మంగళవారం, ఫిబ్రవరి 25, 2020

హంపీ యాత్ర - 2

(మొదటి భాగం తర్వాత..) 

"ఒంపుల హంపీ శిల్పమా.. బాపూ గీసిన చిత్రమా.. అందమా నీ పేరేమిటి.. అందమా..." ఎంత చమత్కారి వేటూరి?!! ఆయన పాటల్లో నిగూఢమైన అర్ధాలుంటాయని తెలుసు కానీ, వాటిని అర్ధం చేసుకోడానికి ఇంతలేసి దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని అస్సలు ఊహించలేదు. నేనున్నది హంపి నడిబొడ్డున ఉన్న హజార రామస్వామి ఆలయ ప్రాంగణంలో. రామాయణ కథని వెయ్యి శిల్పాలలో వర్ణించి, ఆ శిల్పాలతో ప్రాంగణాన్ని అలకరించినందుకు గాను ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందని ఇతిహాసం. అయితే, ఏ శిల్పాన్ని చూసినా బాపూ బొమ్మే గుర్తొస్తోంది. బాపూ బొమ్మల్ని చూసి ఈ శిల్పాలు చెక్కే అవకాశం లేదు కాబట్టి, ఈ బొమ్మల నుంచి స్ఫూర్తి పొందే బాపూ తన దేవతామూర్తులకు ఆకృతి ఇచ్చి ఉంటారు. దానిని గడుసుగా చెప్పేందుకే హంపీ శిల్పాన్ని, బాపూ చిత్రాన్ని కలగలిపి అందాన్ని వర్ణించి ఉంటారు నిరుపమాన సినీ కవి.

హజార రామస్వామి ఆలయ గోపురం మీది ఒకానొక శిల్పం 

శ్రీకృష్ణ దేవరాయల అంతఃపురానికి చేరువలో ఉందీ ఆలయం. సీతారామలక్ష్మణుల విగ్రహాలని తొలగించినట్టుగా అంతరాలయంలో గుర్తులున్నాయి. రాయల పూర్వీకులు చిన్న ఆలయాన్ని నిర్మిస్తే, అదనపు హంగులన్నీ రాయల కాలంలోనే సమకూరాయంటోంది చరిత్ర. రాముడి బాల్యం నుంచీ వరుసగా ఒక్కో దృశ్యాన్నీ రాళ్ళలో చెక్కిన తీరుని చూడడం మొదలు పెడితే, వరుసగా పూర్తి చేయడానికి లేకుండా మధ్యమధ్యలో సంబంధంలేని విష్ణు కథలు దర్శనమిచ్చాయి. అంతే కాదు, పట్టాభిషేకంతో సహా కొన్ని ముఖ్యమైన సన్నివేశాల తాలూకు శిల్పాలు కనిపించలేదు. రాతిపలకల మీద సన్నివేశాలని చెక్కి, ఆ పలకల్ని గోపురం చుట్టూ అతికించడం తెలిసింది, చాలా జాగ్రత్తగా గమనిస్తే. కేవలం దేవతా మూర్తుల శిల్పాలే కాదు, నాటి జానపదుల జీవన శైలిని సూచించే బొమ్మలూ ఉన్నాయి మధ్యమధ్యలో. 

రామకథని దృష్టిలో ఉంచుకుని ఒక్కో బొమ్మనీ తాపీగా చూస్తూ, శిల్పుల కళా నైపుణ్యానికి అచ్చెరువొందుతూ, కథలో ఏయే సన్నివేశాల తాలూకు బొమ్మలు మిస్సయ్యాయో చూస్తూ ఉండగానే, ఒక్కొక్కటిగా టూరిస్టు బస్సులు ఆగడం, బిలబిల్లాడుతూ వచ్చే టూరిస్టులు క్షణాల్లో ఆలయం మొత్తం చుట్టేసి నాలుగైదు ఫోటోలు తీసుకుని తిరిగి వెళ్లిపోవడం. కొందరైతే ఫోటోలకి అడ్డం వస్తున్నాననుకున్నారో ఏమో, దాదాపుగా తోసినంత పని చేశారు. నాలాంటి అతికొద్ది మంది చాదస్తులు, విదేశీ టూరిస్టులు మాత్రమే ఎక్కువ సేపు గడిపారు ఆ ప్రాంగణంలో. కనిపించిన ప్రతి విషయాన్నీ శ్రద్ధగా నోట్స్ రాసేసుకుంటూ, శిల్పాలన్నింటినీ హడావిడిగా ఫోటోలు తీసేసుకుంటున్న ఒక స్త్రీ తనకి తానుగా వచ్చి పలకరించింది. ఆమె పేరు అరుణ, తమిళనాడుకి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. "విజయ విఠల ఆలయంలో మాత్రం మీరు గైడ్ ని ఏర్పాటు చేసుకోండి," అంటూ సలహా ఇచ్చింది, కొంత సంభాషణ తర్వాత. ఒక్కో ఆలయాన్నీ రెండు మూడు సార్లు వచ్చి చూస్తోందట ఆమె. 

నాట్య భంగిమలు చెక్కిన మండపాన్ని చూడగానే, మళ్ళీ వేటూరి గుర్తొచ్చేశారు, అప్రయత్నంగా. "కలికి చిలక కనిపించదేమే.." అంటూ చుట్టాల సురభి రంగాజమ్మ గారి గొంతు ఖంగుమన్న భావన. ఈ మండపంలోనే కదూ, 'సిరికాకొలను చిన్నది' అలివేణి నాట్యం చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది? ఇక్కడే కదూ, ఆమెకి జరిగిన అన్యాయం రాయలు దృష్టికి వచ్చింది? కల్పితమో కాదో తెలియదు కానీ, అలివేణి కథని వేటూరి చెప్పిన తీరు మాత్రం అపూర్వం. స్థంభాల మీద చెక్కిన నర్తకీమణుల శిల్పాల్లో అలివేణి శిల్పమూ ఉండి ఉంటుందనిపించింది. విజయనగర ఆర్కిటెక్చర్ ప్రత్యేకత ఏమిటంటే, కేవలం దేవుళ్ళ బొమ్మలు, జంతువులు, పక్షుల బొమ్మలతో పాటు, నాటి సంఘంలో అనేక వృత్తులు నిర్వహించిన స్త్రీ పురుషుల బొమ్మల్ని, విదేశీ వర్తకులు, యాత్రికుల బొమ్మల్ని కూడా చెక్కారు ఆలయాల మీద. నాటి జీవితాన్ని వారు రికార్డు చేసిన ఒక పధ్ధతి ఇదై ఉంటుంది బహుశా. 

ఆలయం వెలుపలి గోడల మీద రాళ్లతో చెక్కిన విజయనగర సామ్రాజ్యపు గజ బలాన్నీ, అశ్వ దళాన్నీ పరిశీలిస్తూ ముందుకు నడిస్తే రాయల అంతఃపురం.  అక్కడొకటి ఇక్కడొకటిగా మిగిలిన మహా నిర్మాణపు అవశేషాలు. అవేమిటో వివరిస్తూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన బోర్డులు. ఆ బోర్డుల్లో రాసింది చదువుకుంటూ, అవశేషాలని చూస్తూ, చరిత్రలో ఖాళీలని ఊహాశక్తి మేరకి పూరించుకున్న సందర్భమది. ఎత్తైన నవరాత్రి దిబ్బకి కొంచం దూరంలోనే, లోతైన స్నానఘట్టం. రెండుచోట్లా కళ్ళు చెదిరే రాతి పనితనం. ఆ రోజుల్లోనే తుంగభద్ర నుంచి అంతఃపురానికి నేరుగా నీళ్లు వచ్చేలా చేసిన ఏర్పాటు! ప్రజలు నేరుగా ప్రభువుకి తమ సమస్యలు విన్నవించుకునే అవకాశం, ఆ వేదిక లోపల విదేశీ రాయబారులతో అత్యవసర చర్చలు జరిపేందుకు అవసరమైన అండర్ గ్రౌండ్ ఛాంబర్. ఒక పక్క రాయలు పాలనని బేరీజు వేసుకుంటూనే, మరోపక్క నాటి శిల్పకళని, ఇంజినీరింగ్ అద్భుతాలనీ చూడడం. కళ్ళకీ, మెదడుకీ ఏకకాలంలోనే విపరీతమైన పని.

సామాన్యుల స్నానఘట్టం 

మొత్తం నిర్మాణాల్లో ఇప్పుడు మిగిలి ఉన్నవి కనీసం ఒక వందో వంతైనా ఉంటాయా అన్న సందేహం, వందో వంతే ఇలా ఉంటే ఇక మొత్తం నిర్మాణాలు ఎలా ఉండి ఉంటాయన్న ఆశ్చర్యార్ధకం!! ఎండ ఎక్కువగా ఉండడంతో పాటు, ఫోటోగ్రఫీకి అనువైన లొకేషన్లు లేకపోవడం వల్ల కాబోలు టూరిస్టుల తాకిడి పెద్దగా లేదిక్కడ. ఏకాంతాన్ని వెతుక్కునే జంటలు మాత్రం అక్కడక్కడా తారసపడ్డాయి.  తదుపరి మజిలీ 'క్వీన్స్ బాత్' అని పిలువబడే రాణీ వారల స్నానఘట్టం. బయటి నుంచి చూడ్డానికి పాడుబడిన నిర్మాణం అనిపించింది కానీ, లోపలి పనితనం కళ్ళు మిరుమిట్లు గొలిపింది. మొత్తం చెక్కడం పనిలో ఓ ఇరవై శాతం మిగిలి ఉందేమో. అయితేనేం, కట్టడానికి వాడింది సున్నమా లేక వెన్నా అనిపించేలా ఉంది ఇంటీరియర్ అంతా. గుండ్రటి ఇన్నర్ బాల్కనీ, కింద ఉన్న నీళ్ళలోకి వెళ్ళడానికి వీలుగా మెట్లు. బాల్కనీ అంతా స్నానానికి ముందు, తర్వాత రాణికి చేసే ఉపచారాలకి అనువైన ఏర్పాట్లు.  చాలా ఏళ్ళక్రితం వేసిన సినిమా సెట్టింగ్ లా అనిపించింది. 

ఎవరో పది పదిహేను మంది టూరిస్టులు కలిసి ఒక గైడుని ఏర్పాటు చేసుకున్నారు. ఆ గైడు చాలా ఉత్సాహంగా పెద్ద గొంతుతో వర్ణిస్తున్నాడు. "అత్తరు, పన్నీరు కలిపిన నీళ్లలో రాణీవారు స్నానం చేస్తూ ఉంటే, పరిచారికలు ఈ చుట్టూ నిలబడి రాణి మీదకి పూలు విసిరేవారు.." ఈ మాటలు చెవిన పడ్డంతోనే నవ్వొచ్చింది. "రాఘవేంద్రరావు సినిమాలు చూడ్డం కాస్త తగ్గించబ్బాయ్" అని ఆ గైడుకి సలహా ఇవ్వాలనిపించింది. ఇంతకీ ఈ స్నానఘట్టం ఏ రాణిది? తిరుమల దేవి కోసం కట్టించిందా? చిన్నాదేవి స్నానం చేసేదా? లేక, ఎస్. వరలక్ష్మి, దేవికల్లాగా ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారా? ఏవిటో, నా సందేహాల్ని ఏ గైడూ తీర్చలేడు. అన్నట్టు, ఈ స్నాన వాటికకి కూడా అండర్ గ్రౌండ్ నీళ్ల సరఫరా ఏర్పాటు ఉంది. తుంగభద్రా నీళ్లు మొదట ఇక్కడికి వచ్చి, ఇటు నుంచి రాజాంతఃపురానికి, అటుపైన సామాన్యులకీ సరఫరా అయ్యేలా ఉండేదిట ఏర్పాటు.


క్వీన్స్ బాత్ 

అలిసిపోయి హోటల్ కి వెళ్తే, అతిధుల కోసం శాస్త్రీయ నృత్య కార్యక్రమం ఏర్పాటు  చేశామన్నారు వాళ్ళు. 'కుమారి పద్మ నృత్య ప్రదర్శన కానీ కాదు కదా?' అని సందేహం వచ్చింది కానీ, ఏనాటి పద్మ? స్నానాదికాలు కానిచ్చి, లాన్లో ఏర్పాటు చేసిన వేదిక ఎదుట కూర్చుంటే, భరతనాట్యం నేర్చుకుంటున్న నలుగురమ్మాయిలు అరగంట పాటు నాట్యం చేశారు, ఐదారు పాటలకి. రెండు పాటలు భరతనాట్యం అని తెలిశాయి కానీ, నాలుగు పాటల తాలూకు శాస్త్రం ఏంటో బోధ పడలేదు. వేదిక పక్కనే అప్పటికప్పుడు అదనపు కాస్ట్యూమ్స్ ధరిస్తూ, కొంచం కూడా గ్యాప్ ఇవ్వకుండా నడిపారు ప్రోగ్రాంని. నలుగురూ నెమళ్ళ వేషం వేసుకుని ఓ హిందీ పాటకి చేసిన డేన్స్ మాత్రం భలేగా ఉంది. కార్యక్రమం అయ్యాక, కమల్ హాసన్ టోన్ రాకుండా జాగ్రత్త పడుతూ, ఆ నాలుగు పాటలకీ చేసిన డేన్స్ ఏ సంప్రదాయం అని ఇంగ్లీష్ లోఅడిగాను ఓ అమ్మాయిని. "సెమీ క్లాసికల్ అంకుల్" అని జవాబిచ్చింది మృదువుగానే. నెమళ్ళ పాట ప్రభావం కాబోలు, "నెమలికి నేర్పిన నడకలివీ.." పాడుకుంటూ నిద్రకి ఉపక్రమించాను. రెండో రోజు హంపీ యాత్ర ఆ విధంగా ముగిసింది. 

(ఇంకా ఉంది) 

8 వ్యాఖ్యలు:

 1. వేటూరి మహాశయులే మీకు గైడ్ అయ్యారన్నమాట మొత్తానికి. ఈ వేడినీళ్ళ పంపిణీ పద్ధతి మన గోల్కోండ కోటలో కూడా ఉందండీ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పుస్తకం చదివినా, యాత్ర చేసినా ఎవరికీ అందని కోణమేదో మీకు గోచరమౌతుంది!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "రాజుల సొమ్ము రాళ్ళ పాలు" అని ఉస్సురుస్సురనుకుంటూ చూసిన ఊరు హంపీ. :) మీ మాటల్లో మళ్ళీ చూడటం బాగుంది. ఏవండీ, అన్ని పాటలు తల్చుకున్నారు..చందమామ పాటలేం పాపం చేశాయి :)))
  నాకా పాటలు చూస్తే హంపీ, హంపీ గురించి చూస్తే ఆ పాటలు గుర్తు రావడం రివాజైపోయింది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విరూపాక్ష ఆలయ ప్రాంగణంలో ఆయుర్వేద డిస్పెన్సరీ చూడగానే నాకు 'చందమామ' గుర్తొచ్చిందండీ.. కృష్ణవంశీ హంపి మీద కన్నా హీరోయిన్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడని నా ఫిర్యాదు :) ..ధన్యవాదాలు. 

   తొలగించు
 4. వేటూరివారి పాటలతో మీ టూరు మాటలు బావున్నాయి :)

  ప్రత్యుత్తరంతొలగించు