ఆదివారం, మార్చి 31, 2013

గోదావరి గాథలు

"ఈ కథల్లోది వేదంలా ప్రవహించే గోదావరి కాదు. ఊళ్లూ నాళ్ళూ ఏకం చేసి, పంట పొలాలను ఇసుక మేటలు గా మార్చి, ఎన్నెన్నో నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుని శంకరాభరణ రాగాలాప కంఠియై ఉరకలేస్తూ, ఉప్పొంగి పోతూ, తెప్పున ఎగిసి పడుతూ నిర్దాక్షిణ్యంగా సాగిపోయే గోదావరి ఈ కథల్లో కానవస్తుంది," అన్నారు విఖ్యాత కథకుడు మధురాంతకం రాజారాం, ఫణికుమార్ రాసిన 'గోదావరి గాథలు' కి రాసిన ముందు మాటలో. నిజమే, ఎందుకంటే ఈ గాథల్లో గోదారి పాపికొండల నడుమ ప్రవహించే అందమైన నది కాదు, దారీ డొంకా లేని, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ రికార్డుల్లో ఊళ్లుగానే నమోదు కాని అటవీ ప్రాంతాలగుండా సాగిపోయే ప్రవాహం. రెవెన్యూ శాఖలో ఉన్నతోద్యోగిగా ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఫణికుమార్, పాతికేళ్ళ క్రితం వెలువరించిన ఈ పదిహేను గాథల సంకలనం గోదావరిలోని కొత్త కోణాలని ఆవిష్కరిస్తుంది.

రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల్లో ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు మొదటి వరసలో ఉంటాయి.పక్కనే నదీ ప్రవాహం ఉన్నా, కరువు బారిన పడుతూ ఉండడం ఈ ప్రాంతాలకి ఒక శాపం. ఇక ఏటా వచ్చే వరదలు తెచ్చే భీభత్సం అంతా ఇంతా కాదు. గోదావరి వరదలకి 'ప్రజా జీవితం స్థంభించి పోవడం' అంటే ఏమిటో చెబుతుంది సంకలనంలో మొదటి గాథ 'వరదలలో నాగారం.' వరద ప్రాంతాల్లో ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో రెవిన్యూ ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలని వివరించే గాథ ఇది. అయితే, ఇదే వరదల నేపధ్యంలో రాసిన రెండో గాథ 'నువ్ మంచిగుండు మామా...' మనసుని మెలి పెట్టేస్తుంది. పుస్తకం పక్కన పెట్టాక కూడా వెంటాడే కొన్ని గాథల్లో ఇదీ ఒకటి.

రాజ్యాలు పోయినా రాజులే రాజులే. రాజసం తగ్గడాన్ని రాజులే కాదు, ప్రజలూ ఒప్పుకోరు. గోండులలో ఈ పట్టింపు మరీ ఎక్కువ. అందుకే అంబలి కాచుకోడానికి జొన్నలు లేకపోయినా, రాజా అత్రాం భగవంత రావు మరో పని చేసి పొట్ట పోసుకోడానికి ఒప్పుకోలేదు. దారుశిల్పాలు చెక్కడాన్ని అభిరుచితో నేర్చుకున్నారు ఆయన. దానినే ఆయనకీ ఉపాధిగా మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసిన ఓ ఉద్యోగికి ఎదురైన అనుభవమే 'రాజా సాబ్' గాథ. ఊహించని ముగింపు ఇచ్చి, రాజా భగవంత రావుని పాఠకులు మర్చిపోకుండా చేసేశారు రచయిత. ఇలాంటిదే మరో గాథ 'గోండ్వానా భీష్ముడు.' తన తెగని అభివృద్ధి చేయడానికి ఎన్నెన్నో పథకాలు రచించి, జిల్లా ఉన్నతాధికారులకే సలహాలిచ్చిన గోండు రాజ కుటుంబ పెద్ద అత్రాం భీమ్ రావ్ పటేల్ ని గురించిన స్కెచ్ ఇది.


కొత్తగా వచ్చిన వాళ్ళని అనుమానంగా చూడడం మానవ సహజం. ప్రకృతికి దగ్గరగా మసిలే గిరిజనుల్లో ఈ లక్షణం కొంచం అధికం. మరీ ముఖ్యంగా, నాగరీకులని ఓ పట్టాన నమ్మరు వాళ్ళు. అలాంటి వారి మధ్య విధులు నిర్వహించడం ఉద్యోగులకి కత్తిమీద సాము. 'శాస్త్రి గా'రి లాంటి అధికారులు అందుకు మినహాయింపు. అంతేకాదు, ఈ దేశం కాకపోయినా, గిరిజనులని సొంత మనుషులని చేసేసుకున్న హేమండార్ఫ్ దంపతులూ అంతే. ఎవరికో తప్ప వాడని గౌరవ వాచకం 'పేన్' (దేవుడు) ని వీరి విషయంలో గిరిజనులు సునాయాసంగా వాడేశారు అంటారు ఫణి కుమార్. అంతేకాదు, ఎలిజబెత్ హేమండార్ఫ్ గురించి ప్రపంచానికి తెలియని విషయాలని పరిచయం చేశారు కూడా.

గిరిజనేతరుల నుంచి గిరిజనులని రక్షించడం కోసం చట్టాలు చాలానే ఉన్నాయి. కొన్ని సందర్భాలలో గిరిజనేతరులు చేసింది తప్పు కాకపోయినా, చట్టం దృష్టిలో అది నేరంగా పరిణమించే పరిస్థితులు ఉంటాయని చెబుతూ, కర్తార్ సింగ్ తో తన అనుభవాన్ని ఉదహరించారు రచయిత, 'కృష్ణాష్టమి' గాథలో. గిరిజనేతరుడైన సింగ్ కి వ్యతిరేకగా తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితిని చెబుతూ, "నేను కృష్ణాష్టమి రోజున గోకులానికి వెళ్ళిన కంసుడిని అనిపించింది. నా చర్యల వల్ల ఎప్పుడు ఏ మల్లెలు నవ్వాయి గనుక?" అన్న ప్రశ్నని సంధిస్తారు. కీలకమైన పదవుల్లో ఉన్నవారికి మెదడుతో పాటు, మనసుకూడా పనిచేసే సందర్భాలలో ఎదురయ్యే సందిగ్ధత ఇది.

మన్యంలో సౌకర్యాల లేమి, ప్రజల అమాయకత్వంతో పాటు, తీవ్రవాదం పెచ్చరిల్లడానికి అవకాశాలు పెరుగుతూ ఉండడాన్ని కూడా ప్రస్తావించారు ఈ గాథల్లో. 'నేను రాయని గాథలు' పేరిట రచయిత రాసిన చివరి మాటలో "నేను రాసిన గాథలలో అసత్యమైన విషయం కానీ, వర్ణన కానీ లేదు. అయితే నేనెరిగిన సత్యమంతా చెప్పలేదు," అన్న వాక్యం చూసినప్పుడు, సీనియర్ అయ్యేయెస్ అధికారి పీవీఆర్కె ప్రసాద్ రాసిన 'అసలేం జరిగిందంటే...' గుర్తొచ్చింది. "జీవించి ఉన్న వ్యక్తుల సెంటిమెంట్లు గౌరవించాలి అన్నది ఇలా రాయలేకపోడానికి ఒక కారణం," అంటారు ఫణికుమార్. ఫోటోగ్రఫీ లో అభినివేశం ఉన్న ఈ రచయిత, తను తీసిన ఒక ఫోటోని పుస్తకానికి కవర్ పేజీ గా అలంకరించారు. ఆ ఫోటో వెనుక ఉన్న 'రాకి తల్లి' గాథ కదిలిస్తుంది. అలకనంద ప్రచురణల ద్వారా మూడో ముద్రణ పొందిన ఈ 92 పేజీల పుస్తకం వెల రూ.75. ఆపకుండా చదివించే ఊరుకునే రచన కాదు, ఆలోచనల్లో పడేసే పుస్తకం ఇది.

2 కామెంట్‌లు:

  1. నేను రాజాసాబ్‌ కథ ఒక్కటీ (ఏ పత్రికలోనో లేక కథా సంకలనంలోనో గుర్తు లేదు కానీ) చదివాను. అద్భుతమైన కథన శైలి. రచయిత కథగా రాసిన ఘట్టాలు నిజజీవితంలోనివే అని నేను ప్రగాఢంగా నమ్మాను. ఈ గోదావరి గాథలన్నీ చదవాలింక.

    రిప్లయితొలగించండి
  2. @పురాణపండ ఫణి: ఆంధ్రప్రభ లో చదివి ఉంటారండీ.. ఈ గాథలన్నీ ఆ పత్రికలోనే వచ్చాయి.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి