నాటక, సినీ, కథా రచయిత, నటుడు, సినీ పాత్రికేయుడుగా
రావి కొండలరావు పేరు తెలుగువాళ్ళకు సుపరిచితం. కొండలరావు భార్య రాధాకుమారి
సైతం నాటకాలు, సినిమాల్లో నటించారు. ఎనభై మూడేళ్ళ కొండలరావుకి నాటక,
సినిమా రంగాలతో అరవై ఏడేళ్ళ అనుబంధం. తన అనుభవాలు, జ్ఞాపకాలతో ఇటీవలే అయన
వెలువరించిన సంకలనం 'నాగావళి నుంచి మంజీర వరకు.' శ్రీకాకుళంలో నాగావళి నది
ఒడ్డున జన్మించిన కొండలరావు మద్రాసు మీదుగా హైదరాబాద్ చేరుకొని, స్థిరపడిన
వైనాన్ని చెప్పే పుస్తకం ఇది.
ఇంట్లో చెప్పకుండా మద్రాసు
రైలెక్కితే సినిమాల్లో వేషాలు దొరుకుతాయని అప్పట్లో ఓ నమ్మకం. కేవలం ఈ ఒక్క
కారణానికే ఇంట్లో వాళ్లకి చెప్పకుండా, స్నేహితుడి దగ్గర ఇరవై రూపాయలు
తీసుకుని మద్రాసు రైలెక్కేశారు పదహారేళ్ళ కొండలరావు. అప్పటి పత్రికల్లో
వచ్చే సినిమా వార్తలన్నీ ఆసరికే కంఠోపాఠం కావడం వల్ల, మద్రాసు ఎలా ఉంటుందో
తెలియకపోయినా సినిమా వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఏయే స్టూడియోల్లో షూటింగులు
జరుగుతాయో, జరుగుతున్నాయో బాగా తెలుసు. ఇవే కాకుండా, మద్రాసు కేంద్రం నుంచి
ప్రసారమయ్యే ఆకాశవాణి కార్యక్రమాలు క్రమం తప్పకుండా విన్న అనుభవం ఉంది.
అంతేనా, చందమామ పత్రికకి చందాదారు కూడా.
వీటన్నింటినీ మించిన
మరో ధైర్యం, రంగస్థల నటుడు, సినిమాల్లో డబ్బింగులు చెప్పే అన్న కామేశ్వర
రావు మద్రాసులో ఉంటూ ఉండడం. కనీసం అన్నగారి చిరునామా కూడా దగ్గర
పెట్టుకోకుండా మద్రాసు స్టేషన్ లో రైలు దిగి, యెకాయెకిన ఆకాశవాణికి వెళ్లి
అన్నగారి అడ్రస్ సంపాదించిన వైనం, ఉత్సాహంగా పేజీలు తిరిగేలా చేస్తుంది.
అప్పటికే కాస్త నాటకానుభవం ఉండడం అక్కరకి వచ్చింది. ఆకాశవాణి 'బాలానందం'
కార్యక్రమాలు, అప్పుడప్పుడు స్టేజీ నాటకాల్లో వేషాలు, సినిమా స్టూడియోల
చుట్టూ ప్రదక్షిణలతో రోజులు గడుపుతూ ఒక్కొక్కరి స్నేహమూ సంపాదించుకోవడం,
నాటకాల్లో కుదురుకుని సినిమాల్లో వేషాలు సంపాదించుకోవడం తర్వాతి కథ.
కొండలరావు
మద్రాసులో చేరేనాటికి అప్పుడప్పుడే తెలుగు స్టూడియోల నిర్మాణం
ఊపందుకుంటోంది. రాశిలోనూ, వాసిలోనూ తెలుగు సినిమా వికసిస్తున్న కాలం. అటు
నాటకాల్లోనూ సాంఘిక నాటకాలు పౌరాణికాలకి పోటీ ఇవ్వడమే కాక, తెలుగు తెరకి
నటీనటుల్ని, సాంకేతిక నిపుణులని అందిస్తున్న కాలం. మరోవైపు తెలుగునాట
సాహిత్య పత్రికలు ఊపందుకుంటున్న సమయం. ఇలాంటి సందర్భంలో ఈ రంగాలన్నింటిలోనూ
ప్రవేశించి, కొనసాగిన కొండలరావు ఆయా రంగాలని గురించి రేఖామాత్రపు
ప్రస్తావన మాత్రమే చేసి ఊరుకోవడం నిరాశ పరిచింది. అదే సమయంలో, చదువు
మధ్యలోనే ఆపేసిన ఓ కుర్రాడు కథా, నాటక రచయితగా, నటుడిగా, పాత్రికేయుడిగా
రాణించిన వైనాన్నీ అసమగ్రంగానే చెప్పారు.
మొత్తం
పుస్తకంలో బాగా ఆకర్షించేవి కొండలరావు రాసిన బాల్య జ్ఞాపకాలు. చండశాసనుడైన
తండ్రి, కథలు చెప్పి, నాటకాలు వేసేలా ప్రోత్సహించిన నాయనమ్మ, స్కూలు
వాతావరణం, నాటక సమాజాలతో పరిచయాలతో పాటు, నాటి తరం ప్రముఖ హరికథా కళాకారులు
ఆదిభట్ల నారాయణ దాసు, 'కళావర్ రింగ్' గా ప్రసిద్ధురాలైన సరిదే లక్ష్మీ
నరసమ్మలని గురించి ఆసక్తికరమైన కబుర్లు, విజయనగరం రాజావారికి నాటకాల మీద
ఉన్న ఆసక్తి, ఘంటసాల వెంకటేశ్వర రావు విజయనగరంలో సంగీతం నేర్చుకున్న వైనం లాంటి విశేషాలెన్నో ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రముఖుల సంగతులు అక్కడక్కడా మెరిశాయి. బాల్యస్నేహితులని గురించిన కబుర్లలో పునరుక్తులూ దొర్లాయి.
సీరియల్ గా రాయడం వల్ల కాబోలు, ఒకటిరెండు విషయాల్లో స్పష్టత లోపించింది.
మొదటిసారి 'చందమామ' ఆఫీసుకి వెళ్ళినప్పుడు 'చక్రపాణి' అనుకుని 'కొకు' ని
కలిశానని ఒకచోట, చక్రపాణిని కలిశానని మరొకచోట, కొకుని కలిశానని ఇంకోచోట
రాశారు. మాటీవీ కోసం రూపొందించిన 'కన్యాశుల్కం' సీరియల్ కబుర్లని
రేఖామాత్రంగా ప్రస్తావించారు. మొత్తం మీద చూసినప్పుడు తాపీగా తన కథని
చెప్పడం మొదలుపెట్టి, ఉన్నట్టుండి ఏదో జ్ఞాపకం వచ్చి 'ఫాస్ట్ ఫార్వార్డ్'
బటన్ నొక్కేసి, మళ్ళీ కాసేపు తాపీగానూ ఇంకాసేపు గబగబానూ కథచెప్పేసి
హడావిడిగా ముగించేశారన్న భావన కలిగింది, పుస్తకం పూర్తిచేశాక. ఆత్మకథలు,
నాటకాలు, సినిమాల కబుర్లు నచ్చేవాళ్ళు ఇష్టపడే పుస్తకం. (ఆర్కే బుక్స్ ప్రచురణ, పేజీలు 176, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులూ).
రావికొండలరావు గారు విలక్షణమైన నటుడు, ఇప్పుడు వయోవృద్ధులున్నూ. వారంటేను, రాధాకుమారి గారంటేనూ నాకు ఎప్పుడూ గౌరవభావమే. మీరయితే పుస్తకాన్ని చక్కగా రివ్యూ చేసారు. "Take it with a pinch of salt" అని ఓ ఆంగ్ల భాషా పదప్రయోగం మీకు తెలుసు కదా. నేనయితే దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రముఖుల ఆత్మకథలు (ముఖ్యంగా సినిమా రంగం వారివి) చదువుతాను. మరీ మసిపూసి మారేడుకాయ చేస్తారనను గాని, చాలాభాగం తమకు సౌకర్యంగా / అనుకూలంగా ఉండేట్లే వ్రాసుకుంటారు. వారి ఆ ప్రయత్నంలో ఫలితంగా అటువంటి వారి కథల్లో మీరంటున్న gaps, inconsistencies దొర్లడం జరుగుతుంటుంది - అని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ ఓ పుస్తకాన్ని రివ్యూ చేస్తున్నప్పుడు అటువంటి లోపాల గురించి ప్రస్తావించాల్సిందేలెండి.
రిప్లయితొలగించండినాగావళి అనేసరికి ఉత్సాహమనిపించింది కానీ హడావిడి ముగింపు పడిందా అయితే! ఏమైనప్పటికీ కళావర్ రింగ్ విశేషాలకోసమైనా చదవాలి.. :)
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు: రాసిన విషయాలైతే అలాగే తీసుకోవచ్చండీ.. రాయగలిగే అధారిటీ ఉండి కూడా చాలా విషయాలని అసలు ప్రస్తావించక పోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: విజయనగరం కబుర్లు బాగున్నాయండీ.. మీరు చదవాల్సిందే :) ..ధన్యవాదాలు..