శనివారం, మార్చి 30, 2013

సూర్యుడు చూస్తున్నాడు...

'ఎండలు మండిపోతున్నాయి...' ప్రతి వేసవిలోనూ ప్రతి ఒక్కరూ అనుకునే మాట ఇది. అంతేనా? ఏడేళ్ళ పసి వాడు మొదలు, ఎనభై ఏళ్ళ వృద్ధు వరకూ 'ఇంతలేసి ఎండలు ఎప్పుడూ చూడలేదు' అనడం కూడా ప్రతి వేసవిలోనూ వినిపిస్తూ ఉంటుంది. 'నక్క పుట్టి నాలుగు ఆదివారాలు అవ్వలేదు కానీ, ఇంతటి గాలి వాన ఎప్పుడూ చూడలేదు అందిట' అని ఓ సామెత. గాలివాన మాట ఏమోగానీ, ఎండలకి మాత్రం ఇది తప్పకుండా వర్తించేస్తుంది. ఆబాల గోపాలమూ 'హమ్మో ఎంత ఎండా? ఎప్పుడూ చూడనే లేదమ్మా' అన్న డయిలాగుని నాలుక చివర ఉంచుకునే కాలం వచ్చేసింది. ఎప్పటి లాగే ఈసారి కూడా ఎండలు గాట్టిగానే ఉన్నాయి మరి.

మనింట్లో కరెంట్ పోయినప్పుడు, పక్క వాళ్ళ ఇంట్లో దీపాలు వెలుగుతూ, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే మన హృదయం వెయ్యి ముక్కలు అయితీరుతుంది. అలాగే మన ఊళ్ళో మాత్రమే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని తెలిసినా అదే బాధ. ఇన్నాళ్ళూ లోపలి పేజీల్లో ఉండే 'ఉష్ణోగ్రత'లు ఈ నాలుగు నెలలో న్యూస్ పేపర్ల మొదటి పేజీలోకి వచ్చేస్తాయి కాబట్టి, ఉదయాన్నే మనకన్నా వేడిగా ఉన్న వాళ్ళని చూసి జాలిపడి, చల్లగా ఉన్నవాళ్ళ మీద అసూయ పడొచ్చు. ఎటూ కరెంట్ గురించి మాట వచ్చింది కనుక, విద్యుత్ సరఫరా గురించి ఏమన్నా మాట్లాడుదామా అంటే మాట్లాడడానికి ఏమీ లేదక్కడ. ఒకప్పుడు కరెంట్ అనేది ఉండేదిట అని చెప్పుకునే రోజుని చూసేస్తానేమో అన్న అనుమానం రోజు రోజుకీ పెరిగిపోతోంది మరి.

ఎండాకాలంలో తరచూ మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్ లాంటివి తాగుతూ ఉండాలనీ, వడదెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించీ దూరదర్శన్ వాళ్ళు వివరంగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడూ చెబుతూనే ఉండి ఉంటారు కానీ, కొత్త న్యూస్ చానల్ ఏదో మొదలైన సంరంభంలో కేబుల్ అబ్బాయి దూరదర్శన్ ని తాత్కాలికంగా పక్కకి తప్పించినట్టు ఉన్నాడు.. న్యూస్ ఛానళ్ళు కూడా వార్తలు, లైవుల మధ్యలో అప్పుడప్పుడూ ఎండల జాగ్రత్తలు చెబుతున్నాయి కానీ, అవి కూడా మిగిలిన కమర్షియల్స్ లో కలిసిపోతున్నాయి. రోజంతా సాఫ్ట్ డ్రింక్ ప్రకటనలు చూపించి, మధ్యలో ఎప్పుడో పాప పరిహారం కోసమా అన్నట్టు కొబ్బరి నీళ్ళు తాగండి అని ఓ ముక్క చెప్పడం చూసినప్పుడల్లా నవ్వొచ్చేస్తూ ఉంటుంది.


వార్తలంటే గుర్తొచ్చింది... ఎండలు ముదురుతున్న సందర్భంగా పాదయాత్రల పధికులు నడకలకి ఏమన్నా కామా పెడతారా అన్న ఆలోచన పూర్తిగా ఓ కొలిక్కి రాకముందే, ముందస్తు ఎన్నికలు అంటూ ఊహాగానాలు మొదలైపోయాయి.. ఇంత నడకా కేవలం రికార్డుల కోసం కాదు కదా... వాళ్ళలా నడవాల్సిందే.. ఎండలకి ఎండిపోకుండా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారని భోగట్టా, టీవీ వాళ్ళు చెప్పిందే ఇదికూడా. పిల్లలకి పరిక్షల హడావిడి ముమ్మరంగా ఉంది. కరెంట్ లేకపోవడంతో కొవ్వొత్తుల వెలుగులో చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళ భవిష్యత్తుకి మాంచి భరోసా కనిపిస్తోంది. అనుమానం ఉంటే గొప్ప గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు తిరగేయండి. వాళ్ళల్లో మెజారిటీ లాంతర్ల దగ్గరా, వీధి దీపాల దగ్గరా చదువుకున్న వాళ్ళే.

ఈ పరిక్షలు కాస్తా అయిపోయాయి అంటే, నెలన్నా తిరక్క ముందే టీవీల్లో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వాళ్ళ కొత్త డబ్బింగ్ సినిమా విడుదలవుతున్నంత హడావిడి మొదలైపోతుంది. అంకెలంటే విరక్తి పుట్టేలా ర్యాంకులు అరిచేస్తూ ఉంటారు, కొన్నాళ్ళ పాటు. పరిక్షల పుణ్యమా అని కొత్త సినిమాలేవీ పెద్దగా విడుదల అవ్వడం లేదు. దొరికిందే చాన్స్ అనుకుని ఎప్పటినుంచో ల్యాబుల్లో నిరీక్షిస్తున్న చిన్న సినిమాలు ఒక్క ఉదుటన థియేటర్ల లోకి లంఘించాయి. ఒకటీ అరా మినహా నిలబడేవి ఏవీ లేవనే సమాచారం. టిక్కట్టు కొన్న అందరికీ లాటరీ తగలదు కదా. భారీ సినిమాలు వచ్చి ఏం చేస్తాయో చూడాలి. థియేటర్ కి వెళ్లి చూసే సినిమా వస్తే బాగుండును అని ఎదురు చూస్తున్నా, చాలా రోజులుగా.

ఆవకాయ తదాదిగా ఊరగాయలు పెట్టుకునే హడావిడి ఇంకా మొదలవ్వ లేదు. ఈసారి మామిడికాయ రావడం కొంచం ఆలస్యం కావొచ్చని మా పక్కవాళ్ళు చెప్పారు. మల్లెపూలు అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నాయి.. మే నెలలో చాలా పెళ్ళిళ్ళు జరగబోతున్నాయిట. మల్లెల మాసంలో ఒకటి కాబోతున్న జంటలకి ముందస్తు అభినందనలు. చల్లనైన ప్రదేశాలకి హనీమూన్ ప్లాన్ చేసుకున్నట్టాయనా, పుణ్యం మాట ఎలా ఉన్నా పురుషార్ధానికి లోటు ఉండదు. మండే ఎండలని తట్టుకోడానికి మానసికంగా సిద్ధ పడిపోతే, ఆ తర్వాత ఇక జల్లులే జల్లులు.. నాలుగు జల్లులు చాలు కదూ ఈ ఎండల బాధ మర్చిపోడానికి... తలచుకుంటేనే యెంత హాయిగా ఉందో... ఎందుకూ ఆలస్యం.. మీరూ తల్చుకోండి..

4 వ్యాఖ్యలు:

Padmarpita చెప్పారు...

వేడి వాతావరణ సూచనని....చల్లగా చక్కగా సెలవిచ్చారుగా మురళీగారు :-)

సృజన చెప్పారు...

సూర్యుడు చూస్తున్నాడో, మండిపోతాడో....ముందుంది ముసళ్ళ పండగ:)

phaneendra kumar Kothamasu చెప్పారు...

"swamy ra ra" baagaaney undi..meeku "anaganagaa oka roju", "aithe" vanti cinemalu nachithe choodagalru..

"ankalantey virakti..." ha haa haa

మురళి చెప్పారు...

@పద్మార్పిత: ధన్యవాదాలండీ..

@సృజన: నిజం.. నిజం.. తప్పదు కదండీ.. ధన్యవాదాలు..

@ఫణీంద్ర కుమార్: అవునండీ.. బాగుందని చెప్పారు మిత్రులు కూడా.. వీలు చూసుకోవాలి.. ధన్యవాదాలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి