శుక్రవారం, ఫిబ్రవరి 23, 2018

గుల్జార్ కథలు

వెండితెరకి సంబంధించి 'సున్నితత్వం' అనగానే గుర్తొచ్చే పేర్లలో మొదటివరుసలో ఉండే పేరు 'గుల్జార్' ది. సినీ గేయరచయితగా, దర్శకుడిగా హిందీ సినిమా ప్రేక్షకులకి సుపరిచితుడైన గుల్జార్ కథకుడు కూడా. మొత్తం ఇరవై ఎనిమిది కథలతో 'ధువా' గుల్జార్ రాసిన ఉర్దూ కథల సంకలనం కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతిని అందుకుంది. ఈ సంకలనాన్ని భారతీయ భాషల్లోకి అనువదించే ప్రయత్నంలో భాగంగా, తెలుగుసేత బాధ్యతని ప్రముఖ రచయిత్రి, సాహితీ విమర్శకురాలు, మీదుమిక్కిలి గుల్జార్ అభిమానీ అయిన సి. మృణాళిని కి అప్పగించింది అకాడెమీ. 'గుల్జార్ కథలు' పేరిట విడుదలయ్యిందీ సంకలనం.

గుల్జార్ సినిమా మనిషి అనే విషయాన్ని గుర్తు చేస్తూ మొదటి రెండు కథలు 'బీమల్దా,' 'సన్ సెట్ బోలేవా' సినిమా రంగం నేపథ్యంలో రాసినవి. సుప్రసిద్ధ దర్శకుడు బిమల్ రాయ్ ఎలిజీలా అనిపించే 'బిమల్దా' చివరివరకూ ఆపకుండా చదివిస్తుంది. నిజానికి, ఈ సంకలనంలో మెజారిటీ కథలకి చదివించే గుణం పుష్కలంగా ఉంది. రెండో కథ గతవైభావాన్ని నెమరువేసుకుంటూ జీవించే ఒకనాటి వెండితెర నాయిక కథ. ఈ రెండు కథలూ ముగిపు దగ్గర పట్టి ఆపుతాయి పాఠకుల్ని. సినీ హీరోని గుడ్డిగా ప్రేమించే టీనేజీ అమ్మాయి కథ 'గుడ్డో.' మిగిలిన కథలన్నీ సినిమా వాసన తగలనివే.

భారత్-పాకిస్తాన్ ల విభజన గుల్జార్ కళ్ళముందే జరిగింది. ఆ సంఘటన ప్రత్యక్ష సాక్షుల్లో చాలామంది లాగే, గుల్జార్నీ ఆ నాటి పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. విభజన ఇతివృత్తంగా ఆయన రాసిన రెండు కథలు 'రావి నదికి ఆవల,' 'విభజన.' రెండూ కూడా వెంటాడే కథలే. ఒక కథా రచయిత ప్రధాన పాత్రగా రాసిన 'ఇది ఎవరి కథ?' ముగింపు, కథకుడిగా గుల్జార్ సామాజిక స్పృహకి ఒక చిన్న మచ్చుతునక. మతకల్లోలాల నేపథ్యంలో రాసిన కథ 'భయం.' ఈ కథ ముగింపు నుంచి అనేక కథలు పుట్టే అవకాశం ఉంది నిజానికి. 'పొగ' కథకీ మతమే నేపధ్యం.


ఫెమినిజం అంటే శానిటరీ నాప్కిన్ల వాడకాన్ని, వివాహేతర సంబంధాల్ని గ్లోరిఫై చేయడం మాత్రమే అని నమ్ముతున్న రచయితలు తప్పక చదివావాల్సిన కథలు 'మగవాడు,' 'వివాహ బంధం.' గుల్జార్ ఎంతటి స్త్రీ పక్షపాతో చెప్పకనే చెబుతాయి ఈ రెండు కథలూ. పంచతంత్రాన్ని తలపించే 'అరణ్యగాధ' విచ్చలవిడిగా జరుగుతున్న అడవుల నరికివేతని ప్రశ్నిస్తుంది. 'నిప్పుని మచ్చిక చేసుకున్న హబు' కూడా ఈకోవకి చెందిందే. హవేలీ కథ 'డాలియా' లో ముగింపు ఊహించగలిగేదే అయినా, కథ ఆ ముగింపుకి ఎలా చేరుకుంటుందన్న ఆసక్తిని చివరికంటా కొనసాగించారు రచయిత.

మొత్తం మీద చూసినప్పుడు, భిన్న ఇతివృత్తాలని, విభిన్న కథన రీతులని ఎంచుకుని ఈ కథల్ని చెప్పారు గుల్జార్. వాటిని అత్యంత అలవోకగా అనువదించారు మృణాళిని. పాత్రల పేర్లు, ప్రదేశాలు మినహాయిస్తే ఎక్కడా అనువాదం అన్న భావన కలగకపోవడం తాలూకు గొప్పదనాన్ని కథకుడితో పాటు అనువాదకురాలికీ పంచాల్సిందే. విషయసూచికలో దొర్లినన్ని అక్షరదోషాలు కథల్లో కనిపించక పోవడం పెద్ద ఉపశమనం. వైవిద్యభరితమైన కథల్నీ, కథన రీతుల్నీ ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన కథా సంకలనం ఇది. (సాహిత్య అకాడమీ ప్రచురణ, పేజీలు 200, వెల రూ. 100, న్యూ ఢిల్లీ, ముంబై, కోల్ కతా, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్న సాహిత్య అకాడమీ కార్యాలయాలు, మరియు అకాడమీ స్టాల్స్ లో లభిస్తుంది).

3 వ్యాఖ్యలు:

 1. Murali Garu: Could you please share if there is a phone number or email id to order this book?

  Thanks for introducing a good book.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మంచి పుస్తకాన్ని పరిచయం చేశారండీ.మీ పోస్ట్ చదివాక తప్పకుండా చదవాల్సిన పుస్తకాల జాబితాలో ఈ పుస్తకాన్ని కూడా చేర్చుకున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @లలిత టీఎస్: సాహిత్య అకాడెమీ వారింకా అప్ గ్రేడ్ కాలేదండీ.. కనీసం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు పుస్తకంలో :( వివరాలేమన్నా దొరికితే పంచుకుంటాను.. ధన్యవాదాలు.
  @మహావిష్ణుప్రియ: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు