శుక్రవారం, ఫిబ్రవరి 14, 2020

C/o. కంచరపాలెం

కొంతమంది కవులు, రచయితలూ 'జీవితంలో ప్రేమ అనేది ఒక్కసారే పుడుతుంది, ఒక్కరిమీదే పుడుతుంది' లాంటి గంభీరమైన స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కానీ, వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రేమించడం, ప్రేమని పొందడం, ఆ ప్రేమని ఒక శాశ్వత బంధంగా తర్జుమా చేసుకోవడం, అటుపైని కూడా ఆ ప్రేమని నిలుపుకోవడం.. ఇదో సుదీర్ఘమైన ప్రయాణం. ప్రేమలో పడిన వాళ్ళందరూ ఈ అన్ని దశలనూ దాటుకుని ముందుకి వెళ్లలేకపోవచ్చు. ఎందుకంటే, ప్రేమ అంత సులభం కాదు. ఎన్నో పరీక్షలు పెడుతుంది. వాటిని గెలవమని శాసిస్తుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు స్థిరంగా లేకపోయినా, రెండో ఆలోచనలో పడినా గెలవడం కల్ల. గెలుపు కోసం తీవ్రమైన ప్రయత్నం చేసిన వాళ్లకి, ఆ ప్రయత్నాన్ని చుట్టూ ఉన్న వాళ్ళు అర్ధం చేసుకునేలా చేయగలిగిన వాళ్ళకీ మాత్రం అయిన వాళ్ళ నుంచి మద్దతు దొరుకుతుంది. అయితే, దానిని సాధించగలిగే జంటలు బహుకొద్దే.  రండి, ఈ ప్రేమికుల రోజున మనం అలా కంచరపాలెం వెళ్లి, కొంతమంది ప్రేమికుల్ని పలకరించి వద్దాం.


సుందరం ఓ పదిహేనేళ్ల కుర్రాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. నల్లని కళ గల ముఖం, ఆకర్షించే కళ్ళు. ఉత్సాహం ఉరకలెత్తే తొలి యవ్వనంలో ఉన్న ఆ కుర్రాడు, తనతో చదివే సునీత అనే అమ్మాయి మీద ఆకర్షణ పెంచుకున్నాడు. యవ్వనం ఒక్క సుందరాన్నే కాదు, సునీతనీ ఆవహించింది. ఫలితం, సుందరం వైపు దొంగ చూపులు, ముసిముసి నవ్వులు. స్కూల్లో జరిగే వేడుకలో 'భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్..' అంటూ పాట పాడడమూను. 'ఓ అబ్బాయ్ సుందరం' అంటూ ఆమె పలకరిస్తే, 'యేంటమ్మాయ్ సునీతా' అంటూ బదులిస్తూ ఉంటాడు. మరికొన్నాళ్ళు ఆగితే, సునీత-సుందరాలకి ఒకరి మీద ఒకరికి కలిగిన ఆకర్షణ ప్రేమగా రూపు దిద్దుకుని ఉండేదేమో. కానీ, విధి వాళ్ళిద్దరినీ దూరం చేసింది. సుందరానికి వీడ్కోలైనా ఇవ్వకుండా సునీత వేరే ఊరికి వెళ్ళిపోయింది. అంతమాత్రాన, వాళ్ళిద్దరి జీవితాలూ అక్కడే ఆగిపోవాలా? ఆ ఆకర్షణ/ప్రేమని తల్చుకుంటూ ఇద్దరూ మిగిలిన జీవితాన్ని ఒంటరిగా గడిపేయాలా? 

జోసెఫ్ వయసు పాతిక్కి కాస్త అటూ ఇటూ. చింపిరి జుట్టు, మాసిన గెడ్డం. ప్రపంచం మీద పెద్దగా లక్ష్యం లేనట్టుండే వస్త్రధారణ. మెళ్ళో గొలుసులో వేలాడే శిలువ. వృత్తి ఆకురౌడీ. చిన్న చిన్న దందాలు చేస్తూ బతికేస్తూ ఉంటాడు. అలాంటివాడు ఉన్నట్టుండి భార్గవితో ప్రేమలో పడ్డాడు. ఆమె బ్రాహ్మణ పిల్ల. కాలేజీలో చదువుకుంటోంది. తల్లి చనిపోయింది. ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేసే తండ్రే ఆమెని అన్నీఅయి పెంచుతున్నాడు. వండి పెట్టడం మొదలు, డేన్స్ క్లాసులకి తీసుకెళ్లి, తీసుకు రావడం వరకూ కూతురికి సంబంధించిన ప్రతి పనినీ ఇష్టంగా చేస్తూ ఉంటాడు. భార్గవి జోసెఫ్ తో ప్రేమలో పడింది. నిజానికి జోసెఫ్ భార్గవిని ప్రేమించడం వెనుక చొరవ భార్గవిదే. ప్రేమలో పడడం భార్గవికి అదే మొదలు. కానీ, జోసెఫ్ వెనుక ఓ విఫల ప్రేమ గాధ ఉంది. అయితే, భార్గవి చొరవ అతన్ని అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. ఆమె కోసం తన అలవాట్లని మార్చుకునే ప్రయత్నాలు మొదలు పెడతాడు. బతుకుతెరువు కోసం ఓ చిన్న ఉద్యోగంలో కుదురుకుంటాడు కూడా. తండ్రి, జోసెఫ్ ఇద్దరిలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాల్సి పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి వైపే మొగ్గాల్సి వస్తుంది భార్గవికి. జోసెఫ్ ఇక జీవితంలో మళ్ళీ ప్రేమ వైపు వెళ్లకూడదా? 


'గెడ్డం' వయసు ముప్ఫయ్ ఐదేళ్లు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. లవ్ ఫెయిల్యూర్స్ తో సహా ఎంతో జీవితాన్ని చూసేశాడు. చూడ్డానికి కాస్త నిర్లక్ష్యంగా, ఇంకాస్త పొగరుగా ఉంటాడు. వెనుకా ముందూ ఎవరూ లేకపోవడమే అతని బలం, బలహీనత కూడా. బతుకు తెరువు కోసం ఒక లిక్కర్ షాపులో సేల్స్ మాన్ గా పని చేస్తున్నాడు. అతని షాపులో రోజూ లిక్కర్ కొంటూ ఉంటుంది సలీమా, ఓ పేద ముస్లిం యువతి. ఎప్పుడూ స్కార్ఫ్ లో ఉండే సలీమా మొహంలో ప్రస్ఫుటంగా కనిపించేవి ఆమె కళ్ళు. ఆ కళ్ళు ఎంతగానో ఆకర్షించాయి గెడ్డాన్ని. ప్రతి రాత్రీ క్రమం తప్పకుండా లిక్కర్ కొనే సలీమా, షాపులో పనిచేసే అందరికీ ఓ మిస్టరీ. గెడ్డాన్ని ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళు, 'నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది' అంటూ. క్రమంగా ఆమె మీద ఆసక్తి పెరుగుతుంది గెడ్డానికి. ఒక రోజు ఆమెని వెంబడిస్తాడు. ఆమెని గురించి తెలుసుకుంటాడు. బతుకుతెరువు కోసం ఆమె వేశ్యా వృత్తిలో ఉందని తెలిసినప్పుడు, సలీమా మీద గౌరవం కలుగుతుంది గెడ్డానికి. తన ప్రేమని ప్రకటిస్తాడు. కొంత సంశయం తర్వాత, సలీమా అతని ప్రేమని అంగీకరిస్తుంది. పెళ్లి చేసుకుని కొత్తజీవితం మొదలు పెట్టాలనే ప్రయత్నాల్లో ఉన్న గెడ్డానికి, సలీమా మాయమైపోవడం  ఊహకందని షాక్. గెడ్డం ఇప్పుడు అస్తమిస్తున్న సూర్యుడి వైపు నడిచి వెళ్లిపోవాలా? 

రాజు వయసు యాభైకి దగ్గర. ప్రభుత్వ ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తున్నాడు. అతని తల మీద వెంట్రుకల్లాగే అతని అనుభవాలూ పండిపోయాయి. వాటిలో కొన్ని ప్రేమానుభవాలూ ఉన్నాయి. కారణాలు ఏవైనా, రాజు అవివాహితుడిగా ఉండిపోయాడు. తన వాళ్ళు అంటూ ఎవరూ లేని అతను, ఊళ్ళో అందరినీ ఆప్తులుగా భావిస్తూ ఉంటాడు. రాజుని ఓ ఇంటి వాడిని చేయాలని ఊళ్ళో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ, వాళ్ళ ప్రయత్నాలు ఫలించవు. ఇంతలో అతని ఆఫీసుకి బదిలీ మీద వస్తుంది రాధ. వితంతువైన రాధకి టీనేజ్ కూతురు ఉంది. ఉద్యోగం ఉన్నా స్వతంత్రం లేదామెకి. తమ్ముడి ఇష్టాలకి తగ్గట్టుగా నడుచుకుంటూ ఉంటుంది. రాజు మంచితనం రాధని ఆకర్షిస్తుంది. రాజుకి కూడా రాధ మీద ఇష్టం కలుగుతుంది. అప్పటివరకూ తన పెళ్లి కోసం ఊళ్ళో వాళ్ళు చేసే ప్రయత్నాల్ని పెద్దగా పట్టించుకోని రాజు, రాధతో పరిచయం పెరిగాక, జీవితంలో తోడు అవసరాన్ని గుర్తిస్తాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. రాధ కూతురికి ఈ పెళ్లి అంగీకారమే. కానిదల్లా రాధ సోదరుడికే. తన అక్క మళ్ళీ పెళ్లి చేసుకోవడం సంప్రదాయం కాదు అని వాదిస్తాడు అతను. రాజు తన ప్రేమలో ఓడిపోతున్న సందర్భంలో కంచరపాలెం ఊరంతా కలిసి, కదిలి వస్తుంది. రాజునీ, రాధనీ ఒకటి చేస్తుంది. 

విశాఖపట్నం మహానగరాన్ని ఆనుకునే ఉన్నా, పల్లెటూరి పోకడల్ని మిగుల్చుకున్న ఊరు కంచరపాలెం. అక్కడ వాళ్ళకి తమ చుట్టూ ఏం జరుగుతోందో కావాలి. పక్క వాళ్ళ అజ కావాలి. కొత్త వాళ్ళని కాస్త సందేహంగా చూడడం, తన వాళ్ళకోసం ఏదైనా చేయడం అనే లక్షణాలు అక్కడి సమాజంలో ఇంకా ఉన్నాయి. అందుకే, రాజు-రాధల ప్రేమ కథలో కంచరపాలెం కీలకమైన పాత్ర పోషించింది. మరి, ఇదే కంచరపాలెం సుందరం-సునీత, జోసెఫ్-భార్గవి, గెడ్డం-సలీమాల విషయంలో ఎందుకు నిర్లిప్తంగా ఉండిపోయింది? ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన 'C/o. కంచరపాలెం' సినిమా చూడాలి. సెప్టెంబర్ 7, 2018 న విడుదలైన ఈ సినిమాలో ప్రత్యేకతలు ఎన్నో. నటీనటులందరూ కొత్తవాళ్లే. దర్శకుడితో సహా చాలామంది సాంకేతిక నిపుణులకి ఇది తొలి సినిమా. అమెరికాలో డాక్టరుగా పని చేస్తున్న విజయ ప్రవీణ పరుచూరి తొలిసారి సినిమా నిర్మాణంలోకి రావడమే కాక, సీనియర్ నటీమణులు కూడా చేయడానికి తటపటాయించే సలీమా పాత్రని అలవోకగా పోషించారు. స్వీకార్ అగస్తి స్వరకల్పనలో పాటలన్నీ నాలికమీద ఆడేవే. 


అన్నింటినీ మించి అత్యంత సహజమైన కథ, కథనం. ఒకట్రెండు సన్నివేశాల్లో మినహా ఎక్కడా మెలోడ్రామా కనిపించదు. అంతేకాదు, తెలుగు సినిమా 'సెన్సిటివ్' గా భావించే కులం, మతం అనే విషయాలని గురించి ఈ సినిమాలో పాత్రలు చాలా బోల్డ్ గా మాట్లాడతాయి. అలాగని నేటివిటీని అడ్డుపెట్టుకుని నాటుగా తీయలేదు సినిమాని. సునీత దూరమైందని తెలిసిన సుందరం కోపంతో వినాయకుడి విగ్రహాన్ని పాడుచేసినా, భార్గవి తండ్రి క్రైస్తవ కూడికలని గురించి తేలికగా మాట్లాడినా, పెళ్లికాని రాజుని ఊళ్ళో అందరూ 'నట్టు గాడు' అంటూ ఏడిపించినా ఇవన్నీ కథలో భాగంగానే అనిపిస్తాయి తప్ప, అభ్యంతర పెట్టేవిగా అనిపించవు, సినిమాలో లీనమైపోయిన ప్రేక్షకులకి. ఈ ప్రేమ జంటలేవీ విదేశాల్లో డ్యూయెట్లు కలగనే అంత స్తోమతు కలిగినవి కాదు. మధ్య మధ్యలో విశాఖ, సింహాచలం, అరకు అలా మెరుస్తూ ఉంటాయి తప్ప మొత్తం సినిమా అంతా కంచరపాలెం వీధుల్లోనే జరుగుతుంది. డైలాగుల్లో పంచులు, ప్రాసలు ఉండవు. పాత్రల స్థాయిని మరచి, నేల విడిచి సాము చేసే సంభాషణలు అసలే ఉండవు. ఇలా కూడా సినిమాని తీయొచ్చు అని నిరూపించింది ఈ చిత్ర బృందం. ఇప్పటివరకూ ఈ సినిమాని చూడకపోతే ప్రేమికుల రోజుని మించిన మంచి సందర్భం దొరకదు కాబట్టి, చూసేయండి. ఓటీటీ ప్లాట్ఫామ్ మీద దొరుకుతోంది. చూసిన వాళ్లకి కూడా, ఒకవేళ మళ్ళీ చూడాలనిపిస్తే ఎందుకూ ఆలస్యం? 

17 కామెంట్‌లు:

  1. ఈ సినిమాని థియేటర్లో చూసుంటే ఎంత బావుండేదో అని ఎన్నిసార్లు అనుకున్నానో - ఓ మంచి సినిమాకి మా వంతు రెండు టికెట్లు చేర్చలేకపోయామని బాధ. సినిమా గురించి చాలా బాగా రాశారు మీరు. చప్పట్లండి, మురళి గారు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @లలిత: నేను థియేటర్లో చూశానండి.. ఇండియాలో బాగానే ఆదరించారు ప్రేక్షకులు. ధన్యవాదాలు. 

      తొలగించండి
  2. మీరు రాయాలని , రాస్తే చదువుదామని ఎదురు చూసేది ఎందుకో మొదటి పేరాగ్రాఫ్ చెపుతుంది సారూ ..
    Asusual brilliant and thank you so much .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ సినిమా నా చేత అలా రాయించిందండీ, ఆపై మీ అభిమానం.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  3. ఈ సినిమా ఎన్నిసార్లు చుద్దామనుకున్నా అన్నిసార్లు కుదరలేదు. మీ రివ్వూ అద్భుతంగా వుంది. మళ్ళీ చూసే ప్రయత్నం చెయ్యాలనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పకుండా చూడండి.. లొకేషన్స్, నేటివిటీతో మీరు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ధన్యవాదాలు. 

      తొలగించండి
  4. చాలా మంచి సినిమా. లలితగారన్నట్లు సపోర్టు కావాల్సింది ఇటువంటి సినిమాలకే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసుకోడం వల్ల జనంలోకి బాగానే తీసుకెళ్లగలిగారండీ.. ధన్యవాదాలు. 

      తొలగించండి
  5. మీ సలహా ప్రకారం ఈ రోజునే (ఇటువంటి వ్యాపారపూరిత వేలంవెర్రి “రోజుల”తో నాకేమీ సంబంధం లేకపోయినా) ఈ సినిమా చూశానండి Netflix లో. ఇంతకు ముందు చూడలేదు. సినిమావాళ్శ ఊతపదం వాడాలంటే “డిఫరెంట్” గా ఉంది. refreshingly different. బాగుంది.

    సినిమాలో “రాజు” పాత్రధారి (సుబ్బారావు) బాగా చేశాడని నాకు అనిపించింది. తరువాత చిన్నప్పటి “సునీత” పాత్ర వేసిన అమ్మాయి. తరువాత “సలీమా” (నిర్మాత ప్రవీణ). శిల్పి వేషం వేసినతను కూడా.

    నాకు తోచిన లోపం ఒకటి ... ఆఫీసులో ప్యూన్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పట్ల (ఎంత మంచివాడు అయినప్పటికీ) పై స్ధాయి ఉద్యోగిని ఆకర్షితురాలవడం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది నాకు. ఇద్దరు వేరే వేరే స్ధాయి ఉద్యోగులు పెళ్ళి చేసుకోవడం అంత అరుదేమీ కాదు గానీ ఆ ఇద్దరిలో ఒకరు మరీ అటెండర్ అంటే .... కాస్త unusual గా అనిపించింది నా మట్టుకు. సర్లెండి, ఏదో సినిమాటిక్ గా ఉండాలిగా. ఇది మినహా అన్ని విధాలా మెచ్చుకోదగ్గ సినిమా. ఆ మూడు ప్రేమకథలనూ చివరకు “రాజు” పాత్రకు అన్వయించడం మంచి touch.

    అర్థంపర్థం లేని వెర్రిమొర్రి ప్రేమకథలు రాజ్యమేలుతున్న ఈ కాలంలో పైన నేనన్నట్లు refreshingly different చిత్రం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజ జీవితం లో జరగని ఘటనలు కథల్లో జరుగుతాయండీ. అక్కడ కూడా జరగడానికి వీల్లేదు అంటే ఎలా మహాశయా!
      కథలో ఏమైనా జరగొచ్చు. ప్రధానమంత్రి పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే ఏ బుచికో విలన్ లా అడ్డుపడొచ్చు!

      తొలగించండి
    2. అలాగాండీ, మరి నిజ జీవితంలో జరుగుతున్నవే సినిమాలో చూపిస్తున్నాం అంటూ చిలకపలుకులు పలుకుతుంటారు కదా సినిమావాళ్ళు, మహాశయా?🤔

      ఎంత కథయినప్పటికీ, ఎంత రచయిత గారి poetic licence అని సరిపెట్టుకుందామనుకున్నప్పటికీ ..... తెర మీద చూడడానికి ఎబ్బెట్టుగా ఉండకూడదనీ, ముఖ్యంగా చూసేవారి నిజజీవిత ప్రవర్తనను adverse గా ప్రభావితం చేయకూడదనీ ... నా వ్యాఖ్య కవిహృదయం, నా అభిప్రాయమున్నూ.

      తొలగించండి
    3. నిజ జీవితం లో జరిగే ఘటనలు సినిమాల్లో ఉంటాయి.
      కానీ సినిమాల్లో చూపించే ఘటనలు అన్నీ నిజ జీవితం లో ఉండాలని లేదు.

      తొలగించండి
    4. అది నాకూ అర్థమైంది. అయితే నిజజీవితంలో జరుగుతున్న....వే.... ( = మాత్రమే) చూపిస్తున్నామని కదా సినీవర్గాల క్లెయిమ్. వేదికలెక్కి వారు అంత గట్టిగా చెబుతుంటే ఇంక దానికి మనం corollary లాగటానికి వీలవదు కదా అని నా భావం. అయ్యా, సినిమా కథ అన్నప్పుడు కొంత మేర ఊహాజనితంగా ఉండడం, కాస్త నేల విడిచి సాము జెయ్యడం అవసరమే కదా, లేకపోతే రక్తి కట్టదు కదా అని సినిమావారు ఒప్పుకుంటే ఓకే. కానీ వారు ఆ మాట అనరే. ఆ hypocrisy గురించి నేను చెప్పేది.

      ఇటువంటి చర్చల్లో ఎవరి అభిప్రాయాలు వారివి, తప్పు లేదు. కాబట్టి చివరగా మరొక్క మాట మాత్రం చెప్పి నా వైపు నుండి ఈ చర్చ ముగిస్తాను. ఈ సినిమాలో చూపించిన అటువంటి అంశం వైవాహిక జీవితంలో incompatible arrangement గా పరిణమిస్తుందనీ (ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా), ఒక్కోసారి విఫలమయ్యే ప్రమాదాన్ని కూడా rule out చేయలేమనీ, అందువల్ల చేతిలో కలం ఉందనీ artist’s liberty అనీ వ్రాసెయ్యకుండా కథను మలచడంలో మరి కాస్త బాధ్యత చూపించాలనీ, ఆ అంశం తప్ప మిగిలిన సినిమా బాగుందనీ
      ... అనేది నా నిశ్చితాభిప్రాయం అని తెలియజేసుకుంటూ .... స్వస్తి.

      తొలగించండి
    5. @విన్నకోట నరసింహారావు: అరుదేనేమో కానీ, నిజజీవితంలో ఇలాంటి జంటలు లేకపోలేదండి. నా మిత్రుడు ప్రయివేటు ఉద్యోగి, అతని భార్య ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళ పిల్లల చదువులు పూర్తవ్వబోతున్నాయి. మీరన్నట్టుగా సినిమాటిక్ లిబర్టీ అని కూడా అనుకోవచ్చు. ధన్యవాదాలు.. @సూర్య: ధన్యవాదాలండీ.. 

      తొలగించండి
  6. చాలా మంచి సినిమానండీ.. సినిమాకి తగిన రివ్యూ.. వంశీ చెప్పినట్లు ఫస్ట్ పేరాకి హాట్సాఫ్.. పాటలు నాక్కూడా చాలా నచ్చేశాయి దదాపు అన్ని పాటలూ ఇప్పుడు కూడా వింటూ ఉంటాను..

    రిప్లయితొలగించండి
  7. సినిమా చూసినప్పుడు ఎంత మంచి ఫీలింగ్ కలిగిందో మీ పోస్ట్ చదువుతుంటే అంతకంటే మంచి అనుభవం కలిగింది. సదరు సినిమా డైరెక్టర్ మాదిరిగానే సినిమా క్లైమాక్స్ ని దృష్టిలో పెట్టుకుని అసలు విషయాన్ని గుట్టుగా వుంచి చాలా బాగా వ్రాసారు.

    రిప్లయితొలగించండి