గంధం నాగరాజు పేరు చెప్పగానే 'గమ్యం' సినిమాలో సంభాషణలు గుర్తొస్తాయి. 'బాణం' 'సొంత ఊరు' లాంటి వైవిద్యభరిత సినిమాలూ అదే వరసలో గుర్తొస్తాయి. రాసింది తక్కువ సినిమాలకే అయినా, సినిమా సంభాషణల మీద తనదైన ముద్ర వేసిన నాగరాజు మొదట నాటక రచయిత. తర్వాత కథా రచయితగా ప్రయాణం సాగించి, సినీ రచయితగా ఎదిగి నలభై రెండేళ్ళ పిన్న వయసులోనే ప్రపంచాన్నివిడిచి పెట్టేశారు. నాగరాజు స్మృత్యర్ధం ఆయన రాసిన పదిహేను కథలతో వెలువరించిన సంకలనమే 'కథా సుగంధాలు.'
పుస్తకాన్ని చేతిలోకి తీసుకోగానే 'గమ్యం' సినిమా గుర్తు రావడం వల్ల కాబోలు, చాలా అంచనాలతో కథలు చదవడం మొదలు పెట్టాను నేను. అయితే, 'గమ్యం' సినిమా వరకూ నాగరాజు చేసిన సాహితీయానంలో ఈ కథలు రాశారన్న ఎరుక కలగడానికి ఎన్నో పేజీలు పట్టలేదు. రొమాన్స్, సెంటిమెంట్, హాస్యం అనే వర్గాలలో ఏదో ఒకదానిలో ఇమిడిపోయేలా ఉన్నాయి మెజారిటీ కథలు. ఇంకా చెప్పాలంటే, ఫలానా వర్గంలో కథ రాయాలి అని ముందుగానే అనుకుని ఆపై కథా రచన సాగించారేమో అనిపించింది.
'సృష్టి,' 'జీవితానికో పుష్కరం,' 'దుప్పటి' కథలు 'సరసమైన కథల' కేటగిరీలోకి వస్తాయి. వీటిలో గోదావరి పుష్కరాలు నేపధ్యంగా రాసిన 'జీవితానికో పుష్కరం' ఆకట్టుకునే కథ. తర్వాత నిలబడేది 'దుప్పటి' కథ. 'వెల్లవేసి చూడు,' 'పాకలహరి,' 'వెంకటప్పయ్య ట్రా(డ్రా)మా కేర్' హాస్య కథలు. పాత్రలు, సన్నివేశాల నుంచి హాస్యం పుట్టించడానికి రచయిత చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. వీటిలో, 'పాకలహరి' కథ భరాగో రాసిన 'వంటొచ్చిన మగాడు' కథని జ్ఞాపకం చేసింది.
'చెరువు,' 'జన్మభూమి,' 'క్షమయా ధరిత్రి' కథలు వ్యవసాయాన్ని, మరీ ముఖ్యంగా వ్యవసాయరంగ సంక్షోభాన్ని ఇతివృత్తంగా రాసినవి. 'పునరావాసం' కథలో నక్సల్ ఉద్యమాన్ని స్పృశించిన నాగరాజు, 'అపరాజిత' కథని స్త్రీవాద కోణంలో రచించారు. 'అబార్షన్' కథ అబ్ స్ట్రాక్ట్ గా అనిపిస్తుంది. ట్రీట్మెంట్ విషయంలో మరికొంచం శ్రద్ధ పెడితే బాగుండేది అనిపించిన కథ 'రజ్జు సర్ప భ్రాంతి.' మానవనైజం ఇతివృత్తంగా సాగే కథ ఇది.
మొత్తం సంకలనంలో నన్ను బాగా ఆకట్టుకున్న కథ 'తెల్ల మచ్చల నల్ల క్రోటన్ మొక్క.' పేరులాగే కథలోనూ ఎంతో వైవిధ్యం ఉంది. అపరాధ పరిశోధన ఇతివృత్తంగా సాగే ఈ కథ ఆసాంతమూ ఊపిరి బిగపట్టి చదివించడమే కాదు, ఊహకందని ముగింపుతో ఆశ్చర్య పరుస్తుంది కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఒక్క కథ కోసం ఈ పుస్తకం కొనుక్కోవచ్చు అనిపించింది. మళ్ళీ మళ్ళీ చదివిన కథ ఇది.
మొత్తంగా చూసినప్పుడు కథల్లో వైవిధ్యం చూపడానికి నాగరాజు చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. ఇతివృత్తం మొదలు మాండలీకం వరకూ ప్రతి విషయంలోనూ ఏ రెండు కథలకీ పోలిక ఉండని విధంగా శ్రద్ధ తీసుకున్నారు. అయితే మితిమీరిన నాటకీయత, బలవంతపు హాస్యం కోసం చేసిన ప్రయత్నాలని తగ్గించుకుంటే మరింత బాగుండేది అనిపించింది.గంధం నాగరాజు కుటుంబం, స్నేహితులు కలిసి ప్రచురించిన ఈ సంకలనం అచ్చుతప్పులు ఎక్కువే. అయితే, నాగరాజు కథలు కను మరుగు కాకుండా ఉండడానికి చేసిన ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే. (పేజీలు 190, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
మురళి గారు.....నమస్తే
రిప్లయితొలగించండిమీ పుస్తక పరిచయం చాల బాగుంటుంది......మీరు రాసిన విశ్లేషణ ఆధారంగా నేను కొన్ని పుస్తకలు కొనుక్కున్నాను.......
Mere visleshana baagundi
రిప్లయితొలగించండి@శ్రీలు: చాలా సంతోషం అండీ.. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@నాగ శ్రీనివాస పేరి : ధన్యవాదాలండీ..