సోమవారం, జనవరి 13, 2014

అంజలికి అంజలి...

అంజలీదేవి.. ఈ పేరు తలచుకోగానే ఎన్ని జ్ఞాపకాలో.. జీవితాన్ని ఎనభై ఆరేళ్ళ పాటు పరిపూర్ణంగా జీవించి ఆమె ఈ లోకం నుంచి సెలవు తీసుకుందని తెలిసిన క్షణం నుంచీ, అంజలికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ కలగాపులగంగా నెమరుకొస్తూనే ఉన్నాయి.. ఎక్కడినుంచి మొదలు పెట్టడం? వెండితెర కబుర్లా.. వ్యక్తిగత విశేషాలా...??

'సువర్ణ సుందరి' సినిమా మొదటిసారి చూసిన జ్ఞాపకం ఇంకా తడి ఆరలేదు. 'దేవకన్య అంటే అచ్చం ఇలాగే ఉంటుంది కాబోలు' అనిపిస్తూనే ఉంది, సినిమా చూస్తున్నంతసేపూ. అంతటి దేవకన్యా మానవమాత్రురాలిగా మారిపోవడం, అలవికాని కష్టాలు అనుభవించడం.. సినిమా కథని ముందుకి నడిపాయేమో కానీ.. ఉహు.. నచ్చలేదు ఎందుకో..అంజలి అంటే 'పిలువకురా..' పాడుతున్న అంజలే.


ఆ తర్వాత 'అనార్ కలి'..ముద్దకట్టిన అమాయకత్వం కదూ ఆ నాయిక?! 'జీవితమే సఫలమూ..' అంటూ అనారు పూల తోటలో విహరిస్తూ ఆమె పాడుతూ ఉంటే, రెండు కళ్ళూ చాలతాయా చూడ్డానికి? ఇక, 'రాజశేఖరా.. నీపై మోజు తీరలేదురా..' జావళి మరీ? 'వేగరారా' అని ఆమె పాడుతూ ఉంటే, సినిమా హాల్లో సీటుకి అంటిపెట్టుకునే ఉండాల్సి రావడం ఎంత దుర్భరం!!

ఆశ్చర్యం ఏమిటంటే, అంతటి అందగత్తే సీతా మహాసాధ్వి పాత్రలోకి సులువుగా పరకాయ ప్రవేశం చేసేసింది, 'లవకుశ' సినిమాకోసం. 'సందేహింపకుమమ్మా..' పాట చూస్తూ, ఆమె జానకి కాదు, అంజలి అంటే నమ్మగలమా అసలు? 'భక్త తుకారాం' లో పూర్తి నాస్తికురాలి పాత్ర! చూస్తుండగానే అమ్మగానూ, అటుపై బామ్మగానూ మారిపోయింది వెండితెరమీద. ఏ పాత్ర చేసినా తన మార్కు సారళ్యం కనిపించి తీరేది.

దగ్గరలోనే ఉన్న పెద్దాపురం కదూ అంజలి స్వస్థలం.. అలా ఆమె గురించిన కబుర్లు కూడా తరచూ వినిపించేవి. ఆదినారాయణ రావుతో ప్రేమ, పెళ్లి.. కాకినాడ యంగ్మెన్స్ హేపీ క్లబ్ లో నాటకాల రిహార్సల్స్ కి వాళ్ళిద్దరూ కలిసి సైకిలు మీద వెళ్ళడం.. అటుపై మదరాసు ప్రయాణం.. సినిమా అవకాశాలు.. ఇలా ఎన్ని కబుర్లో.. ఎన్నెన్ని సార్లు విన్నానో.. "మనంజమ్మ" అని మాట్లాడేవాళ్ళు మావైపు వాళ్ళు, అభిమానంగా.

నటిగానూ, నిర్మాతగానూ వరుస విజయాలు చూసిన అంజలి ఉన్నట్టుండి నష్టాల బారిన పడింది. "లంకంత ఇల్లు కట్టింది మదరాసులో.. కానీ ఇంట్లోనే దేవుడి గుడి కూడా కట్టేసింది.. పూజా మందిరం పెట్టుకోవాలి కానీ, గుడి కట్టేస్తారా ఇంట్లో? అందుకే ఇబ్బందుల్లో పడింది" అని నొచ్చుకున్నారు కొందరు. కొన్నేళ్ళ తర్వాత, పెద్దాపురం లో ఉన్న పాతిల్లు అమ్మకానికి పెట్టినప్పుడు, చాలామంది అమ్మొద్దని సలహా ఇచ్చారు కానీ, ఎందుకో మరి..ఆమె వినిపించుకోలేదు.

ఆదినారాయణ రావు మరణం తర్వాత, సినిమాలు చేయడం తగ్గింది. పుట్టపర్తి బాబాకి భక్తురాలు. ఆయనవల్లే తన కష్టాలు గట్టెక్కాయని గట్టి నమ్మకం ఆమెకి. సినిమా నటుల గురించి, మరీ ముఖ్యంగా నటీమణుల గురించి జరిగే ప్రైవేటు సంభాషణల్లో సహజంగానే ఒకింత చులకన స్వరం వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు అంజలి మినహాయింపు. ఆమె మాట మన్నన, ఎదుటివారికి ఇచ్చే గౌరవం ఇందుకు కారణం కావొచ్చు. సినిమా పరిశ్రమలో అంజలీదేవి అజాతశత్రువు. ఆమె పరిపూర్ణ నటి మాత్రమే కాదు, పరిపూర్ణ జీవితం గడిపిన మహిళ కూడా..

2 కామెంట్‌లు: