంటుంది, తెలిసిన కధే అయినా..

    రిప్లయితొలగించండి
  3. @ఉష: రావి కొండల రావు కాదండి, వంకాయల. మీకు ధన్యవాదాలు.
    @ఉమా శంకర్: విశ్వనాధ్, వర్మ భావ దారిద్ర్యం ఉన్న కథకులు/దర్శకులు కాదండి. కాని వాళ్ళే ఇలా చేయడం... మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. మురళి గారూ, నా వ్యాఖ్య కి చిన్న సవరణ,

    నా పై వ్యాఖ్య లో ఉద్దేశం, కధలు మూస కధలనే. కధ పాతదైనా కొత్తగా చూపించిన దర్శకులందరికీ హేట్సాఫ్. కాదంటారా?

    రిప్లయితొలగించండి
  5. @ఉమాశంకర్: కాదని ఎలా అనగలనండి?

    రిప్లయితొలగించండి
  6. ఈ మూడు సినిమాలు నేను చూళ్ళేదు ఇప్పటి దాకా :(
    కథ ఒకటే అయినా.. చుట్టూ పరిస్థితులు మార్చెయ్యడం వల్ల, కథనంలో మార్పుల వల్ల అన్నీ హిట్ అయ్యాయేమో..!!

    రిప్లయితొలగించండి
  7. @మధురవాణి: సో, మీరు 'చదువుల తల్లి' అన్నమాట., మాలాగా పుస్తకాలు, సినిమాలు అనకుండా బుద్ధిగా చదువుకున్నారు కదా..

    రిప్లయితొలగించండి