నవాబుల బిడ్డ షమ్మన్ మియాకి పద్దెనిమిదేళ్ళు . చదువు,
క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలీదతనికి. కానీ, ఆ మహల్ లో కొన్ని ఆచారాలు
ఉన్నాయి. వాటి ప్రకారమే ఆ రాత్రి వేళ అతనికి సేవ చేయడం కోసమని షమ్మన్ మియా తల్లి నవాబ్ బేగం పంపగా అతని గదికి వచ్చింది హలీమా, ఆ ఇంటి దాసీపిల్ల. ఆమె సేవలని తిరస్కరించాడు
షమ్మన్ మియా. ఫలితం, ఒకదాసి యజమాని గదికి వెళ్లి చెక్కు చెదరకుండా తిరిగి
రావడం అన్నది మొదటిసారిగా జరిగింది ఆ ఇంట్లో. కొడుకు 'ఆరోగ్యాన్ని' గురించి
బెంగ పెరిగింది బేగంకి. మరింత చొరవ చూపించాల్సిందిగా హలీమా మీద ఒత్తిడి
పెరిగింది.
హకీమ్ సాబ్ చేసిన వైద్యం కన్నా, హలీమా చూపించిన
భక్తిపూర్వకమైన ప్రేమ బాగా పనిచేసింది షమ్మన్ మియా మీద. అతనిప్పుడు హలీమా
లేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. రోజులు క్షణాల్లో గడిచిపోగా, ఓ
ఉదయం హలీమా గర్భవతి అన్న వార్త తెలిసింది మహల్లో. బేగం ఆనందానికి అవధులు
లేవు. కొడుక్కిక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయొచ్చు. సంబంధం సిద్ధంగానే
ఉంది కూడా. మరి హలీమా? ఆ ఇంటి ఆచారం ప్రకారం, ఆమె పల్లెటూరికి వెళ్లి అక్కడ
బిడ్డని కని, తిరిగిరావాలి. పుట్టిన బిడ్డ మగబిడ్డ అయితే సేవకుడిగానూ,
ఆడబిడ్డ అయితే సేవికగానూ మహల్లో జీవితాన్ని గడపాలి.
అనూచానంగా
వస్తున్న మహల్ ఆచారాన్ని ఎదిరించిన మొట్టమొదటి వ్యక్తి షమ్మన్ మియా.
తల్లిదండ్రులు, సోదరుల మాటని లెక్ఖ చేయలేదు. హలీమాని పెళ్లి
చేసుకునేనేందుకు మనసా వాచా సిద్ధపడ్డాడు. అదే జరిగితే ఇంకేమన్నా ఉందా? మహల్
పరువు ఏమైపోవాలి?? షమ్మన్ మియా తన నిర్ణయాన్ని అమలు చేయగలిగాడా లేదా
అన్నది ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ రాసిన పాతిక పేజీల కథ 'అలముకున్న
పరిమళం' కి ఇచ్చిన హృద్యమైన ముగింపు. ఈ కథతో పాటుగా ఇస్మత్ రాసిన మరో
పద్నాలుగు కథలని తెనిగించి సంకలనాన్ని తయారు చేశారు స్త్రీవాద రచయిత్రి పి. సత్యవతి. పుస్తకంగా ప్రచురించింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్.
అనువాదకురాలి
పేరు చూడడంతోనే కథానాయిక ప్రధానంగా సాగే కథలని చదవడానికి సిద్ధ పడిపోయాను
మానసికంగా. అయితే, దాసీ పిల్లని మనసారా ప్రేమించిన షమ్మన్ మియా కథతో పాటు,
చిన్నప్పుడు తను పని చేసిన ఇంట్లో అమ్మాయినే పెళ్లి చేసుకోగలిగే స్థాయికి
ఎదిగిన 'కల్లూ,' తనది కాని బిడ్డని తన బిడ్డగా అంగీకరించగల రామ్ అవతార్
('చేతులు' కథ), ఇంకా మత మౌడ్యాన్ని ఎదిరించే పడుచు ప్రేమజంట ('పవిత్ర
కర్తవ్యం) కథా కనిపించి ఆశ్చర్య పరిచాయి. అయితే, మెజారిటీ కథలు పరదా చాటు
జీవితాలని, వాటిలోని సంఘర్షణలనీ చిత్రించినవే.
వృద్ధుడైన
నవాబుగారి పడుచు భార్య బేగం జాన్ పరదాల చాటునే తనదైన జీవితాన్ని
వెతుక్కోడాన్ని 'లిహాఫ్' కథ వర్ణిస్తే, భర్త ఎదుట తనకితానుగా మేలిముసుగుని
పైకెత్తడం అనే సంప్రదాయ విరుద్ధమైన పనిని తన అభీష్టానికి వ్యతిరేకంగా
చేయడానికి ఇష్టపడక వృద్ధ కన్యగా ఉండిపోయిన గోరీబీ కథని 'మేలిముసుగు' కథ
చిత్రిస్తుంది. పట్టుదల విషయంలో గోరీబీకి ఏమాత్రం తీసిపోని మరో స్త్రీ
'బిచ్చూ అత్తయ్య.' తన భర్త దాసీతో సన్నిహితంగా ఉండడాన్ని చూసిన మరుక్షణం
వితంతు వేషం ధరించి, జీవితాంతం అతన్ని'కీర్తిశేషుడు అనే విశేషణం జోడించి
మాత్రమే ప్రస్తావించిందామె.
డబ్బులేకపోతే
అన్నీ సమస్యలే. పెళ్లి కావడం మరీ సమస్య. పెళ్ళికోసం అలవాటు లేని మేకప్
చేసుకున్న సరళా బెన్ అగచాట్లని 'ఒక ముద్ద' కథ చెబితే, తనవాడవుతాడని నమ్మిన
వాడికోసం పడరాని పాట్లు పడ్డ కుబ్రా కరుణరసాత్మక కథ 'చౌతీ కా జోడా.' సంప్రదాయం ఎంత
కఠినంగానైనా ఉండొచ్చు గాక. వెతుక్కునే వాళ్లకి గమ్యం చేరుకునే మార్గాలు
ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయని చెప్పే కథ 'దేవుడి దయ.' భార్యని తనకి
అనుకూలంగా మార్చుకునే అన్నయ్యనీ ('శిల') యవ్వనాన్ని కరిగించుకోడం కోసం
కష్టపడే రుఖ్సానా యాతనలనీ ('అమృతలత') ఓ పట్టాన మర్చిపోలేం.
'పుట్టుమచ్చ'
'చిన్నక్క' 'గరళం' కథలు వేటికవే ప్రత్యేకమైనవి. వీటికి మెరుపు
ముగింపులిచ్చారు రచయిత్రి. వీటిలో చాలా కథలు దేశానికి స్వతంత్రం రాకపూర్వం
రాసినవే. 'లిహాఫ్' కథ కోర్టు కేసులని కూడా ఎదుర్కొంది. మనకి ఏమాత్రం
తెలియని ప్రపంచంలోకి అలవోకగా తీసుకుపోతారు రచయిత్రి. పదిహేను కథలనీ చదవడం
పూర్తిచేశాక కూడా మహళ్ళు, అక్కడి మనుషులు ఓ పట్టాన మన జ్ఞాపకాలని
విడిచిపెట్టరు. కథలతో పాటు 'జీవన యాత్రలో ముళ్ళూ, పూలూ' పేరిట చుగ్తాయ్
రాసుకున్న స్వగతం ఉర్దూ కథల్ని ఇంగ్లీష్ లోకి అనువదించిన తాహిరా నఖ్వి
రాసిన 'పరిచయం' కథల పూర్వరంగాన్ని గురించి చెబుతాయి. తెనిగింపుని ఇష్టంతో
చేశానని చెప్పారు సత్యవతి. (పేజీలు 184, వెల రూ. 100, అన్ని ప్రముఖ
పుస్తకాల షాపులు).
ఇస్మత్ చుగ్తాయ్ కథలను
రిప్లయితొలగించండిఅద్దంలో చందమామను చూపినట్టు చాలా అద్భుతంగా సమీక్షించారు.
మీరు అనుమతిస్తే ఈ సమీక్షను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగు గోడ మీద కూడా
అలంకరించుకుంటాం.
వీలైతే hyderabadbooktrust@gmail.com కు యునికోడ్ ఫాంట్ లో పంపండి.
ధన్యవాదాలు.
@ప్రభాకర్ మందార: చూశానండీ బ్లాగులో.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిమీరు పరిచయం చేసిన పుస్తకం చదివేశాక, వచ్చి మళ్ళీ మీ సమీక్ష చదువుకోవడం బావుంటుందని ఇదివరలో కూడా చెప్పినట్టున్నాను కదండీ.
రిప్లయితొలగించండిస్కైబాబ చూపిన జీవితాలొక రకమైతే, ఇస్మత్ కథలొకరకం. పోలిక కాదు.. గమనింపు అంతే. వేటికవే మరచిపోలేని కథలు.. "అలముకున్న పరిమళం", "శిల" కొంచెం ఎక్కువ నచ్చాయ్. "చౌతీ కా జోడా" చాలా కాలం వెంటాడే కథ.
@కొత్తావకాయ: 'స్త్రీ వాద' కథలు చదివేందుకు సిద్ధపడిపోయి పుస్తకం తెరిచానేమో, 'అలముకున్న పరిమళం' మరీ నచ్చేసిందండీ.. . ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి