శుక్రవారం, జనవరి 10, 2014

జానకి పాటలు-3

ఆమె అతన్ని మనస్పూర్తిగా ప్రేమించింది. ఆ ప్రేమని ప్రకటించింది కూడా. ఆ తర్వాత తెలిసింది, అతనో పెద్ద అబద్ధం చెప్పాడని. అది కూడా కేవలం ఆమె ప్రేమని గెలుచుకోవడం కోసమే చేశాడనీ. తను చేసిన పనిని అతను నిజాయితీగా ఒప్పేసుకున్నాడు. ఏం చేసి అయినా సరే, అనుకున్నది సాధించుకోవడం తన తత్వమనీ, చిన్నప్పటినుంచీ ఎన్నో చోట్ల అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందనీ చెప్పుకున్నాడు.. అంతేకాదు, నిజం తెలిసిన తర్వాత ఆమె తీసుకునే ఏ నిర్ణయమైనా తనకి సమ్మతమే అని చెప్పేశాడు.

ప్రేమకి పునాది నమ్మకం అయితే, ఆ పునాది సమూలంగా కూలిపోయే సందర్భం ఇది. అతను నిజం దాచి తనని మోసం చేసిన కారణానికి దూరం పెట్టాలా? నిజాయితీగా జరిగింది ఒప్పుకున్నందుకు క్షమించాలా? ఇదీ ఆమె ముందున్న ప్రశ్న. ఆమె ప్రేమ గొప్పది.. నిజం చెప్పాలంటే, అతని ప్రేమకన్నా గొప్పది. కాబట్టే, అతన్ని వదులుకోడానికి సిద్ధపడలేదు ఆమె.. అతను తనకి కావాలి.. అతని తోడిదే తన జీవితం కావాలి.. ఈ విషయం అతనికి చెప్పాలి.. ఎలా??

ఆమె మామూలు ఆడపిల్ల కాదు.. పిన్న వయసులోనే గొప్ప పేరు తెచ్చుకున్న శాస్త్రీయ నృత్య కళాకారిణి.. అతనూ సామాన్యుడు కాదు.. వేణుగాన విద్వాంసుడు. అతనికి తన మనసు చెప్పడానికి మాటలు చాలవు కదా.. అందుకే ఆమె పాటని ఆశ్రయించింది.. అది కూడా సద్గురు త్యాగరాజ స్వామి కీర్తనని.. అతను తనకి దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదని, అతనికి తప్ప మరొకరికి తన మనసులో స్థానం లేదనీ పాట ద్వారా చెప్పింది..'సప్తపది' (1981) సినిమాలోని ఈ కీలక సన్నివేశంలో ప్రేమ పరీక్షని ఎదుర్కొన్న ఆ ముద్దరాలి పాటకి కెవి మహదేవన్ స్వరం సమకూర్చగా, గొంతు ఇచ్చింది నలభై రెండేళ్ళ ఎస్. జానకి.

గుండె లోతుల్లోనుంచి పొంగి వచ్చే అమాయకమైన ప్రేమని ప్రకటించడంలో జానకి గొంతుది ఓ ప్రత్యేకమైన ఒరవడి. తెరపై దృశ్యం చూస్తున్న ప్రేక్షకులకి, ఆ అమ్మాయి తన గుండెని అతని దోసిట్లోకి జారవిడుస్తోందనిపించేలా చేయడం జానకికి మాత్రమే సాధ్యం.. జానకి ఆలపించిన 'మరుగేలరా ఓ రాఘవా' కీర్తనలో ప్రతి పదం దేనికదే ప్రత్యేకం అయినప్పటికీ 'అన్ని నీవనుచు.. అంతరంగమున..' 'నిన్నెగాని మదిని ఎన్నజాల నొరుల...' వింటుంటే మన గుండె చప్పుడులో తేడా మనకే స్పష్టంగా తెలుస్తుంది.. ఒకసారి కాదు.. పాట విన్న ప్రతిసారీ...


తనను ప్రాణంగా ప్రేమిస్తున్న మనిషి, తనకి కూడా ఇష్టమైన మగాడు, ఎదురుగా నిలబడి "మనం పెళ్లి చేసుకుందాం" అంటే ఏ అమ్మాయి అయినా ఎగిరి గంతేయాలి. కానీ ఆమె వేరు.. ఆమె పరిస్థితులు పూర్తిగా వేరు.. అతనికి ఆమె "అలాగే" అని సమాధానం చెప్పలేకపోయింది.. అలా అని "కాదు" అనీ చెప్పలేదు. కాదని చెప్పడానికి కారణం లేదు.. అవుననడానికి మాత్రం ఓ పెద్ద అడ్డంకే ఉంది. అదేమిటో అతనికి చెప్పలేదు.. చెప్పకుండా ఉండనూ లేదు.. ఎందుకంటే, ఆమెకీ అతనంటే ఇష్టమే..

తన వెంటపడ్డ ఐదుగురు ఆకతాయి కుర్రాళ్ళ ఆలోచనల్లో మార్పు తెచ్చి, వాళ్ళు సక్రమమైన దారిపట్టేలా చేసిన ఆ అమ్మాయి.. వాళ్ళలో ఓ కుర్రాడు తనని ప్రేమిస్తున్నాడని సులువుగానే అర్ధం చేసుకుంది.. ఆడపిల్ల, అందులోనూ దగ్గర స్నేహితురాలు.. ఆమాత్రం అతని మనసు అర్ధం చేసుకోలేదూ? అయినా ఉలకలేదు, పలకలేదు. చివరికి అతనే ఒకరోజు ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు. డొంక తిరుగుడు లేకుండా నేరుగా విషయం చెప్పేశాడు.. ఆమె స్పందన కోసం ఎదురు చూశాడు.. మాట్లాడాల్సిన ఆమె, పాటని అందుకుంది..

'మంచుపల్లకీ' (1982) సినిమాలోని ఈ సన్నివేశానికి బలాన్ని చేకూర్చే పాట రాశారు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ అమ్మాయి మనసునీ, అందులో గూడు కట్టుకున్న వేదననీ అలవోకగా పాట కట్టేశారు. వడ్డించిన విస్తరిలాంటి భవిష్యత్తు తనకోసం ఎదురు చూస్తున్నా, పరిస్థితుల కారణంగా "వద్దు" అని చెప్పవలసి వచ్చిన ఓ ఆడపిల్ల లో చెలరేగే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? ఆమెది కన్నీళ్లు పెట్టుకునే తత్త్వం కాదు.. అందుకే పాటలో ఎక్కడా కన్నీళ్లు ఉండవు.. కానీ పాట ఆసాంతమూ ఆ అమ్మాయి పడే వేదన ప్రతిఫలిస్తూ ఉంటుంది..

నలభై మూడేళ్ళ జానకి పాడిన 'మేఘమా.. దేహమా..' పాట వినే శ్రోతలకి తెలియకుండానే మనసు బరువైపోతుంది.. గాయని గొంతులో వినిపించే ఆర్ద్రత, నీటి చుక్కగా మారి శ్రోతల కనుకొనల్ని చేరుతుంది. 'నాకొక పూమాల తేవాలి నీవు.. అది ఎందుకో...' వింటూ ఉన్నప్పుడు, ఆ నీటి చుక్క కంటి నుంచి బయట పడడానికి అక్షరాలా ఓ పెద్ద యుద్ధమే చేస్తుంది.. రాజన్-నాగేంద్ర స్వరపరిచిన ఈ పాటని ఓసారి విన్న తర్వాత మర్చిపోవడం అసాధ్యం.. ఎందుకంటే అలా వెంటాడుతూనే ఉంటుంది.. 


గెడసాము చేసే ఇంట్లో పుట్టింది ఆ పిల్ల. తలమీద నీళ్ళ చెంబు, చేతిలో గెడ తో, తల్లిదండ్రుల డప్పుల దరువులకి లయబద్ధంగా తాడు మీద నడుస్తూ, ఓ నాట్యాచార్యుడి కంట పడింది. అలాంటి పిల్లకోసమే వెతుకుతున్నాడు ఆయన. ఆమె తల్లిదండ్రులని ఒప్పించి, అగ్రహారాన్ని ఎదిరించి, ఇంటికి దూరంగా ఊరి చివర ఇల్లు కట్టుకుని మరీ అత్యంత శ్రద్ధగా ఆమెకి నాట్యం నేర్పించాడు. ఆమె నాట్య కళాకారిణి గా అగ్రహారీకుల చేత అవును అనిపించుకున్ననాడే ఆచార్యుడు తిరిగి అగ్రహారంలో ప్రవేశించగలుగుతాడు.

తన పనులు తనే చేసుకోడం తెలియని పసితనం ఆమెది. గురువుగారికి నాట్యం నేర్పడం తప్ప మరో ధ్యాస లేదు. అదిగో, అప్పుడు వచ్చారు, గురువుగారి తండ్రి. వయో వృద్ధుడు. గురువు యెడల భయంతో దూరంగా మసలిన ఆ పిల్ల, తాతయ్యకి ఇట్టే చేరువయ్యింది. స్నాన పానాదుల మొదలు, జడ వేసుకోడం, ఇల్లు చక్కదిద్దుకోవడం ఇవన్నీ అలవోకగా నేర్చేసుకుంది, తాతయ్య సాహచర్యంలో. కాల చక్రం గిర్రున తిరిగి పసిపిల్ల పదారేళ్ళ పడుచు అయ్యింది.. శాస్త్రీయ నృత్యంలో గురువు అంచనాలనీ అందుకుంది.

అగ్రహారానికి కబురు వెళ్ళింది. ఆమెకి విద్యా పరీక్ష. ఓ అగ్రహారపు విద్యార్ధికీ, ఆమెకీ మధ్య పోటీ.. ఆమె గెలిస్తే గురువుకి అగ్రహర ప్రవేశం, ఓడిపోతే శాశ్వత బహిష్కరణ. తాతయ్య ధైర్యం చెప్పారు. గురువు ఆశీర్వదించారు.. ప్రదర్శన ఏర్పాటు అయ్యింది. పోటీ మొదలైన కాసేపటికి తాతయ్య సభాస్థలి వదిలి వెళ్ళిపోవడం ఎవరూ గమనించలేదు.. పోటీ సగానికి వచ్చేసరికల్లా తాతయ్య మరిలేరన్న కబురు తెలిసింది. పోటీ ఆగడానికి వీలు లేదంది అగ్రహారం. విషమ పరీక్ష... గురువుకీ, ఆమెకీ కూడా. గురువు నట్టువాంగం, గాయని గాత్రం, ఆమె పద నర్తనం... అన్నింటిలోనూ మార్పు.. కొట్టొచ్చినట్టు కనిపించే విషాదం.

'ఆనంద భైరవి' (1983) సినిమాలో ఈ సన్నివేశానికి అద్భుతమైన గీతాన్ని రచించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. అంతే అద్భుతంగా స్వరపరిచారు రమేష్ నాయుడు. ఇవాల్టికీ, కూచిపూడి సంప్రదాయంలో జరిగే నృత్య ప్రదర్శనల్లో ఈ పాట, ఇదే బాణీలో వినిపిస్తుందంటే అర్ధం చేసుకోవచ్చు, పాట గొప్పదనం. గాయని ముందున్న సవాలు చిన్నదేమీ కాదు. నట్టువాంగానికి అనుగుణంగా స్వరం ఇవ్వాలి.. భావ గర్భితంగా ఉండాలి.. పాట ప్రధమార్ధం లో గొంతులో ఉత్సాహం ఉరకలు వెయ్యాలి.. ద్వితీయార్దానికి వచ్చేసరికి, బాధ, అసహాయత, ఆవేశం మిళితమవ్వాలి.

నలభై నాలుగేళ్ల జానకి పాడిన 'కొలువైతివా రంగశాయీ' పాట వింటున్నప్పుడు 'సిరి మదిలో పూచి..' 'సిరిమోవి దమ్మికై' చరణాల్లో వినిపించే ఉత్సాహం, చిలిపితనం, 'ఔరా.. ఔరౌరా...' చరణం దగ్గరికి వచ్చేసరికి ఆవేశం, ఆవేదనల కలబోతగా మారడాన్ని గమనించాలి. దేవులపల్లి కృష్ణశాస్త్రి అపూర్వ సాహిత్యానికి, రమేష్ నాయుడి అద్వితీయ బాణీకి ఇంతకన్నా న్యాయం చేసే గాయని మరొకరు లేరనిపించక మానదు.


(ఇంకా ఉంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి