బుధవారం, జనవరి 08, 2014

జానకి పాటలు-2

యవ్వనం.. జీవితం మొత్తంలో ఓ అందమైన భాగం. వీడని బాల్య చాపల్యం, ఒక్కసారిగా వచ్చి పడే పెద్దరికం..రెండూ కలిసి ఉక్కిరిబిక్కిరి చేసే సమయం. అంతేకాదు, చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో అందంగా కనిపించడం మొదలవుతుంది.. ప్రకృతిలో అంతకు మునుపు గోచరించని కొత్త అందాలు ఎన్నో సాక్షాత్కరిస్తూ ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సృష్టి మొత్తం సౌందర్య భరితంగా కనిపించే కాలం అది.ఏ చీకూ చింతా లేని భద్ర జీవితం గడిపే ఓ అమ్మాయి యవ్వనంలోకి అడుగు పెట్టినప్పుడు, అప్పటివరకూ తెలియని ప్రపంచం ఏదో పరిచయం అయినప్పుడూ ఆమె మనఃస్థితి ఎలా ఉంటుంది?

అత్యంత సహజంగానే పగలే వెన్నెలలు కనిపిస్తాయి.. జగమే ఊయలగా మారిపోతుంది.. ఊహలు రెక్క తొడుగుతాయి. సినీ గేయరచయితగా అప్పుడప్పుడే కుదురుకుంటున్న యువకవి సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె) సమస్త ప్రకృతి సౌందర్యాన్నీ ఆవాహన చేసుకుని అక్షరరూపం ఇస్తే, (ర)సాలూరు రాజేశ్వర రావు బహు చక్కని బాణీ కట్టారు. జీవితాన్ని గురించి అందమైన కలలుకనే ఓ అమ్మాయి పాడుకునే పాట సిద్ధం అయిపొయింది.

పాట పాడే గాయని, సాహిత్యం లోని అనుభూతిని తను ఆస్వాదించి, తన గొంతు ద్వారా శ్రోతలకి అందించాలి. జీవితపు సౌందర్యాన్నీ, భవిష్యత్తు తాలూకు అందమైన స్వప్నాలనీ తన స్వరంలో కనిపింపజేయాలి. కత్తిమీద సామే కదూ? కానీ, పాతికేళ్ళ జానకి ఎంతో అలవోకగా పాడేసింది ఆ పాటని.. కళ్ళుమూసుకుని పాటని వినే శ్రోతలకి ప్రకృతి లోని అందమంతా కట్టెదుట నిలిస్తే, కళ్ళు తెరిచి దృశ్యం చూసే ప్రేక్షకులకి పియానో మోగిస్తున్న 'హంపీ సుందరి' జమున సౌందర్యం కనువిందు చేస్తుంది.

'పూజా ఫలము' (1964) సినిమా కోసం జానకి ఆలపించిన మధురగీతం 'పగలే వెన్నెలా...' మొదట వచ్చే ఆలాపన, చివర్లో 'మనసే వీణగా' దగ్గరి గమకం, భావాన్ని అనుభవిస్తూ పాడడం, ఇవన్నీ మరోగాయని నుంచి ఆశించ లేమేమో..


సృష్టిలో తీయనిది స్నేహం.. ఇద్దరు మనుషుల మధ్య స్నేహబంధం ఏ వయసులో అయినా ఏర్పడవచ్చు. కానీ, బాల్యంలో మొదలయ్యే స్నేహాలు, అప్పటి స్నేహితులు ఎప్పటికీ ప్రత్యేకమే! పాలలాంటి స్వచ్చమైన మనసుతో ప్రపంచాన్ని చూసే పిల్లలు, స్నేహితులని వెతుక్కోవడం వెనుక ఎలాంటి లెక్కలూ ఉండవు. ఈర్ష్యాసూయలు, తరతమబేధాలు తెలియని వయసులో ఏర్పడే స్నేహం కలకాలం మనడం వెనుక రహస్యం మరేమీ లేదు..కేవలం ఆ స్నేహం వెనుక ఉన్న స్వచ్చత మాత్రమే!!

ఇద్దరు అబ్బాయిలు.. ఓ ఊరి వాళ్ళే, ఒకే బళ్ళో చదువుకుంటున్నారు. ఇద్దరిమధ్యనా చక్కని స్నేహం. వాళ్ళ స్నేహం మిగిలిన ప్రపంచానికి మాత్రం పెద్ద వింత. ఎందుకంటే, ఇద్దరిలోనూ ఓ కుర్రాడు భూస్వామి కొడుకైతే, రెండో కుర్రాడి తండ్రి కూలి పనితో పొట్ట పోసుకుంటున్నాడు. స్నేహం కుదిరిన ఇద్దరికీ అందులో అభ్యంతరం ఏమీ కనిపించలేదు. కానీ, "మీ ఇద్దరికీ స్నేహం ఏమిటి?" అన్న ప్రశ్న వాళ్ళకి ఎదురవుతూనే ఉంది. ఈ నేపధ్యంలో, స్నేహం గొప్పదనాన్ని ఓ పాటగా పాడి వినిపించే అవకాశం దొరికింది ఇద్దరిలో ఓ అబ్బాయికి.

మేష్టారు పాడమని అడగ్గానే, ఎప్పుడూ తిరిగే తోటలు గుర్తొచ్చాయి.. గున్నమావి కొమ్మమీద గూళ్ళు కట్టుకున్న కోయిల, రామచిలుక కళ్ళముందు కదిలాయి. వాటిమధ్య ఎన్నో అంతరాలున్నా, స్నేహం చెక్కు చెదరలేదన్న విషయాన్ని ఓ అందమైన పాట ద్వారా కళ్ళకి కట్టి, అందరి అభినందనలూ అందుకున్నాడు 'బాల మిత్రుల కథ' (1972) సినిమాలో సందర్భం ఇది. పదేళ్ళ కుర్రవాడి కోసం పాట అంటే, గాయకుడి చేత పాడించడం సాధ్యం కాదు.. ఎందుకంటే ఆ వయసుకి 'మగ' గొంతు పూర్తిగా విచ్చుకోదు.. అలా అని ఆడగొంతు ప్రయత్నిస్తే, మరీ లేతగా ఉంటుంది..

ఓ చిన్న జీర ఉండాలి గొంతులో.. బాల్యం లోని అమాయకత్వం అంతా ఆ గొంతులో ఉండాలి.. కోయిల, రామచిలుకల మధ్య స్నేహాన్ని వర్ణించ గలిగే స్వచ్చత, తన్మయత్వం కావాలి. సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె) రచనకి, చెళ్ళపిళ్ళ సత్యం స్వరాన్ని సమకూర్చారు.. ఈ పాటకి పూర్తి న్యాయం చెయ్యగల ఒకే ఒక్క గాయని ఎస్. జానకి.. వేరెవరైనా పాడితే, ఆ గొంతులో బాల్యం 'కనిపించడం' సందేహమే.. ముప్ఫై ఐదేళ్ళ జానకి పాడిన 'గున్నమావిడీ కొమ్మ మీదా...' పాటలో ఆరంభంలో వచ్చే ఆలాపన, 'చివురులు ముట్టదు చిన్నారి కోయిల..' 'చిలుకా కోయిల చేసిన చెలిమి.. ' ఇంకా చివరిలో వచ్చే ఆలాపన చెబుతాయి, ఈ పాటని జానకి మాత్రమే ఎందుకు పాడాలో..


కొందరుంటారు.. ప్రతి చిన్న విషయానికీ బెంబేలు పడిపోతూ, చుట్టూ ఉన్నవాళ్ళని కంగారు పెట్టేస్తూ ఉంటారు.. వీళ్ళకి ఏం జరిగినా ఓదార్చేందుకు ఎప్పుడూ ఓ భుజం అవసరం. మరికొందరు ఇందుకు పూర్తిగా విరుద్ధం. వాళ్లకి వచ్చిన ఏ ఇబ్బందినీ - అది ఎంత పెద్దదైనా సరే - ఎవరితోనూ పంచుకోడానికి ఇష్టపడరు. అవతలి వారు ఎంత దగ్గరి వారైనా సరే.. ఇవతల గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా సరే.. విషయం పెదవి దాటదు. ఇదిగో ఈ రెండో కోవకి చెందిన ఓ పాతికేళ్ళ అమ్మాయి. తనకంటూ భర్త, పిల్లలు, సంసారం ఉండాలి అన్నది ఆమె కల.

ఆమెని పెళ్లి చేసుకోవాలనే కోరికతో, కేవలం ఆమె అనుమతి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తీ ఉన్నాడు. కానీ ఆమె సరేననడం లేదు. ఇందుకు కారణం ఆమె మీద ఉన్న బాధ్యతలు. కన్నతండ్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే, తోడబుట్టిన అన్న బాధ్యత తప్పించేసుకుంటే తనకి తప్పక ఇంటి బాధ్యతని మోస్తోంది ఆ అమ్మాయి. ఎప్పటికైనా ఇంటి బాధ్యత తీసుకునే మనిషి ఎదురైతే, తనదైన జీవితాన్ని నిర్మించుకోవాలన్నది ఆమె కోరిక. అలాగని తండ్రి లాగా, అన్నలాగా బాధ్యత నుంచి పారిపోడానికి వ్యతిరేకి ఆమె.

ఆమెకోసం ఎదురుచూస్తున్న అతను ఎన్నాళ్ళు వేచి ఉండగలడు? అతనికీ సహనం నశించింది. ఇంకా ఎన్నాళ్ళని నిలదీశాడు.. అదిగో, అప్పుడు గొంతు విప్పింది ఆమె.. గుండెల్లో దాగిన అగ్నిపర్వతం బద్దలయ్యింది. "నాలో ఉన్న మనసూ నాకుగాక ఇంకెవరికి తెలుసు?" అని అడిగింది సూటిగా. అన్నేళ్ళు గుండెల్లో దాచుకున్న బాధ ఒక్కసారిగా బయట పడే సందర్భం. అప్పుడు కూడా ఆమె తన సమస్య ఇదీ అని చెప్పేందుకు సిద్ధంగా లేదు.. అలా చెప్పడం ఆమె పద్ధతీ కాదు. కానీ, చెప్పాల్సిన విధంగా చెప్పింది.

'అంతులేని కథ' (1976) సినిమాలోని ఈ సన్నివేశం కోసం తేలికైన మాటలతో బరువైన పాటని రాశారు ఆచార్య ఆత్రేయ. సజీవమైన బాణీ కట్టారు ఎమ్మెస్ విశ్వనాథన్. ఈ పాటకి గొంతు ఇచ్చి జీవం పోయాల్సిన గాయని ముందు ఉన్న బాధ్యత ఏమిటి? ఆ పాతికేళ్ళ అమ్మాయిని ఆవాహన చేసుకోవాలి.. ఆమె మోస్తున్న బరువుని అర్ధం చేసుకోవాలి.. ఆమె మనఃస్తితితో మమేకం కావాలి. ఆవేదన, దుఃఖంగా మారకూడదు.. ఎక్కడా సంయమనం కోల్పోకూడదు.. మరో గాయనికైతే ఇదో పెద్ద సవాలే.. కానీ పాడింది ఎస్. జానకి కదా.. అలవోకగా సాగిపోయింది ఆమె గళం.. ముప్ఫై ఎనిమిదేళ్ళ జానకి పాడిన 'కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ..' పాటలో ప్రత్యేకంగా వినాల్సినవి, కథానాయిక వ్యక్తిత్వానికి అద్దం పట్టేవీ, రెండు చరణాలు.. మరీ ముఖ్యంగా 'జరిగేనాడే జరుగును అన్నీ... జరిగిన నాడే తెలియును కొన్నీ..' లైన్స్.. 


(ఇంకా ఉంది)

6 వ్యాఖ్యలు:

Padmarpita చెప్పారు...

వావ్....మంచి మంచి పాటల పోస్ట్ తో మళ్ళీ వచ్చేసారుగా.....వందనాలు _/\_

ఎగిసే అలలు.... చెప్పారు...

Superb murali gaaru.

Unknown చెప్పారు...

Chala bagunnayi andi mee posts. recent ga thelisindi naku mee blog gurinchi. Anni okeroje chadivesanu. Meeru vraase kathalu,pusthakala reviews chaala baguntayi.

రాధిక చెప్పారు...

good information murali garu..

chaala baavundi

keep it up

మురళి చెప్పారు...

@పద్మార్పిత: ధన్యవాదాలండీ
@ఎగిసే అలలు: ధన్యవాదాలండీ

మురళి చెప్పారు...

@అన్నోన్: ధన్యవాదాలండీ..
@రాధిక: ధన్యవాదాలండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి