తెలుగులో వెలసిన తొలి వీరశైవ పురాణ గ్రంధం పాల్కురికి సోమన విరచిత 'బసవ పురాణం.' క్రీస్తు శకం పన్నెండో శతాబ్దానికి చెందిన
ఏడశ్వాసాల ఈ గ్రంధంలో నందీశ్వరుని అవతారమైన బసవని పూర్వ అవతారాలు, వ్యవహార
దక్షత, వీరశైవ ధర్మ రక్షా ప్రచారాలు, జంగమ సేవ, లింగైక్యము తదితర పుణ్య
చరిత్రలతో పాటు సుమారు డెబ్భై ఐదు మంది శివ భక్తుల కథలు కూర్చబడ్డాయి.
'మహాశివరాత్రి' పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ రచనలో వర్ణించిన ఇద్దరు
శివభక్తుల కథలకి రేఖామాత్రపు పరామర్శ.
భగవంతుణ్ణి
తండ్రిగానో, స్నేహితుడిగానో చూసిన భక్తుల కథలు మనకి తెలుసు. సాక్షాత్తూ
పరమశివుణ్ణి తన కొడుకుగా భావించుకుని ఉపచారాలు చేసిన మహాభక్తురాలు బెజ్జ
మహాదేవి. శివుణ్ణి గురించి ఈమె ఆలోచనలు ఎంత దూరం వెళ్ళాయంటే, "శివుడి తల్లి
బహుశా మరణించి ఉంటుంది. తల్లే జీవించి ఉంటే కేశాలని అలా జడలు
కట్టనిస్తుందా? పులితోలు కట్టుకుని తిరగనిస్తుందా? మామూలు రోజుల్లో ఎలా
ఉన్నా, కనీసం పెళ్ళిళ్ళు, పేరంటాల సమయంలో అయినా బిడ్డని అందంగా తయారు
చేయకుండా ఉంటుందా?" ఇలాంటి ఆలోచనలు సాగి సాగే, పరమ శివుడికి తానే ఎందుకు
తల్లి కాకూడదు? అన్న ప్రశ్న దగ్గర ఆగుతుంది.
శివుడామె
భక్తికి మెచ్చి పసిబాలుడిగా ఆమె ఇంట్లో ప్రవేశిస్తాడు. నవజాత శిశువులకి
జరిపే అన్ని ఉపచారాలనీ బాల శివుడికి ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తుంది బెజ్జ
మహాదేవి. తలారా స్నానం చేయించి, మూడు కళ్ళకీ కాటుక దిద్దడం మొదలు, బుగ్గ
గిల్లి ఉగ్గుపాలు పోయడం, ఏడుపు మాన్పడానికి ముద్దాడి బుజ్జగించడం, వెన్న
తినిపించి నిద్రపుచ్చడం.. ఇలా రోజంతా ఆ పసివాడితోనే గడిపేది. భక్తుడేవిధంగా
భావిస్తే శివుడా విధంగా సాక్షాత్కరిస్తాడనడానికి ఉదాహరణగా నిలిచిన
సన్నివేశాలవి. ఇంతలో తన భక్తురాలిని పరిక్షించదలిచాడు శివుడు. ఉన్నట్టుండి
తిండి ముట్టడం మానేశాడు.
బిడ్డకి జబ్బు చేసిందన్న బెంగ బెజ్జ
మహాదేవిని నిలవనివ్వలేదు. ముందుగా ఆమె ఆ బిడ్డని కోపగించుకుంది. అతని
అల్లర్ల జాబితా చదివింది. ఊరంతా బలాదూర్ తిరగడాన్నీ, అందరిళ్ళకీ వెళ్లి
వాళ్ళు పెట్టింది తిని రావడాన్నీ తప్పు పట్టింది. తనేం తక్కువ
చేస్తున్నానంటూ నిష్టూర పడింది. అటుపై ఆ తల్లి కోపం బెంగగా మారింది. బిడ్డ
బాధ చూడలేక ప్రాణ త్యాగానికి సిద్ధ పడింది. ఆమె తన తలని
పగలగొట్టుకోబోతుండగా శివుడామెకి ప్రత్యక్షమయ్యాడు. ఆమెకి శాశ్వతమైన
ముక్తిని ప్రసాదించాడు. బెజ్జ మహాదేవి అమ్మగా మారి శివుణ్ణి సేవించింది
కనుక 'అమ్మవ్వ' అని పేరుపొందింది.
తాను నైవేద్యం పెట్టిన
పాలని తాగడం లేదెందుకని శివుణ్ణి నిలదీసిన బాల భక్తురాలు 'గొడగూచి.'
శివదేవుడనే శివభక్తుడి కడగొట్టు సంతానం ఆ పిల్ల. తల్లీ తండ్రీ యాత్రకి
వెడుతూ, నిత్యం శివుడికి కుంచెడు పాలు నైవేద్యంగా సమర్పించడం మర్చిపోవద్దని
మరీ మరీ చెప్పి వెళ్ళారా అమ్మాయికి. మొదటి రోజు పాలని శ్రద్ధగా కాచి,
చల్లార్చి, ఆలయానికి తీసుకెళ్ళి, శివలింగం ముందుంచింది భక్తిగా. పాల పాత్ర
అలాగే ఉంది. ఎంతసేపటికీ శివుడా పాలని ముట్టక పోవడంతో ఆమెకి కోపం వచ్చింది, బాధ కలిగింది.. అటుపై తండ్రి దగ్గర మాట పడాలని భయం మొదలయ్యింది.
పాలు
తాగమని ఎంతగానో ప్రార్ధించింది శివుణ్ణి. తండ్రి తెచ్చే చిరుతిళ్ళు, ఆట
బొమ్మల్లో వాటా ఇస్తానని ఆశ పెట్టింది. ఉహు, పాలగిన్నె అలాగే ఉంది. శివుడు
పాలు తాగకపోతే, తండ్రి చేతిలో తనకి ఎలాగో దండన తప్పదు కాబట్టి,
శివలింగానికి శిరస్సు తాటించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధ పడిపోతుంది.
శివుడు ప్రత్యక్షమై పాలని సేవిస్తాడు. తల్లిదండ్రులు ఊరినుంచి వచ్చేవరకూ
ప్రతి రోజూ ఆమె పాలని తీసుకెళ్లడం, శివుడు ఆరగింపు చేయడం జరిగింది.
ఊరినుంచి తిరిగొచ్చిన తండ్రి శివుడు పాలు తాగాడంటే నమ్మలేదు. మహా మహా
భక్తుల నైవేద్యాలనే ఆరగించని శివుడు, తన కూతురు నైవేద్యం పెట్టిన పాలని
తాగడం అతనికి నమ్మశక్యం కాలేదు.
కూతురి మాటలు నమ్మకపోగా,
అబద్ధం చెబుతోందంటూ ఆమెని దూషించాడు. పాలు పారబోశావా లేక స్నేహితులని
పంచావా చెప్పమని నిలదీశాడు. తన ఎదురుగా శివుడిని వచ్చి పాలు తాగేలా
చేయమన్నాడు. రోజూ వచ్చి పాలు తాగిన పరమ శివుడు ఆరోజు రాలేదు. ఆ బాలిక వేదన
వర్ణనాతీతం. ఓ పక్క తన నమ్మకానికి తగిలిన దెబ్బ, మరోవంక తండ్రి ఆగ్రహం.
శివలింగం దగ్గర ప్రాణ త్యాగానికి సిద్దమయిపోయింది. శివుడు ప్రత్యక్షమై
ఆమెని తనలో లీనం చేసుకుంటూ ఉండగా, తండ్రి ఆమె జుట్టు తన చేత పట్టుకున్నాడు.
నాటి నుంచీ ఆమె 'గొడగూచి' గా సుప్రసిద్ధమయింది.
రేఖామాత్రపు పరామర్శతో శివయ్య దర్శనం చేయించారు ఓంనమశ్శివాయ:
రిప్లయితొలగించండి@శ్రీనివాస్ పప్పు: ఓం నమఃశ్శివాయ.. ధన్యవాదాలండీ...
రిప్లయితొలగించండి