బుధవారం, జనవరి 22, 2014

అక్కినేని ...

"ప్రజలందరూ నాకు ఆశీర్వాద బలాన్నిస్తే సెంచురీ కొట్టేస్తాను.." అక్కినేని నాగేశ్వర రావు ఇంటర్యూ నిన్ననో మొన్ననో చూసినట్టుగా ఉంది టీవీలో. ఇంతలోనే 'అక్కినేని ఇకలేరు' అంటూ అదే టీవీలో వార్త.. ఎంత చిత్రమైనదో కదా జీవితం అనిపించిన క్షణం అది. తను కోరుకున్న నూరేళ్ళకి, తొమ్మిదేళ్ళు తక్కువగా జీవితాన్ని చూసిన అక్కినేని గురించి ఆలోచనలు ఏ పని చేస్తున్నా ఓ ప్రవాహంలాగా సాగుతూనే ఉన్నాయి.

అక్కినేని నాగేశ్వర రావు పుట్టుకతోనే నటుడు కాదు. రంగస్థలం ఎక్కాక నటన నేర్చుకోవడం మొదలుపెట్టి సినిమా రంగానికి వచ్చాక నిరంతరం తన నటనా పటిమకి మెరుగులు పెట్టుకోడానికి శ్రమించిన వ్యక్తి. తొలినాళ్ళలో స్వరం మెరుగుపరుచుకోమని దర్శక నిర్మాతలు ఇచ్చిన సూచనని అమలులో పెట్టే క్రమంలో తెల్లవారుజామునే సముద్రపు ఒడ్డుకు వెళ్లి, ఖాళీ కుండని నోటి ముందు ఉంచుకుని అనేక స్థాయిల్లో మాట్లాడుతూ కావాల్సిన ఫలితాన్ని సాధించడం ఆయనలోని శ్రమించే తత్వాన్ని చెబుతుంది.


"మొదట్లో అక్కినేని నాగేశ్వరరావుకి నటన వచ్చేది కాదు. బెంగాలీ సినిమాలు చూపించి నటన నేర్పించాం" అని సహనటి భానుమతీ రామకృష్ణ అనేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యని ఏనాడూ ఖండించలేదు అక్కినేని. పైగా, నటనలో తను నిత్య విద్యార్దినని చెప్పేవారు. ఒక్క బెంగాలీ సినిమాల నుంచే కాదు, అవకాశం ఉన్న ప్రతి చోటినుంచీ నేర్చుకునే ప్రయత్నం చేశారు. "నటన నా వృత్తి," అని పదేపదే చెప్పడం వెనుక, వృత్తిపట్ల నిబద్ధత కనిపిస్తుంది.

అక్కినేని అనగానే గుర్తొచ్చేది 'జాగ్రత్త.' అవును, అన్ని విషయాల్లోనూ జాగ్రత్త చాలా ఎక్కువ అక్కినేనికి. అది ఆరోగ్యం కావొచ్చు, సంపాదించుకున్న పేరునీ డబ్బునీ నిలుపుకోవడం లో కావొచ్చు. 'అందాల రాముడు' షూటింగ్ అప్పుడు, యూనిట్ వాళ్ల కోసం చుట్టుపక్కల ఊళ్ళకి కుర్రాళ్ళని సైకిళ్ళ మీద పంపి, అప్పుడే పితికిన పాలని బిందెలతో తెప్పించే ఏర్పాటు చేశారట నిర్మాతలు. మెస్ వాళ్ళు ఆ చిక్కని పాలని కాచేసరికి అరచేతి మందాన మీగడ కట్టేదిట. రోజూ ఉదయాన్నే ఆ మీగడతో ఫేస్ ప్యాక్ వేసుకోవడమే కాదు, "చాలా రోజులకి చక్కని మీగడ దొరికింది" అంటూ అన్నం లోనూ కలుపుకునే వారట అక్కినేని.


ఒకరోజు ఉన్నట్టుండి ఛాతీలో నొప్పిగా అనిపిస్తే, ఆ వెంటనే ఆయన చేసిన మొదటి పని మీగడ తినడం మానేయడం! అదికూడా ఏ డాక్టరూ చెప్పకమునుపే!!ముళ్ళపూడి వెంకటరమణ 'కోతి కొమ్మచ్చి' లో పంచుకున్న కబురు చదివినప్పుడు సరదానే అనిపించినా, ఆలోచించినప్పుడు అక్కినేనిలో కొత్త కోణాలు ఎన్నింటినో చూపించింది. ఆరోగ్యంతో పాటు శరీరాకృతిని అదుపులో ఉంచుకోడం, సినిమా పరిశ్రమలో కొత్తగా వస్తున్న మార్పులని ఒడిసిపట్టుకుని వాటికి అనువుగా తనని తాను మలుచుకోవడం వెండితెర మీద అక్కినేని లాంగ్ ఇన్నింగ్స్ కి ఎంతగానో సహాయ పడ్డాయి. తెలుగు తెరకి స్టెప్పులని పరిచయం చేసిన ఘనత అక్కినేనిదే. "అక్కినేని వేస్తేనే స్టెప్పులు" అన్న నానుడి కూడా వచ్చేసింది అప్పట్లో.

"అన్నపూర్ణా స్టూడియో లో అక్కినేని ఆఫీసు రూములో కూర్చుని ఆయనతో మాట్లాడుతున్నా. ఇంతలో ఎవరో ప్రొడ్యూసర్ తాలూకు మనిషి వచ్చి ఆయన చేతికి కొంత డబ్బు ఇచ్చాడు. అక్కినేని ఆ నోట్ల కట్టని ఎంతో జాగ్రత్తగా అందుకుని, లెక్క చూసుకుని, అప్పుడు ఇచ్చినతనకి వెళ్ళిరమ్మని చెప్పారు" అక్కినేనితో సన్నిహితంగా మసలిన మిత్రులొకరు చాలా రోజులక్రితం పంచుకున్న విశేషం ఇది. "కష్టపడి పైకొచ్చిన వాళ్లకి ఆ కష్టం విలువ తెలుస్తుంది. డబ్బు జాగ్రత్త తెలుస్తుంది. వాళ్ళు డబ్బుని ఎడమచేత్తో అందుకుని సొరుగులొకి గిరాటెయ్యలేరు." ఈ ముక్తాయింపు కూడా ఆ మిత్రుడిదే.


అక్కినేని తాతయ్య వేషాలకి ప్రమోట్ అయ్యాక, ఓ కాలేజీ ఫంక్షన్ కి వచ్చారు. ఆడపిల్లల కాలేజీ అది. వాళ్ళని చూసిన ఉత్సాహంలో కాబోలు, అక్కినేని ఉపన్యాసం సరదా సరదాగా సాగుతోంది. ఇంతలో ఓ అమ్మాయి లేచి "మీరో రెండు స్టెప్పులు వేస్తే చూడాలని ఉంది" అని అడిగింది. వెంటనే అక్కినేని "స్టెప్పులు వెయ్యడం నా వృత్తిలో భాగం. సినిమాల్లో అలా వేసినందుకు నిర్మాతలు నాకు డబ్బులిస్తారు. నా పారితోషికం నాకు ఇస్తే ఇక్కడ వెయ్యడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు" అని గంభీరంగా చెప్పగానే అంత పెద్ద ఆడిటోరియమూ ఒక్క క్షణం మూగబోయింది.

చాలామంది సెలబ్రిటీల కుటుంబాలు ఓసారి కాకపొతే మరోసారి రోడ్డుకెక్కాయి. వాళ్ళ ఇంటి విషయం ఊరందరి విషయమూ అయ్యింది. అక్కినేని కుటుంబం ఇందుకు మినహాయింపు. పైకి కనిపించని క్రమశిక్షణ ఒకటి ఆ కుటుంబంలో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని నెలకొల్పిన, కొనసాగించిన ఘనత పూర్తిగా అక్కినేనిదే కాకపోవచ్చు.. కానీ ఆయనకీ భాగం ఉందన్నది వాస్తవం. నేర్చుకోవాలి అనుకునే వాళ్లకి అక్కినేని వ్యక్తిత్వం చాలా విషయాలనే నేర్పుతుంది.. నటన మీదా, జీవితం మీదా తనదైన ముద్రని వేసిన అక్కినేని నాగేశ్వరరావు కొన్ని తరాలపాటు తెలుగువారి హృదిలో చిరంజీవి!!

6 కామెంట్‌లు:

  1. అక్కినేని నాగేశ్వరరావుగారికి నివాళి!

    రిప్లయితొలగించండి
  2. నాగేశ్వరరావు గారు చాలావిషయాల్లో నాకు నచ్చుతారు (అలాగని నచ్చని విషయాలు లేవనికాదు). ఆయన నటించిన సీతారామయ్యగారి మనవరాలు నాకు నచ్చిన చిత్రాల్లో ఒకటి. ఇతర వేషాలువెయ్యకుండా కేవలం సినిమావేషాలే వేసుకుంటూ చఖ్ఖగా జీవించినారు. అంతే చఖ్ఖగా మరణించినారు. I'm happy for him.

    అంత ముక్కుసూటిగా, నిజాయితీగా, నిగర్వంగా ఉండటం ఇప్పటి కధానాయకులక్కూడా ఉంటే చాలా బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  3. ఈ పాటికి మన ఆస్థాన జ్యోతిష్కులుంగారు "అక్కినేని జాతకం" అని ఒక టపా వేసి ఉంటారనుకున్నానే?

    రిప్లయితొలగించండి
  4. -- చాలామంది సెలబ్రిటీల కుటుంబాలు ఓసారి కాకపొతే మరోసారి రోడ్డుకెక్కాయి. వాళ్ళ ఇంటి విషయం ఊరందరి విషయమూ అయ్యింది. అక్కినేని కుటుంబం ఇందుకు మినహాయింపు. పైకి కనిపించని క్రమశిక్షణ ఒకటి ఆ కుటుంబంలో కనిపిస్తూ ఉంటుంది. ---

    ఇది బాగా నచ్చింది.

    అవకాశం ఉండి, NTR పోరు పెట్టినా రాజకీయాలకి రాని గట్టి విల్ పవర్ ఉన్న వ్యక్తి ANR.

    He knows very well what he doesn't know and what he is not. That's not easy. .

    రిప్లయితొలగించండి
  5. @పరిమళం: ధన్యవాదాలండీ..
    @శ్రీనాథ్: ఇప్పటి తరం కథానాయకులు.. ఉహు.. ఊహించలేమండీ... ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  6. @DG: పొరపాటున ఇక్కడ రాసినట్టున్నారు మీ వ్యాఖ్య.. ...ధన్యవాదాలండీ
    @వాసు: అవునండీ.. బహుశా, ఆ లక్షణమే అక్కినేనిని ప్రత్యేకంగా నిలబెట్టిందేమో, మొదటినుంచీ.. ...ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి