క్రమం తప్పకుండా తెలుగు కథలు చదివే వారికి సుంకోజి దేవేంద్రాచారి పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాయలసీమ సమస్యలని సొంతగొంతుతో
కథలుగా కళ్ళముందుంచుతున్న కొద్దిమంది రచయితలలో దేవేంద్రాచారి ఒకరు. వ్యవసాయ
సంక్షోభం, వలసలు, వీటి ఫలితంగా కుటుంబ బంధాలు, మానవ సంబంధాల్లో వచ్చి
పడుతున్న మార్పుని కథా వస్తువులు తీసుకుని చారి రాసిన పద్ధెనిమి కథల
సంకలనమే 'ఒక మేఘం కథ.' పేరు లో కనిపిస్తున్న తడి, సంకలనంలోని చాలా కథల్లోనూ
కనిపించడమే ఈ పుస్తకం ప్రత్యేకత.
సంకలనానికి శీర్షికగా
ఎంచుకున్నకథ 'ఒక మేఘం కథ' చదువుతున్నంతసేపూ దామల్ చెరువు అయ్యోరు
మధురాంతకం రాజారాం రాసిన కథలు పదేపదే గుర్తొచ్చాయి. ఉహు, ఇది రాజారాం
కథల్ని పోలిన కథ లాంటిది కాదు. శైలికూడా అయ్యోరిది కాదు. కానీ, కథ రెండో
పేజీలోకి వెళ్లేసరికి పాఠకులు ప్రధాన పాత్రలో లీనం కావాల్సిందే. అతడి
సంతోషం, విచారం మనవి అయిపోతాయి. పల్లెటూరు, పట్టణం రెండు చోట్ల
జీవితాల్లోనూ ఉండే కష్టసుఖాలు, వీటితో పాటే వ్యవసాయంలోనూ, చిన్నపాటి
వ్యాపారంలోనూ ఉండే లాభాలు, ఇబ్బందులు ఇవన్నీ మనకి చిరపరిచితం అయిపోతాయి.
తిరుపతిలో
చిన్నకొడుకు నడిపే కిళ్ళీ బడ్డీలో కూర్చుని పల్లెటూళ్ళో ఉండే తన పెద్ద
కొడుకు కథని చెప్పిన ప్రధాన పాత్ర, పల్లెకి వెళ్ళాక చిన్నకొడుకు కథని
అందుకుంటాడు. కథ ముగింపు పాఠకుల పెదవుల మీద ఓ నవ్వుని పూయిస్తుంది. సేద్యం
చేసే తండ్రి-ఇంజినీరింగ్ చదివే కొడుకు కథ 'చెనిక్కాయలు.' సీమలో వేరుశనగ
రైతుల ఇబ్బందుల్ని కళ్ళకి కట్టే ఈ కథ, ఎక్కడా డాక్యుమెంటరీ లాగా
అనిపించకపోగా, తర్వాత ఏమవుతుంది అనే కుతూహలంతో పేజీలు తిప్పిస్తుంది.
ముగింపు విషయంలో రచయిత కొంచం హడావిడి పడ్డారేమో అనిపించింది.
వ్యవసాయ
సంక్షోభం కారణంగా సీమలో నిత్యకృత్యంగా మారిన వలసలని ఇతివృత్తంగా తీసుకుని
రాసిన కథల్లో మొదటగా చెప్పుకోవాల్సింది 'మనుషులు మరణించాక...' వలస తాలూకు
విషాదం కన్నా, మానవ నైజపు నగ్నస్వరూపం కదిలిస్తుంది ఈ కథలో. పల్లె కరువుకీ,
నగరపు మాంద్యానికీ ముడిపెట్టి రాసిన కథ 'వలస దేవర.' రాజకీయాల ప్రభావం
సామాన్యుల మీద ఎలా ఉంటుందో చిత్రించిన కథలు 'అంత్యక్రియలు' 'దీపం
పురుగులు.' మొదటి కథ పెరిగిపోతున్న ఎన్నికల ఖర్చుల్నీ, రెండో కథ ప్రభుత్వం
వారి ఒకానొక సంక్షేమ పథకపు అమలు తీరునీ చర్చించాయి.
'ప్రకటన,'
'రాజమ్మ,' 'పరువు,' 'బహుమతి' ఈనాలుగూ బలమైన స్త్రీ పాత్రలున్న కథలు.
వీటిలో 'రాజమ్మ' కథ ముగింపు, 'పరువు' కథా ప్రారంభం గుర్తుండిపోతాయి.
'బహుమతి' కథని ఎవరో స్త్రీవాద రచయిత్రి రాశారంటే నమ్మేయొచ్చు. 'పారేడు
కూర,' 'ఇరుకుమాను,' 'దాహం,' 'చెదిరిన బింబం,' 'ఆకుపచ్చని లోకంలోకి' ఈ ఐదూ
నోస్టాల్జియా కథలు. రచయిత బాల్యంలో పాఠకులు తమ బాల్యాలనీ వెతుక్కోవచ్చు.
'పెళ్లికళ' కథ నగరజీవితపు ఒడిదుడుకులని చిత్రిస్తే, 'ఇల్లీగల్ లవ్ స్టోరీ'
అత్తా-కోడళ్ళ సమస్యని ఓ కొత్త కోణం నుంచి చూపించి, ఊహాతీతంగా ముగుస్తుంది.
"ఒక
మేఘం కథ శీర్షికతో పద్ధెనిమిది జీవిత శకలాలు ఇవి. లేనిపోని కల్పనలు,
లేనిపోని వర్ణనలు, ఇంకా కృత్రిమమైన వ్యర్ధ విషయాలు లేని అచ్చమైన యదార్ధ
జీవితం వీటిలో అంతటా పరుచుకుని ఉంది... ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవితమంత బరువైనది..." అన్నారు విఖ్యాత కథా రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య 'వర్తమాన
సీమ జీవితాన్ని నిజాయితీగా రికార్డు చేసిన చరిత్ర' పేరిట రాసిన ముందుమాటలో.
దేవేంద్రాచారి మరిన్ని మంచి కథలద్వారా మట్టి వాసనల్ని పాఠకులకి అందించాలని
కోరుకుంటూ... ('ఒక మేఘం కథ,' పేజీలు 191, వెల రూ. 120, యుక్త ప్రచురణలు
ప్రచురణ, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం).
వీరి అన్నంగుడ్డ కథ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది.చాలా మంచి రచయిత.మంచి సంకలనాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శశి: అవునండీ.. దేవేంద్రాచారి పేరు చెప్పగానే గుర్తొచ్చే మొదటి కథ 'అన్నం గుడ్డ' ... ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి