శుక్రవారం, సెప్టెంబర్ 05, 2014

విజయవాడ

కొత్తగా అవతరించిన పాత రాష్ట్రానికి రాజధాని ఖరారయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే చాలా మంది ఊహించిన నగరమే రాజధాని అయ్యింది. విజయవాడలో సంబరాలు, రాయలసీమలో నిరసనలూ మొదలైపోయాయి. తొట్టతొలి ఆంధ్ర పాలకులని కొందరు చరిత్రకారులు భావించే శాతవాహనుల రాజధాని ప్రాంతం, కొన్ని శతాబ్దాల తర్వాత రాజధానిగా రూపు దిద్దుకుంటోంది మళ్ళీ. అసలు ఏముంది విజయవాడలో?

కొత్త రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. కృష్ణా నది ఉంది. కనకదుర్గమ్మ ఉంది. రైల్వే జంక్షన్ ఉంది. విమానాశ్రయం ఉంది. వీటన్నినినీ మించి 'విజయవాడ' అనే బ్రాండ్ నేముంది. అవును, విజయవాడ అనగానే చదువులు గుర్తొస్తాయి. సినిమాలు గుర్తొస్తాయి. రాజకీయాలు గుర్తొస్తాయి. రాజకీయాలని నీడలా వెన్నంటి ఉండే రౌడీయిజమూ, కొట్లాటలూ ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. ఇంకా, కారల్ మార్క్స్ రోడ్డూ, అక్కడి పుస్తకాల షాపులూ, ప్రచురణ కర్తలూ గుర్తొచ్చే వీలుంది.

సహజ వనరులన్నీ పుష్కలంగా ఉన్నా, ఎంతోమంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలకి పుట్టినిల్లైనా అదేమిటో విజయవాడలో పారిశ్రామికాభివృద్ధి పెద్దగా జరగలేదు. జలవనరుల మొదలు రవాణా సౌకర్యాల వరకూ అన్నీ ఉన్నాయి. మరి లేనిదేమిటి? సమాధానం ఒక్కటే, భూవసతి. భూములున్నాయి, కానీ వాటి ధరలు ఎప్పుడూ ఆకాశంలోనే ఉన్నాయి. పరిశ్రమకి అయ్యే ఖర్చు కన్నా భూమి కొనడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.


రాజధాని నిర్మాణానికి మొదటి సవాలు భూసేకరణే. ప్రయివేటు పారిశ్రామికవేత్తలే కొనలేని భూమిని ప్రభుత్వం కొనగలదా అన్నది మొదటి ప్రశ్న. రాజు తలచుకుంటే భూమికి కొదవ లేని మాట నిజమే కానీ, రైతుల పీకమీద కత్తిపెట్టి రాజధాని నిర్మాణం మొదలు పెట్టడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్న సిద్ధంగా ఉంటుంది. ఏ రకంగా చూసినా, ప్రభుత్వం ఎక్కువ మొత్తాన్ని భూముల కొనుగోలు మీదే వెచ్చించాల్సి వస్తుందన్నది వాస్తవం.

చాలా నగరాల్లాగే విజయవాడ కూడా 'ప్లాన్డ్ సిటీ' కాదు. చాలా రోడ్లకి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఇప్పటికే ముఖ్య కూడళ్ళ దగ్గర ట్రాఫిక్ జాములు నిత్యదృశ్యం. ఇక రాజధాని తరలింపు మొదలయ్యాక ఈ సమస్య మరింతగా పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయాలు వెతకడం అవసరం. ఒకప్పటితో పోల్చినప్పుడు శాంతిభద్రతలు బాగా మెరుగయ్యాయనే చెప్పాలి. మొదటినుంచీ కూడా విజయవాడలో ఏ నేరం జరిగినా అది పెద్ద సంచలనం అవుతోంది. ఇప్పుడిక పోలీసుల మీద ఒత్తిడి మరింతగా పెరుగుతుంది.

మల్టి ప్లెక్స్ లు, మాల్స్ తో ఇప్పటికే మెట్రో కళ సంతరించుకోవడం మొదలుపెట్టిన విజయవాడ, రాజధాని ప్రకటనతో మరింత వేగంగా పెరుగుతుంది. చుట్టుపక్కల పల్లెలు వచ్చి నగరంలో చేరిపోతాయి. రియల్ ఎస్టేట్ బుడగ ఇప్పటికే పెద్దదవ్వడం ఆరంభించింది. కనీసం ఓ తరంపాటు రాజధాని అనగానే హైదరాబాద్ గుర్తురావడం అత్యంత సహజం. హైదరాబాద్ తో పోలికా అప్రయత్నంగా జరిగేదే. అయితే, విజయవాడకి ఉన్న పరిమితుల దృష్ట్యా 'హైదరాబాద్' అంచనాలని అందుకోడం సాధ్యం కాదు. చిన్న రాష్ట్రానికి చిన్న రాజధాని అవుతుంది విజయవాడ.

(ఫోటో కర్టెసీ: The Hindu)

2 కామెంట్‌లు:

  1. అసలు ఏముంది విజయవాడలో హ్మం యెంత మాట! విజివాడలో మేమంతా వున్నాముగా .. మనదే కదా విజయవాడ :)

    రిప్లయితొలగించండి
  2. @హిమబిందు: కృష్ణ ఒడ్డున ఓ చిన్న కుటీరం ఏర్పాటు చేసుకుని శేషజీవితం గడిపేయాలనిపిస్తోంది.. కాస్త అందుబాటు ధరలో స్థలం ఇప్పించే ఏర్పాటు ఉంటే చూసి పెడుదురూ :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి