శుక్రవారం, మార్చి 01, 2013

పరిచయాల మలుపు...

పరిచయం.. ఇది కేవలం ఓ అందమైన మాట మాత్రమే కాదు.. ఓ చక్కని సందర్భం కూడా.. నిత్యం ఎంతోమంది మనకి కొత్తగా పరిచయం అవుతూ ఉంటారు.. కొన్ని ఆ క్షణానికే పరిమితమయ్యే పరిచయాలు అయితే, అతికొద్ది మాత్రం తర్వాతి కాలంలో గుర్తుండి పోయేవిగా మారతాయి. అంతేకాదు, అప్పుడు ఆ పరిచయం జరగకుండా ఉంటే బాగుండు అనుకునేవీ ఉండి తీరతాయి. అయితే, ఏ పరిచయం తాలూకు పరిణామాలు ఎలా ఉండబోతాయి అన్నది చాలా సందర్భాల్లో పరిచయాలు జరిగే క్షణాలలో తెలియదు మనకి.

తొలిపరిచయంలోనే అవతలి వ్యక్తిలో ఉన్న ఏదో ప్రత్యేకత మనల్ని ఆకర్షిస్తే, అ ఆవ్యక్తిని తప్పక గుర్తు పెట్టుకుంటాం. నిజానికి ఈ గుర్తుపెట్టుకోడం అన్నది మనుషుల విషయంలో మాత్రమే కాదు, ట్రైలర్ చూసి సినిమా మీద, టైటిల్ చూసి పుస్తకం మీద ఆసక్తి పెంచుకోడం అన్నది కూడా ఈ పరిచయాల జాబితాలోకే వస్తుంది కదా మరి.పెట్టుకోడానికి ఉన్న మరోకారణం, పరిచయం అయిన తీరు. పరిచయం ఎవరి ద్వారా జరిగింది అన్నది కూడా బాగానే ప్రభావితం చేస్తుంది మనల్ని. ఒకటి రెండు ఎదురు దెబ్బలు కనుక తగిలినట్టయితే, ఆ చానల్ ద్వారా జరిగే పరిచయాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాం మనం.

క్రమం తప్పకుండా కొందరిని మనం కలుస్తూనే ఉన్నా, వారితో పరిచయం మరో మెట్టు ఎక్కదు. పరిచయం దగ్గరే ఆగిపోతుంది. మనం క్రమం తప్పకుండా కూరగాయలు కొనే చిరు వ్యాపారులు, బిల్లింగ్ కౌంటర్ ఉద్యోగులు, క్రమం తప్పకుండా ప్రయాణం చేసే వారికైతే బస్ కండక్టర్లు, గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చే కుర్రాళ్ళు, పేపర్ బాయ్స్, సెలూన్/బ్యూటీ పార్లర్ లో పని చేసేవాళ్ళు, పాలవాళ్ళు.... వీళ్ళంతా ఈ జాబితాలోకి వస్తారు. వీళ్ళలో చాలామంది పేర్లు కూడా మనకి తెలియవు.వాళ్ళకీ మన వివరాలు తెలియవు.

ఓ పెద్ద సంస్థలో పని చేసేవారికి, సహోద్యోగులు మొత్తం అందరితోనూ స్నేహం కాదు కదా, పరిచయం కూడా ఉండదు. అలా ఉండడానికి అవకాశం ఉండదు నిజానికి. కొందరితో స్నేహం, మరి కొందరితో పరిచయం, చాలామందితో కేవలం ముఖ పరిచయం.. అంతే. సంస్థకి కనుక డ్రెస్ కోడ్ ఉన్నట్టయితే, ఈ ముఖ పరిచయం సహోద్యోగులు యూనిఫాం లో కాక మామూలు దుస్తుల్లో బయట తారస పడితే ఎదురయ్యే అవస్థ అంతా ఇంతా కాదు.పాపం, అవతలి వాళ్ళ పరిస్థితీ అలాగే ఉంటుంది. పలకరింపుగా నవ్వాలో, కూడదో తెలియని సందర్భం మరి. 

కొన్ని కొన్ని పరిచయాలు అందమైన మలుపులు తిరుగుతాయి. ఇప్పటి మన ప్రాణ స్నేహితులలో చాలామంది ఒకప్పుడు యాదృచ్చికంగా పరిచయం అయిన వాళ్ళే అవుతారు, గుర్తు చేసుకుంటే. కొన్ని పరిచయాలు బంధుత్వాలకి దారితీస్తే, మరికొన్ని ఉద్యోగంలో మార్పుల వైపు నడిపిస్తాయి. మంచినీ, చెడునీ విడదీసి చూడడం సాధ్యపడదు కాబట్టి, అన్ని పరిచయాలూ మంచి వైపు మాత్రమే దారి తీస్తాయి అనుకోలేం. అందుకే, ఎక్కడికక్కడ తగుమాత్రం జాగ్రత్త చూపడం అవసరం. చేతులు కాలకుండా చూసుకోవడం ఉత్తమం కదూ.

ఎప్పుడో జరిగిన పరిచయాన్ని, చాలా ఏళ్ళ తర్వాత గుర్తు చేసుకోడం బాగుంటుంది. అది కూడా అస్సలు ఊహించని విధంగా అయితే మరింత బాగుంటుంది. ఎప్పుడో పరిచయమైన వాళ్ళు, ఊహించని విధంగా ఎదురై పలకరించి, అప్పటి కబుర్లు చెబుతూ ఉంటే, 'అప్పుడు మనం వీళ్ళని నిర్లక్ష్యం చేశామా?' అన్న ఆలోచన కలగక మానదు. ఇందుకు పూర్తిగా బిన్నమైన సందర్భమూ ఉంది. మనం మర్చిపోడానికి ప్రయత్నిస్తున్న విషయాలు, పరిచయస్తుల రూపంలో మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం రావడం. తప్పదు... పరిచయాలు మనచేతుల్లో ఉండవు మరి.

4 వ్యాఖ్యలు:

Sravya Vattikuti చెప్పారు...

హేమిటో :-)

laddu చెప్పారు...

Bagundhi.

జయ చెప్పారు...

ఈ జీవితపు రైలుబండి కి పరిచయాల డబ్బా లెన్నో! కొత్త డబ్బాలు చేరుతూనే ఉంటాయి. పాతవి కొన్ని మూల పడిపోతూనే ఉంటాయి. కొన్ని విలువైన పరిచయాలు ఏసీ డబ్బాల్లాగ దర్జాగా ఉంటూనే ఉంటాయి. జెనెరల్ డబ్బాల్లాంటివైతే చెప్పనే అఖ్ఖర్లేదు. ఆ పరిచయాలు ఎక్కడ కలుగుతాయో, ఎక్కడ వదిలిపోతాయో.మదిలో పదిలంగా ఉండే పరిచయాలు మాత్రం చాలా తక్కువ. అవి మనతో పాటే ఏ కంపార్ట్మెంట్ లో కయినా వచ్చేస్తూనే ఉంటాయి. నాకెందుకో గాని మీ ఈ 'పరిచయాలు' చాలా చాలా నచ్చిందండి. ఇట్లాంటి రచనలు మీ దగ్గరినుంచి నాకింకా కావాలి.

మురళి చెప్పారు...

@శ్రావ్య వట్టికూటి : సొంతఘోష లెండి :-) ..ధన్యవాదాలు

@ఇద్దరు: ధన్యవాదాలండీ

@జయ: రాశాక చదువుకుంటే నాకూ అలాగే అనిపించిందండీ... ధన్యవాదాలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి