సోమవారం, ఫిబ్రవరి 26, 2018

శప్తభూమి

చరిత్రని అధ్యయనం చేసి, కాలం నాటి సామాజిక పరిస్థితులని అర్ధం చేసుకోవడం ఒక ఎత్తైతే, ఆ అధ్యయనం ఆధారంగా కాల్పనిక పాత్రలని సృష్టించి, చారిత్రక నవలరాయడం మరోఎత్తు. అలా రాసిన నవలలో రచయిత ఏపాత్ర పట్లా, ఏ సన్నివేశం విషయంలోనూ ఎలాంటి రాగద్వేషాలకీ లోనుకాకుండా, ఎక్కడా తన గళం కానీ, నినాదాలు కానీ వినిపించకుండా అత్యంత సంయమనాన్ని ఆద్యంతమూ పాటించడం మరో ఎత్తు. 'మంచి నవల' కోసం సాహిత్యాభిమానులు చకోరాల్లా ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో, 'గొప్పనవల' స్థాయికి చేరుకోడానికి అన్ని అర్హతలూ ఉన్న రచన 'శప్తభూమి' ని అందించిన బండి నారాయణస్వామికి ముందుగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.

'శప్తభూమి' అంటే శాపగ్రస్తమైన ప్రాంతం. అవును, కథా స్థలం రాయలసీమ. కథాకాలం విజయనగర సామ్రాజ్య పతనానంతరం అధికారం లోకి వచ్చిన హండే రాజుల పాలనాకాలం. స్పష్టంగా చెప్పాలంటే క్రీస్తుశకం 1775 నుంచి మొదలు పెట్టి, తర్వాతి పదిహేను, ఇరవై ఏళ్ళ కాలం. ఇరవైవకటో శతాబ్దం అనేక నూతన ఆవిష్కరణలతో జెట్ వేగంతో అభివృద్ధి పధంలో దూసుకుపోతోందన్న ప్రచార హోరు మధ్య, మూడొందల ఏళ్ళు వెనక్కి వెళ్లి నాటి కథని చదవాల్సిన అవసరం ఏమిటన్నది ముందుగా వచ్చే ప్రశ్న. వర్తమానానికి, భవిష్యత్తుకీ బలమైన పునాది గతంలోనే ఉందన్నది జవాబు. మరో మాట చెప్పాలంటే, చరిత్ర అధ్యయనం ఎందుకు అవశ్యమో కూడా ఈ నవల చెబుతుంది.

ఈ నవల రాజుల కథ కాదు. రాజ్యం కథ. రాజ్యంలోని అనేక వర్గాల ప్రజల కథల సమాహారం. ఇందులో రాజ్య రక్షణ కోసం చూపిన సాహసం ఫలితంగా గొర్రెల కాపరి నుంచి అమరనాయకుడిగా ఎదిగిన బిల్లే ఎల్లప్ప కథ ఉంది, అతని అమరనాయక హోదాని ఏమాత్రమూ లెక్కపెట్టక ఒకే ఒక్క పంచాయతీతో వివాహబంధం నుంచి బయటపడిన అతని మరదలు ఇమ్మడమ్మ కథా ఉంది. నాయకరాజుల సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న రాచ వేశ్య పద్మసాని కథ, ఇంగ్లీష్ చదువులు చదివిన ఆమె కొడుకు మన్నారుదాసు కథా ఉన్నాయి. రాజుకి ఉన్న స్త్రీ వ్యసనానికి తన ముద్దుల కూతురు బలైపోతే, రహస్యంగా తిరుగుబాటు తెచ్చి రాజుని పదవీచ్యుతుణ్ణి చేసిన వ్యాపారి బయన్నగారి అనంతయ్య శ్రేష్ఠి కథతో పాటు అదే స్త్రీవ్యసనం కారణంగా వంశాన్ని కోల్పోయిన అమరనాయకుడు వీరనారాయణరెడ్డి కథా ఉంది.

కండబలం పుష్కలంగా ఉన్నా కులం బలం లేకపోవడంతో కళ్లెదుట జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేక అడవిదారి పట్టిన కంబళి శరభుడు, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే వీరత్వం, మనసుపడిన వాడి మీద ప్రాణాన్నే పణంగా పెట్టగలిగేంత ప్రేమ, కార్యసాధనకి అవసరమైన లౌక్యం సమపాళ్లలో ఉన్న హరియక్క, మతాన్ని ముసుగు వేసుకుని లైంగిక దోపిడీ చేసే నాగప్ప ప్రెగడ, అదే మతం ఆధారంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేసిన గురవడు.. ఇలా ఎందరెందరివో కథలు. అంతే కాదు, ఒకరొట్టెకి, మూడు కాసులకి పసి పిల్లల్ని అమ్ముకునే కరువు, వర్ణవ్యవస్థకి ఆవల ఉన్న కుటుంబాల స్త్రీలని ఊరుమ్మడి సొత్తుగా మార్చే బసివి అనాచారం, స్త్రీ గౌరవం ముసుగులో అమలైన సతీసహగమనం లాంటి దురాచారాలు..వీటన్నింటినీ అక్షరబద్ధం చేసిన నవల ఇది.


అనంతపురం సంస్థానాన్ని హండే రాజు సిద్ధరామప్ప నాయుడు పాలిస్తున్న కాలంలో, ఓ నరక చతుర్దశి నాటి రాత్రి కొందరు దుండగులు ఊరి చెరువుకి గండి కొట్టబోతూ ఉంటే గొర్రెలకాపరి బిల్లే ఎల్లప్ప తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీళ్ళని కాపాడడం, ప్రభువు మెచ్చి అతన్ని రాజోద్యోగిగా నియమించడంతో ఆరంభమయ్యే కథ, అనేక వైవిధ్యభరితమైన పాత్రలు, ఊహకందని సన్నివేశాలతో పరిపుష్టమై, తనకి పదవినిచ్చిన ప్రభువు శ్రేయస్సు కోసం ఎల్లప్ప తీసుకున్న గగుర్పాటు కలిగించే నిర్ణయాన్ని అమలుపరచడంతో ముగుస్తుంది. నిపుణుడైన స్వర్ణకారుడు వెంట్రుకవాసి మందం ఉన్న పొడవాటి బంగారు తీగని అత్యంత నైపుణ్యంతో కళ్లెదుటే అల్లి అందమైన నగగా చేతికందించినప్పుడు కలిగే భావోద్వేగాలన్నీ ఏకకాలంలో అనుభవానికి వస్తాయి ఈ నవల చదవడం పూర్తిచేసే సమయానికి.

హండే రాజుల పాలనా పధ్ధతి, అధికారాలు పరిమితమే అయినా ప్రజలమీద అపరిమితమైన జులుం చూపిన అమరనాయకులు, 'మన గతి ఇంతే' అని సరిపెట్టేసుకున్న స్త్రీలు, అణగారిన వర్గాలు, వీరినుంచే పుట్టిన ఆశాజ్యోతులు, నాటి రాజకీయాలు, కళలు, వినోదాలు, ఆధ్యాత్మిక విషయాలు... ఈ నవల కాన్వాసుని ఒకటి రెండు మాటల్లో చెప్పడం అసాధ్యం. పాలకుల్నీ ప్రజల్నీ మంచి-చెడు అనే చట్రాల్లో బిగించకుండా, ఇరుపక్షాల్లోని మంచి చెడులనీ నిష్పక్షపాతంగా చెప్పడం, రచయిత తాను కథని మాత్రమే చెప్పి, అర్ధం చేసుకునే బాధ్యతని పాఠకుడికి విడిచి  పెట్టడం రచన స్థాయిని పెంచింది. పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన పాఠకుల్ని అదాటున కథా కాలంలోకి, పాత్రల మధ్యకి లాక్కుపోయేవిగా ఉన్నాయి. రాజుల విలాస జీవిత చిత్రణకి, కురువ, మాదిగ కులాల ఆచారాలు, జీవన శైలులని రికార్డు చేయడానికీ సమ ప్రాధాన్యత ఇచ్చారు రచయిత. ఆమాటకొస్తే, ఏ పాత్రనీ ఎక్కువా చెయ్యలేదు, తక్కువా చెయ్యలేదు.

ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఈ రచనకి ఉపయోగించిన భాష. పద్దెనిమిదో శతాబ్దం నాటి రాయలసీమ భాషపై పరిశోధన చేసి, ప్రతి పాత్ర నేపధ్యాన్నీ దృష్టిలో ఉంచుకుని వారి చేత ఆయా మాండలీకాల్లో సంభాషణలు పలికించారు రచయిత. ఉదాహరణకి, తంజావూరు నేపధ్యం కలిగిన పద్మసాని మాటలు మిగిలిన పాత్రలు పలికే సంభాషణలకి పూర్తి భిన్నంగా ఉంటాయి. పాత్ర సామాజిక స్థాయి ఏమిటన్నది, సంభాషణల్లో వాడిన మాటల ఆధారంగా సులువుగా బోధపడుతుంది పాఠకులకి. అన్నమయ్య కీర్తనల్లో వాడిన మాటలు కొన్ని సంభాషణల్లో అక్కడక్కడా మెరిశాయి. రచన తాలూకు స్థలకాలాదులని చెప్పకనే చెప్పిన భాష తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోగలిగేంత సరళంగా ఉంది.

ఈ నవల్లో లోపాలేవీ లేవా? చిన్నవే అయినా వాటినీ ప్రస్తావించుకోవడం అవసరం. హరియక్క పాత్ర అసంపూర్ణంగా ముగిసిన భావన కలిగింది. అదికూడా, ఆమెకి ఒక పెద్ద అన్యాయం జరిగినప్పుడు, అందుకు కారకుడు కథలో మరో ప్రధాన పాత్ర అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి ఉండాల్సింది. అలాగే, నాగప్ప ప్రెగడ పాత్ర. పేరుని బట్టి, అతని తండ్రి చేసిన లౌకిక వృత్తిని బట్టి అతడు బ్రాహ్మణుల్లో నియోగి శాఖకి చెందినవాడుగా తెలుస్తోంది. ఆలయాల్లో పని చేసే వారు వైదిక బ్రాహ్మణులు. ఒకరి వృత్తిని మరొకరు చేపట్టక పోవడం అన్నది ఇరవయ్యో శతాబ్దం వరకూ కొనసాగింది. ("యీ యింగిలీషు చదువులు లావైనకొద్దీ వైదీకులే అన్న మాటేవిఁటీ, అడ్డవైన జాతుల వాళ్ళకీ ఉద్యోగాలవుతున్నాయి గాని..." అంటాడు 'కన్యాశుల్కం' నాటకంలో నియోగి రామప్పంతులు). నాగప్ప ప్రెగడ ఆలయంలో పూజాదికాలు చేయడం ఆ కాలానికి జరిగే పని కాదు. కథా గమనానికి ఇవి అడ్డం పడేవి కాదు కానీ, జాగ్రత్త తీసుకుంటే మరింత బావుండేది అనిపించింది.

'తానా' సంస్థ 21వ మహాసభల సందర్భంగా నిర్వహించిన నవలల పోటీలో గత ఏడాది డిసెంబర్ లో రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని మూడు తెలుగు నవలలకు పంచింది. ఆ మొత్తంలో 'శప్తభూమి' వాటా ఎనభైవేల రూపాయలు. ఇరవై ఏళ్ళ క్రితమే 'రేగడి విత్తులు' నవలకి తానా అందించిన లక్షా ముప్ఫయి వేల రూపాయల నగదు బహుమతితో పోల్చుకుంటే రెండు లక్షల రూపాయలు చిన్నమొత్తమే (డాలర్ రేటు పరుగులు పెడుతున్న నేపథ్యంలో). పైగా ఆమొత్తాన్ని మూడు వాటాలు వేయడం వల్ల 'శప్తభూమి' కి అందింది స్వల్పమొత్తమే. కానీ, వేరే ఏ బహుమతులూ లేని వాతావరణంలో దీనినే పెద్దమొత్తంగా భావించాలి. 'శప్తభూమి' కేవలం తెలుగు సాహిత్యానికి పరిమితమైపోవాల్సిన నవల కాదు. ఎల్లలు దాటి సాహిత్యాభిమానుల్ని చేరుకోవాలి. ఈ నవల ఆంగ్లం లోకి అనువాదం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 'తానా' ఆదిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

('శప్తభూమి' రాయలసీమ చారిత్రక నవల, రచన: బండి నారాయణస్వామి, పేజీలు: 263, వెల రూ.125, తానా ప్రచురణలు, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం).

2 వ్యాఖ్యలు:

నీహారిక చెప్పారు...

ఈ నవల రాయలసీమ యాసలో వ్రాసారా లేక సాధారణ తెలుగులో వ్రాసారా తెలుపగలరు.

మురళి చెప్పారు...

@నీహారిక: నేను తప్పక ప్రస్తావించి ఉండాల్సిన విషయాన్ని గుర్తు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండీ.. భాషని గురించిన వివరాలతో టపా అప్డేట్ చేశాను..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి