సోమవారం, అక్టోబర్ 15, 2018

కొత్తనీరు

మూడున్నర  దశాబ్దాల పాటు అప్రతిహతంగా కథలూ, సాహిత్య విమర్శా చేసిన రచయిత ఉన్నట్టుండి బ్రేక్ తీసుకోడంలో విశేషం లేదు. కానీ, ఆ విరామం పుష్కర కాలం పాటు సాగడమూ, అనంతరం కలంపట్టి ఒకే ఏడాదిలో ఏకంగా 22 కథలూ, వంద వ్యాసాలూ రాసేయడం మాత్రమే కచ్చితంగా విశేషమే. 'విహారి' అనే కలంపేరుతో ప్రసిద్ధులైన ఆ రచయిత పేరు జె.ఎస్. మూర్తి. ఒకే ఏడాది (2007) లో రాసిన 22 కథల నుంచి 15 కథల్ని ఎంచి 'కొత్తనీరు' పేరిట సంకలనంగా ప్రచురించారు. ఈ సంకలనంలోని కథల్లో బాగా ఆకర్షించే విషయం వస్తు వైవిధ్యం. తాను ఎప్పుడూ ఎంచుకునే మధ్యతరగతి జీవితం తాలూకు ఇతివృత్తాలే అయినా, ఏ రెండు కథావస్తువులకీ పోలిక లేకపోవడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

సంపుటంలో మొదటి కథ 'కొత్తనీరు.' వృద్ధుడైన తన తండ్రికీ, ఈ తరం ప్రతినిధులైన తన పిల్లలకీ (సంపాదనపరురాలైన కూతురు, ఇంజినీరింగ్ చదువుకుంటున్న కొడుకు)  ఇంట్లో నిత్యం జరిగే ఘర్షణని పరిష్కరించలేని ఓ నడివయసు గృహస్థు కథ. అతడికి తన తండ్రి గురించి ఎంతగాబా తెలుసో, తన పిల్లల్ని గురించి అంతకన్నా బాగా తెలుసు. వాళ్ళమధ్య సామరస్య వాతావరణం ఏర్పాటు చేయడం అన్నది తనకి సాధ్యమయ్యే పని కాదు అనే నిర్ణయానికి వచ్చేసిన సమయంలో, వృద్ధ తండ్రి సమస్యకి 'పరిష్కారాన్ని' వెతకడం ముగింపు. నిజానికి తన తండ్రి నిర్ణయం కన్నా, దాని పట్ల తన పిల్లల ప్రతిస్పందన ఆందోళనకి గురిచేస్తుంది ఆ గృహస్తుని.

సాహిత్యం తాలూకు ప్రభావం సమాజం మీద ఏరూపంలో పడే అవకాశం ఉందో చెప్పే కథ 'అవ్యక్తం.' రచయితలు తమ పాత్రలకి ఇచ్చే ముగింపుల కన్నా, మనుషులు తమకి ప్రియమైన వారి విషయంలో తీసుకునే  నిర్ణయాలు భిన్నంగా ఉంటాయని చెబుతుందీ కథ. సినీ నటుడు రంగనాథ్ జీవితం (బలవన్మరణం కాదు) ఈ కథకి కొంత స్ఫూర్తి ఇచ్చి ఉండొచ్చు బహుశా. మానవ-ఆర్ధిక సంబంధాలను మరో మారు చర్చించిన కథ 'శేషప్రశ్నలు.' ఓ నిత్య అసంతృప్త వాది కథ 'మిస్టర్ ఆక్రోశం.' ఇలాంటి వాళ్ళు అన్నిచోట్లా  కనిపిస్తూనే ఉంటారు, సామాజిక మాధ్యమాలతో సహా.


భర్త చేతిలో హింసలకు గురయ్యే ఓ ఉద్యోగిని కథ 'రెండో సముద్రం.' ఇప్పుడొస్తున్న అనేకానేక 'స్త్రీవాద' కథల్లాగే ఉంది. మామూలు కథే అయినా, కథనం ఆసక్తికరంగా సాగింది. ఈజీ మనీ వెంట తాను పరుగులు పెట్టి, కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసే వ్యక్తి కథ 'కొత్త పాఠం.' ఆ వ్యక్తి జీవితం అతని కొడుక్కి పాఠం కావడం ముగింపు. ఇక, నగరంలో ఉన్న కొడుకుని చూసేందుకు పల్లెనుంచి వచ్చిన ఓ తండ్రి కథ 'ఉభయకుశలోపరి. కథనంతో పాటు, ముగింపు కూడా చాన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది. మిఠాయి కొట్టు యజమాని ఓ వారసుణ్ణి దత్తత చేసుకోడానికి చేసుకున్న ఏర్పాట్లు ఏ మలుపు తిరిగాయో చెప్పే కథ 'రుచుల జాడ.'

మిగిలిన కథలకి భిన్నంగా సాగిన కథ 'వంకర గీతలు.' ఎక్కడా నాటకీయత కనిపించకుండా సాగే ఈ కథ చదువుతుంటే, పాఠకులు కూడా కథకుడితోపాటు సిటీ బస్సు లో ప్రయాణం చేస్తున్న అనుభూతి పొందుతారు. "ఆధునికత తెచ్చిన సాంకేతిక పరిణామాలు జీవితాలను అపారంగా వృద్ధి చేస్తున్నాయి అంటున్నారు కానీ, పూసల్లో దారం లాంటి విశ్వాసం ఏది?" అన్న కథకుడి ప్రశ్న ఆలోచింపజేస్తుంది. వృద్ధాశ్రమాల్లో ఉండే జంటల కథ 'గూడు-నీడ. ఒక్కో జంటది ఒక్కో కథ. పిల్లలు వెనక్కి పిలిస్తే బాగుండుననే ఆశతో ఎదురు చూసేవాళ్ళు కొందరైతే, పిలుపు వచ్చినా వెళ్ళడానికి ఇష్ట పడని తల్లిదండ్రులు మరికొందరు.

'సిద్ధము సుమతీ,' 'రెండర్ధాల పాట' ఈ రెండు కథలూ నిరుద్యోగ/చిరుద్యోగ సమస్యని చర్చించినవి. ప్రపంచీకరణ ఫలితంగా జాబ్ మార్కెట్లో పెరిగిన పోటీని, పల్లెటూరి నేపధ్యం నుంచి వచ్చిన యువత నగరాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఎదుర్కొనే సమస్యలనీ చిత్రించారు రచయిత. మొదటి కథలో నాయకుడికి అతన్ని పెళ్లాడబోయే యువతి సాయం అందిస్తే, రెండో కథలో మార్కెటింగ్ ఉద్యోగంలో ఇమడలేని కుర్రాడు మార్గాంతరం వెతుక్కోడానికి ప్రయత్నం చేస్తాడు. 'భూ మధ్యరేఖ' కథ ఈజీ మనీ, ఆస్థిపంపకాల ఇతివృత్తంతో సాగితే, 'ఎదురద్దాలు' ఏ కాలానికైనా సరిపోయే కథ/స్కెచ్. చివరి కథ 'భ్రష్ట యోగి' పాఠకులకి చిన్న ఉలికిపాటునీ, "ఇలాంటి వాళ్ళు మనకీ తెలుసు" అన్న భావననీ కలిగిస్తుంది.

మొత్తం మీద చూసినప్పుడు, సమకాలీన ఇతివృత్తాలని ఎంచుకొని రాసిన ఈ కథలన్నీ ఆసాంతమూ చదివిస్తాయి. కొన్ని ఆలోచింపజేస్తాయి కూడా. ఎక్కడా తీర్పులు చెప్పే పని పెట్టుకోకుండా కథలని మాత్రమే చెప్పారు విహారి. కథకులు మునిపల్లె రాజు, పోరంకి దక్షిణామూర్తి రాసిన ముందు మాటలు అచ్చంగా ఆప్తవాక్యాలే. కథా సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్లు చదవదగ్గ పుస్తకం. (పేజీలు 127, వెల రూ. 80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

4 వ్యాఖ్యలు:

  1. @పురాణపండ ఫణి: థాంక్స్ అండీ.. గూగుల్ ప్లస్ బాటలోనే బ్లాగర్ కూడా అన్న ప్రకటన ఏదన్నా వస్తుందేమో, ఈలోగా రాయాల్సినవి రాసిపెట్టేద్దాం అనిపించింది...

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఈ వరసలో ఇల్లేరమ్మగారి "పెళ్ళి పందిరి కథలు" కూడా వస్తాయేమోనని ఎదురుచూస్తున్నానండీ .. మీరో నాలుగు కబుర్లు చెప్తే మళ్ళీ తిరగెయ్యచ్చు :)

    ప్రత్యుత్తరంతొలగించు
  3. @వంశీకృష్ణ: 'పెండ్లి పందిరి' కి ఇంకా టైం పడుతుందండీ.. మీరు కానిచ్చేయండి. 'ఈవెంట్ మేనేజర్' లాంటి మంచి కథలు ఉన్నాయి అందులో.. ధన్యవాదాలు..

    ప్రత్యుత్తరంతొలగించు