గురువారం, ఫిబ్రవరి 27, 2020

హంపీ యాత్ర - 4

(మూడో భాగం తర్వాత)

"ఆ రాణీ ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు.." చరిత్ర సారం కాదని మహాకవి శ్రీశ్రీ అంటే అని ఉండొచ్చుగాక, శ్రీకృష్ణదేవరాయలు తన దేవేరులని ఎంతగా ప్రేమించాడో తెలియాలంటే మాత్రం వాళ్ళు నివసించిన అంతఃపురం తాలూకు అవశేషాలని సందర్శించాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే రక్షణ, సౌకర్యం, సౌందర్యాల కలగలుపు ఆ అంతఃపురం. రక్షణ అనగానే 'రాణుల్ని వేరే రాజెవరో ఎత్తుకుపోకుండా' అనే ఆలోచన వచ్చెయ్యక ముందే ఇంకో విషయం చెప్పేసుకోవాలి. అంతఃపురంలో ఓ వైపున ఉన్న శిధిలాలు 'ఖజానా' భవనానివి అంటోంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. అయితే, ఆ ఖజానా విజయనగర సామ్రాజ్యం మొత్తానిదా, లేక కేవలం రాణులది మాత్రమేనా అనే విషయంలో స్పష్టత లేదు. (విజయనగర రాణులు స్వయంగా ఖజానా నిర్వహించుకున్నారన్న వాదన ఒకటి ఉంది, పుట్టింటి ఆరణాలో లేక చీటికీ మాటికీ చెయ్యి చాపే అవసరం లేకుండా మహారాజు చేసిన ఏర్పాటో మరి). 

స్థానికంగా 'జనానా' అని పిలుచుకునే ప్రాంగణం ముందు ఆటో దిగి, లోపలి అడుగుపెడుతూ ఉండగానే ఎస్. వరలక్ష్మి, దేవిక, ఎల్. విజయలక్ష్మితో కలిసి జమిలిగా గుర్తొచ్చారు 'తిరుమల తిరుపతి వెంకటేశ్వరా..' పాడుకుంటూ. చుట్టూ ఎత్తైన ప్రహరీ ఉన్న సువిశాలమైన ప్రాంగణంలో ఎడమ చేతివైపు చివర ఒక మ్యూజియం ఉందని చెప్పింది ఆర్కియాలజీ వారి మేప్. మ్యూజియంకి ముందే ఖజానా తాలూకు శిధిలాలు, వాటికి పార్లల్ గా అంతఃపురం తాలూకు శిధిలాలు (కేవలం పునాది మాత్రమే మిగిలింది), అంతఃపురం ఎదురుగా చిన్న కొలను, ఆ కొలను ఒడ్డున లోటస్ మహల్ అని పిలవబడే పద్మ మందిరం, ప్రాంగణం రెండో చివర సైనికుల విశ్రాంతి మందిరం, ఏనుగుల మహాలూ ఉన్నాయి. ప్రహరీ దాటి బయటికి వెళ్తే వరుసగా హిందూ, జైన ఆలయాలు. ఖజానా పునాదుల్లో చూసేందుకు ఏమీ లేదు కనుక, మ్యూజియం వైపు వెళ్తే అంతఃపురంలో  వాడిన వస్తువుల తాలూకు శకలాలు కనిపించాయి. ఒకప్పుడు అది అంతఃపురం తాలూకు కొట్టుగది అనీ, కిరాణా సరుకులు నిల్వ చేసేవారని చెప్పింది, అక్కడ పనిచేస్తున్నావిడ. 

పద్మ మందిరం 

అంతఃపురపు పునాది దిబ్బ చుట్టూ ప్రదక్షణ చేసినా, ఆనాటి అత్తరు వాసనలేవీ నా నాసికని తాకలేదు. నీళ్లు లేని కొలనులో పెరిగిపోయిన గడ్డిని కోస్తున్నారు ఆర్కియాలజీ వారు ఏర్పాటు చేసిన మెయింటెనెన్స్ వర్కర్స్. పద్మ మందిరం కేవలం ఆకారాన్ని మిగుల్చుకుంటే, ఏనుగుల మహాలూ, సైనికుల విశ్రాంతి మందిరమూ కాల పరీక్షలని తట్టుకుని మరీ ఠీవిగా నిలబడ్డాయి. రంగులోనూ, రూపులోనూ కలువపువ్వుని గుర్తు చేసే పద్మ మందిరం నిర్మాణం మరో ఇంజినీరింగ్  అద్భుతం. వేసవిలో రాణిగారి శీతల విడిది ఆ చిన్న భవనం. బయటి అన్నివైపులా నుంచీ నిరంతరం పరిచారికలు భవనాన్ని నీళ్లతో తడుపుతూ ఉంటే, లోపల విశ్రాంతి తీసుకుంటున్న రాణీకి సహజసిద్ధమైన ఏసీ ఏర్పాటయ్యేదట! మిగిలిన కాలాల్లో సంగీత, నృత్య ప్రదర్శనాల్లాంటి వినోదాలు జరిగేవట అక్కడ. నాటి శిల్పుల సౌందర్య దృష్టికీ, పనితనానికీ మరో ఉదాహరణ ఈ మందిరం. 

పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించిన ఏనుగుల మహల్ ఎంత ముద్దుగా అనిపించిందంటే, చూసినకొద్దీ చూడాలనిపించింది. సైజుల వారీగా ఏనుగుల కోసం గదులు, మేత, నీళ్లు అందించే ఏర్పాట్లు, ఒక్క మాటలో చెప్పాలంటే ఏనుగుల మనస్తత్వాన్ని, అవసరాలని కాచి వడబోసి అప్పుడు ప్లాన్ చేసి ఉంటారు ఈ నిర్మాణాన్ని. అంతేకాదు, కావలి వాళ్ళు రాత్రి వేళల్లో ఆ భవనం పైనుంచి పహారా కాసేందుకు వీలుగా మెట్లు కూడా ఉన్నాయి. సైనికుడు అనగానే ఎత్తుగా, బలంగా ఉండే రూపం గుర్తొచ్చినట్టే, ఆ సైనికుల విశ్రాంతి కోసం నిర్మించిన భవనం కూడా బాగా ఎత్తుగానూ, బలంగానూ ఉంది. కనీసం యాభై మంది సైనికులు ఒకేసారి విశ్రాంతి తీసుకుందుకు సరిపోయేట్టుగా ఉంది. వెనుక ద్వారం నుంచి బయటికి వెళ్తే వరసగా ఆలయాలు. కేవలం రాణి కోసం నిర్మించినట్టుగానే ఉన్నాయి. జైనాలయం వాస్తు మిగిలిన వాటికన్నా ప్రత్యేకంగా ఉంది. రథంలోనో, మేనాలోనో క్వీన్స్ బాత్ కి వెళ్లొచ్చి, ఈ ఆలయాలన్నీ వరసగా దర్శించుకునేసరికి రాణికి రోజు గడిచిపోయేదేమో అనిపించింది. పక్కలో బల్లెంలా శతృభయం వెంటాడుతూనే ఉంటుంది కదా పాపం. 

ఏనుగుల మహల్ 

హోటల్లో చెకవుట్ చేసి, హోస్పేట రైల్వేస్టేషన్ కి ప్రయాణం, ఆటోలో. డ్రైవరు ఉత్సాహవంతుడైన యువకుడు, కొత్తగా ఆటో కొనుక్కున్న వాడూను. దారిలో రెండు మూడు స్థానిక ఆలయాల దగ్గర ఆపాడు. టైం ఉండడంతో హోస్పేట డామ్ కూడా చూపించాడు. చెప్పకపోడమేం, అవన్నీ కూడా 'హంపిని చూసిన కళ్ళతో...' అనిపించాయి. నేను చూడాలనుకున్న ఆనెగొంది కోట మాత్రం చూడలేక పోయాను, అది ప్రయివేటు ప్రాపర్టీ అన్నాడు డ్రైవరు. దారంతా రాయల సామ్రాజ్యాన్ని పరికించి చూస్తే, అప్పుడు ఎలా ఉండేవో కానీ ఇప్పుడు తుంగభద్ర కాల్వల పుణ్యమా అని మాగాణులుగా మారిన నేలలు, వాటికి అంచులుగా కొండలు, గుట్టలు. అప్పటి గుర్తులుగా రోడ్డు పక్కన అక్కడక్కడా బాటసారుల కోసం రాళ్లతో కట్టిన సత్రవులు. వాటిని చూస్తూనే నాలుగు రోజులుగా చుట్టి వచ్చిన నిర్మాణాలన్నీ ఒక్కసారి కళ్ళముందు కదిలాయి. ఎందుకు కట్టించి ఉంటారు అన్నేసి గుడులూ, గోపురాలూ? కేవలం దైవభక్తి, కళాభిరుచి మాత్రమేనా, ఇంకా ఏమైనా కారణం ఉండి ఉంటుందా? అన్న ఆలోచన వచ్చింది. 

రాజ్యంలో శాంతిభద్రతలు కాపాడడం రాజు విధి. ప్రజలందరికీ చేతినిండా పనులున్నప్పుడు మాత్రమే కొట్లాడుకోకుండా, సామరస్యంగా ఉంటారు. కేవలం వ్యవసాయం తప్ప పరిశ్రమలేవీ లేని ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ఉపాధి చూపించాలి, అది కూడా స్థానిక వనరులతో అంటే, రాతి నిర్మాణాలని మించిన ప్రత్యామ్నాయం దొరికి ఉండదు. ఖజానాలో ఎంత డబ్బున్నా, ప్రజలకి ఊరికే పంచడం అనే పధ్ధతి ఆనాటికి అమల్లోకి రాలేదు కదా. రాజు తల్చుకుంటే దెబ్బలకే కాదు, నిర్మాణాలకీ కొదవ ఉండదు. ఇప్పటి కాలేజీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఉత్పత్తి చేస్తున్నట్టుగా, అప్పటి గురుకులాలు శిల్పులని తయారు చేసి ఉంటాయి బహుశా. ఇప్పుడు "మావాడు సాఫ్ట్వేర్" అని చెప్పుకున్నట్టే, అప్పటి తల్లిదండ్రులు "మావాడు శిల్పి" అని గర్వంగా చెప్పుకుని ఉంటారు.  నిర్మాణాలు పెంచమని రాజాజ్ఞ అయినప్పుడు, అందులో వైవిధ్యం చూపించడం భృత్యుల బాధ్యత కదా. స్థానికంగా దొరికే రాయితో పాటు, ఓరుగల్లు రాజ్యం నుంచి నల్లరాతినీ తెప్పించి ఉంటారు. 

సైనికుల విశ్రాంతి మందిరం 

చూసిన నిర్మాణాలని ఈ ఆలోచనతో లంకె వేసినప్పుడు, ఎన్నివేల మంది శిల్పులకి, పనివాళ్లకి ఎన్నేళ్లపాటు గౌరవప్రదమైన ఉపాధి దొరికి ఉంటుందో కదా అనిపించింది. వేలల్లో కాకపోయినా, ఇప్పటికీ నిత్యం వందల మందికి ఉపాధి ఇస్తున్నాయి హంపీ శిధిలాలు. టూరిస్టు బస్సులు, క్యాబ్లు, ఆటో డ్రైవర్లు, హోటళ్ల వాళ్ళు మొదలు టూరిస్టు గైడ్లు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలు పొందిన సెక్యూరిటీ గార్డులు, మెయింటెనెన్స్ సిబ్బంది వరకూ అనేకమంది ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. పరోక్షంగా ఆదాయం పొందుతున్న వాళ్ళ వివరాల్లోకి వెళ్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. పర్యాటకుల విషయానికి వస్తే, భారతీయుల సంఖ్యకి సమంగా (కొన్నిచోట్ల ఎక్కువగా) విదేశీయులు కనిపించారు. 

కానీ సౌకర్యాలని చూస్తే నిరాశ కలిగింది. చాలా సైట్లకి కనుచూపు మేరలో టాయిలెట్ సౌకర్యం లేదు కనీసం. అయితే, రోడ్లు, నడక దారులూ కూడా బాగున్నాయి. మిగిలిన పర్యాటక ప్రాంతాలతో పోల్చినప్పుడు స్థానికులు మంచి వాళ్ళుగా, సహాయం చేసేవాళ్లుగా అనిపించారు. మొత్తం ప్రయాణంలో ఒకరిద్దరు మినహా మిగిలిన ఆటోడ్రైవర్లు రీజనబుల్ ఫేర్లే అడిగారు. నాలుగురోజుల హంపీ ట్రిప్ అంటే "అన్నాళ్ళు ఎందుకు?" అన్నవాళ్లున్నారు. కానీ, నాకేమో చూడాల్సినవి, మళ్ళీ మళ్ళీ చూడాల్సినవి ఎన్నో మిగిలే ఉన్నాయి అనిపించింది. నా సింహావలోకనంలో నేనుండగానే రైల్వే స్టేషన్ వచ్చేసింది. "మేము హోమ్ స్టే కూడా పెడుతున్నాం. ఈసారి మా దగ్గరే ఉందురుగాని. నా ఫోన్ నెంబర్ రాసుకోండి సార్..." ఆటోడ్రైవర్ మాటల్ని రైలుకూత మింగేసింది. 

(అయిపోయింది) 

ఎన్నాళ్ళుగానో వాయిదా పడుతూ వస్తున్న హంపీయాత్ర మరో వాయిదా పడకుండా కార్యరూపం దాల్చేందుకు దోహదం చేసిన కొత్తావకాయ గారికి కృతజ్ఞతలు... 

బుధవారం, ఫిబ్రవరి 26, 2020

హంపీ యాత్ర - 3

(రెండో భాగం తర్వాత) 

"అందమైన ఈ హంపీ పట్టణమంతా మూడు నెలలపాటు దట్టమైన పొగల్లో ఉంది సార్. వాళ్ళు విగ్రహాలు పగలగొట్టారు, గోపురాలని కూల్చేశారు. నగలన్నీ దోచుకున్నారు. అయినా కూడా ఇంకా ఏదో మిగిలిపోయింది. హంపీని నామరూపాలు లేకుండా చేయందే ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అనుకున్నారు. కలప ఉన్న ప్రతి నిర్మాణానికీ నిప్పు పెట్టి అప్పుడు కదిలారు. జనమంతా కట్టుబట్టలతో పారిపోయారు. హంపి ఒక పెద్ద శ్మశానంగా మారిపోయింది..." గుక్క తిప్పుకోడం కోసం ఆగాడు టూరిస్టు గైడు. అభావంగా ఉన్నాడతను. అప్పటికి అరగంట నుంచీ మాట్లాడుతూనే ఉండడం వల్ల కలిగిన అలసట తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం పర్యాటక శాఖ వారు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పాల్గొని, గైడుగా అర్హత సంపాదించుకున్నవాడు. వాళ్ళు నేర్పిన చిలక పలుకులే కాకుండా ఇంకా ఏదో చెప్పాలనే తాపత్రయం ఉన్నవాడు. చేస్తున్న వృత్తిమీద గౌరవంతో పాటు, ఆ వృత్తికి కారణమైన శ్రీకృష్ణ దేవరాయల మీద ఆరాధన గోచరించింది అతని మాటల్లో. 

హంపీ అనగానే మొదట గుర్తొచ్చేది ఏకశిలా రథం. ఆ రథం ఉన్నది విశాలమైన విజయ విఠల ఆలయ ప్రాంగణంలో. యాత్రలో మూడో రోజు ఉదయం అడుగుపెట్టింది ఆ ఆలయ ప్రాంగణంలోనే. రోజూలాగే తెలుగు మాట్లాడే  ఆటో డ్రైవరే దొరికాడు. అందరు డ్రైవర్లలాగే హంపీ కథలెన్నో చెబుతూ, ఇరవై నిమిషాల్లోనే గమ్యస్థానంలో దించేసి వెళ్ళిపోయాడు. అప్పుడే తెలిసిన విషయం ఏమిటంటే, నేరుగా విఠలాలయం దగ్గరికి బయటి వాహనాలు వేటినీ అనుమతించరు. ఒక కిలోమీటరు దూరంలోనే ఆపేస్తారు. అక్కడి నుంచి నడిచి వెళ్లొచ్చు, లేదా అందరూ మహిళలే నడిపే చిన్న చిన్న బేటరీ కార్లలో టిక్కెట్టు కొనుక్కుని వెళ్లొచ్చు. ఉదయపు వాతావరణం ఆహ్లాదంగా అనిపించడంతో నడకకే ఓటు పడింది. ఫలితం, దారిలో మరో రెండు చారిత్రక నిర్మాణాలని చూసేందుకు వీలయింది. వాటిలో ఒకటి 'గజ్జెల మండపం,' ఎందరు నర్తకీమణులు నాట్యం చేశారో అక్కడ. మరొకటి, బాటసారుల కోసం కట్టించిన సత్రం లాంటి నిర్మాణం, ఎదురుగా కోనేరు. ఆశ్చర్యం ఏమిటంటే, అక్కడ కూడా తమ కళా నైపుణ్యం ప్రదర్శించారు విజయనగర శిల్పులు.


అనుకోకుండా జర్నలిస్టు అరుణ మళ్ళీ కలిశారు. అనేగొంది లో ఉన్న ఆర్కియలాజికల్ సైట్ లోకి పర్యాటకులని ఆపేశారని, ఆ శాఖ ఉన్నతాధికారులకి తను మెయిల్ రాశానని చెబుతూ  డిపార్ట్మెంట్ ని తిట్టిపోశారు. విఠలాలయంలో గైడ్ ని ఏర్పాటు చేసుకోమని మళ్ళీ గుర్తు చేస్తూ, తను గజ్జెల మండపం దగ్గర నోట్స్ రాసుకోడానికి ఆగిపోయారు. టిక్కెట్టు కొనుక్కుని ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా, కుమారి పద్మ మళ్ళీ గుర్తొచ్చింది. జేసుదాసు గొంతుతో రవీంద్రబాబు 'నవరస సుమమాలికా..' అని పాడుతూ ఉండగా, రథం పక్కన, స్థంభాల మధ్యనా పరవశంగా నర్తించిన పద్మ. ఒక్క 'అందాలు అలలైన మందాకిని..' చరణంలో హేమకూటాన్ని పావనం చేసింది తప్ప, మిగిలిన పాటంతటికీ ఎండని సైతం లెక్కచేయకుండా ఇక్కడే కదా నర్తించింది. చాలా విశాలమైన ఆవరణలో ఉంది విఠలాలయం. ఇంకా సందర్శకుల తాకిడి ఊపందుకోలేదు. లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా రాతి రథం. రకరకాల మండపాలు. చుట్టూ ఎత్తైన ప్రాకారం. గైడు కోసం వాకబు చేస్తుంటే, ఓ హిందీ గైడు తెలుగతన్ని పరిచయం చేశాడు.

గైడు చెప్పిన ఆలయపు శిల్ప రహస్యాలు కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తే, మరికొన్ని నమ్మశక్యం అనిపించలేదు. రాతి స్థంభాల నుంచి సంగీతం ఎలా పలికించేవారో స్వయంగా పలికించి చూపించాడు. ఆ కాసేపూ సెక్యూరిటీ వాళ్ళెవరూ ఆ దాపులకి రాకుండా అతనికి సహకరించారు. విదేశీ వర్తకుల నుంచి శ్రీకృష్ణ దేవరాయలు గుర్రాలని కొనుగోలు చేయడం మొదలు, ఆలయం బయటి బజారులో రత్నాలు రాశులుగా పోసి అమ్మడం వరకూ తాను స్వయంగా చూసినంత నమ్మకంగా చెప్పాడు. సాక్ష్యంగా కొన్ని రాతి శిల్పాలని చూపించాడు. వాటిలో కొన్ని విదేశీ వర్తకులవి, మరికొన్ని గుర్రాల వ్యాపారులవి. చిన్నాదేవి జన్మతః దేవదాసీ కనుక ఆమెకి గుడి మండపంలో నృత్యం చేసే సెంటిమెంట్ ఉండేదనీ, అయితే ఆమె రాణీ కాబట్టి సామాన్యులెవరూ ఆమె నృత్యం చూడకుండా ఉండేదుకు మండపం చుట్టూ తెరలు కట్టేవారనీ చెబుతూ, అందుకోసం చేసిన ఏర్పాట్లని చూపించాడు. ఒక్క రాయలుకి మాత్రమే ఆమె నాట్యం చూసే అవకాశం ఉండేదట. "ఇవన్నీ మీకు ట్రైనింగ్ లో చెప్పారా?" అని అడిగితే అవునన్నాడు.


ఉన్నట్టుండి సందర్శకుల తాకిడి పెరిగింది. రథం దగ్గర ఫోటోలు, సెల్ఫీలు తీసుకుని తిరుగు ముఖం పట్టిన వాళ్ళు కొందరైతే, మండపాల్లో మరికొన్ని ఫోటోలు తీసుకుని తర్వాతి సైట్ కి పరుగులు పెట్టిన వాళ్ళు మరికొందరు. ఓ గుజరాతీ ఆవిడ మాత్రం చాలా తాపీగా ఒక్కో స్థంభాన్నీ ఫోటోలు తీసుకున్నారు, భర్తే కాబోలు - బ్యాగ్ మోస్తూ మధ్య మధ్యలో ఆవిడకి నీళ్ళూ, బిస్కట్లూ భక్తిగా అందిస్తున్నాడు. "ఏకశిల రథముపై లోకేష్ ఒడిలోన అని నాగేశ్వర్ రావు పాడాడు కానీ సార్, ఇది ఏకశిలా రథం కాదు. ప్రతి పార్టుని విడగొట్టి మళ్ళీ అసెంబుల్ చేయొచ్చు. టూరిస్టులు పాడు చేసేస్తారని చక్రాలని సిమెంట్ తో అతికేశారిప్పుడు," చెప్పాడు గైడు. రథాన్ని దగ్గర నుంచి చూస్తుంటే, ఇలాంటి రథం పక్కనే ఓ రాత్రివేళ 'మౌనమేలనోయి..' అని పాడుకున్న మాధవి గుర్తొచ్చింది. గైడుతో అంటే ఈ రథాన్ని చూసి గజపతులు కోణార్క్ లో ఆ రథాన్ని చేయించి ఉంటారని అభిప్రాయ పడ్డాడు. ప్రధాన ఆలయంలోనూ, ఉపాలయాల్లోనూ కూడా దేవతా విగ్రహాలు లేవు. స్థంభాల మీద చెక్కడం పని మాత్రం చెక్కుచెదరలేదు. 

ఆలయ ప్రాంగణం బయట ఉన్న అతిపెద్ద బజారుని పురావస్తు శాఖవారు పునర్నిర్మించారని తెలిసింది. వెనుకవైపు సత్రాలు శిధిలావస్థలో ఉన్నాయి కానీ, రాయలు తులాభార స్థంభాలు మాత్రం ఠీవిగా నిలబడి ఉన్నాయి. ఆవరణంతా కలియతిరిగి బయటికి వచ్చేసరికి, మళ్ళీ రోడ్డు వరకూ నడిచే ఓపిక లేకపోయింది. బేటరీకారు ప్రయాణం తప్పలేదు. విఠలాలయానికి తీసుకున్న టిక్కట్లతోనే లోటస్ మహల్ ఉన్న రాణుల అంతఃపురాన్నీ, కమలాపురంలో ఉన్న మ్యూజియంనీ కూడా చూడొచ్చు. మ్యూజియంని ఎంచుకుని అటు వెళ్తే ఖాళీగానే ఉంది. ప్రదర్శనలో ఉంచిన వస్తువులు కూడా ఊహించినన్ని లేవు. ఆయుధాల తాలూకు అవశేషాలూ, శాసనాల తాలూకు శేష భాగాలూ  ఉన్నాయక్కడ. 'మినియేచర్ హంపీ' మాత్రం ప్రత్యేక ఆకర్షణ. చూసేసిన స్థలాలు, చూడాల్సిన విశేషాలు గుర్తు పెట్టుకోడానికి వీలుగా ఉంది ఆ ఏర్పాటు. ప్రవేశ ద్వారం దగ్గర రాయలు, ఇద్దరు రాణుల విగ్రహాలు తిరుమల ఆలయాన్ని గుర్తు చేశాయి.


మయూర భువనేశ్వరిలో వసతి బాగానే ఉంది కానీ, తిండి బొత్తిగా బాలేదు. అంతకు మించి అక్కడెక్కడా ఏమీ దొరికే వీలూ కనిపించలేదు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరి వెళ్తే, వెళ్లిన చోట మధ్యాహ్నానికి కాయో, పండో తినడం, సాయంత్రం తిరిగొచ్చాక పూర్తిస్థాయి డిన్నర్ చేయడం. తిండి, తిరుగుడు షెడ్యూల్లో ఒక్కసారిగా వచ్చిన మార్పు మూడోరోజుకి బయటపడింది. కాస్త తొందరగానే విశ్రాంతికి ఉపక్రమించి, "ఇంతకీ హంపీని ఎవరు ధ్వంసం చేశారు?" అన్న నా ప్రశ్నకి గైడు చెప్పిన జవాబుని జ్ఞాపకం చేసుకున్నాను. "కొడుకు మరణంతో రాయలు దెబ్బతిని ఉన్నాడు. అప్పటికే మంత్రి తిమ్మరుసు దూరమయ్యారు. దీనితో శతృ నవాబులందరూ ఒక్కటై దండెత్తారు. ఎంత దోచుకున్నారో లెక్కే లేదు. దోచుకోడంతో ఆగలేదు. రాయలు మీద అసూయతో హంపిని సర్వనాశనం చేయాలనుకున్నారు. అందమైన విగ్రహాలు పగలగొట్టారు, ఫిరంగులతో మండపాలు పేల్చారు. ఇక్కడి జనాన్ని వాళ్ళు ఎంత భయపెట్టారంటే, మళ్ళీ ఇంగ్లీష్ దొరలు వచ్చి ఈ నిర్మాణాలు గుర్తించే వరకూ మనుషులెవరూ ఇక్కడికి రాలేదు సార్. రాయలుతోనే హంపి వైభవం అంతా పోయింది..." ..హంపీ వచ్చి మూడురోజులు గడిచిపోయాయి. 

(ఇంకా ఉంది) 

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020

హంపీ యాత్ర - 2

(మొదటి భాగం తర్వాత..) 

"ఒంపుల హంపీ శిల్పమా.. బాపూ గీసిన చిత్రమా.. అందమా నీ పేరేమిటి.. అందమా..." ఎంత చమత్కారి వేటూరి?!! ఆయన పాటల్లో నిగూఢమైన అర్ధాలుంటాయని తెలుసు కానీ, వాటిని అర్ధం చేసుకోడానికి ఇంతలేసి దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని అస్సలు ఊహించలేదు. నేనున్నది హంపి నడిబొడ్డున ఉన్న హజార రామస్వామి ఆలయ ప్రాంగణంలో. రామాయణ కథని వెయ్యి శిల్పాలలో వర్ణించి, ఆ శిల్పాలతో ప్రాంగణాన్ని అలకరించినందుకు గాను ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందని ఇతిహాసం. అయితే, ఏ శిల్పాన్ని చూసినా బాపూ బొమ్మే గుర్తొస్తోంది. బాపూ బొమ్మల్ని చూసి ఈ శిల్పాలు చెక్కే అవకాశం లేదు కాబట్టి, ఈ బొమ్మల నుంచి స్ఫూర్తి పొందే బాపూ తన దేవతామూర్తులకు ఆకృతి ఇచ్చి ఉంటారు. దానిని గడుసుగా చెప్పేందుకే హంపీ శిల్పాన్ని, బాపూ చిత్రాన్ని కలగలిపి అందాన్ని వర్ణించి ఉంటారు నిరుపమాన సినీ కవి.

హజార రామస్వామి ఆలయ గోపురం మీది ఒకానొక శిల్పం 

శ్రీకృష్ణ దేవరాయల అంతఃపురానికి చేరువలో ఉందీ ఆలయం. సీతారామలక్ష్మణుల విగ్రహాలని తొలగించినట్టుగా అంతరాలయంలో గుర్తులున్నాయి. రాయల పూర్వీకులు చిన్న ఆలయాన్ని నిర్మిస్తే, అదనపు హంగులన్నీ రాయల కాలంలోనే సమకూరాయంటోంది చరిత్ర. రాముడి బాల్యం నుంచీ వరుసగా ఒక్కో దృశ్యాన్నీ రాళ్ళలో చెక్కిన తీరుని చూడడం మొదలు పెడితే, వరుసగా పూర్తి చేయడానికి లేకుండా మధ్యమధ్యలో సంబంధంలేని విష్ణు కథలు దర్శనమిచ్చాయి. అంతే కాదు, పట్టాభిషేకంతో సహా కొన్ని ముఖ్యమైన సన్నివేశాల తాలూకు శిల్పాలు కనిపించలేదు. రాతిపలకల మీద సన్నివేశాలని చెక్కి, ఆ పలకల్ని గోపురం చుట్టూ అతికించడం తెలిసింది, చాలా జాగ్రత్తగా గమనిస్తే. కేవలం దేవతా మూర్తుల శిల్పాలే కాదు, నాటి జానపదుల జీవన శైలిని సూచించే బొమ్మలూ ఉన్నాయి మధ్యమధ్యలో. 

రామకథని దృష్టిలో ఉంచుకుని ఒక్కో బొమ్మనీ తాపీగా చూస్తూ, శిల్పుల కళా నైపుణ్యానికి అచ్చెరువొందుతూ, కథలో ఏయే సన్నివేశాల తాలూకు బొమ్మలు మిస్సయ్యాయో చూస్తూ ఉండగానే, ఒక్కొక్కటిగా టూరిస్టు బస్సులు ఆగడం, బిలబిల్లాడుతూ వచ్చే టూరిస్టులు క్షణాల్లో ఆలయం మొత్తం చుట్టేసి నాలుగైదు ఫోటోలు తీసుకుని తిరిగి వెళ్లిపోవడం. కొందరైతే ఫోటోలకి అడ్డం వస్తున్నాననుకున్నారో ఏమో, దాదాపుగా తోసినంత పని చేశారు. నాలాంటి అతికొద్ది మంది చాదస్తులు, విదేశీ టూరిస్టులు మాత్రమే ఎక్కువ సేపు గడిపారు ఆ ప్రాంగణంలో. కనిపించిన ప్రతి విషయాన్నీ శ్రద్ధగా నోట్స్ రాసేసుకుంటూ, శిల్పాలన్నింటినీ హడావిడిగా ఫోటోలు తీసేసుకుంటున్న ఒక స్త్రీ తనకి తానుగా వచ్చి పలకరించింది. ఆమె పేరు అరుణ, తమిళనాడుకి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. "విజయ విఠల ఆలయంలో మాత్రం మీరు గైడ్ ని ఏర్పాటు చేసుకోండి," అంటూ సలహా ఇచ్చింది, కొంత సంభాషణ తర్వాత. ఒక్కో ఆలయాన్నీ రెండు మూడు సార్లు వచ్చి చూస్తోందట ఆమె. 

నాట్య భంగిమలు చెక్కిన మండపాన్ని చూడగానే, మళ్ళీ వేటూరి గుర్తొచ్చేశారు, అప్రయత్నంగా. "కలికి చిలక కనిపించదేమే.." అంటూ చుట్టాల సురభి రంగాజమ్మ గారి గొంతు ఖంగుమన్న భావన. ఈ మండపంలోనే కదూ, 'సిరికాకొలను చిన్నది' అలివేణి నాట్యం చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది? ఇక్కడే కదూ, ఆమెకి జరిగిన అన్యాయం రాయలు దృష్టికి వచ్చింది? కల్పితమో కాదో తెలియదు కానీ, అలివేణి కథని వేటూరి చెప్పిన తీరు మాత్రం అపూర్వం. స్థంభాల మీద చెక్కిన నర్తకీమణుల శిల్పాల్లో అలివేణి శిల్పమూ ఉండి ఉంటుందనిపించింది. విజయనగర ఆర్కిటెక్చర్ ప్రత్యేకత ఏమిటంటే, కేవలం దేవుళ్ళ బొమ్మలు, జంతువులు, పక్షుల బొమ్మలతో పాటు, నాటి సంఘంలో అనేక వృత్తులు నిర్వహించిన స్త్రీ పురుషుల బొమ్మల్ని, విదేశీ వర్తకులు, యాత్రికుల బొమ్మల్ని కూడా చెక్కారు ఆలయాల మీద. నాటి జీవితాన్ని వారు రికార్డు చేసిన ఒక పధ్ధతి ఇదై ఉంటుంది బహుశా. 

ఆలయం వెలుపలి గోడల మీద రాళ్లతో చెక్కిన విజయనగర సామ్రాజ్యపు గజ బలాన్నీ, అశ్వ దళాన్నీ పరిశీలిస్తూ ముందుకు నడిస్తే రాయల అంతఃపురం.  అక్కడొకటి ఇక్కడొకటిగా మిగిలిన మహా నిర్మాణపు అవశేషాలు. అవేమిటో వివరిస్తూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన బోర్డులు. ఆ బోర్డుల్లో రాసింది చదువుకుంటూ, అవశేషాలని చూస్తూ, చరిత్రలో ఖాళీలని ఊహాశక్తి మేరకి పూరించుకున్న సందర్భమది. ఎత్తైన నవరాత్రి దిబ్బకి కొంచం దూరంలోనే, లోతైన స్నానఘట్టం. రెండుచోట్లా కళ్ళు చెదిరే రాతి పనితనం. ఆ రోజుల్లోనే తుంగభద్ర నుంచి అంతఃపురానికి నేరుగా నీళ్లు వచ్చేలా చేసిన ఏర్పాటు! ప్రజలు నేరుగా ప్రభువుకి తమ సమస్యలు విన్నవించుకునే అవకాశం, ఆ వేదిక లోపల విదేశీ రాయబారులతో అత్యవసర చర్చలు జరిపేందుకు అవసరమైన అండర్ గ్రౌండ్ ఛాంబర్. ఒక పక్క రాయలు పాలనని బేరీజు వేసుకుంటూనే, మరోపక్క నాటి శిల్పకళని, ఇంజినీరింగ్ అద్భుతాలనీ చూడడం. కళ్ళకీ, మెదడుకీ ఏకకాలంలోనే విపరీతమైన పని.

సామాన్యుల స్నానఘట్టం 

మొత్తం నిర్మాణాల్లో ఇప్పుడు మిగిలి ఉన్నవి కనీసం ఒక వందో వంతైనా ఉంటాయా అన్న సందేహం, వందో వంతే ఇలా ఉంటే ఇక మొత్తం నిర్మాణాలు ఎలా ఉండి ఉంటాయన్న ఆశ్చర్యార్ధకం!! ఎండ ఎక్కువగా ఉండడంతో పాటు, ఫోటోగ్రఫీకి అనువైన లొకేషన్లు లేకపోవడం వల్ల కాబోలు టూరిస్టుల తాకిడి పెద్దగా లేదిక్కడ. ఏకాంతాన్ని వెతుక్కునే జంటలు మాత్రం అక్కడక్కడా తారసపడ్డాయి.  తదుపరి మజిలీ 'క్వీన్స్ బాత్' అని పిలువబడే రాణీ వారల స్నానఘట్టం. బయటి నుంచి చూడ్డానికి పాడుబడిన నిర్మాణం అనిపించింది కానీ, లోపలి పనితనం కళ్ళు మిరుమిట్లు గొలిపింది. మొత్తం చెక్కడం పనిలో ఓ ఇరవై శాతం మిగిలి ఉందేమో. అయితేనేం, కట్టడానికి వాడింది సున్నమా లేక వెన్నా అనిపించేలా ఉంది ఇంటీరియర్ అంతా. గుండ్రటి ఇన్నర్ బాల్కనీ, కింద ఉన్న నీళ్ళలోకి వెళ్ళడానికి వీలుగా మెట్లు. బాల్కనీ అంతా స్నానానికి ముందు, తర్వాత రాణికి చేసే ఉపచారాలకి అనువైన ఏర్పాట్లు.  చాలా ఏళ్ళక్రితం వేసిన సినిమా సెట్టింగ్ లా అనిపించింది. 

ఎవరో పది పదిహేను మంది టూరిస్టులు కలిసి ఒక గైడుని ఏర్పాటు చేసుకున్నారు. ఆ గైడు చాలా ఉత్సాహంగా పెద్ద గొంతుతో వర్ణిస్తున్నాడు. "అత్తరు, పన్నీరు కలిపిన నీళ్లలో రాణీవారు స్నానం చేస్తూ ఉంటే, పరిచారికలు ఈ చుట్టూ నిలబడి రాణి మీదకి పూలు విసిరేవారు.." ఈ మాటలు చెవిన పడ్డంతోనే నవ్వొచ్చింది. "రాఘవేంద్రరావు సినిమాలు చూడ్డం కాస్త తగ్గించబ్బాయ్" అని ఆ గైడుకి సలహా ఇవ్వాలనిపించింది. ఇంతకీ ఈ స్నానఘట్టం ఏ రాణిది? తిరుమల దేవి కోసం కట్టించిందా? చిన్నాదేవి స్నానం చేసేదా? లేక, ఎస్. వరలక్ష్మి, దేవికల్లాగా ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారా? ఏవిటో, నా సందేహాల్ని ఏ గైడూ తీర్చలేడు. అన్నట్టు, ఈ స్నాన వాటికకి కూడా అండర్ గ్రౌండ్ నీళ్ల సరఫరా ఏర్పాటు ఉంది. తుంగభద్రా నీళ్లు మొదట ఇక్కడికి వచ్చి, ఇటు నుంచి రాజాంతఃపురానికి, అటుపైన సామాన్యులకీ సరఫరా అయ్యేలా ఉండేదిట ఏర్పాటు.


క్వీన్స్ బాత్ 

అలిసిపోయి హోటల్ కి వెళ్తే, అతిధుల కోసం శాస్త్రీయ నృత్య కార్యక్రమం ఏర్పాటు  చేశామన్నారు వాళ్ళు. 'కుమారి పద్మ నృత్య ప్రదర్శన కానీ కాదు కదా?' అని సందేహం వచ్చింది కానీ, ఏనాటి పద్మ? స్నానాదికాలు కానిచ్చి, లాన్లో ఏర్పాటు చేసిన వేదిక ఎదుట కూర్చుంటే, భరతనాట్యం నేర్చుకుంటున్న నలుగురమ్మాయిలు అరగంట పాటు నాట్యం చేశారు, ఐదారు పాటలకి. రెండు పాటలు భరతనాట్యం అని తెలిశాయి కానీ, నాలుగు పాటల తాలూకు శాస్త్రం ఏంటో బోధ పడలేదు. వేదిక పక్కనే అప్పటికప్పుడు అదనపు కాస్ట్యూమ్స్ ధరిస్తూ, కొంచం కూడా గ్యాప్ ఇవ్వకుండా నడిపారు ప్రోగ్రాంని. నలుగురూ నెమళ్ళ వేషం వేసుకుని ఓ హిందీ పాటకి చేసిన డేన్స్ మాత్రం భలేగా ఉంది. కార్యక్రమం అయ్యాక, కమల్ హాసన్ టోన్ రాకుండా జాగ్రత్త పడుతూ, ఆ నాలుగు పాటలకీ చేసిన డేన్స్ ఏ సంప్రదాయం అని ఇంగ్లీష్ లోఅడిగాను ఓ అమ్మాయిని. "సెమీ క్లాసికల్ అంకుల్" అని జవాబిచ్చింది మృదువుగానే. నెమళ్ళ పాట ప్రభావం కాబోలు, "నెమలికి నేర్పిన నడకలివీ.." పాడుకుంటూ నిద్రకి ఉపక్రమించాను. రెండో రోజు హంపీ యాత్ర ఆ విధంగా ముగిసింది. 

(ఇంకా ఉంది) 

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

హంపీ యాత్ర - 1

"నా పేరు విరూపాక్ష సార్. నా ఫోన్ నంబర్ రాసుకోండి.." ఎదురుగా నిలువెత్తు గుడి గోపురం, విరూపాక్ష స్వామిది. ఎడమ చేతివైపున రాతిపలకలతో నిర్మించిన బజారు, దానిని ఆనుకునే ఓ కొండ. కుడివైపున మైదానంలో పార్కు చేసిన టూరిస్టు బస్సులు, ఆటోలు. 'ఇదేనా చారిత్రాత్మకమైన హంపీ విరూపాక్ష స్వామి ఆలయం?' నా సందేహంలో నేనుండగానే, నెంబర్రాసుకోమంటూ ఆటో విరూపాక్షుడి గొడవ. ఫోన్లో నెంబర్ ఫీడ్ చేసుకున్నట్టుగా నటించి, అతగాడికి డబ్బులిచ్చి పంపించి నెమ్మదిగా గుడివైపుకి నడుస్తూ ఉండగా పలకరించింది హంపీ గాలి. అవును, అక్కడి గాలి కూడా ప్రత్యేకమే. వినగలిగితే ఎన్నెన్ని కథలూ, గాథలూ వినిపిస్తుందనీ? ఎస్సెల్లార్ కెమెరా సహిత బ్యాక్ ప్యాక్ బరువనిపించడం లేదు. రాత్రంతా ప్రయాణం చేసిన బడలిక లేనే లేదు. రాయల కాలంలోకి నడిచి వెళ్తున్న అనుభూతి కాబోలు.  

పాదరక్షలు స్టాండులో పెట్టి, కెమెరా సహితంగా టిక్కెట్లు కొనుక్కుని, ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే కుడివైపున ఆయుర్వేద డిస్పెన్సరీ పలకరించింది. దీపాలు వెలిగించిన గుర్తుగా నూనె చారికలు కనిపిస్తున్నాయి రాతి నేలమీద. హంపీ పట్టణం మొత్తం మీద ఉన్న ఆలయాల్లో, ఇప్పటికీ నిత్యం ధూప దీప నైవేద్యాలు జరుగుతున్న పురాతన గుడి ఈ విరూపాక్ష స్వామి ఆలయం ఒక్కటే. అప్పుడప్పుడూ గుడి గంటలు వినిపించడమే కాదు, ప్రసాదాలు ఆరగించడం కోసం లెక్కకు మిక్కిలిగా వానరాలూ తిరుగాడుతున్నాయి ఆ ప్రాంగణంలో. ఎన్నో ప్రాచీన నిర్మాణాలు చూసినా, ఈ తరహా వాస్తుని చూడడం ఇదే ప్రధమం. 'విజయనగర ఆర్కిటెక్చర్' అని కదూ దీనికి పేరు. ఎత్తైన గోపురం చిట్టచివరి వరకూ సున్నితమైన పనితనంతో చెక్కిన శిల్పాలు. శిల్పదృష్టితోనే కాదు, గణితశాస్త్రం దృష్ట్యా చూసినా అబ్బుర పరిచే కొలతలతో ఠీవిగా నిలబడ్డ మండపాలు, నిర్మాణాలు. 

ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలనీ, వాటి నిర్మాణన్నీ పరిశీలిస్తూ, కలియతిరిగి, ఓ మండపంలో విశ్రాంతిగా కూర్చోగానే, చెంగున ఎగిరొచ్చిన వానరం కెమెరా లెన్స్ కవర్ ఎత్తుకుపోయి, ఓ స్థంభం మీద కూర్చుని వినోదం చూసింది. 'నేన్నీకు మునిమనవడి వరస' అని ప్రవర చెప్పుకుంటే, కనికరించి, కవరు తిరిగిచ్చింది. ప్రవేశ ద్వారానికి అభిముఖంగా బయటికి వెళ్లేందుకు రాతి గుమ్మం, ఆనుకునే కోనేరు. కనుచూపు మేరలో కనిపిస్తున్న తుంగభద్రా నది. అప్రయత్నంగానే అడుగులు ఆ నదివైపుకు సాగాయి. నాగరికతలన్నీ నదీతీరాన్నే వెలిశాయని చెబుతుంది చరిత్ర. ఆ ప్రకారం చూసినప్పుడు, మహోన్నతమైన విజయనగర నాగరికత వికసించేందుకు దోహదం చేసిన నది ఈ తుంగభద్ర. సగం దూరం నడిచి రెండు పక్కలా చూస్తే, ఒకవైపు ఎత్తైన విరూపాక్ష ఆలయ ప్రాకారం, గోపురం, మరో వైపు తుంగభద్ర. అనుభూతిని అక్షరాల్లో తర్జుమా చేయటానికి ఈ యాత్రలో చేసిన మొట్టమొదటి విఫల ప్రయత్నం బహుశా ఇదే. హంపిలో గడిపినంత కాలమూ ఎన్నెన్ని విఫల యత్నాలు జరిగాయో లెక్కేలేదు. అడుగులు తుంగభద్ర వైపే పడ్డాయి.

హేమకూట పర్వతం నుంచి విరూపాక్ష దేవాలయం 

ఎండ కాస్త తీక్షణంగా ఉన్న ఆ మధ్యాహ్నం వేళ, తన సహజ ధోరణిలోనే ప్రశాంతంగా కనిపిస్తోంది తుంగభద్ర, చారిత్రక నగరం హంపి ఉత్థానపతనాలకి మౌనసాక్షి. గట్టుమీద అక్కడక్కడా పైకిలేస్తున్న పొగలని చూడగానే ఒకటే సందేహం, కాశీలో లాగా ఇక్కడ కూడా శవదహనాలు జరుగుతాయా? ఉహు, జరుగుతున్నది అది కాదు. పట్టణంలో పేరుకున్న చెత్తని రాశులుగా పోసి తగలబెడుతున్నారని తెలిసింది. ఆ చెత్తని తయారు చేస్తున్నది నాలాంటి యాత్రికులే. అయినా, హంపికి, తుంగభద్రకీ ఈ పొగలు కొత్త కాదు. ఇంతకుమించిన దట్టమైన పొగల్ని మూడునెలలపాటు ఊపిరాడని విధంగా భరించాయవి. కానీ నాకే, ఆ సంగతులు తెలుసుకోడానికి మరో రెండు రోజులు పట్టింది.  తుంగభద్రలో కాళ్ళు కడుక్కుంటూ ఉంటే మొదటగా గుర్తొచ్చినవి మొసళ్ళు! మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర 'హంపీనుంచి హరప్పా దాక' చదివిన ప్రభావం. ఆ పండితుణ్ణీ, ఆ పుస్తకాన్నీ తల్చుకోడం ఆ ఉదయం నుంచీ అది ఎన్నోసారో గుర్తులేదు. 

హోస్పేట స్టేషన్లో రైలు దిగగానే మొదట వెళ్ళాల్సింది కమలాపురం. కర్ణాటక టూరిజం కార్పొరేషన్ వారి హోటల్ మయూర భువనేశ్వరిలో బస. కమలాపురంలో అడుగుపెట్టింది మొదలు రామచంద్ర గుర్తొస్తూనే ఉన్నారు. స్నానానికి వేడినీళ్ళతో పాటు, మైసూర్ శాండల్ సబ్బుని, దావణగెరె తువ్వాలునీ అందించిన హోటల్ వారు సగం బడలిక పోగొట్టేశారు. బలంగా  బ్రేక్ఫాస్ట్ చేసి, ఆటో పట్టుకుంటే అరగంట లోపే హంపీ చేర్చాడు డ్రైవరు, దారిలో కనిపించిన ప్రతి చెట్టు, పుట్ట గురించీ నమ్మశక్యం కాని కథలు చెబుతూ.  మొసళ్ల  ఆలోచనల్ని పక్కన పెట్టి, చుట్టూ చూస్తే, తుంగభద్ర గట్టున పొడవు పొడవూ దుకాణాలు. యాంటిక్ డిజైన్లని పోలిన డెకరేటివ్ పీసుల మొదలు, సేవెండి ఆభరణాల వరకూ అనేకం అమ్ముతున్నారు రాశులు పోసి. కొన్ని వందల ఏళ్ళక్రితం రత్నాలని, ముత్యాలనీ రాశులుగా పోసి విక్రయించింది ఇచ్చోటనేనా? 

ఆలయాన్ని ఆనుకునే ఉన్న చిన్నపాటి కొండమీద పడింది దృష్టి. హేమకూట పర్వతమట పేరు. ఆ మధ్యాహ్నపు ఎండలో నిజంగానే బంగారంలా మెరిసిపోతోంది ఆ పర్వతం. సెమ్మెట్రికల్ గా నిర్మించిన చిన్న చిన్న గుళ్ళూ, మండపాలూ రారమ్మని పిలుస్తూ ఉంటే కొండెక్కడం ఏమంత కష్టమనిపించలేదు. ఆ కొండమీంచి మరింత స్పష్టంగా కనిపిస్తోంది విరూపాక్ష ఆలయ గోపురం. రెండోపక్క కనుచూపు మేరంతా హంపీ శిధిలాలు. ఆ గోపురం బ్యాక్డ్రాప్ గా వచ్చేలా వాళ్ళిద్దరికీ ఓ ఫోటో తీయమని రిక్వెస్ట్ చేసింది ఓ విదేశీ జంట. ఒకటికి నాలుగు ఫోటోలు తీసి ఐఫోన్ తిరిగిస్తే, మొహాలు చేటంత చేసుకున్నారు ఆ చైనా అమ్మాయి, డెన్మార్క్ అబ్బాయీ. అమెరికా నుంచి వచ్చారట హంపిని చూడడానికి. వాళ్ళ ప్రేమకథని మూడుముక్కల్లో చెప్పేసి "ఇటీజ్ టూ హాట్ హియర్" అన్నారు. 'మా రాయలుకీ ఓ ప్రేమకథ ఉంది తెలుసా మీకు?' అని అడగాలనిపించింది. కానీ, 'చిన్నాదేవిని గురించి నాకు తెలిసిందెంత?' అనే సందేహం అడ్డొచ్చింది.

శ్రీకృష్ణాలయంలో చెక్కుచెదరని ఓ గోపురం 

హేమకూటం మీద ఉన్న గుళ్ళనీ, మండపాలనీ చూస్తున్నంతసేపు ఒకటే ప్రశ్న. ఇక్కడ ఉన్న రాళ్లనే తొలిచి వీటిని నిర్మించారా? లేక, వేరే చోట్ల నుంచి బండరాళ్లని ఈ కొండమీదకి చేర్చారా? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన బోర్డులో ఈ వివరం లేదు. ఆ మాటికొస్తే చాలా వివరాలే లేవు. హేమకూటం మీద కడలేకలు (శనగ గింజ) గణేశ, ససివేకలు (ఆవగింజ)  గణేశ ఆలయాలు రెండూ చెప్పుకోదగ్గవి. రెండు విగ్రహాలూ భారీగానే ఉన్నాయి. కడలేకలు గణేశుడి ఉదరభాగం చెక్కేసి ఉండడం చూసి చివుక్కుమనిపించింది. ఆ పొట్టలో విలువైన మణులు ఉండొచ్చన్న అనుమానమో లేక అందమైన ఆ విగ్రహాన్ని పాడుచేయాలన్న ప్రయత్నమో తెలియదు కానీ, క్రూరత్వానికి గుర్తుగా చెక్కేసిన బొజ్జ మాత్రం మిగిలిపోయింది. 

మరికాసేపట్లోనే - ఒడిలో లక్ష్మి లేని నరసింహుడినీ నీళ్లలో ఉన్న భారీ శివలింగాన్నీ దర్శించుకుని మరో నాలుగడుగులు ముందుకు వేసేసరికే - అంతకి వెయ్యింతల బాధ సుళ్ళు తిరిగింది, బలవంతంగా కూల్చివేయబడిన శ్రీకృష్ణ మందిరపు శిఖరాన్ని చూసినప్పుడు.  విగ్రహమూ, పూజా పునస్కారమూ లేని ఆ గుడిలో గడిపే ఒక్కో నిమిషమూ మరింత బరువైపోయింది. శిధిలాలలోనే ఇంత సౌందర్యం తొంగిచూస్తూ ఉంటే, వైభవోపేతమైన కాలంలో ఈ ఆలయం ఎలా ఉండి ఉండేది? ఏమి వాస్తు ఇది? ఎందరి శ్రమ ఈ నిర్మాణం? టైం మెషిన్ లో వెనక్కి వెళ్లి ఆ విధ్వంసాన్ని ఆపేయగలిగితే అన్న ఆలోచన మొదటిసారిగా కలిగింది. అదొక్కటేనా? ఆ శిధిల సౌందర్యాన్ని చూస్తూ ఉంటే ఉబికి వచ్చే ఆలోచనలు ఎన్నో, ఎన్నెన్నో. ఎటొచ్చీ, వాటిల్లో కొట్టుకుపోకుండా పట్టి బయటికి లాగేందుకు విరూపాక్ష లాంటి వాళ్ళు సదా సిద్ధంగా ఉంటారు. ...అలా తొలిరోజు హంపీ యాత్ర పూర్తయింది. 

(ఇంకా ఉంది) 

శుక్రవారం, ఫిబ్రవరి 14, 2020

C/o. కంచరపాలెం

కొంతమంది కవులు, రచయితలూ 'జీవితంలో ప్రేమ అనేది ఒక్కసారే పుడుతుంది, ఒక్కరిమీదే పుడుతుంది' లాంటి గంభీరమైన స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కానీ, వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రేమించడం, ప్రేమని పొందడం, ఆ ప్రేమని ఒక శాశ్వత బంధంగా తర్జుమా చేసుకోవడం, అటుపైని కూడా ఆ ప్రేమని నిలుపుకోవడం.. ఇదో సుదీర్ఘమైన ప్రయాణం. ప్రేమలో పడిన వాళ్ళందరూ ఈ అన్ని దశలనూ దాటుకుని ముందుకి వెళ్లలేకపోవచ్చు. ఎందుకంటే, ప్రేమ అంత సులభం కాదు. ఎన్నో పరీక్షలు పెడుతుంది. వాటిని గెలవమని శాసిస్తుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు స్థిరంగా లేకపోయినా, రెండో ఆలోచనలో పడినా గెలవడం కల్ల. గెలుపు కోసం తీవ్రమైన ప్రయత్నం చేసిన వాళ్లకి, ఆ ప్రయత్నాన్ని చుట్టూ ఉన్న వాళ్ళు అర్ధం చేసుకునేలా చేయగలిగిన వాళ్ళకీ మాత్రం అయిన వాళ్ళ నుంచి మద్దతు దొరుకుతుంది. అయితే, దానిని సాధించగలిగే జంటలు బహుకొద్దే.  రండి, ఈ ప్రేమికుల రోజున మనం అలా కంచరపాలెం వెళ్లి, కొంతమంది ప్రేమికుల్ని పలకరించి వద్దాం.


సుందరం ఓ పదిహేనేళ్ల కుర్రాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. నల్లని కళ గల ముఖం, ఆకర్షించే కళ్ళు. ఉత్సాహం ఉరకలెత్తే తొలి యవ్వనంలో ఉన్న ఆ కుర్రాడు, తనతో చదివే సునీత అనే అమ్మాయి మీద ఆకర్షణ పెంచుకున్నాడు. యవ్వనం ఒక్క సుందరాన్నే కాదు, సునీతనీ ఆవహించింది. ఫలితం, సుందరం వైపు దొంగ చూపులు, ముసిముసి నవ్వులు. స్కూల్లో జరిగే వేడుకలో 'భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్..' అంటూ పాట పాడడమూను. 'ఓ అబ్బాయ్ సుందరం' అంటూ ఆమె పలకరిస్తే, 'యేంటమ్మాయ్ సునీతా' అంటూ బదులిస్తూ ఉంటాడు. మరికొన్నాళ్ళు ఆగితే, సునీత-సుందరాలకి ఒకరి మీద ఒకరికి కలిగిన ఆకర్షణ ప్రేమగా రూపు దిద్దుకుని ఉండేదేమో. కానీ, విధి వాళ్ళిద్దరినీ దూరం చేసింది. సుందరానికి వీడ్కోలైనా ఇవ్వకుండా సునీత వేరే ఊరికి వెళ్ళిపోయింది. అంతమాత్రాన, వాళ్ళిద్దరి జీవితాలూ అక్కడే ఆగిపోవాలా? ఆ ఆకర్షణ/ప్రేమని తల్చుకుంటూ ఇద్దరూ మిగిలిన జీవితాన్ని ఒంటరిగా గడిపేయాలా? 

జోసెఫ్ వయసు పాతిక్కి కాస్త అటూ ఇటూ. చింపిరి జుట్టు, మాసిన గెడ్డం. ప్రపంచం మీద పెద్దగా లక్ష్యం లేనట్టుండే వస్త్రధారణ. మెళ్ళో గొలుసులో వేలాడే శిలువ. వృత్తి ఆకురౌడీ. చిన్న చిన్న దందాలు చేస్తూ బతికేస్తూ ఉంటాడు. అలాంటివాడు ఉన్నట్టుండి భార్గవితో ప్రేమలో పడ్డాడు. ఆమె బ్రాహ్మణ పిల్ల. కాలేజీలో చదువుకుంటోంది. తల్లి చనిపోయింది. ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేసే తండ్రే ఆమెని అన్నీఅయి పెంచుతున్నాడు. వండి పెట్టడం మొదలు, డేన్స్ క్లాసులకి తీసుకెళ్లి, తీసుకు రావడం వరకూ కూతురికి సంబంధించిన ప్రతి పనినీ ఇష్టంగా చేస్తూ ఉంటాడు. భార్గవి జోసెఫ్ తో ప్రేమలో పడింది. నిజానికి జోసెఫ్ భార్గవిని ప్రేమించడం వెనుక చొరవ భార్గవిదే. ప్రేమలో పడడం భార్గవికి అదే మొదలు. కానీ, జోసెఫ్ వెనుక ఓ విఫల ప్రేమ గాధ ఉంది. అయితే, భార్గవి చొరవ అతన్ని అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. ఆమె కోసం తన అలవాట్లని మార్చుకునే ప్రయత్నాలు మొదలు పెడతాడు. బతుకుతెరువు కోసం ఓ చిన్న ఉద్యోగంలో కుదురుకుంటాడు కూడా. తండ్రి, జోసెఫ్ ఇద్దరిలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాల్సి పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి వైపే మొగ్గాల్సి వస్తుంది భార్గవికి. జోసెఫ్ ఇక జీవితంలో మళ్ళీ ప్రేమ వైపు వెళ్లకూడదా? 


'గెడ్డం' వయసు ముప్ఫయ్ ఐదేళ్లు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. లవ్ ఫెయిల్యూర్స్ తో సహా ఎంతో జీవితాన్ని చూసేశాడు. చూడ్డానికి కాస్త నిర్లక్ష్యంగా, ఇంకాస్త పొగరుగా ఉంటాడు. వెనుకా ముందూ ఎవరూ లేకపోవడమే అతని బలం, బలహీనత కూడా. బతుకు తెరువు కోసం ఒక లిక్కర్ షాపులో సేల్స్ మాన్ గా పని చేస్తున్నాడు. అతని షాపులో రోజూ లిక్కర్ కొంటూ ఉంటుంది సలీమా, ఓ పేద ముస్లిం యువతి. ఎప్పుడూ స్కార్ఫ్ లో ఉండే సలీమా మొహంలో ప్రస్ఫుటంగా కనిపించేవి ఆమె కళ్ళు. ఆ కళ్ళు ఎంతగానో ఆకర్షించాయి గెడ్డాన్ని. ప్రతి రాత్రీ క్రమం తప్పకుండా లిక్కర్ కొనే సలీమా, షాపులో పనిచేసే అందరికీ ఓ మిస్టరీ. గెడ్డాన్ని ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళు, 'నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది' అంటూ. క్రమంగా ఆమె మీద ఆసక్తి పెరుగుతుంది గెడ్డానికి. ఒక రోజు ఆమెని వెంబడిస్తాడు. ఆమెని గురించి తెలుసుకుంటాడు. బతుకుతెరువు కోసం ఆమె వేశ్యా వృత్తిలో ఉందని తెలిసినప్పుడు, సలీమా మీద గౌరవం కలుగుతుంది గెడ్డానికి. తన ప్రేమని ప్రకటిస్తాడు. కొంత సంశయం తర్వాత, సలీమా అతని ప్రేమని అంగీకరిస్తుంది. పెళ్లి చేసుకుని కొత్తజీవితం మొదలు పెట్టాలనే ప్రయత్నాల్లో ఉన్న గెడ్డానికి, సలీమా మాయమైపోవడం  ఊహకందని షాక్. గెడ్డం ఇప్పుడు అస్తమిస్తున్న సూర్యుడి వైపు నడిచి వెళ్లిపోవాలా? 

రాజు వయసు యాభైకి దగ్గర. ప్రభుత్వ ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తున్నాడు. అతని తల మీద వెంట్రుకల్లాగే అతని అనుభవాలూ పండిపోయాయి. వాటిలో కొన్ని ప్రేమానుభవాలూ ఉన్నాయి. కారణాలు ఏవైనా, రాజు అవివాహితుడిగా ఉండిపోయాడు. తన వాళ్ళు అంటూ ఎవరూ లేని అతను, ఊళ్ళో అందరినీ ఆప్తులుగా భావిస్తూ ఉంటాడు. రాజుని ఓ ఇంటి వాడిని చేయాలని ఊళ్ళో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ, వాళ్ళ ప్రయత్నాలు ఫలించవు. ఇంతలో అతని ఆఫీసుకి బదిలీ మీద వస్తుంది రాధ. వితంతువైన రాధకి టీనేజ్ కూతురు ఉంది. ఉద్యోగం ఉన్నా స్వతంత్రం లేదామెకి. తమ్ముడి ఇష్టాలకి తగ్గట్టుగా నడుచుకుంటూ ఉంటుంది. రాజు మంచితనం రాధని ఆకర్షిస్తుంది. రాజుకి కూడా రాధ మీద ఇష్టం కలుగుతుంది. అప్పటివరకూ తన పెళ్లి కోసం ఊళ్ళో వాళ్ళు చేసే ప్రయత్నాల్ని పెద్దగా పట్టించుకోని రాజు, రాధతో పరిచయం పెరిగాక, జీవితంలో తోడు అవసరాన్ని గుర్తిస్తాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. రాధ కూతురికి ఈ పెళ్లి అంగీకారమే. కానిదల్లా రాధ సోదరుడికే. తన అక్క మళ్ళీ పెళ్లి చేసుకోవడం సంప్రదాయం కాదు అని వాదిస్తాడు అతను. రాజు తన ప్రేమలో ఓడిపోతున్న సందర్భంలో కంచరపాలెం ఊరంతా కలిసి, కదిలి వస్తుంది. రాజునీ, రాధనీ ఒకటి చేస్తుంది. 

విశాఖపట్నం మహానగరాన్ని ఆనుకునే ఉన్నా, పల్లెటూరి పోకడల్ని మిగుల్చుకున్న ఊరు కంచరపాలెం. అక్కడ వాళ్ళకి తమ చుట్టూ ఏం జరుగుతోందో కావాలి. పక్క వాళ్ళ అజ కావాలి. కొత్త వాళ్ళని కాస్త సందేహంగా చూడడం, తన వాళ్ళకోసం ఏదైనా చేయడం అనే లక్షణాలు అక్కడి సమాజంలో ఇంకా ఉన్నాయి. అందుకే, రాజు-రాధల ప్రేమ కథలో కంచరపాలెం కీలకమైన పాత్ర పోషించింది. మరి, ఇదే కంచరపాలెం సుందరం-సునీత, జోసెఫ్-భార్గవి, గెడ్డం-సలీమాల విషయంలో ఎందుకు నిర్లిప్తంగా ఉండిపోయింది? ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన 'C/o. కంచరపాలెం' సినిమా చూడాలి. సెప్టెంబర్ 7, 2018 న విడుదలైన ఈ సినిమాలో ప్రత్యేకతలు ఎన్నో. నటీనటులందరూ కొత్తవాళ్లే. దర్శకుడితో సహా చాలామంది సాంకేతిక నిపుణులకి ఇది తొలి సినిమా. అమెరికాలో డాక్టరుగా పని చేస్తున్న విజయ ప్రవీణ పరుచూరి తొలిసారి సినిమా నిర్మాణంలోకి రావడమే కాక, సీనియర్ నటీమణులు కూడా చేయడానికి తటపటాయించే సలీమా పాత్రని అలవోకగా పోషించారు. స్వీకార్ అగస్తి స్వరకల్పనలో పాటలన్నీ నాలికమీద ఆడేవే. 


అన్నింటినీ మించి అత్యంత సహజమైన కథ, కథనం. ఒకట్రెండు సన్నివేశాల్లో మినహా ఎక్కడా మెలోడ్రామా కనిపించదు. అంతేకాదు, తెలుగు సినిమా 'సెన్సిటివ్' గా భావించే కులం, మతం అనే విషయాలని గురించి ఈ సినిమాలో పాత్రలు చాలా బోల్డ్ గా మాట్లాడతాయి. అలాగని నేటివిటీని అడ్డుపెట్టుకుని నాటుగా తీయలేదు సినిమాని. సునీత దూరమైందని తెలిసిన సుందరం కోపంతో వినాయకుడి విగ్రహాన్ని పాడుచేసినా, భార్గవి తండ్రి క్రైస్తవ కూడికలని గురించి తేలికగా మాట్లాడినా, పెళ్లికాని రాజుని ఊళ్ళో అందరూ 'నట్టు గాడు' అంటూ ఏడిపించినా ఇవన్నీ కథలో భాగంగానే అనిపిస్తాయి తప్ప, అభ్యంతర పెట్టేవిగా అనిపించవు, సినిమాలో లీనమైపోయిన ప్రేక్షకులకి. ఈ ప్రేమ జంటలేవీ విదేశాల్లో డ్యూయెట్లు కలగనే అంత స్తోమతు కలిగినవి కాదు. మధ్య మధ్యలో విశాఖ, సింహాచలం, అరకు అలా మెరుస్తూ ఉంటాయి తప్ప మొత్తం సినిమా అంతా కంచరపాలెం వీధుల్లోనే జరుగుతుంది. డైలాగుల్లో పంచులు, ప్రాసలు ఉండవు. పాత్రల స్థాయిని మరచి, నేల విడిచి సాము చేసే సంభాషణలు అసలే ఉండవు. ఇలా కూడా సినిమాని తీయొచ్చు అని నిరూపించింది ఈ చిత్ర బృందం. ఇప్పటివరకూ ఈ సినిమాని చూడకపోతే ప్రేమికుల రోజుని మించిన మంచి సందర్భం దొరకదు కాబట్టి, చూసేయండి. ఓటీటీ ప్లాట్ఫామ్ మీద దొరుకుతోంది. చూసిన వాళ్లకి కూడా, ఒకవేళ మళ్ళీ చూడాలనిపిస్తే ఎందుకూ ఆలస్యం? 

సోమవారం, ఫిబ్రవరి 10, 2020

వడ్లగింజలు

"వెంటనే వింజామర చేత పుచ్చుకుని అలివేణి కూడా ఏనుగెక్కేసింది అనే వాక్యంతో కథ ముగిస్తారు శ్రీపాద వారు. నేనిప్పుడు అలివేణిని.." అంటూ  ఓ పుస్తకానికి ముందుమాటని ముగించారు శ్రీరమణ. చాలారోజుల క్రితం చదివిన ముచ్చట ఇది. అప్పటికే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 'వడ్లగింజలు' కథని చాలాసార్లే చదివినా, దృష్టి అంతా మొదట్లో కథానాయకుడు తంగిరాల శంకరప్ప మీద, పోను పోను పేదరాశి పెద్దమ్మ మొదలుగా రంగనాయిక వరకూ మిగిలిన అన్ని పాత్రలమీదకీ వెళ్ళింది, ఒక్క అలివేణి మీదకి తప్ప! శ్రీరమణ పుణ్యమా అని, వెంటనే కథ తీసి అలివేణి దృష్టికోణం నుంచి చదవడం మాత్రమే కాదు, తర్వాతెప్పుడు చదివినా ఆ పాత్రని కూడా దృష్టిలో ఉంచుకోవడం మర్చిపోలేదు. అలివేణి గురించి చెప్పాలంటే, 'వడ్లగింజలు' కథని గుర్తుచేయాలి. 

పేద బ్రాహ్మణుడు తంగిరాల శంకరప్ప కులవృత్తిలో కన్నా, చదరంగంలో నిష్ణాతుడు. ఊరికే చదరంగం ఆడుతూ కూర్చుంటే పూట గడిచేదెలా? రాజుని ఆశ్రయించి, తన విద్యని ప్రదర్శిస్తే, అతగాడు మెచ్చి ఆదరిస్తాడని ఓ నమ్మకం కుదిరింది. రాజుకి కూడా చదరంగం అభిమాన క్రీడ కావడమే ఈ నమ్మకానికి ఆధారం. కానీ గోచిపాత రాయడు శంకరప్పకి మహారాజు దర్శనం లభించడం అంటే మాటలా? రాజు ఎంత కళా పోషకుడు అయితేనేమి, చుట్టూ ఉన్నవాళ్లు కావొద్దూ? ఆ కంచెలన్నీ దాటుకుని రాజు సమ్ముఖానికి చేరుకునే ఓర్పూ,  లేకపోయాయి శంకరప్పకి. ఫలితంగా, కావలి వాళ్ళచేత  'పిచ్చివాడు' అని ముద్ర వేయించుకున్నాడు. వాళ్ళ చేతుల్లో అతని అంగవస్త్రం చిరిగిపోయింది, యజ్నోపవీతం తెగిపోయింది. అవమానంతో కుతకుత ఉడికిపోయాడు శంకరప్ప. పేదవాడి కోపం పెదవికి చేటు కదా. 

రసపట్టుకి వచ్చిన కథ నుంచి కాస్త బయటికి రావడం కష్టమే కానీ, ఇక్కడ చెప్పుకోవాల్సిన కబురొకటి ఉంది. శ్రీపాద వారి కథల్లో రాజు కానీ, అధికారి కానీ - నలుగురికి  పెట్టే స్థానంలో ఉన్నవాళ్లు ఎప్పుడూ మంచివాళ్ళే అయి ఉంటారు. కానీ, వాళ్ళ దగ్గర సలహాదారులుగా చేరే వాళ్ళు మాత్రం సహాయం ఆశించి వచ్చే వాళ్ళని చిన్నచూపు చూసే వాళ్ళు, వాళ్ళ పని జరగకుండా ఉండేందుకు ప్రయత్నించే వాళ్ళూ అయి ఉంటారు. 'కలుపుమొక్కలు' నుంచి 'గులాబీ అత్తరు' వరకూ ఏ కథ తీసుకున్నా ఇదే ధోరణి చూడొచ్చు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఒకానొక ప్రముఖ జమీందారీలో దివాన్ చేతిలో తనకి జరిగిన అవమానం ఆయనలో బలంగా నాటుకుపోయిందనీ, కాలక్రమంలో అది అధికారులని అంటిపెట్టుకుని ఉండేవారి పట్ల తీవ్రమైన వ్యతిరేకతగా పరిణమించిందనీ కర్ణాకర్ణిగా విన్నాను. కథల్లో ఈ ధోరణి చూసిన తర్వాత, విన్నది నిజమే అయి ఉండొచ్చు అనిపించింది. 

మళ్ళీ కథలోకి వచ్చేస్తే, అవమాన భారంతో ఉన్న శంకరప్ప పూటకూళ్ళ ఇల్లు నడుపుకునే పేదరాశి పెద్దమ్మ ఇంటికి వచ్చి పడతాడు. పెద్దమ్మ లౌక్యురాలు. మనుషుల్ని, పరిస్థితులని కూడా చిటికెలో అంచనా వేయగలదు. శంకరప్ప పూర్తిగా చెప్పక మునుపే ఆమెకి అంతా అర్ధమయ్యింది. కర్తవ్యం కూడా కట్టెదుట కనిపించింది. "ఇప్పటిదాకా రాజ దర్శనానికి నువ్వు తిప్పలు పడ్డావు. ఇక నీ దర్శనం కోసం రాజే తిప్పలు పడాలి" అంటూ చెయ్యాల్సిందేమిటో చెప్పింది. పెద్దమ్మ సలహాని అనుసరించి, మొదట ఊళ్ళో తగుమాత్రం చదరంగం ఆటగాళ్లతో ఆడి గెలుస్తాడు శంకరప్ప. శాస్త్రి, యాజులు అనే ఇద్దరు ఆటగాళ్ళని అనుయాయుల్ని చేసేసుకుంటాడు. అక్కడినుంచి మొదలవుతుంది శంకరప్ప జైత్రయాత్ర. అతడికి ఆటలో సమఉజ్జీలని వెతికే బాధ్యతని వాళ్లిద్దరూ ఆనందంగా తీసేసుకుంటారు. వాళ్ళ వెంట వెళ్లి, వాళ్ళు చెప్పిన వాళ్లతో చదరంగం ఆడడమే శంకరప్ప పని. 

ఓ సాయంత్రం వేళ.. మామూలుగా కాక అక్కడ వెన్నెల సురభిళం గానూ, పిల్లగాలి మధురంగానూ ఉండే వీధికి శంకరప్పని తీసుకెళ్తారు శాస్త్రి, యాజులు. ఒక మేడ ముందు నుంచి ఒక మధ్యానాయిక వీళ్ళకి అడ్డం వచ్చి "శంకరప్పగారి పాదాలు కొలుచుకుంటాను" అనగా, "ఈమె పేరు అలివేణి. రాజసభలో ప్రముఖురాలైన నర్తకి. విశేషించి చదరంగంలో నిధి. ఒకమాటు 'ఆటకట్టు' అన్నంత చాతుర్యం చూపించగా మెచ్చి, మహారాజులుంగారీమెకి రత్నాంగుళీయకమూ,  బంగారు జెడా, దుశ్శాలువలూ, దంతపు బలగమూ బహూకరించారు," అంటూ పరిచయం చేసి, "ఒకమారు పాదాలివ్వండి" అని సూచిస్తాడు శాస్త్రి. "నా పాదాలు ధూళి ధూసరితాలు కదా" అని శంకరప్ప సంకోచించగా, "మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు" నంటూ శంకరప్ప పాదాలు పట్టి కళ్ళకద్దుకుంటుంది అలివేణి.  

ఆ వేశ్యావాటిక నుంచి, మహారాజు అనుయాయుల దగ్గరికీ, మహారాజు దగ్గరికీ ఒకేసారి పాకుతుంది శంకరప్ప ప్రతిభ. అతిత్వరలోనే మహారాజు నుంచి కబురొస్తుంది. ఇద్దరూ ఆటకి కూర్చుంటారు. మహారాజు కూడా మామూలు ఆటగాడేమీ కాదు. రోజుల తరబడి ఉత్కంఠభరితంగా సాగుతుంది వాళ్ళిద్దరిమధ్యా చదరంగం ఆట. సాగి సాగి ఒక చోట నిలిచిపోతుంది. తదుపరి ఎత్తు మహారాజు వెయ్యాల్సి ఉంది. ఏ ఎత్తు వేసినా గెలుపు శంకరప్పదే. చూస్తున్న అందరికీ ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కానీ, రాజుకి ఎదురుచెప్పగలవారెవరు? తన ఓటమిని, శంకరప్ప విజయాన్నీ అంగీకరించడానికి మహారాజుకి సమయం పడుతుంది.  కానుకగా తన సింహాసనం ఇచ్చేయడానికి సిద్దపడగా, కాదని 'వడ్లగింజలు' చాలంటాడు శంకరప్ప. 

మహారాజతన్ని అగ్రహారీకుణ్ణి చేస్తాడు. ఆనాటి సభలో ఒళ్ళు మరచి నాట్యం చేస్తుంది అలివేణి. శంకరప్ప మెప్పు చూపులతో లజ్జిత అయి ముఖం వంచేసుకుంటుంది. దగ్గర ఉండి మహారాజు శంకరప్పని గజారోహణం చేయించడమూ, వెంటనే వింజామర చేత పుచ్చుకుని, అలివేణి కూడా యేనుగెక్కేయడమూ జరిగిపోతాయి. మళ్ళీ ఓసారి 'వడ్లగింజలు' చదవండి, అలివేణిని మీరూ మర్చిపోలేరు. 

శుక్రవారం, ఫిబ్రవరి 07, 2020

కిర్క్ డగ్లస్ ...

హాలీవుడ్ సినిమాలు అతి తక్కువగా చూసే నాకు కిర్క్ డగ్లస్ తో పరిచయం చాలా చిత్రంగా జరిగింది. అది కూడా, సినిమాల ద్వారా కాదు. డగ్లస్ ఆత్మకథ 'మై స్ట్రోక్ ఆఫ్ లక్' పుస్తకం వల్ల. ఈ ఆత్మకథ ద్వారా కేవలం డగ్లస్ ధైర్యం, పోరాట పటిమ, రంగస్థలం నుంచి హాలీవుడ్ అగ్రశ్రేణి నటుడు, నిర్మాతగా ఎదిగిన తీరుని మాత్రమే కాక, హాలీవుడ్ చిత్ర నిర్మాణ శైలిలో వచ్చిన మార్పులు, తెరవెనుక నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య ఉండే అనేకరకాలైన సంబంధ బాంధవ్యాలు లాంటి అనేక విషయాలు తెలుసుకోగలిగాను. కిర్క్ తన 103 వ ఏట ఈ లోకాన్ని విడిచి వెళ్లారన్న వార్త విన్న తర్వాత, అతని ఆత్మకథ, ఆ పుస్తకం తాలూకు పూర్వాపరాలు మరోసారి గుర్తొచ్చాయి. 

సుమారు ఏడేళ్ల క్రితం 'మై స్ట్రోక్ ఆఫ్ లక్' పుస్తకాన్ని కానుకగా అందుకున్నాను. అప్పటినుంచి ఆ పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను. నాలో పాఠకుడికి ఇంగ్లీష్ పుస్తకాల విషయంలో బద్ధకం మెండు. అందుకే అవెప్పుడూ బుక్ మార్కులతో కళకళలాడుతూ ఉంటాయి. అయితే, ఈ ఆత్మకథ విషయానికి వస్తే బుక్ మార్కులుగా టికెట్లు, బోర్డింగ్ పాసులు ఉంటాయి. "ప్రయాణాల్లో చదువుదాం" అనిపించిన క్షణం ఏవిటో కానీ, ఈ ఏడేళ్లలో బోల్డన్ని ప్రయాణాలు చేసినా 165 పేజీల పుస్తకం మాత్రం ఒక్కసారి చదవడం కూడా పూర్తవ్వలేదు. ఇప్పటికీ, చివరిపేజీలు ఇంకా చదవాల్సి ఉంది. కానుకిచ్చిన వారు, ఓ రెండున్నరేళ్ల క్రితం ఆటోగ్రాఫ్ ని రివైజ్ చేసి ఇచ్చారు కూడా. 

అలాగని పుస్తకం ఆసక్తిగా లేదా అంటే, రేసుగుర్రంలా పరిగెత్తే వచనం. హాలీవుడ్ అగ్ర నటుడు ఉన్నట్టుండి ప్రాణాపాయంలో పడి, మృత్యువు అంచువరకూ వెళ్లి, కేవలం మొండితనంతో మళ్ళీ బతికిన యదార్ధ గాధ. శరీరంలో ఏ భాగమూ పని చేయని స్థితి నుంచి ఒక్కో అవయవాలన్నీ స్వాధీనంలోకి తెచ్చుకుంటూ, తిరిగి నటించగలననే ధైర్యాన్ని తనలో నింపుకుంటూ, చుట్టూ ఉన్న వారిలో నింపుతూ గడిపిన డగ్లస్ కథ అనేకానేక వ్యక్తిత్వ వికాస పుస్తకాల కన్నా ఎన్నో మెట్లు పైన ఉంటుంది. ఈ పుస్తకంలో అరువు తెచ్చిన కొటేషన్లు ఉండవు. అనుభవ సారం నిండిన మాటలు ఉంటాయి. మనుషుల మీద ప్రేమ, కరుణ ఉంటుంది. ప్రేమతో మనుషుల్ని ఎలా జయించవచ్చో డగ్లస్ అనుభవాల నుంచి తెలుసుకోవచ్చు. నటనకి ఎలాంటి సంబంధమూ లేని నేపధ్యం డగ్లస్ ది. కడు బీదరికం మధ్య బాల్యం గడిచింది. 


అనేకమంది సెలబ్రిటీలకి మల్లేనే, డగ్లస్ మీద అతని తల్లి ప్రభావం అత్యధికం. ఇంటాబయటా కష్టపడుతూ, గంపెడు సంసారాన్ని ఈదిన ఆ తల్లి తన బిడ్డలందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చిన తీరు, వారి ఇష్టాలని గమనించి ప్రోత్సహించిన విధానం చదవడం ద్వారా ఎన్నో వందల పేరెంటింగ్ లెసన్స్కి ముడిసరుకు దొరుకుతుంది. యవ్వనంలో నాటకరంగం విశేషంగా ఆకర్షించింది డగ్లస్ ని. పెద్దగా చదువు అవసరం లేకుండా పని దొరకడం ఒక కారణం అయితే, ఎంతోకొంత సంపాదన దొరుకుతూ ఉండడం మరో కారణం. చేసే పనిని సంతోషంగానూ, చిత్తశుద్ధి తోనూ చేయడాన్ని తన తల్లి నుంచే నేర్చుకున్నానంటాడు డగ్లస్. 

ఇక, హాలీవుడ్లో నిలదొక్కుకోడానికి డగ్లస్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పోరాట ప్రధాన చిత్రాలతో బాగా పేరు రావడంతో, వరుసగా అలాంటి కథలే వచ్చినా, ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం చూపేందుకు తపించాడు. తన అభిమానులని తృప్తి పరచడానికి, పోరాట దృశ్యాల్లో డూప్ కాక తానే నటిస్తానని పట్టుపట్టేవాడు. ఈ క్రమంలో మూడు సార్లు పెద్ద ప్రమాదాలకు గురయ్యాడు. చిన్న చిన్న దెబ్బలకి లెక్కేలేదు. దెబ్బలు తిన్న ప్రతి సందర్భంలోనూ తనకి అండగా ఉన్న ప్రతి ఒక్కరినీ (వైద్యం చేసిన డాక్టర్లు, సేవలు చేసిన నర్సులతో సహా) పేరు పేరునా గుర్తుపెట్టుకోడం ఆ నటుడిలోని కృతజ్ఞతని తెలియజెపుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా ఇక కెరీర్ అయిపోయిందేమో అనుకోడం, వెనువెంటనే మళ్ళీ కెమెరా ముందుకి రావడం కోసం శ్రమించడం అలవాటైపోయాయి డగ్లస్ కి. 

సినిమా ప్రపంచంలో చూసిన ఎత్తుపల్లాలని చెప్పినంత వివరంగానూ వ్యక్తిగత జీవితపు ఒడిదుడుకులని చెప్పడం అన్నది హాలీవుడ్ నటీనటులకే సాధ్యమేమో. అలాగని, అనవసరమైన విషయాలతో పేజీలు నింపలేదు. ఎదురైన కష్టంతో పాటు, దానిని దాటి వచ్చిన వివరాన్నీ శ్రద్దగా చెప్పాడు. డగ్లస్ తెలుగు దేశంలో పుట్టి ఉంటే అతన్ని 'ధీరోదాత్తుడు' అనో 'మేరునగ ధీరుడు' అనో అనేవాళ్ళేమో. తనకి స్ట్రోక్ వచ్చినప్పుడు, ప్రపంచ స్థాయిలో పేరున్న డాక్టర్లే ఇక కోలుకోడం కష్టమేమో అని సందేహించిన తరుణంలో, కేవలం తన మనోబలంతో అనారోగ్యాన్ని జయించి, జీవితాన్ని గాడిలో పెట్టుకోవడం మాత్రమే కాదు. తన అనుభవాలన్నింటినీ అక్షర బద్ధం చేసి దానికి 'మై స్ట్రోక్ ఆఫ్ లక్' అని పేరుపెట్టాడు. ఈ పుస్తకాన్ని చూసినప్పుడు, ఇందులో విషయాలు జ్ఞాపకం వచిన్నప్పుడల్లా డగ్లస్ గుర్తొస్తూనే ఉంటాడు.

బుధవారం, ఫిబ్రవరి 05, 2020

కాశ్మీరు లోయలో ...

"గూటి పడవల్లోన చాటుగా కలిశాక
నీటికైనా వేడి పుట్టాలిలే..." 

హీరో హీరోయిన్లు కాశ్మీర్లో ఓ డ్యూయెట్ పాడుకోవాలి, ఇదీ సందర్భం. కాశ్మీరు అనే మాటొక్కటీ చాలదూ, వేటూరిలాంటి కవికి? అలవోకగా ఓ శృంగార ప్రధాన గీతాన్ని రాసిచ్చేశారు, 'పసివాడి ప్రాణం' (1987) సినిమా కోసం. నాయికా నాయకుల (విజయశాంతి, చిరంజీవి) ఇమేజీకి తగిన విధంగా, సంగీత దర్శకుడు (చక్రవర్తి) ఇచ్చిన జానపద బాణీకి అనువుగా, ప్రేక్షకుల నోళ్ళలో నాలుగు కాలాలపాటు నానేలాగా, అదే సమయంలో సాహిత్యాన్ని గురించి పట్టించుకునే వాళ్ళని గిలిగింతలు పెట్టేలా రాయడం అనే అష్టావధానాన్ని అతి గడుసుగా నిర్వహించేశారు. 

"కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమావ.. ఓ సందమావ.. 
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమావ.. ఓ సందమావ.." 

నాయకుడు నాయికని కాశ్మీరు లోయలో కన్యాకుమారి అంటుంటే, నాయికేమో అతన్ని కన్నె ఈడు మంచులో కరిగే సూరీడు అంటోంది. మామూలుగా అయితే సూరీడు ధాటికి మంచు కరగాలి. కానీ ప్రేమలో ఉన్నవాళ్ళ ఉత్ప్రేక్షలకి లోటేముంది.  పల్లవిలో తొలిసగం అందరూ సులువుగా పాడుకునేలా ఉంటే, రెండోసగం సాహిత్యం మీద దృష్టి పెట్టినవాళ్ళకి విందుభోజనం పెట్టేస్తుంది. 

"పొగరాని కుంపట్లు రగిలించినాదే.. 
పొగరెక్కి చలిగాణ్ణి తగిలేసినాడే.. 
చెమ్మాచెక్క.. చేత చిక్క.. 
మంచమల్లె మారిపోయె మంచు కొండలు.. 
మంచిరోజు మార్చమంది మల్లె దండలు.."

ఆ కన్యాకుమారి అంత చల్లని కాశ్మీరంలో 'పొగరాని కుంపట్లు' రగిలించిందని అతను ముచ్చట పడుతున్నాడు. ఆ ముచ్చటని అర్ధం చేసుకోవాలంటే మనం అలా కాకతీయుల కాలానికి వెళ్లిరావాలి. 

"మాఘ మాసంబు పులివలె మసలుచుండ 
పచ్చడం బమ్ముకొన్నాడు పసరమునకు; 
ముదిత చన్నులు పొగలేని ముర్మురములు; 
చలికి నొఱిగాయ కేలండు సైరికుండు?" 

అంటాడు క్రీడాభిరామకర్త. (ఈ 'క్రీడాభిరామం' రాసింది వినుకొండ వల్లభామాత్యుడనీ, మహాకవి శ్రీనాధుడనీ రెండు వాదనలున్నాయి. ఆ కావ్యం రాసింది ఎవరైనా పొగలేని ముర్మురములని సినిమా పాటలోకి లాక్కొచ్చింది మాత్రం సినీరంగ శ్రీనాధుడే! అర్ధవివరణ కోసం దాశరథి కృష్ణమాచార్య ఆత్మకథ 'యాత్రాస్మృతి' లో 'ముర్మురాలు' అనే అధ్యాయం చూడొచ్చు.)


మనం మళ్ళీ పల్లవిలోకి వచ్చేస్తే, 'పొగరెక్కి చలిగాణ్ణి తగిలేసినాడే' అంటోందామె! అతని పొగరు వెనుక ధీమా ఆమే కదా. అంత మహోన్నతమైన మంచుకొండలూ మంచంలా మారిపోయాయనడం కవిగారి చమత్కృతి. 'మంచిరోజు మార్చమంది మల్లె దండలు' అనడం ద్వారా వాళ్లిద్దరూ పెళ్ళికి ముందే విహార యాత్రకి వచ్చారని చెప్పకనే చెప్పారు. ఇక, తొలి చరణానికి వస్తే.. 

"తేనీటి వాగుల్లో తెడ్డేసుకో.. పూలారబోసేటి ఒడ్డందుకో.. 
శృంగార వీధుల్లో చిందేసుకో.. మందార బుగ్గల్ని చిదిమేసుకో.. 
సూరీడుతో ఈడు చలికాచుకో.. పొద్దారిపోయాక పొద చేరుకో.. 
గుండెలోనే పాగా గుట్టుగా వేశాక గుత్తమైన సోకు నీదే కదా.. "

పాటని మొదలు పెట్టిన కాశ్మీరుని పల్లవికి సరిపెట్టి ఊరుకోకుండా చరణాల్లోకీ తీసుకొచ్చారు. మంచుకొండలు తర్వాత మనకి గుర్తొచ్చేవి తేనీరు, గులాబీ పూలు. 'కోటలో పాగా వెయ్యడం' అనే నానుడి గుండెలో పాగా వేయడంగా మారింది, అదికూడా గుట్టుగా. 

"తస్సా చెక్క..  ఆకు వక్క.. 
ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము.. 
పెళ్ళి కాక ముందే జరిగె పేరంటము... "

తస్సాదియ్యా, తస్సాచెక్కా ఈ రెండూ గ్రామీణుల భాషలో సర్వసాధారణాలు. ఆకు, వక్క ఇచ్చిపుచ్చుకోక ముందే (తాంబూలాలు మార్చుకోడం/ఎంగేజ్మెంట్) తాంబూలం అందేసిందట. పెళ్ళికి ముందే పేరంటం జరిగిపోవడంతో వింతేముంది? రెండో చరణంలో ఆ జంట చేత ఏమేం చేయించారో చూద్దాం: 

"సింధూర రాగాలు చిత్రించుకో.. అందాల గంధాల హాయందుకో.. 
పన్నీటి తానాలు ఆడేసుకో.. పరువాలు నా కంట ఆరేసుకో.. 
కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో.. చిలక పచ్చ రైక బిగి చూసుకో.. 
గూటి పడవల్లోన చాటుగా కలిశాక నీటికైనా వేడి పుట్టాలిలే.. "

హిందూస్తానీ రాగాల్లో 'సింధూర రాగం' ఒకటి. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండాలి కాబట్టి, కాశ్మీరులో హిందూస్తానీ రాగం పాడుకోమంటోంది నాయిక ('చిత్రించు' కి ఉన్న నానార్ధాల్లో 'అలరించు' ఒకటి). దాల్ సరస్సులో నౌకా విహారం చేయాలంటే మామూలు పడవలో కుదరదు, గూటి పడవ ఉండాల్సిందే. ఆ జంట చాటు సరసానికి నీటికి కూడా వేడి పుడుతుందట. ముందుగానే చెప్పుకున్నట్టుగా, టాప్ స్టార్ల ఇమేజీకి తగ్గట్టుగా ఉండాలి కదా పాట. 

"పూత మొగ్గ.. లేత బుగ్గ.. 
సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు.. 
సొంతమైన చోట లేవు ఏ హద్దులు..." 

ముగింపు వాక్యాలని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు కదా. గానం విషయానికి వస్తే, ఎక్స్ప్రెషన్స్ పలికించే విషయంలో జానకితో మరో మారు పోటీ పడే ప్రయత్నం చేశాడు బాలూ. మంచుకొండలు నేపథ్యంలో, సంగీతానికి, సాహిత్యానికి తగ్గట్టుగా ఆహ్లాదకరంగా చిత్రించారు దర్శకుడు ఏ. కోదండరామి రెడ్డి.  గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా విజయంలో ఈ పాటకీ స్థానం ఉంది.

సోమవారం, ఫిబ్రవరి 03, 2020

తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క

ఆమెని 'చీటీల బేబమ్మ' అంటారు అందరూ. నల్లని చెయ్యెత్తు మనిషి. ముప్ఫయ్ ఐదేళ్ల వయసు. కళ గల మొహం. కుడి కనుబొమ దగ్గర గాయం తాలూకు మచ్చ, పెదవులపైన, చేతి వేళ్ళ సందుల్లో, కనురెప్పల మాటున  ఉన్న తెల్లని మచ్చలు - ఆమెని పరిశీలనగా చూసిన వాళ్లకి మాత్రమే కనిపిస్తాయి. వాటిని చూసే "బొల్లి కాబోలు గుంటకి, అయినా బాగానే ఉంది," అనుకుంటాడు శివకోటి శాస్త్రి, మరో ఆరు నెలల్లో రిటైర్ కాబోతున్న సీబీసీఐడీ ఇన్స్పెక్టర్. బయట హోరున వర్షం కురుస్తూ ఉండగా, మెయిన్ రోడ్డు మీద బస్టాపుకి దగ్గరలో ఉన్న బేబీ భవంతిలో ఆమెకి ఎదురుగా సోఫాలో కూర్చుని చాలా  తాపీగా సంభాషణ ప్రారంభిస్తాడు శాస్త్రి. అతని తీరే అంత, ఏ పనైనా తాపీగా చేయడం, ఏమాటైనా  ఆచితూచి మాట్లాడడం ముప్ఫయి రెండేళ్ల సర్వీసు అతనికి నేర్పించింది. ఎంత జాగ్రత్తగా ఉంటేనేం, చిన్న ఏసీబీ కేసులో పట్టుబడిపోవడం వల్ల రెండేళ్లు వీఆర్ (వేకెన్సీ రిజర్వ్) లో ఉండాల్సి రావడంతో కేవలం ఇన్స్పెక్టర్ గా మాత్రమే రిటైర్ కాబోతున్నాడు. 

బేబమ్మ పూర్వాశ్రమంలో విశాఖపట్నం పూర్ణా మార్కెట్లో టీ స్టాలు నడిపేది. 'చీటీల బేబీ' అనేవాళ్ళు ఆమెని. జగదాంబ సెంటర్లో బెల్టులు అమ్మే దేవర సూర్యనారాయణతో ఆమెకి అక్కడే పరిచయం. బెల్టు సూరి అనేవాళ్ళు అతన్ని. జగదాంబ సెంటర్లో అతనో చిన్న సైజు ఆకు రౌడీ కూడా. ఇద్దరూ కలిసి, చీటీ డబ్బులు ఓ ఓ పది పదిహేను లక్షలతో విశాఖ నుంచి మాయమై మరో మహానగరంలో తేలారు.  కొన్నాళ్ళు పోయాక, ఇద్దరూ కలిసి 'పసిడి చిట్స్' ప్రారంభించారు. సూరి స్నేహితుడు రంగశాయిని కూడా పార్ట్నర్ గా కలుపుకున్నారు.  కొంత  కాలం బాగానే గడిచింది. అంతలోనే అనుకోని ఉపద్రవం. బెల్టు సూరి హత్యకి గురయ్యాడు. చీటీ బాకీలు వసూలు చేసుకుని  కార్ డ్రైవ్ చేసుకుని వస్తూండగా ఉన్నట్టుండి కారు తగలబడిపోయి పూర్తిగా కాలిపోయాడు. చీటీ డబ్బుల కోసం రంగశాయే సూరిని చంపేశాడని పోలీసులకి రిపోర్టు చేసింది బేబీ. 

వసూలు చేసిన డబ్బు దగ్గర దగ్గర  కోటి రూపాయలు ఉండడంతో కేసు సీబీసీఐడీ కి వెళ్ళింది.  అదుగో, ఆ కేసు నిమిత్తమే బేబమ్మ ని కలిశాడు శాస్త్రి.  తను వచ్చింది సూరి హత్య కేసు గురించి కాదనీ, సూరి చేసిన హత్య కేసుని గురించనీ మొదలు పెడతాడు. "ఇది డెల్టా కేర్ హాస్పిటల్, తిరుపతి వారిచ్చిన రిపోర్ట్. అలిపిరి దగ్గర జరిగిన యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన దేవర సూర్యనారాయణకి ప్రాధమిక చికిత్స, తదనంతరం ఎమర్జన్సీ చికిత్స తమ హాస్పిటల్లోనే జరిగిందని సర్టిఫై చేశారు. ఆ హాస్పిటల్ త్రాష్టులు అంతవరకే సర్టిఫికెట్ ఇచ్చి ఊరుకోలేదమ్మా. మీ ఆయన ఎడమ తొడకి మల్టి ఫ్రాక్చర్ అయిన విషయం కూడా రాశారు. బెల్టు సూరి పోస్టు మార్టం రిపోర్టులో ఎడమ తొడ దగ్గర ఉండాల్సిన స్టీలు రాడ్ కనిపించక పోగా, మామూలు ఎముకే కనిపిస్తోందమ్మా.. " 

శివకోటి శాస్త్రి మాటలు ఆమెకి నెమ్మదిగా అర్ధమయ్యాయి. అర్ధమయ్యే కొద్దీ క్రమంగా ఆమె ముఖం గట్టిగా బిగదీసుకున్నట్టుగా అయిపోయింది.  బేబీ ఐదోతనం  గట్టిదని శాస్త్రి నవ్వుతూ చెబితే, రంగశాయే తన భర్తని అన్యాయంగా చంపి  డబ్బుతో పారిపోయాడని వాదిస్తుంది బేబీ.  శవం మాత్రం రంగశాయిదంటాడు శాస్త్రి. "ఏంకాదు. ఆ రంగశాయి గాడే వాళ్లావిడతో ఈయనకి సంబంధం ఉందని కక్ష పెంచుకుని ఈన్ని కాలబెట్టాడు. మీరు చెప్పేవన్నీ అబద్ధాలు.." ఆవేశపడుతుంది బేబీ.  "మీ ఆయనకీ, రంగశాయి భార్య అని నువ్వు చెబుతున్న కాటం కుసుమ కుమారికి  పెళ్లి జరిగిన సాక్ష్యం "  అంటూ మేరేజ్ రిజిస్టర్ కాపీని ఆమెకి అందిస్తాడు శాస్త్రి. "తన రెండోపెళ్లానికి మొగుడిగా ఒకడిని నటింపజేసే ఏర్పాటు నీ బలవంతం మీదే మీ ఆయన చేశాడని నాకు తెలుసమ్మాయ్. నేనేం తప్పుబట్టనమ్మా. సంఘానికి భయపడి మనం కొన్నిసార్లు కొన్ని ఏర్పాట్లు చేసుకోక తప్పదు. కాకపోతే, లోకం కోసం ఏర్పాటు చేసుకున్న మొగుడు, అసలు మొగుడి మీద కక్ష పెంచుకోడం, చంపడం, పెద్దగా అతకవమ్మాయ్," గొంతులో మార్దవం ఏమాత్రం సడలకుండా చెబుతాడు శాస్త్రి. 

ఒళ్ళో పడ్డ మేరేజి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ని నిలువు గుడ్లేసుకుని చూస్తూ ఉండిపోతుంది బేబీ. "సరిగ్గా రెండు నెల్ల పదిహేను రోజుల క్రితం తన పేరు మీద ఉన్న ఆస్తులు నీ పేరుమీదకి మార్పించాడు. ఇక రంగశాయి మీ ఇంటి కుక్క. దాదాపు మీ ఆయన వయసే. అదే హైటూ. అవసరమూ, పరిస్థితీ కూడా అలా కలిసొచ్చాయి. శతకోటి దరిద్రాలకు  అనంత కోటి ఉపాయాలు. మీ కష్టానికి మీకు తోచిన మార్గం అదీ. ఏదో అనుకున్నారు, చేసేశారు, అయిపోయింది.."   శాస్త్రి గొంతులో అదే మార్దవం. "నమ్మకస్తుడు రంగశాయి అల్పాయుష్కుడయ్యాడన్న చిన్న బాధ తప్పితే మనుషులు శాశ్వతమా?  ఏది ఏమైనా చిట్ ఫండ్ వసూళ్లు మొత్తం మిగిలిపోయాయి.  కొంత కాలం ఆగి అంతా సర్దుకున్నాక నువ్వు నెమ్మదిగా బిచాణా ఎత్తేసి అల్లుడుగారి దగ్గరకే వెళ్లిపోవచ్చు.." జరగబోయేది  వివరిస్తాడు శాస్త్రి. 'అల్లుడుగారు' ఇంకెవరో కాదు, బెల్టు సూరి. "ఇంతకీ మీరెందుకొచ్చారు?" నిశ్చలంగా చూస్తూ అడుగుతుంది బేబీ. 

"నీకు ఇద్దరు చెల్లెళ్ళు అమ్మాయ్. పెద్దదాన్ని అమెరికాలో ఇచ్చాను.  రెండో దాన్ని కూడా అక్కడికే పంపితే, ఈ ముష్టి ఉద్యోగం ముగించుకుని, నేనూ మీ పిన్నీ కూడా అక్కడికే  చేరదాం అని నిర్ణయం. దీనికంతా ఓ యాభై లక్షలవుతుంది. నేను సగానికి తూగగలను. మిగతా సగం నీది. నీ పరిస్థితికి పిరమవ్వదు. ఆడపిల్ల సొమ్మును అవసరానికి మించి ఆశించే వాణ్ణి కాను నేను. తొందర లేదమ్మా, ఓ వారం టైం తీసుకో. నువ్వు బేరం ఆడాల్సిన మాట నేను అనలేదు..."  చెప్పడం ముగించి, ఎంత తాపీగా వచ్చాడో అంతే తాపీగా బయలుదేరతాడు శివకోటి శాస్త్రి. వర్షం ఇంకా కురుస్తూనే ఉంటుంది. వెళ్తున్న వాడల్లా కిటికీ లోంచి కనబడుతున్న తెల్లమచ్చల నల్ల క్రోటన్  మొక్కని చూసి "ఆ మొక్క ఎంత విచిత్రంగా ఉందమ్మాయ్? దాని పేరేవిటి?" అని అడుగుతాడు.  మొక్కవైపు చూస్తుంది బేబీ. "తెలీదండి, ఏదో వెరైటీ క్రోటన్" అని మాత్రమే జవాబిస్తుంది. నిజానికి, ఆ క్రోటన్ కి బేబీకి పోలిక ఉండడం మాత్రమే కాదు, ఆమెకి సంబంధించిన ఓ  ముఖ్యమైన విషయానికి ఆ క్రోటన్ మొక్కే సాక్ష్యం కూడా. అదేమిటో తెలియాలంటే, గంధం నాగరాజు రాసిన 'తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క' పెద్ద కథని చదవాల్సిందే. 'కథా సుగంధాలు' సంపుటిలో ఉందీ కథ. శివకోటి శాస్త్రి, బేబీలనే కాదు, ఆ క్రోటన్ మొక్కనీ ఓ పట్టాన మర్చిపోలేం.