బుధవారం, జూన్ 03, 2015

'మేగీ' మాయ ...

ఉదయాన్నే త్వరగా తయారు చేయగలిగే బ్రేక్ ఫాస్ట్ అన్నా, మధ్యాహ్నానికి బాక్స్ లో  పిల్లలు మిగల్చకుండా  తినేసే లంచ్ ఐటెం అన్నా, ఓపికలేని సాయంత్రం పూట అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకు తినగలిగే స్నాక్ అన్నా మొదటగా గుర్తొచ్చేవి మేగీ నూడుల్స్. పిల్లల్నీ, పెద్దల్నీ సమంగా ఆకట్టుకున్న 'మేగీ' ఎంతవరకూ ఆరోగ్యకరం? ఢిల్లీలో మొదలైన ఈ ప్రశ్న ఇప్పుడు దేశం మొత్తాన్నీ చుట్టి రావడమే కాదు, షేర్ మార్కెట్ మీదా ప్రభావాన్ని చూపిస్తోంది. 'మేగీ' ఉత్పత్తుల్ని తయారు చేసి, మార్కెట్ చేస్తున్న స్విట్జర్లాండ్ సంస్థ 'నెస్లే' మాత్రం ఇప్పటివరకూ పెదవి విప్పలేదు.

ఢిల్లీ ప్రభుత్వం తాజాగా జరిపించిన పరీక్షల్లో 'మేగీ' నూడుల్స్ లో పరిమితికి మించి లెడ్ వాడుతున్నట్టుగా తేలడంతో ఆ ప్రభుత్వం మేగీ తినడం సురక్షితం కాదని తేల్చింది. ఢిల్లీ పరిశోధనా శాలల్లో పరిశీలించిన 13 ప్యాకట్ల మేగీ నూడుల్స్ లోనూ, పది ప్యాకట్లలో లెడ్ పరిణామం అనుమతించిన 2.5 పిపియెం (పార్ట్స్ పర్ మిలియన్) ని మించి ఉన్నట్టుగా తేలింది. కొద్ది రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లేబరేటరీలలో జరిపిన పరీక్షల్లో ఒక మేగీ ప్యాకట్లో 17 పీపీయెం లెడ్ ఉన్నట్టుగా వెల్లడయ్యింది. అజనిమాటో గా పిలవబడే మొనోసోడియం గ్లుటామేట్ ని ఆహార ఉత్పత్తులలో వాడడాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. 'మేగీ' ఈ నిషేధాన్ని ఉల్లంఘించింది.

పరిమితికి మించి ఉప్పును వాడుతోంది అన్నది 'మేగీ' కి సంబంధించి బయట పడిన మరో ఉల్లంఘన. ఒక మనిషి సగటున తీసుకోగలిగే ఉప్పు రోజుకి ఆరు గ్రాములు. ఒక మేగీ ప్యాకట్లో ఉండే లవణం మూడు గ్రాములు!  అంటే, మేగీ తిన్న రోజున మిగిలిన ఆహార పదార్ధాల ద్వారా తీసుకునే ఉప్పుని నియంత్రించుకోవలసిన అవసరం ఉంది. అయితే, ఈ ఉప్పు శాతాన్ని గురించి మేగీ ప్యాకట్లపై ఎలాంటి ప్రస్తావనా కనిపించడం లేదు. నిషేధాలని ఉల్లంఘించడంతో పాటు, వినియోగదారులకి సమాచారం అందించకుండా తప్పుదోవ పట్టిస్తోంది అన్నవి 'మేగీ' పై వచ్చిన అభియోగాలు. ఢిల్లీ లో మొదలైన ప్రకంపనలు దేశం మొత్తానికి నెమ్మదిగా విస్తరిస్తున్నాయి.


'మేగీ' కి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సినీ నటులు అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, ప్రీతీ జింతా లపై బీహార్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. చిన్న పిల్లల ఆహారానికి సంబంధిచిన ప్రకటనల తయారీ, ప్రసారం విషయంలో మిగిలిన దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో నిబంధనలు మరీ అంత కఠినంగా లేవు. వీటి అమలుతీరు కూడా ఏమంత గొప్పగా లేదు. ఇక, సెలబ్రిటీ ఎండార్స్ మెంట్లకి సంబంధించి ఎలాంటి నిబంధనలూ లేవిక్కడ. ఈ నేపధ్యంలో, బీహార్ ప్రభుత్వం పెట్టిన కేసులు ఎంతవరకూ నిలబడతాయి అన్నది ప్రశ్నార్ధకమే అయినప్పటికీ, ఎండార్స్ మెంట్లని గురించి కొంత చర్చ జరిగేందుకు మాత్రం దోహదం చేస్తాయి.

ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయానికి స్పందిస్తూ, కేరళ రాష్ట్రం ప్రభుత్వం నిర్వహించే షాపుల్లో 'మేగీ' అమ్మకాల్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ షాపులన్నీ ఇప్పుడు స్టాకుని వెనక్కి పంపే పనిలో ఉన్నాయి. శీతల పానీయాల్లో క్రిమిసంహారకాల నిల్వలు ఉన్నాయంటూ పరిశోధనా ఫలితాలతో ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా సంచలానికి కారణమైన స్వచ్చంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సిఎస్ఇ) మేగీ విషయంలోనూ స్పందించింది. 'మేగీ' లో మోతాదుకు మించి లవణాలని వాడుతున్న విషయాన్ని తమ సంస్థ నాలుగేళ్ల క్రితమే బయట పెట్టిందనీ, ఆహార పదార్ధాల విషయంలో ప్రభుత్వానికి ఉదాసీనత తగదనీ చెబుతోంది సిఎస్ఇ. 'మేగీ' లో కార్బో హైడ్రేడ్లు మినహా పోషకాలేవీ లేవంటోందీ సంస్థ.

వీటన్నింటి ప్రభావం 'మేగీ' అమ్మకాల మీద ప్రభావం చూపిస్తోంది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లలో బుధవారం ఒక్క రోజునే నెస్లే షేర్లలో పదిశాతం తగ్గుదల నమోదయ్యింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి 'మేగీ' లో వాడుతున్న ఇన్ గ్రేడియంట్స్ ని గురించి నెస్లే ఇండియా ని వివరణ కోరింది కూడా. ఇప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ వర్గాలు, స్వచ్చంద సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది కేంద్ర ప్రభుత్వ స్పందన కోసమే. ఇప్పటివరకూ రాష్ట్ర స్థాయిలో పరిశోధనలు చేసి, అమ్మకాల విషయంలో నిర్ణయాలు జరిగాయే తప్ప కేంద్రం నుంచి ఎలాంటి చర్యా, ప్రకటనా లేవు. బడా బహుళజాతి సంస్థ 'నెస్లే' నిబంధనలని ఉల్లంఘిస్తూ పట్టుబడినప్పుడు, కేంద్రం స్పందన ఎలా ఉంటుందన్నది ఊహకి అందడంలేదు.

7 కామెంట్‌లు:

  1. ఏముందండీ మేగీ కి మొదట బెయిల్ ఇచ్చేస్తారు. నెమ్మదిగా నిర్దోషి అని తేల్చేస్తారు... అందరూ అన్నీ మర్చిపోయి మౡ 2 మినిట్స్ మాగీ తినడం మొదలెట్టేస్తారు.

    రిప్లయితొలగించండి
  2. ఈ వ్యాసంలో అన్ని తెలిసిన విషయాలే ఉన్నా, మీరు రాసిన దానిలో ఎదైనా కొత్త పాయింట్ ఉన్నదా అని చివరివరకు ఓపికగా చదివాను. నిరాశే మిగ్ల్చింది. కేంద్ర ప్రభుత్వం ఎదో ఒక నిర్ణయం తీసుకొంట్టుంది లేండి దాని గురించి సామాన్య ప్రజలు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కువగా ఆలోచించినా, పజలు చేయగలిగింది ఎమి లేదు. తినకుండా మానేస్తే పోయేదానికి, ప్రజలు మేగి బాన్ చేయాలని, రోడ్డెక్కి ప్రజా ఉద్యమాలు చేయలేరు కదా!

    రిప్లయితొలగించండి
  3. మీరు ఈ టపాను టూ మినిట్సులో రాసారా? నేను మాత్రం టూ మినిట్సులో చదివాను!

    రిప్లయితొలగించండి
  4. ఉప్పు విషయానికి వస్తే మాగీ మాట అలా ఉంచి ఎప్పుడైనా ఓ సారి ఆంధ్రా పచ్చళ్ళలో (ప్రియా వారి ఆవకాయ, గోంగూర ఎదైనా సరే, లేకపోతే ఇంట్లో చేసుకున్నదైనా సరే) ఎంత ఉప్పు ఉంటుండో ఓ సారి చూసుకున్నారా? అసలు ఇండియాలో ఎన్ని తిండి పదార్ధాలమీద న్యూట్రిషన్ ఇంఫర్మేషన్ ఉంటుంది? ఉన్నా అది ఎవరు చదువుతారు? చదివినా ఎంతమందికి అర్ధమౌతుంది? అమెరికాలో ఉన్న ఇండియన్సే చాలామందికి ఈ లేబుల్స్ గురించి తెలియవు. పదిహేనేళ్ళబట్టి ఉంటున్న ఒకాయన్ని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఇది - న్యూట్రిషన్ లేబులా? అంటే? ఈ లోపుల వాళ్ళావిడొచ్చి మాట తప్పించిందనుకోండి మొగుణ్ణి రక్షించడానికి, అది మరో సంగతి.

    ఇన్ని లొసుగులున్నప్పుడు మాగీ కానివ్వండి, మరోటి కానివ్వండి, వాళ్ళిష్టం వచ్చినట్టూ చేస్తారు. తప్పు మనదే మగీదీ, కోకోకోలాదీ కాదు. మనకో రూలూ శ్రాద్ధం లేవు. అందరూ వచ్చి ఇక్కడ కంపేనీలు పెట్టి మమ్మల్ని ఉద్ధరించడొహో అని దేశవిదేశాలకి వెళ్ళి డబ్బాలు కొట్టుకుంటే ఇవే మిగుల్తాయ్ చివరకి. నేనున్న ఆరేళ్ళలో బొంబాయ్ నగరంలో ఎప్పుడు ఒక్కసారంటే ఒక్కసారి కూడా పవర్ కట్ అనే మాట కానీ, నీళ్ళు ఆగిపోయాయి కుళాయ్ లోంచి అనే మాట గానీ వినలేదు. బస్సులు స్ట్రైక్ అనేది కానీ, రైల్వే వాళ్ళూ స్ట్రైక్ అనేదీ కూడా. వర్షాలు వచ్చి మునిగిపోతే వేరనుకొండి. మరి అటువంటి మంచి నగరం కట్టగలగిన వాళ్ళు మనకో నగరం నిర్మించలేరా? గలరు కానీ మన ముఖ్ఖె మంత్రిగారికి సింగపూర్ తప్ప ఇంకేమీ ఆనవు కళ్ళకి. ఏం? అదంతే. ఈ విదేశీ మోజు వల్లే మనం ఇలా తయారయ్యేం. ఆ విదేశాలనుంచి వచ్చినవాళ్లకి కావాల్సిండి డబ్బులు. మనం చచ్చామా, బతికున్నామా వాళ్ళకి అనవసరం. మికు రూల్స్ లేవు, మెం లేబుల్స్ వెయ్యలేదు. తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి. అంతే.

    రండి, రండి, మమ్మల్నుద్ధరించండీ!!

    రిప్లయితొలగించండి

  5. @స్ఫురిత మైలవరపు: అంతేనండీ.. కాకపొతే కొందరైనా జాగ్రత్త పడతారు.. కోలా ని కేవలం సింక్ క్లీన్ చేయడానికి వాడేవాళ్ళు తెలుసు నాకు :) ..ధన్యవాదాలు.
    @ఇందు: అవునండీ.. ..ధన్యవాదాలు
    @UG SriRam: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  6. @Jai Gottimukkala: సున్నాకి విలువ లేదూ అని మీరంటే రెండు నిమిషాలేనండీ :) ..ధన్యవాదాలు.
    @DG: ముఖ్యమంత్రిగారి సింగపూర్ ప్రేమ ఇవాళ కొత్తగా పుట్టింది కాదు కదండీ.. మీరన్న పాయింట్స్ అన్నీ పదిహేనేళ్ళ క్రితం ఇక్కడ బాగా చర్చకి వచ్చాయండీ.. కాకపొతే క్రియ ఏదీ లేదు.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి