శుక్రవారం, మార్చి 08, 2013

పెదవికి ఇది తప్పదా...

ఇప్పటినుంచి సరిగ్గా ఏడాది గడిచేసరికి, భారతదేశంలో మేకప్ సామగ్రి అమ్మకాల మొత్తం విలువ ఇరవైవేల కోట్ల రూపాయల పైమాటే. వీటిలో సింహభాగం పెదవుల రంగు, గోళ్ళ రంగుల అమ్మకాల ద్వారా రాబోతోంది. అసోసియేటెడ్ చాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచాం) నిర్వహించిన సర్వే ప్రకారం, భారతదేశం లో కాస్మటిక్స్ మార్కెట్ ఇప్పటికే పదివేల కోట్ల రూపాయలు దాటేసింది. అత్యంత వేగంగా పెరుగుతున్న మార్కెట్ గా కాస్మటిక్స్ ని గుర్తించింది అసోచాం.

ఉన్నట్టుండి కాస్మటిక్స్ మార్కెట్ ఇంతగా ఎలా ఊపందుకుంది? చుట్టూ వస్తున్న మార్పులని గమనించే వాళ్లకి ఇదేమంత అశ్చర్య పరిచే పరిణామం కాదు. ముఖ్యమైన కారణం ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరగడం. కాస్మటిక్స్ అమ్మకాల్ని ప్రభావితం చేస్తున్న మరో అంశం మీడియా. టెలివిజన్ చానెళ్ళ ప్రసారాలు పల్లెటూళ్ళ కి కూడా విస్తరించడం మొదలయ్యాక, చిన్నపాటి పట్టణాల్లో సైతం బ్రాండెడ్ కాస్మటిక్స్ అమ్మకాలు ఊపందుకున్నాయని సర్వేలు చెబుతున్నాయి.

ఉద్యోగాలు చేసే మహిళలు మేకప్ చేసుకోక తప్పదా? రిసెప్షనిస్ట్, ఎయిర్ హోస్టెస్ లాంటి కొన్ని ఉద్యోగాలకైతే ఇది తప్పనిసరి విషయమే. వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఆయా ఉద్యోగినులు విధి నిర్వహణలో ఉన్నంత సేపూ మేకప్ లో ఉండాల్సిందే. మిగిలిన చాలా ఉద్యోగాల విషయంలో ఇది కేవలం ఐచ్చికం. మూడున్నర దశాబ్దాల క్రితమే "నేను గాడిద బరువు మోస్తున్నా.. అందుకే ఈ బూడిద పూసుకుంటున్నా..ఈ బట్టలు మోస్తున్నా.." అంటూ తన నాయిక చేత బాలచందర్ పలికించిన డైలాగు గుర్తొస్తోంది.


గడిచిన పదేళ్ళ లోనూ భారతదేశంలో అడుగుపెట్టిన మల్టీనేషనల్ కాస్మటిక్ కంపెనీల సంఖ్య తక్కువేమీ కాదు. పది పన్నెండేళ్ళ క్రితం విశ్వ సుందరి, ప్రపంచ సుందరి కిరీటాలు భారతీయ వనితలకే దక్కడం వెనుక, ఈ కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీ పాత్ర తక్కువదేమీ కాదన్న వాదన ఉంది. అలాగే, పెరుగుతున్న కాస్మటిక్స్ అమ్మకాలకి ప్రపంచీకరణకీ ఉన్న సంబంధాలపైనా లోతైన చర్చలే జరిగాయి అప్పట్లో. మొత్తానికి, కాస్మటిక్స్ మార్కెట్ విస్తరిస్తుందంటూ పదేళ్ళ క్రితం చేసిన ఊహాగానాలు ఇప్పుడు వాస్తవాలై కనిపిస్తున్నాయి.

కాస్మటిక్స్ అమ్మకాల పెరుగుదలని, భారతీయ సమాజం సంప్రదాయ ధోరణి నుంచి ఆధునికత వైపు వడివడిగా అడుగులు వేస్తోంది అన్న దృష్టి కోణంలో చూడాలా? కొన్ని దశాభ్దాల క్రితం వరకూ మహిళలు ఫేస్ పౌడర్ రాసుకోడానికే వెనుకాడిన పరిస్థితులు ఉన్నాయిక్కడ. మేకప్ అంటే కేవలం నాటకాల వాళ్ళు, సినిమా వాళ్లకి సంబంధించిన విషయం. బ్యూటీ పార్లర్లు వీధివీధికీ విస్తరించడం అన్నది ఇటీవలి పరిణామంగా గుర్తించాలి మనం. ఈ నేపధ్యంలో, వచ్చిపడుతున్న బ్రాండ్లు, పోటాపోటీ ప్రమోషన్లు, ఏ కొత్త బ్రాండ్ కనిపించినా ఆదరించే వినియోగదారులు... ఇవన్నీ తరచి చూస్తే ఆశ్చర్యాన్ని కలిగించేవే.

సౌందర్యం అంటే కేవలం బాహ్య సౌందర్యం మాత్రమేనా? ఒక ఫేషియల్, మరికొన్ని కాస్మటిక్స్ తో సౌందర్యాన్ని 'సొంతం' చేసేసుకోవచ్చా? సౌందర్య సాధనాలు కేవలం ఉన్న సౌందర్యాన్ని మెరుగులు దిద్దగలవే తప్ప, లేని సౌందర్యాన్ని రప్పించలేవు అన్నది నిజం. అసలంటూ సౌందర్యం ఉన్నప్పుడు మెరుగులు అవసరమా? అన్న ప్రశ్నకి, 'బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు అవసరం' అన్న సమాధానం సిద్ధంగా ఉంటుంది. మేకప్ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయమే, కానీ ఇది చిన్న విషయం కాదనీ, అంతర్జాతీయ సంస్థలు మార్కెట్ కోసం పోటీ పడేంత పెద్ద విషయం అనీ గుర్తించాలి.

సౌందర్య సాధనాలని శ్రుతిమించి వాడడం, ఎంపికలో అజాగ్రత్తల వల్ల అనారోగ్యాల బారిన పడుతున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే పరిణామం. ఎలర్జీ మొదలు, స్కిన్ కేన్సర్ వరకూ అనేక ఆరోగ్య సమస్యలకి కాస్మటిక్స్ కారణం అవుతున్నాయన్న వార్తలు ఆందోళన కలిగించేవే. అయితే ఇవేవీ కాస్మటిక్స్ అమ్మకాల మీద ప్రభావం చూపించడం లేదనే చెప్పాలి. నేటి మహిళలు బ్రహ్మరధం పడుతున్న ఈ సౌందర్య సాధనాల విషయంలో రేపటి మహిళల ధోరణి ఎలా ఉంటుందో వేచి చూడాలి.

4 కామెంట్‌లు:

  1. బొమ్మ బాగుందండి! మిగతా పోస్ట్ ఏవిటో పెద్దగా ఎక్కలేదు కానీ.. ;)

    రిప్లయితొలగించండి
  2. ha ha What a topic on the Women's day Sir ji :-)
    But want to tell something ..

    మేకప్ వేసుకున్నా వేసుకున్నట్లు కనపడని ప్రోడక్ట్ రేటు ఎక్కువ అన్నమాట ! అంటే నాచురల్ గా కనపడటానికే ప్రాధాన్యత ఎక్కువ మరీ ఎవరో nerd గా ఉండే వాళ్ళు లేదా profession డిమాండ్ చేస్తేనో తప్ప .
    ఇంకొకటి ఎంటటే ఇప్పటికీ ఎక్కువ పీపుల్ తో ఇంటరాక్షన్ ఉండే జాబ్స్ లో వాళ్ళే కొంచెం ఎక్కువ శ్రద్ద చూపిస్తారు మేకప్ విషయం లో ,after all it is part of their job :-)

    రిప్లయితొలగించండి
  3. వజ్రానికి కూడా సాన పెడతారు కదండి?అప్పుడే కదా ధగ ధగ మనేది?

    సౌందర్యానికి మెరుగులు దిద్దడం అవసరమా కాదా అంటే, అవసరమే అని చాలా మంది మహిళలు అంటారు అని నా అభిప్రాయం. సౌందర్య సాధన శ్రుతిమించి వాడడం, ఎంపికలో అజాగ్రత్తల వల్ల అనారోగ్యాల బారిన పడుతున్న మహిళల సంఖ్య ఉన్నట్టుగానే, కాస్మటిక్స్ వలన ఏవరేజ్ గా ఉండే వారు కూడా అందంగా కనపడతారు లెండి. ఉద్యోగాలు చేసుకునేవారు మేకప్ సామగ్రి వాడాలా అన్నది ప్రశ్న అయితే, నలుగురిలోకి వెళ్ళేటప్పుడు ఇంట్లో ధరించే వస్త్రాలు కాక, వేరేవి కట్టుకోవడం ఎలాగో నా దృష్టిలో మేకప్ చేసుకోవడం కూడా అంతే! శ్రుతి మించకుండా...ఏది చేసుకున్నా అందం గానే ఉంటుంది. మీరు ఎంచుకున్న టాపిక్ వైవిధ్యం గా బాగుంది మురళి గారు.

    రిప్లయితొలగించండి
  4. @చాణక్య: సహజమేనండీ... తప్పట్టుకోలేం :) ..ధన్యవాదాలు..

    @శ్రావ్య వట్టికూటి: మంచి సమాచారం ఇచ్చారు.. ధన్యవాదాలు..

    @జలతారు వెన్నెల: మీరన్న వజ్రం పోలిక సినిమా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న వాళ్లకి బాగా వర్తిస్తుందండీ.. అక్షరాలా సాన పెట్టించు కుంటారు వాళ్ళు.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి