శనివారం, జూన్ 06, 2015

ఆర్తి అగర్వాల్ ...

పదిహేనేళ్ళ వయసులో ఆమె వెండితెరకి పరిచయమయ్యింది. పదిహేడో ఏట తారాపథానికి దూసుకు పోయింది. అయితే, అగ్రస్థానంలో ఆమె నాలుగైదేళ్ళ కన్నా నిలవలేకపోయింది. క్రమంగా కిందకి జారిపోయింది. ఈ తిరోగమనానికి కారణం ఆమె కాక, ఆమెని కన్న వాళ్ళూ, నమ్మిన స్నేహితులూ కావడం అత్యంత విషాదం. వెండితెరపై అగ్రస్థానానికి చేరడం కన్నా, ఆ స్థానాన్ని నిలుపుకోడానికి ఎక్కువగా కష్టపడాలి అన్న సత్యానికి ఆమె కెరీర్ మరో ఉదాహరణగా నిలిచింది. ఆమె పేరు ఆర్తి అగర్వాల్.

అమెరికాలో న్యూజెర్సీని ఓ ఆస్పత్రిలో అధిక బరువు తగ్గించుకోవడం కోసం ఆర్తి అగర్వాల్ చేయించుకున్న శస్త్రచికిత్స వికటించడంతో ఆమె కన్నుమూసిందనే వార్త ఓ చిన్న ఉలికిపాటు కలిగించింది. ఆర్తి వయసు కేవలం ముప్ఫై ఒక్క సంవత్సరాలు. అమెరికాలో పుట్టి పెరిగి, ఇండియా ట్రిప్ లో సినిమా రంగానికి పరిచయమై, ఆనతికాలంలోనే తారాపథానికి దూసుకుపోయి కేవలం తన చుట్టూ ఉన్న వాళ్ళ కారణంగా కెరీర్ ని నష్టపోయిన కథానాయిక. చిన్నవయసులోనే ఉత్థాన పతనాలని చూసి, వాటికి అతీతంగా నిలబడగలిగిన స్థితప్రజ్ఞత ఆమె సొంతం. 

వెంకటేష్ కథానాయకుడిగా విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా ఇద్దరికి బాగా కలిసొచ్చింది. ఒకరు సంభాషణల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. మరొకరు కథానాయిక ఆర్తి అగర్వాల్. హిందీలో ఏవరేజ్ గా ఆడిన 'పాగల్ పన్' ఆమె మొదటి సినిమా. ఆ సినిమాతోనే కొత్త టాలెంట్ ని వెతికి పట్టుకునే స్రవంతి,సురేష్ ప్రొడక్షన్స్ సంస్థల దృష్టిలో పడిందామె. అది యూత్ సినిమాలు తెలుగు తెరని ముంచెత్తుతున్న కాలం. యువ హీరోలు వరుసగా పరిచయమవుతున్న తరుణం. అప్పుడు నాయికగా కెరీర్ ఆరంభించిన ఆర్తి ఇటు యువ నాయకులతోనూ, అటు అప్పటికి తన తండ్రి వయసున్న అగ్ర హీరోలతోనూ ఏకకాలంలో సినిమాలు చేసి, ఎన్నో విజయాల్ని సొంతం చేసుకుంది.


తెలుగు సినిమాల్లో ఆర్తి ఎంతగా బిజీ అయ్యిందంటే, అప్పటివరకూ అమెరికాలో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆమె కుటుంబం ఒక్కసారిగా హైదరాబాద్ కి మకాం మార్చేసేంత. ఆమె వ్యవహారాల్లో ఆమె తండ్రి మితిమీరిన జోక్యం దర్శకనిర్మాతలకి తలనొప్పిగా మారినా, సెట్స్ పై ఆర్తి చాలా ప్రొఫెషనల్ కావడం ప్లస్ వరుసగా విజయాల్లో ఉండడం ఆమె కెరీర్ ని కాపాడాయి. నిర్మాతలనుంచి ప్రతి పైసానీ ముక్కు పిండి వసూలు చేసిన ఆమె తండ్రి, ఆ మొత్తాన్ని చాలా జల్సాగా ఖర్చు చేసేసేవాడు అంటారు. ఊపిరి సలపనంత బిజీగా ఉన్న తరుణంలో ఓ యువ కథానాయకుడితో జరిగిన ప్రేమ వ్యవహారం విఫలం కావడం ఆమెకి తగిలిన మొదటి షాక్ అంటారు ఆర్తిని బాగా తెలిసినవాళ్ళు.

ఆ షాక్ నుంచి బయట పడే ప్రయత్నంలో కుటుంబం నుంచి మద్దతు లేకపోగా ఒత్తిళ్ళు పెరగడం ఆమెని ఆత్మహత్యా ప్రయత్నం వైపు తోశాయని అప్పట్లో కొన్ని పత్రికలు రాశాయి. ఇన్ని ఒత్తిళ్ళ మధ్యా తన చెల్లెల్ని కథానాయికగా నిలబెట్టే ప్రయత్నాలు చేసింది ఆర్తి. అయితే, అక్కకి వచ్చినంత పేరూ, వచ్చినన్ని సినిమాలూ అదితికి రాలేదు. కారణాలు ఏవైనా, అతి తక్కువ కాలంలోనే ఆమె ఆకృతిలో మార్పులు వచ్చేశాయి. అప్పటి అగ్ర కథానాయకుడు చిరంజీవితో హిట్ సినిమా చేసిన ఆర్తి రేంజ్, అప్పటి హాస్యనటుడు సునీల్ పక్కన నాయికగా చేసేంతకి పడిపోయింది.

కుటుంబ కలహాలు, ఆత్మహత్యా ప్రయత్నాలతో అవకాశాలు బాగా సన్నగిల్లాయి. నాలుగైదేళ్ళ పాటు స్టార్డం చూసిన ఆమె, అవకాశాలు లేక పూర్తిగా గోళ్ళు గిల్లుకునే పరిస్థితికి వచ్చేసింది. వైవాహిక జీవితమూ ఆర్తికి కలిసిరాలేదు. అక్కడా వైఫల్యమే. దానితో, ఏదోలా సినిమా రంగంలోకి మళ్ళీ వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చిన్న చిన్న సినిమాలు, ప్రాధాన్యత లేని పాత్రలు, టెలి బ్రాండ్ టీవీ ప్రకటనలు.. వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. సినిమా రంగంలో, అందునా కథా నాయికలకి అదృష్టం అన్నది ఒక్కసారే తలుపు తడుతుందేమో. అవకాశాలు రాకపోగా ఆరోగ్యం దెబ్బ తినేసింది. తెలుగు సినిమా ప్రపంచం ఆమెని దాదాపుగా మరచిపోయిన సమయంలో మరణవార్త పలకరించింది.

"ఇవాళ చెబుతున్నాను.. ఈ అమ్మాయి కనీసం పది పదిహేనేళ్ళు ఇండస్ట్రీని ఏలుతుంది.." 'నువ్వు నాకు నచ్చావ్' విడుదలయ్యాక ఓ సినిమా మిత్రుడు అన్న మాటలు పదేపదే గుర్తొస్తున్నాయి. ఏలేందుకు అర్హతలూ, అవకాశాలూ ఉన్నా ఏలలేకపోయింది ఆర్తి. ఈ వైఫల్యం ఆమెది కాదు, ఆమెని కేవలం ఓ 'బంగారు బాతు'గా మాత్రమే చూసిన వాళ్ళందరిదీ. 'సినిమా వాళ్ళ జీవితాలు' అనే పాఠ్య గ్రంధంలో ఆర్తికీ ఓ పేజీ ఉంది.. ఆర్తి అగర్వాల్ ఆత్మకి శాంతి కలుగుగాక..

2 కామెంట్‌లు: