నలభయ్యేళ్ళ నాటి ఈ నవలని ఇవాళ మళ్ళీ
ప్రస్తావించుకోడానికి ఏకైక కారణం శ్రీరమణ. భార్యాభర్తల చిలిపి తగువులకి తన
మార్కు చమక్కులని అద్ది, మళ్ళీ చదివినా బోర్ కొట్టని విధంగా తీర్చి
దిద్దారు. ఇప్పటికైతే, శ్రీరమణ ప్రచురించిన ఏకైక నవల ఇది. మరో నవల
రాబోతోందని చాన్నాళ్లుగా ఊరిస్తున్నారు కానీ, వస్తున్న అజ కనిపించడం లేదు.
పురాణం సుబ్రహ్మణ్య శర్మ సంపాదకత్వంలోని 'ఆంధ్రజ్యోతి' వారపత్రికలో 1978-79
కాలంలో సీరియల్ గా వచ్చి, అటుపై ఒకే ఒక్క సారి నవలగా ప్రింట్ అయ్యి
కొద్దిపాటి లైబ్రరీలకి మాత్రమే పరిమితమైన ఈ పుస్తకాన్ని తాజాగా
ప్రచురించారు సాహితి ప్రచురణలు వారు.
కథలోకి వెళ్ళిపోతే,
రాంపండు-గీత కొత్తగా పెళ్ళైన దంపతులు. ఇద్దరూ ఉద్యోగస్తులు మరియు వేరేటి
కాపురం. రాంపండు 'స్వీట్ హోమ్' నవల్లో బుచ్చిబాబు లాగా అమాయకుడు మరియు
మంచివాడు. గీతకూడా అచ్చం అదే నవల్లో విమల లాంటిదే. ప్రేమించి పెళ్లి
చేసుకోవాలనీ, ఆ పెళ్ళిలో పూసల పల్లకీలో ఊరేగాలనీ రాంపండు చిరకాల వాంఛ. ఆ
రెండు కోరికలూ తీరనే లేదు. కవిత్వం రాయాలనే, ఇల్లు కళాత్మకంగా
అలంకరించుకోవాలనీ.. ఇలా చాలా చాలా ఊహలే ఉన్నా, వాస్తవాలు వేరే రకంగా
కనిపిస్తూ ఉంటాయి. ఏమాటకామాటే, కొత్త కాపురం అవ్వడం వల్లనో ఏమో కానీ, గీత
అనుకూలవతి అయిన ఇల్లాలే. అయినా కూడా రాంపండులో ఏదో అసంతృప్తి.
ఆఫీసులో
వాళ్ళు, స్నేహితులూ రాంపండు మంచితనాన్ని వాడేసుకుంటూ ఉంటారు. ఫలితంగా
అతగాడు అప్పుడప్పుడూ చిక్కుల్లో పడుతూ ఉంటాడు. ఆ చిక్కుల్నించి గీతే
అతగాణ్ణి ఒడ్డున పడేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు గీతమీద విపరీతంగా
ప్రేమకలిగినా, ప్రేమలేఖలు, పూసలపల్లకీ మిస్సైన బాధని ఓ పట్టాన
మర్చిపోలేకుండా ఉంటాడు. ఈ సమస్యకి కూడా గీతే పరిష్కారం వెతికింది. "ఇద్దరం
కొన్నాళ్ల పాటు ప్రేమికులుగా ఉండిపోదాం" అని ప్రతిపాదించి, రాంపండు ని
ఒప్పించేస్తుంది. ప్రేమికులైపోవడం అంటే భావగీతాలు పాడుకోవడం అన్నట్టుగా
కలల్లో తేలిపోవడం ఆరంభిస్తాడు మన కథానాయకుడు.
"ప్రేమికులు
వంట చేసుకోరు" అంటూ హోటల్ కేరేజీ తెప్పించడం మొదలు, "ఇంటి పనులుంటే
ప్రేమించడం కుదరదు" అని పనిపిల్లని కుదర్చడం వరకూ రాత్రికి రాత్రే
అప్పటివరకూ వస్తున్న ఇంటి పధ్ధతిని సమూలంగా మార్చేస్తుంది గీత. ప్రేమ
జీవితం బాగుందో బాలేదు రాంపండు తేల్చుకోక మునుపే, "ప్రేమికులకి విరహం అవసరం
రామ్" అని చెప్పి, ఉద్యోగానికి సెలవు పెట్టి పుట్టింటి రైలెక్కేస్తుంది
గీత. కథ కంగాళీ అయిపోకుండా రక్షించడం కోసం, గీత చెల్లెలు సీతని కథలో
ప్రెవేశ పెట్టి ఆమెకి పెళ్లి కుదురుస్తారు రచయిత. ఆ పెళ్ళిలో రాంపండు పడ్డ
పాట్లు అన్నీ ఇన్నీ కావు. పూసల పల్లకీ గురించి అతగాడికి జ్ఞానోదయం కలగడం
నవలకి ముగింపు.
గీత మాట్లాడే మాటలు, చేసే పనులు చాలాసార్లు
'పెళ్ళిపుస్తకం,' 'మిస్టర్ పెళ్ళాం' సినిమాల్లో నాయికలని గుర్తు చేశాయి.
బాపూకి గీత పాత్ర చాలా ఇష్టమని, ఆ ఇద్దరు నాయికల మీద గీత ప్రభావం ఉందనీ
శ్రీరమణ రాసిన ముందుమాటని చివర్లో చదివినప్పుడు తెలిసింది. ముందుగా టైటిల్
తో ప్రకటనలు ఇచ్చేశారనీ, కాలమ్ రాసినట్టే ఏ వారానికి ఆదివారం
రాసిచ్చేయొచ్చు అనుకుని ముందస్తు ఏర్పాట్లు పెద్దగా చేసుకోకుండా నవలా
రచనలోకి దిగిపోయాననీ ఒప్పేసుకున్నారు కూడా. ఈ సీరియల్ విజయవంతమైన ఉత్సాహంలో
పురాణం 'రంగుల రామచిలుక' అనే సీరియల్ ప్రకటన ఇచ్చేశారట కానీ, రాసేందుకు
శ్రీరమణ ఒప్పుకోలేదట.
'ప్రేమపల్లకీ' దగ్గరకి వస్తే, సత్తా
ఉన్న రచయిత సాధారణమైన విషయాన్ని కూడా చదివించేలా ఎలా రాయగలడు అన్న దానికి
ఉదాహరణగా చెప్పొచ్చు. నవలంతా ఒకే గ్రాఫ్ లో వెళ్లకుండా, అక్కడక్కడా ఆసక్తి
తగ్గిపోతూ ఉండడం, ఆ వెంటనే కథలో మలుపు చోటు చేసుకోవడం గమనించినప్పుడు
పాఠకాభిరుచికి అనుగుణంగా అప్పటికప్పుడు రచయిత తన సీరియల్ లో మార్పులు
చేసుకున్న వైనం అర్ధమవుతుంది. రాంపండు పాత్రని కాస్తైనా వాస్తవానికి
దగ్గరగా చిత్రించి ఉంటే చాలా ఆసక్తికరమైన నవల అయి ఉండేది అనిపించింది.
(పేజీలు 176, వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
మంచి పుస్తకాలను, సినిమాలను పరిచయం చేస్తూన్నందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ప్రియరాగాలు: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి