బుధవారం, జూన్ 17, 2015

తెర వెనుక -1

పెద్ద మబ్బుల గుంపొకటి దూరం నుంచి చంద్రుడి వైపుగా కదిలొస్తోంది. శరత్కాలం మొదలయ్యిందేమో, చంద్రుడు అధిక చక్కని వెన్నెలలు పూయిస్తున్నాడు. కరిగిపోతున్న సమయాన్ని సూచిస్తున్నట్టుగా, గాజు గ్లాసులో ఉన్న స్కాచ్ మధ్యలో కదులుతున్న ఐస్ క్యూబ్ నెమ్మదిగా కరుగుతోంది.

రూపం కోల్పోతున్న మంచుముద్ద మీద చంద్రకిరణం పడి మెరిసినట్టుగా అనిపించడంతో ప్రకృతిలో పడ్డాను. అవును.. సమయం కరిగిపోతోంది. వచ్చిన పని ఈసరికే మొదలుపెట్టేసి ఉండాల్సింది. కానీ ఏదో సంశయం. మా బృందం అందరికీ నమ్మకమే, నేనీ పని సాధించుకు వస్తానని. ఇంకా చెప్పాలంటే, నేనుమాత్రమే సాధించగలను అనేశారు వాళ్ళు.

నల్లని గోదారి నీళ్ళ మీద మెత్తగా సాగిపోతోంది పడవ. పరుపు మీద కూర్చుని, బాలీసుకి జేర్లబడి కాసేపు చేతిలో ఉన్న గ్లాసునీ, మరికాసేపు ఆకాశాన్నీ చూస్తూ అప్పుడప్పుడూ గొంతు తడుపుకుంటున్నాను. చుక్కాని కాసుకుంటున్న వీర్రాజు ఉండుండీ ఏదో కూని రాగం అందుకుని తన ఉనికి చాటుకుంటున్నాడు.

నా ఎదురుగా కూర్చున్న స్వామిలో మాత్రం ఎలాంటి చలనమూ లేదు. మర్యాద కోసం గ్లాసు పట్టుకున్నాడంతే. నేను మూడో పెగ్గుకి వచ్చినా వాడింకా మొదటిది పూర్తి చెయ్యలేదు. నేను సాధించాల్సిన కార్యం స్వామితో ముడిపడ్డదే. ఎలా వీడిని కదిలించడం?

భుజం మీద చిన్నగా తట్టి, వాడి చేతిలో ఉన్న గ్లాసువైపు చూపించి తాగమన్నట్టు సైగచేశాను. అతిప్రయత్నం మీద రెండు గుటకలు వేశాడు. జీడిపప్పు పలుకులున్న పింగాణీ ప్లేటు అందించాను. ప్లేటుకి బదులు నాలుగు పలుకులు మాత్రమే అందుకున్నాడు.

"పర్వాలేదు.. మాట వింటున్నాడు," అనుకున్నాను అప్రయత్నంగా. నిజం చెప్పాలంటే స్వామి నామాట ఎప్పుడూ కాదనలేదు. ఇరవయ్యేళ్ళ క్రితం మొదటిసారి కలిశాడు నన్ను. ఆవేళ రాత్రి కాకినాడ పరిషత్తులో నాటకం ఆడడం పూర్తి చేసి గ్రీన్ రూం దగ్గర చుట్టుముట్టిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు జనంలో ఉన్నాడు వాడు. 'ఓ తల్లి తీర్పు' నాటకం ఆడాం. స్క్రిప్టు, డైరెక్షను నావే.

నాటకం నడుస్తున్నప్పుడు వినిపించే చప్పట్లే కాదు, గ్రీన్ రూం దగ్గర వినిపించే సమీక్షలూ బాగా ఉపయోగపడతాయి మాకు. మరీ ముఖ్యంగా, మేము గమనించుకోని లోపాలు విశ్లేషించి చెప్పేవాళ్ళు గ్రీన్ రూం దగ్గరే ఎక్కువగా తారసపడుతూ ఉంటారు.

అందరూ వెళ్ళే వరకూ ఓపిక పట్టి అప్పుడు వచ్చాడు స్వామి నా దగ్గరికి. అటూ ఇటూగా పాతికేళ్ళు ఉంటాయేమో వాడికప్పుడు. సూదంటు చూపు నన్ను గుచ్చుకున్నట్టే అనిపించింది.  నేనింకా మేకప్ తుడుచుకోలేదు. ప్రయాణానికి ఆలస్యం అయిపోతోందని మా ట్రూప్ వాళ్ళు అప్పటికే కంగారు పడుతున్నారు.

"మహాభారతంలో కుంతి కథని భలే సోషలైజ్ చేశారు," ఇదీ వాడన్న మొదటిమాట. చెప్పొద్దూ, చాలా ముచ్చటగా అనిపించింది. వాడికి థాంక్స్ చెప్పి, మా వాళ్లకి పనులు పురమాయిస్తున్నాను.

"మీతో కొంచం తీరుబడిగా మాట్లాడాలి. అడ్రస్ ఇస్తే, వచ్చి కలుస్తాను," అన్నాడు. ట్రూపులో కుర్రాడొకడు ఓ కాగితం మీద నా అడ్రస్ రాసిచ్చాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు.

నాటకం చూసిన వేడిలో చాలామందే ఇలా అడ్రస్లు అడుగుతారు. తెల్లారేసరికి ఆ వేడి చల్లారిపోతుంది. మూడోనాటికి అడ్రస్ కాగితం చిత్తుకాగితాల్లోకి చేరుకుంటుంది. కానీ, స్వామి ఆ చాలామందిలా కాదు. కాబట్టే, ఇవాళ నాకీ పరిక్ష. వాడి గ్లాసు ఖాళీ అయ్యింది. మరో పెగ్గు ఫిక్స్ చేసి ఇచ్చాను.

మామూలప్పుడు వాడు మితభాషి. ఇలాంటి సందర్భాల్లో మాత్రం మూడు నాలుగు పెగ్గులు దాటాక గొంతు విప్పుతాడు. ఒక్కో పెగ్గూ పడే కొద్దీ మాటలు పెరుగుతాయి. కానీ, ఎక్కడా బ్యాలన్స్ తప్పడు. అదీ ఆశ్చర్యం. వాడిలో నన్ను ఆశ్చర్య పరిచే విషయాలు చాలానే ఉన్నాయి.

అడ్రస్ తీసుకున్న వారం పది రోజుల తర్వాత ఓ సాయంత్రం వేళ నన్ను వెతుక్కుంటూ వచ్చేశాడు. వస్తూనే "నేనూ మీ ట్రూపులో చేరతాను గురువు గారూ," అన్నాడు. 'చేరి ఏం చేస్తాడూ ట్రూపులో?' వాడినోసారి పరిక్షగా చూశాను. ఒడ్డూ పొడవూ బానే ఉన్నాడు. గొంతు, మాటతీరూ కూడా పర్వాలేదు. కాస్త సాన పడితే నటుడవుతాడు.

గాలివాటం మనిషేమో అనిపించింది ఓ క్షణం. ఓ నాలుగైదు నాటకాల స్క్రిప్టులు చేతికిచ్చాను. కూర్చుని శ్రద్ధగా చదివి తన అభిప్రాయాలు కుండ బద్దలు కొట్టాడు. "ఆదివారం ఉదయం వస్తే ట్రూపుని పరిచయం చేస్తా," అని చెప్పాను.

మా ట్రూపు సభ్యులం ప్రతి ఆదివారం తప్పకుండా కలిసేవాళ్ళం అప్పట్లో. చర్చలు, రిహార్సల్సు అన్నీ ఆదివారాలే. మాలో ఎక్కువమంది ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళమే. సరదాకి కళాపోషణ. అలాగని కేవలం కాలక్షేపానికి నాటకాలు కాదు. పరిషత్తుకి వెళ్ళామంటే బహుమతులతో రావలిసిందే.

నేను చెప్పిన ప్రకారమే ఆదివారం ఉదయాన్నే వచ్చేశాడు స్వామి. మా వాళ్ళని పరిచయం చేశాను. వాడు ఇంటర్ పాసయ్యి, కో-ఆపరేటివ్ సొసైటీ లో గుమస్తాగా పని చేస్తున్నాట్ట. ఇతరత్రా వివరాలేవీ నేను అడగలేదు. వాడు చెప్పలేదు.

ఆ వేళ మా కొత్త రిహార్సల్ ప్రారంభం. నాలుగు డైలాగులున్న పనివాడి పాత్ర ఒకటి ఉంటే అదిచ్చాం స్వామికి. జరిగిన నాలుగైదు రిహార్సల్స్ కీ శ్రద్ధగా వచ్చాడు. చిన్న వేషమే కదా అని నిర్లక్ష్యం చూపించలేదు సరికదా, మిగిలిన వాళ్ళు చేస్తుంటే కూడా రెప్పవేయకుండా చూశాడు.

డైలాగులు చెప్పడం తప్ప ఎవరితోనూ మాట కలిపేవాడు కాదు. తరువాతి నాటకం 'ఏకాకి' లో విలన్ వేషం ఇచ్చాం. దగ్గరి బంధువులని మోసం చేసే మనిషి పాత్ర. "శకుని కదా గురువుగారూ?" అడిగాడు మేమిద్దరం ఉన్నప్పుడు.

రిహార్సల్స్ లో ఎంత ఒద్దికగా చేశాడో, స్టేజి మీద అంతగా విజృంభించాడు స్వామి. మిగిలిన నటీనటులు ఉలికిపడ్డారు ఒక్కసారి. రిహార్సల్స్ ని మించి స్టేజీ మీద చేయడం, వాళ్లకి పేరు రావాలని అప్పటికప్పుడు పాత్రని ఇంప్రొవైజ్ చేయడం ఇవన్నీ నాటకాల్లో మామూలే. కొంత పేరొచ్చాక చాలామంది నటీనటులు చేసే పనే.

కానీ, ఓ కొత్తవాడు అలా పాత్ర పరిధికి మించి నటించడం మిగిలిన ఆర్టిస్టులకి మింగుడు పడలేదు. అలాగని నాటకాన్ని మధ్యలో ఆపలేరు కదా. ప్రేక్షకుల నుంచి చప్పట్లు వచ్చే కొద్దీ మరింత ఉత్సాహంగా నటించేస్తున్నాడు స్వామి. రెండు సీన్లయ్యేసరికి మావాళ్ళందరికీ విషయం అర్ధమయ్యింది కాబట్టీ, అందరూ రంగస్థలం మీద అనుభజ్ఞులే కాబట్టీ ఎవరి పాత్ర విషయంలో వాళ్ళు జాగ్రత్త పడ్డారు.

సైడ్ వింగ్ లో నిలబడి నాటకం చూస్తున్న నాకు కొత్తగా కనిపించాడు స్వామి. నాటకం అవుతూనే చప్పట్లు మిన్నంటాయి. గ్రీన్ రూం దగ్గర జనం. ప్రశంసలన్నీ స్వామికే. స్టేజి దిగుతూనే వాడు మామూలైపోయాడు. "థాంక్స్" తప్ప ఇంకేమీ మాట్లాడడం లేదు ఎవరితోనూ. ఏమైపోయింది ఆ ఆవేశం? 

'ఏకాకి' తో స్వామికి మంచి పేరొచ్చింది. అప్పటివరకూ వాడితో అంటీముట్టనట్టుగా ఉన్న మా ట్రూపు వాళ్ళు కూడా స్నేహం చేసే ప్రయత్నాలు చేశారు. స్టేజీ మీద అంతా తనే అయిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడన్న విమర్శ నావరకూ రాకపోలేదు.

మా తర్వాతి నాటకం 'వనవాసం' లో హీరో వేషం ఇచ్చాను వాడికి. ఇది కేవలం విమర్శకి సమాధానం మాత్రమే కాదు. వాడిమీద పెరిగిన నమ్మకం కూడా. బయట చూస్తే 'వీడికి మాట్లాడ్డం వచ్చా?' అని సందేహం కలిగేలా ఉండే స్వామి, స్టేజి మీద ఒకలాంటి ఆవేశంతో కనిపించేవాడు. చప్పట్లు వినిపించే  కొద్దీ ఒళ్ళు మర్చిపోయేవాడు.

సైడ్ వింగ్ నుంచి వాడిని చూస్తూ ఉంటే దక్ష వాటిక నుంచి పరమశివుడు నేరుగా మా రంగస్థలం మీదకి వచ్చేశాడా అనిపించేది నాకు. 'వనవాసం' క్లైమాక్స్ సీన్లో స్వామిని చూస్తూ "వీడి ఆవేశాన్ని అదుపులో పెట్టగలిగే వాళ్ళెవరో" అనుకున్నాను అప్రయత్నంగా.

గెడ అవసరం లేకుండానే గాలివాలుకి జాయిగా సాగిపోతోంది పడవ. దోమతెరలాంటి మంచుతెర గోదారి నీళ్ళమీద చిక్కబడుతోంది. పడవ కదలికలకి ఏర్పడ్డ అలల మీద చంద్రుడు ముక్కలు ముక్కలుగా మెరిసిపోతున్నాడు. వీర్రాజు చుట్ట వెలిగించినట్టున్నాడు. లంక పొగాకు వాసన ఘాటుగా తగులుతోంది.

నా చేతిలో గ్లాసు ఖాళీ అయింది. తనో పెగ్గు ఫిక్స్ చేసుకుని, నా గ్లాసులో స్కాచ్, సోడా కలిపి, ఐస్ క్యూబ్స్ వేసి అందించాడు స్వామి. 'స్మాల్ చాలు' అని నేను చెప్పాల్సిన అవసరం లేకపోయింది.  హాట్ ప్యాక్ నుంచి ఫిష్ ఫ్రై బయటికి తీసి, ప్లేట్లో పెట్టి అందించాడు.

నా ప్రతి కదలికా తెలిసిన వీడికి, నేనిప్పుడు ఏం అడగబోతున్నానో తెలీదా? ఇప్పటికే వాడు సమాధానం సిద్ధం చేసేసుకుని ఉండడా? ఎంత చిత్రమైన పరిస్థితి! ఈ పరిస్థితి రాడానికి కారణం చంద్రమ్మ. ఇరవయ్యేళ్ళ క్రితం, మొదట మా ట్రూపులోకీ తర్వాత స్వామి జీవితంలోకీ అడుగుపెట్టిన కథానాయిక. ఆమె పేరుని మేమే చంద్రకళ అని మార్చాం.

స్వామికన్నా చిత్రంగా మా ట్రూపులోకి వచ్చింది చంద్రమ్మ. మా రిహార్సల్ గదిని శుభ్రం చేయడం, రిహార్సల్ అప్పుడు మాకు టీ కాఫీలు అందించడం, సెట్ ప్రాపర్టీలు తయారు చేసుకోడంలో మాకు సాయం చేయడం లాంటి పనులన్నీ ఓ ముసలవ్వ చూసుకునేది.

ఇరవయ్యేళ్ళ వయసులో ఆ ముసలవ్వ దగ్గరకి చేరింది చంద్రమ్మ. "అనాద పిల్ల బాబుగోరూ.. సేరదీసి నాలుగు ముద్దలెడితే పున్నెవే గానీ పాపం కాదుగదా నాకు," అంది ముసలవ్వ. అవ్వతోపాటే రిహార్సల్స్ కి వస్తూ, ఆమెకి సాయంగా ఉండేది చంద్రమ్మ.

ఆరోజుల్లోనే మాకో ఊహించని సమస్య వచ్చింది. 'ఆరో వేలు' నాటకం తయారు చేసుకున్నాం. గుంటూరు పరిషత్తుకి సెలక్ట్ అయ్యింది. మరో రెండు రిహార్సల్స్ చేస్తే నాటకం ఆడేయచ్చు. అంతలో లేడీ ఆర్టిస్టు జబ్బు పడింది. ఆపరేషన్ చేయాలన్నారు డాక్టరు. కనీసం ఆరువారాలు ఆమె అందుబాటులో ఉండదు.

పరిషత్తు చూస్తే పదిహేను రోజులు కూడా లేదు. కొత్త ఆర్టిస్టు కోసం వెతకడం మొదలుపెట్టాం. మామూలు రోజుల్లోనే లేడీ ఆర్టిస్టులు దొరకరు. ఇక పరిషత్తు రోజుల్లో ఎక్కడ దొరుకుతారు? ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. సరిగ్గా అప్పుడు అవ్వ నాదగ్గరికి వచ్చింది, చంద్రమ్మని తీసుకుని.

"ఈ పిల్ల సెయ్యగలూతాదేమో సూడండి బాబుగోరూ.. దీనికిట్టవేనంట నాటకాలంటే," సంగీతంలా వినిపించిందా మాట. అప్పుడు చూశాను చంద్రమ్మని పరిక్షగా. 'తెలివైన పిల్ల' అనిపించింది చూడగానే.

'ఆరో వేలు' లో నాయిక పాత్ర చాలా బలమైనది. మా ట్రూపులో ఆర్టిస్టు చాలా ఏళ్ళుగా నటిస్తోంది. ఆమెని దృష్టిలో పెట్టుకుని రాసిన నాటకం అది. తొలిసారి స్టేజి ఎక్కుతూనే పరిషత్తు, అది కూడా ప్రధాన పాత్ర.. ఈ అమ్మాయి చెయ్యగలదా? అన్న సందేహం లేకపోలేదు. నాటకం మానుకోవడం కన్నా ప్రయత్నం చేయడం మంచిదనిపించింది.

మొదట ఆమె పోర్షన్ భట్టీయం వేయించాను. డైలాగులు ఆమెకి నోటికి వచ్చాయి అనిపించాక, ట్రూపుని పిలిచి రిహార్సల్ చేయించాను. ఎవరి ఆలోచనలు, భయాలు వాళ్లకి ఉన్నట్టున్నాయి. ఎవరూ మాట్లాడలేదు. నాటకం ఆడడానికే నిర్ణయించుకున్నాం.

పైకి చెప్పకపోయినా మా వాళ్లకి ఉన్న సందేహాలు నాకూ ఉన్నాయి. తోటి ఆర్టిస్టులకి స్టేజి మీద చుక్కలు చూపించే స్వామి, చంద్రమ్మని నటించనిస్తాడా? వాళ్ళిద్దరూ నాయికా, నాయకులు. కాంబినేషన్ సీన్లు తప్పవు. చంద్రమ్మ నెగ్గుకురాగలదా?

నా పోర్షన్ అవుతూనే సైడ్ వింగ్ లోకి వచ్చి నిలబడి నాటకం చూస్తున్నాను.వాళ్ళిద్దరి కాంబినేషన్ లో మొదటి సీన్. మా బృందం అందరూ ఊపిరి బిగపట్టారు. ఆశ్చర్యం! చాలా మామూలుగా చేశాడు స్వామి. వాడు తన పాత్రని అండర్ ప్లే చేయడంతో హీరోయిన్ పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. నాటకానికీ, చంద్రమ్మకీ కూడా మంచిపేరొచ్చింది. అందరం ఊపిరి పీల్చుకున్నాం.

'ఏమయ్యింది స్వామికి?' అన్న ప్రశ్న మాత్రం రోజురోజుకీ పెరిగి పెద్దదయ్యింది. ఎవరితోనూ మాట్లాడని వాడు చంద్రమ్మతో చనువుగా ఉంటున్నాడు. స్టేజి మీద వాడిని చూస్తుంటే 'మన స్వామేనా?' అని సందేహం కలుగుతోంది మాకు. వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండడం నలుగురి దృష్టిలోనూ పడే లోగానే మరో రెండు నాటకాలు ఆడాం. ఈలోగా ఊహించనవి చాలానే జరిగాయి.

"గురు గారూ..." స్వామి పిలుపుతో ఆలోచనలనుంచి బయటికి వచ్చాను. నాలుగో పెగ్గు కలుపుకుంటున్నాడు వాడు. రెండు గుక్కలు తాగి, "చెంద్ర.. చెంద్రేం చేసిందో చూసేరా గురు గారూ.." అన్నాడు. వెన్నెల్లో వాడి కళ్ళు మెరుస్తున్నాయి. టిష్యూ తీసిచ్చి, కళ్ళు తుడుచుకోమని సైగ చేశాను.

"మీకు.. మీకు చాలా చెప్పాలి గురూ గారూ.. మీకే చెప్పాలి.. ఇప్పుడే చెప్పాలి... కాస్సేపు ఉండండేం..." అన్నాడు, మరో గుటక వేస్తూ. నేను సిగరెట్ వెలిగించాను. మబ్బుల గుంపు చంద్రుణ్ణి కప్పేయడంతో ఉన్నట్టుండి చీకటి అలుముకుంది చుట్టూ. ఆ చీకట్లో ఒక్క కుదుపుతో ఆగింది పడవ.

(నావకీ, రేవుకీ మధ్య మరికాస్త దూరం...)

7 కామెంట్‌లు:

  1. Katha chalabaga tesuku vasthunaru andi.. Konasagimpu kosam eduru chusthunamu epudu nava teeranni cheruthundo.. Ani...

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది.
    తరువాత ఏమవుతుందా అని ఉత్కంఠగా ఉంది.

    రిప్లయితొలగించండి
  3. కుదుపుతో ఆపారు కదా కథ! ప్రతీ పాత్రా, సన్నివేశమూ మీరు ఓపికగా మలచే తీరు.. మరోసారి చదువుకుని మరీ తరువాతి భాగం కోసం ఎదురుచూసేలా చేస్తుందండీ. తాపీగా సాగే కథనం మీది. అభినందనలు! అన్నట్టు నాటకాలపేర్లు భలే ఉన్నాయండీ.. ఏ పురాణకథల్ని సోషలైజ్ చేశారా అని ఆలోచిస్తున్నా... :)

    రిప్లయితొలగించండి
  4. పడవమీద వాళ్ళతో కలిసి వళ్తున్నట్టే ఉంది

    రిప్లయితొలగించండి
  5. తాపీగా సాగుతున్న పడవప్రయాణం బాగుందండీ.. చంద్రేం చేసుంటుందా అని ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నాను :-)

    రిప్లయితొలగించండి

  6. @Gayatri Nishtala: కొనసాగింపు చదివే ఉంటారనుకుంటున్నానండీ.. ..ధన్యవాదాలు.
    @Kiran Kamuju: తర్వాతి భాగం రెడీగానే ఉంది.. చదివేయండి :) ..ధన్యవాదాలు..
    @కొత్తావకాయ: నాటకాల పేర్ల గురించి మళ్ళీ ఆలోచిస్తుంటే కథలకి ఐడియాలు వస్తున్నాయండీ :) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @Narayana Swamy S: నిజంగా!! ..ధన్యవాదాలండీ..
    @వేణూ శ్రీకాంత్: హహ్హ.. తను చేసిన పని వల్లే కదండీ ఇంత కథ :) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి