మంగళవారం, జనవరి 28, 2014

'సుందర' శృంగారం!!

పేపరు, టీవీ, ఆన్లైన్.. ఎక్కడ చూసినా వేటూరి స్మరణ కనిపిస్తూ ఉంది ఉదయం నుంచీ.. జయంతి కదా. ఇవన్నీ కలగలిసి వేటూరి పాటల్ని గురించి కాసేపు ఆలోచించేలా చేశాయి నన్ను. వేటూరి రాయలేని పాట ఏదైనా ఉంటే కదా అసలు?! ఒకానొక దశలో ఆచార్య ఆత్రేయ ని 'బూత్రేయ' అన్నట్టే, 'పాటని బూతుతో నింపుతున్నాడు' అన్న విమర్శ వేటూరికీ తప్పలేదు.

శ్రీరాముడి కాలు తాకగానే రాయి రమణిగా మారిపోయినట్టు, వేటూరి సుందర రాముడి కలం స్పర్శతో బూతు కూడా శృంగారం గా మారిపోతుందేమో అనిపించేస్తూ ఉంటుంది కొన్ని పాటలు వింటున్నప్పుడు. బూతుకీ, శృంగారానికీ తేడా ఏమిటీ అంటే.. ఉద్రేక పరిచేది బూతు, ఉత్సాహ పరిచేది శృంగారం అని భాష్యం చెప్పుకోవచ్చేమో.. అందరికీ అర్ధమైతే బూతు, కొందరికే అర్ధమైతే శృంగారం అని కూడా విన్నాను ఆ మధ్య ఎక్కడో..

వేటూరి మీద విమర్శలని పెంచిన పాట 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ..' ఎన్టీఆర్ లాంటి కమర్షియల్ హీరో సినిమాలో, జయప్రద అంతటి సౌందర్యవతి నాయికగా ఉండగా.. బలమైన సందర్భం ఏమీ లేకుండానే వాళ్ళిద్దరి మధ్యనా ఓ యుగళగీతం కావాల్సి వచ్చింది 'అడవి రాముడు'కి. 'ఈ పాటలో బూతేముందీ?!' అని ఎస్పీ బాలూ లాంటి వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోతే పోవచ్చు గాక.. ఎవరికి కావాల్సింది వాళ్ళు ఎప్పుడో వెతికేసుకున్నారు. 'నా పాట ఈ పూట నీ పైటలా దాచేసుకోనీ నీ పొంగులా' లాంటి మెరుపులూ ఉన్నాయీ పాటలో!


మొదటిరాత్రి సన్నివేశానికి పాట అంటే ఏముంటుంది, శృంగారం తప్ప? ఈ సందర్భానికి వేటూరి రాసిన పాటలే కోకొల్లలు. 'పల్నాటి సింహం' సినిమాలో 'ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా' వాటిలో ఒకటి.. ఇలాంటి గీతంలో 'ముక్కుపుడక ఎందుకూ మనసుండగా?' అని నాయిక చేత అడిగించడం ఇంకెవరికి సాధ్యం? చిరంజీవి సినిమాకి రాసిన 'అబ్బనీ తియ్యనీ దెబ్బ...' పాట మీద వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు.. ఈ పాటలో 'అడగక అడిగినదేమిటో... లిపి చిలిపిగ ముదిరిన కవితగా' లాంటి లైన్లు విడిచి పెట్టవు ఓ పట్టాన.

'సూపర్ పోలీస్' సినిమాలో ఓ పాటలో 'పక్కా జెంటిల్ మేన్ని..' అని హీరో అంటే, 'పుణ్యం కొద్దీ పురుషా.. పట్టె మంచం కొద్దీ మనిషా'అంటుంది నాయిక!!'మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు' అని చెబుతూనే 'ప్రేమంటేనే పేచీలు.. రాత్రికి మాత్రం రాజీలు.. గిల్లీగిచ్చీ కజ్జాలు.. లవ్లీ లావాదేవీలు' తత్త్వం బోధించేశారు 'బంగారు బుల్లోడి' కి. 

'రాజసింహం' సినిమాలో బొత్తిగా సందర్భంలేని ఓ సందర్భోచిత యుగళంలో నాయకుడు నాయికను 'దాయీ దాయీ దాయి దాక్షాయణీ' అంటే, నాయిక ఏమాత్రం తగ్గకుండా 'వద్దూ వద్దూ వద్దూ వాత్సాయనా' అంటుంది. యుగళాలు మాత్రమేనా? వ్యాంప్ తరహా గీతాల్లోనూ వేటూరి ముద్ర ప్రత్యేకం.. 'అ అంటే అమలాపురం' అంటూ 'ఆర్య' ని కవ్వించే అమ్మాయి 'యానాము దాటినా ఈనాము మారునా.. ఫ్రెంచీ ఫిడేలు ఆగునా' అంటుంది. ఎవరికి ఏ అర్ధం కావలిస్తే అదే దొరకడం వేటూరి పాటల ప్రత్యేకతగా చెప్పుకోవాలి..

5 కామెంట్‌లు:

  1. ఎప్పటిలాగానే మంచి పోస్ట్

    రిప్లయితొలగించండి
  2. :) చేతుల్లేని వాడికి శనగలు తినడం నేర్పిస్తున్నారు!! జోక్స్ అపార్ట్, వెతుక్కున్నవారికి వెతుక్కున్నంత దొరకడం వేటూరి పాటల ప్రత్యేకత. Nice post.

    రిప్లయితొలగించండి
  3. @పద్మార్పిత: ధన్యవాదాలండీ..
    @కొత్తావకాయ: భలే సామెత పట్టుకొచ్చారు!! అంతే అంటారా అయితే :)) ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  4. "వంగి వంగి దండమెట్టు రాజకీయ రంభరో..." పాటని వేటూరి గారే రాసారా? జొన్నవిత్తుల గారు కావొచ్చేమో సర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనే పొరబడ్డానండీ.. సరిచేసినందుకు ధన్యవాదాలు.. 

      తొలగించండి