గురువారం, జూన్ 14, 2012

సాయంకాలమైంది

"ఆండాళ్ళు వీపు మీద కొన్ని తరాల, యుగాల సత్సంప్రదాయం బరువు గంజీ కావిడి మోస్తోంది. ఆమె పాదాల దగ్గర అన్ని తరాల, యుగాల వ్యత్యాసం యధాప్రకారంగా - మోకాళ్ళు తెగి పడి ఉంది. నిర్దుష్టంగా గిరులు గీసుకుని, సడలడానికి ఏమాత్రం ఆలోచనలోకూడా రానివ్వని రెండు వర్గాల పొలిమేరలో నుంచున్న ఇరవై రెండేళ్ళ పిల్ల ఏం చెయ్యాలి? ఇది అనూచానంగా వస్తున్న చాతుర్వర్ణ వ్యవస్థకి సాయంకాలమా? అన్వయించుకుని, కొత్త అర్ధాల్ని ఆశ్రయించే కొత్త పుంతకి ప్రాతఃకాలమా?" ...గడిచిన ఎనిమిదేళ్ళలో నేను అతి ఎక్కువసార్లు చదివిన తెలుగు నవల గొల్లపూడి మారుతి రావు రాసిన 'సాయంకాలమైంది.' అందులోని ఓ కీలక సన్నివేశం ఇది.

"మార్పు కొందరిని భయపెడుతుంది. కొందరిని జోకొడుతుంది. కొందరిని ఆనందింపజేస్తుంది" ఇవి కూడా నవలలో వాక్యాలే. ఈ మార్పే 'సాయంకాలమైంది' నవలలో కథా వస్తువు. ప్రాణం కన్నా సంప్రదాయాన్ని కొనసాగించడాన్ని మిన్నగా భావించే ఓ శ్రీవైష్ణవ కుటుంబంలో నాలుగు తరాల కాలంలో అనివార్యంగా వచ్చి పడిన మార్పుని వ్యాఖ్యాన సహితంగా చిత్రించిన నవల ఇది. కథాస్థలం విజయనగరం జిల్లాలో, గోస్తనీ నదీ తీరంలో ఉన్న పద్మనాభం అనే పల్లెటూరు. స్వస్థలం సర్పవరం అగ్రహారంలో ఆచారం సాగడంలో జరిగిన చిన్న పొరపాటు, పండితుడైన కుంతీనాధాచార్యుల వారిని కుటుంబ సహితంగా పద్మనాభం తరలి వచ్చేలా చేస్తుంది.

పద్మనాభంలో కుంతీమాధవ స్వామి, కొండమీది అనంతపద్మనాభ స్వామి ఆలయాల్లో అర్చకత్వం మొదలుపెడుతుంది ఆ కుటుంబం. కుంతీనాధా చార్యుల కుమారుడు పెద్ద తిరుమలాచార్యులు తండ్రి ఇష్టానికి విరుద్ధంగా ఆయుర్వేద వైద్యం చేయడం మొదలుపెట్టి, కేవలం సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం అనివార్య పరిస్థితిలో ప్రాణత్యాగం చేస్తారు. పెద్ద తిరుమలాచార్యుల కుమారుడు సుభద్రాచార్యులు నూటికి నూరుపాళ్ళు తాతకి తగ్గ మనవడు. శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని కొనసాగించడాన్ని మించినదేదీ లేదాయనకి. భర్తకి తగిన భార్య వరదమ్మ. పద్మనాభం అనే ఓ చిన్న పల్లెటూరినే తమ ప్రపంచంగా చేసుకున్న ఆ దంపతుల కొడుకు చిన్న తిరుమలాచార్యులు ఉద్యోగం కోసం విదేశాలకి వలస వెళ్ళిపోగా, కాలేజీలో చేరిన కూతురు ఆండాళ్ళు - కుండలు చేసుకుని జీవించే సానయ్య కొడుకు కూర్మయ్యని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ఈ విపర్యయాలకి ఆ వృద్ధ దంపతులు ఎలా స్పందించారన్నది తర్వాతి కథ.

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు' నవలతో అనివార్యంగా పోలిక కనిపించే నవల ఈ 'సాయంకాలమైంది.' తరాల అంతరాలు, మార్పుని అంగీకరించలేక, ప్రేక్షక పాత్ర వహించే ప్రధాన పాత్రల కారణంగా 'వేయిపడగలు' గుర్తొచ్చి తీరుతుంది. నాటక, సిని రచయతగా అపార అనుభవం ఉన్న గొల్లపూడి కలం నుంచి వచ్చిన ఈ నవలలో నాటకీయత అక్కడక్కడ శ్రుతిమించింది. నవనీతం అత్యాచారం, ఆండాళ్ళు ప్రేమకథలని చిత్రించిన తీరులో నాటకీయతని చాలావరకూ తగ్గించవచ్చు. విసిగించే మరో అంశం, మితిమీరిన వ్యాఖ్యానం. కథని తన దోవన తను నడవనివ్వకుండా రచయిత పదే పదే అడ్డుపడి, వ్యాఖ్యానాలు చేయడం చాలా సందర్భాలలో పంటికింద రాయిలాగా అనిపిస్తుంది. నిజానికి వ్యాఖ్యానించదల్చుకున్న అభిప్రాయం పాఠకుల్లో కలిగించే విధంగా రాయడం, చేయి తిరిగిన రచయిత గొల్లపూడికి కష్టమేమీ కాదు.


ఇది డైరెక్ట్ నవల కాదు. 'ఆంధ్రప్రభ' వారపత్రికలో సీరియల్ గా వచ్చింది. ఒక్కసారిగా కాక, ఏవారానికి ఆ వారం రాసి ఇవ్వడం వల్ల కాబోలు, చాలాచోట్ల కంటిన్యుటీ దెబ్బతింది. ఉదాహరణకి, ప్రారంభంలో కొడుకు రాకకోసం సుభద్రాచార్యుల వారి దేహం మూడు రోజులు మార్చురీలో ఉందని రాసి, నవల మధ్యలో అంత్యక్రియలు వియ్యంకుడు జరిపినట్టుగా రాశారు. చిన్న తిరుమల, భూపతిరాజు, నవనీతం కొన్ని నెలల తేడాతో పుట్టారని రాసి, తర్వాతి సన్నివేశంలో చిన్న తిరుమలకీ నవనీతానికీ చాలా వయోభేదం ఉన్నట్టు చిత్రించడం, జయవాణిని మొదట ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ లో సూపర్నెంట్ గా పరిచయం చేసి, తర్వాతి అధ్యాయాలలో ఆమెకి చదువు లేదు కాబట్టి నర్సుగా పనికి కుదిరిందని చెప్పడం...ఇవన్నీ సీరియల్ గా రాయడం వల్ల జరిగిన పొరపాట్లే అయినప్పటికీ, నవల ప్రింట్ చేసేటప్పుడు సరిదిద్ది ఉండాల్సింది.

"శ్రీ వైష్ణవ సత్సంప్రదాయ వైభవాన్ని సవివరంగా నాకు తెలియజెప్పిన పూజ్యులు శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్యుల వారికీ, శ్రీ సాతులూరి గోపాల కృష్ణమాచార్యుల వారికీ..." కృతజ్ఞతలు చెప్పుకున్న గొల్లపూడి, ఆ సంప్రదాయాన్ని చిత్రించడంలోనూ తడబడ్డారు. ఉదాహరణకి, చిన్నతిరుమల వివాహ సందర్భంలో సుభద్రాచార్యుల వారికి వియ్యంకుడు 'రుద్రాక్షమాల' కానుకగా చదివిస్తాడు. శ్రీవైష్ణవులు ముట్టుకోని వాటిలో మొదటి వరుసలో ఉండేవి రుద్రాక్షలు! అలాగే, శ్రీవైష్ణవ కుటుంబాల్లో స్త్రీలు మట్టి గాజులు ధరించరు, మడికి పనికిరావని. (ఈ వివరం పంచుకున్న మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు). అలాగే శ్రీవైష్ణవులనీ, క్షత్రియులనీ 'వారు' అని సంబోధించిన రచయిత, ఇతర వర్ణాల వారిని గురించి చెప్పేటప్పుడు 'వాడు' 'అది' అని ప్రస్తావించడం పంటి కింద రాయిలాగా అనిపిస్తుంది. వెంకటాచలానికీ, జయవాణికీ పుట్టిన విక్టోరియాని కలుపుమొక్కతో పోల్చడమూ సరికాదు.

ఇన్ని లోపాలున్నా, ఈ నవల అన్నిసార్లు చదవడానికి కారణం? మొదటగా చెప్పాల్సింది చదివించే గుణాన్ని. తర్వాత కథ, కథనాల్లో ఆర్ద్రత. నవనీతం, రేచకుడు లాంటి బలమైన పాత్రలు. ప్రతి పాత్రకీ ఓ ఐడెంటిటీ ఇవ్వడం. చిన్నా పెద్దా కలిపి ముప్ఫైకి పైగా పాత్రలున్నప్పటికీ ప్రతి పాత్రా దేనికదే ప్రత్యేకమైనది. సుభద్రాచార్యులు-వరదమ్మల పాత్ర చిత్రణలో ఆర్ధ్రత..ప్రతిసారీ ఉత్కంఠభరితంగా అనిపించే కొన్ని మలుపులు, తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లేలా చేసే కొన్ని సన్నివేశాలు..వెరసి, మనసు బాగోనప్పుడు అప్రయత్నంగా చేయి వెళ్ళే మొదటి పుస్తకం అయిపోయింది ఈ 'సాయంకాలమైంది.' ఈ నవలకి అభిమానుల సంఖ్య పెద్దదే. పీవీ నరసింహారావు, కొంగర జగ్గయ్య వంటి ప్రముఖులు గొల్లపూడిని వ్యక్తిగతంగా అభినందించగా, ప్రస్తుతం మన మధ్య లేని ఓ ప్రముఖ ఖైదీ ఈ నవల చదివి జైలు నుంచి సుదీర్ఘమైన ఉత్తరం రాయడం విశేషం.

'సాయంకాలమైంది' కి కొనసాగింపు రాసే ఉద్దేశం ఉందని ఆమధ్యన ప్రకటించారు గొల్లపూడి. తర్వాత మళ్ళీ ఏ కబురూ లేదు. అలాగే యువ దర్శకుడు ఒకరు ఆ కథని సినిమాగా తెరకి ఎక్కించే ఆలోచన చేసినట్టు సమాచారం. జ్యేష్ట లిటరరీ ట్రస్టు ప్రచురించిన ఈ నవల కాపీలు కొద్దిగా మాత్రమే ఉన్నాయి మార్కెట్లో. అచ్చు తప్పులని సవరించడంతో పాటు, కథనంలో దొర్లిన పొరపాట్లని రచయితే స్వయంగా సవరించి మరో ప్రింట్ తీసుకొస్తే బాగుంటుంది. లోపాలెన్ని ఉన్నప్పటికీ, పాఠకులని వెంటాడే నవల ఇది. (పేజీలు 179, వెల రూ.100, అన్ని పుస్తకాల షాపులు)

19 కామెంట్‌లు:

  1. నవలా పరిచయం ఆసక్తిగాను, మీరు చెప్పిన విధానం నిర్మొహమాటం గాను ఉంది.థాంక్ యు మురళీ గారు.

    రిప్లయితొలగించండి
  2. చదవడానికి ఎప్పుడు కుదురుతుందో ఏమో!!!

    రిప్లయితొలగించండి
  3. యదలోతులో యే మూలనో నిదురించు జ్ఞాపకం :)
    ఒక ఫైన్ మార్నింగ్ అప్పుడే పరిచయం అయిన ఒక ఫ్రెండ్ నాకు "సాయంకాలం"బహుమతిగా ఇచ్చారండీ ,ఇవ్వడమే కాక చదివన లేదా అని వారం అంత గుర్తోచినపుడల్లా వాకబు చేసేరు దెబ్బకి భయపడి పుస్తకం మొత్తం చదివి గబగబా ఫోన్ చేసి మరీ చెప్పాను చదివేసానని :)ఇక కథ విషయానికి వస్తే( పంటికింద రాళ్ళు చిన్న పొరపాట్లు వదిలేస్తే )గుండె బరువెక్కి వెంటాడుతూనే వుండేది .విశాఖపట్నం వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా పద్మనాభం వెళ్లి కొండ సగం వరకి ఎక్కి గుడి ప్రాంగణంలో తిరిగి చిన్ననాటి తిరుమలని సుభాద్రచార్యులని తలుచుకుంటూ కళ్ళార చూసుకున్నాం .ఇంకోసారి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ప్రత్యేకించి వరదదేవి పుట్టిన ఊరు శ్రీకూర్మం ఆలయంలో జాడలు వెదికాం....అప్పట్లో సాయంకాలం లోని పాత్రలన్నీ అంతలా వెంటాడాయి అన్నట్లు చాలామంది తో చదివించేము.

    రిప్లయితొలగించండి
  4. నాకెంతో ఇష్టమైన పుస్తకం..టపా చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. చదవాలి ఎలాగైతేనేం వీలుచూసుకుని..

    రిప్లయితొలగించండి
  6. "ఓ శ్రీవైష్ణవ కుటుంబంలో నాలుగు తరాల కాలంలో అనివార్యంగా వచ్చి పడిన వ్యాఖ్యాన సహితంగా చిత్రించిన నవల ఇది"

    ** వచ్చిన మార్పును ** ఉండాలి అనుకుంటా

    ఇన్ని పంటి కింద రాళ్ళు ఉన్నా ఎందుకు ఆరగించారు అందామనుకునే లోపు మీరే చెప్పారు :)

    రేచకుడు చదవడం వల్లనా లేక ఇది వరకూ ఒకసారి ప్రచురించారా ఇది ..ఈ సినిమా నేను చూశాను
    మీరు చెప్తా ఉంటే నాకు ముందే తెలిసిపోతోంది (క్షణ క్షణం లో శ్రీదేవి స్టైల్ లో చదువుకోండి ) అనిపించింది

    రిప్లయితొలగించండి
  7. 500 టపాలు పూర్తయినందుకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. హృదయ పూర్వక అభినందనలు మురళి గారూ! :)

    రిప్లయితొలగించండి
  9. అవునండోయ్, తృష్ణ గారు చెప్పిన తరువాత నేనూ లేఖ్ఖపెట్టేను.

    అర్ధ సహస్ర టపాలకి అభినందనలు.
    ఇలాగే మరెన్నో సహస్రటపాలు వ్రాయాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  10. మురళీ, అర్ధ సహస్ర టపాలు పూర్తిచేసినందుకు హృదయపూర్వక అభినందనలు... నిజంగా ఇది సామాన్యమైన విషయం కాదండీ!
    ఎంకెన్నో మంచి పుస్తకాలు, సినిమాలు, విషయాలను మాకు పరిచయం చేస్తూ మీరు అతి త్వరలో ఆ సహస్రాన్ని చేరుకోవాలి :-)

    ఇక పుస్తకం విషయానికొస్తే.... ఫైనల్లీ!!! ఎప్పటినించో ఈ టపా కోసం ఎదురుచూస్తున్నాను..
    ఇందులో నాకు నచ్చిన అంశం కూడా అన్ని పాత్రలకూ ఒక ప్రత్యేకతని ఇవ్వడం.. ఎవరెవరో వస్తుంటారు.. వెళ్తుంటారు.. కానీ ప్రతి వారికీ ఒక నిర్దిష్టమైన పని అప్పజెప్పబడి ఉంటుంది!
    ఉదాహరణకి, అమెరికాఅ నించి తిరుమల ఫోన్ వచ్చే ఇంటి యజమాని పైడితల్లి నాయుడు..
    అలానే ఈ పుస్తకంలో లోపాలను కూడా బాగా గమనించారు!!
    చాలా చక్కని పరిచయం :-)

    రిప్లయితొలగించండి
  11. మారుతీరావు గారి రచనలు నాకెక్కువగా నచ్చకపోవటానికదే కారణమండీ- పేజీల కొద్దీ ఆయన వ్యాఖ్యలు. మరీ కొన్నిసార్లు తన పాత్రల గురించి ఆయనే జడ్జిమెంటులు కూడా ఇచ్చేస్తూ వుంటారు.

    రచయిత కేవలం కథ చెప్పి, అభిప్రాయాలనీ ఆలోచనలనీ పాఠకులకి వదిలేస్తే నవలా పఠనం ఇంకొంచెం ఆసక్తి గా వుంటుంది కదా. ఏం జరిగిందో నేను చెప్తాను, ఎలా అర్ధం చేసుకోవాలో నూవ్వే చూసుకో అన్నట్టుంటే రచయితా పాఠకుడూ ఇద్దరి ఇన్వాల్వ్మెంటూ వుంటుంది. కానీ ఇక అంతా ఆయనే చెప్పేస్తే మనకేం మిగిలింది అక్కడ చేయటానికి అనిపించి, నాకాయన రచనలు ఎన్ని సార్లు చదివినా ఒక రకమైన అసంతృప్తి.

    శారద

    రిప్లయితొలగించండి
  12. చాలా మంచి పుస్తకాన్ని సమీక్షించారు. చదువుతుంటే కళ్ళు చమరుస్తాయి. చదివాకా... నేను చూసిన కొన్ని వైష్ణవ కుటుంబాలు, వాళ్ల ఆచారాలు, జీవన విధానం కళ్ళ ముందు మెదిలాయి

    రిప్లయితొలగించండి
  13. అర్ధసహస్ర టపాలు పూర్తిచేసినందుకు హృదయపూర్వక అభినందనలు!అతి త్వరలో సహస్రాన్నిచేరుకోవాలని ఆశిస్తూ....

    రిప్లయితొలగించండి
  14. ఇది నేను మిస్సయ్యనా. శుభాకాంక్షలు మురళిగారు. ఆ సహస్రం కూడా తొందర్లోనే కావాలని ఆశిస్తూ ...

    రిప్లయితొలగించండి
  15. అర్ధసహస్రానికి శతకోటి సహస్రాభినందనలు.
    ఈ పుస్తకం గురించీ టపా గురించీ నేనేమంటానో మీకిదివరకే తెలుసు. అంచేత ఏమీ చెప్పను :)

    రిప్లయితొలగించండి
  16. శుభాకాంక్షలు మురళి గారు ...అర్థ సహస్రం అయిందని నెల రోజులు విరామం తీసుకుందాం అనుకుంటున్నారా ఏంటి ?

    ఇలాగైతే ఎలగండీ ??

    రిప్లయితొలగించండి
  17. ఆలస్యంగా జవాబిస్తున్నందుకు మన్నించాలి. అభిప్రాయాన్ని పంచుకున్న మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి