బుధవారం, జూన్ 06, 2012

రాణీ చెన్నమ్మ

భారత స్వతంత్ర సంగ్రామంలో సిపాయిల తిరుగుబాటు ఓ మరపురాని ఘట్టం. ఆ తిరుగుబాటు జరగడానికి మూడు దశాబ్దాలకి ముందుగా, ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని కిత్తూరు సంస్థానంలో తొలిసారిగా ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిగింది. భారత స్వతంత్ర పోరాటానికి సంబంధించి తొలి తిరుగుబాటు ఇది. తిరుగుబాటుకి నాయకత్వం వహించింది రాజు కాదు. అప్పటి కిత్తూరు సంస్థానాధీశురాలు రాణీ చెన్నమ్మ. ఆ తిరుగుబాటులో చెన్నమ్మ నాయకత్వంలోని కిత్తూరు యోధుల చేతుల్లో వందలాది బ్రిటిష్ జవాన్లు నేలకరవడంతో పాటు అప్పటి కలక్టర్ థాక్రే నరికివేయబడ్డాడు. సంస్థానాలతో వ్యవహరించాల్సిన తీరుపై ఆంగ్లేయ పాలకులకి ఓ పాఠం నేర్పిందీ తిరుగుబాటు. స్థానిక అధికారుల మొదలు, గవర్నర్ వరకూ బ్రిటిష్ పాలకులకి సింహ స్వప్నమయ్యింది రాణీ చెన్నమ్మ. ఇంతకీ ఎవరీవిడ?

బెల్గాం జిల్లాలోని కాకతి అనే చిన్న సంస్థానాన్ని పాలించే ధూళప్పగౌడ దేశాయ్ కుమార్తె చెన్నమ్మ. చూపు తిప్పుకోలేనంత అందంతో పాటు, పెద్దపులిని వేటాడి చంపే సాహసమూ ఆమె సొంతం. కిత్తూరు సంస్థానాధీశుడు మల్లసర్జ దేశాయ్ కి చుట్టూ సమస్యలే! అవడానికి కిత్తూరు సంపన్న సంస్థానమే అయినా, ఓ పక్క పీష్వాలు, మరోపక్క టిప్పు సుల్తాన్, వీరు చాలనట్టు ఫ్రెంచి, డచ్చి పాలకులు.. వీళ్ళంతా కిత్తూరు మీద కన్నేసి, దండెత్తే అవకాశం కోసం పొంచి ఉన్న వాళ్ళే. ఆంగ్లేయులతో ఆపద్ధర్మ స్నేహం నెరపుతూ రోజులు నెట్టుకొస్తున్న మల్లసర్జ, చుట్టూ ఉన్న సంస్థానాధీశులందరినీ కూడగట్టి, ఓ బలమైన శక్తిగా ఎదగడం ద్వారా శత్రువులని ఎదుర్కోవచ్చునన్న ఆలోచన చేసి, ఇందులో భాగంగా కాకతిని సందర్శిస్తాడు.

అనుకోకుండా ఎదురుపడ్డ చెన్నమ్మ-మల్లసర్జ తొలిచూపులోనే ప్రేమలో పడతారు. అప్పటికే రుద్రమ్మని వివాహం చేసుకుని, శివలింగ రుద్రసర్జ కి తండ్రైన మల్లసర్జకి రెండో భార్యగా వెళ్ళడానికి అంగీకరిస్తుంది చెన్నమ్మ. కిత్తూరు కోటలో అడుగుపెట్టిన కొన్నాళ్ళకే సమస్యలు చుట్టుముడతాయి చెన్నమ్మని. రుద్రమ్మతో ఆమెకి ఏ సమస్యా లేదు. సొంత సోదరీమణుల్లా కలిసిపోయారు ఇద్దరూ. చెన్నమ్మకి ఓ కొడుకు పుట్టి, కొంతకాలానికే అనారోగ్యంతో మరణిస్తాడు. ఆ గాయం నుంచి ఆమె కోలుకోక మునుపే, మల్లసర్జ శత్రువులకి చిక్కి, బందీగా మారి, కొంత కాలానికి చిక్కి శల్యమై తిరిగి వచ్చి అనారోగ్యంతో మరణిస్తాడు. పేరుకి శివలింగ రుద్రసర్జ ప్రభువే అయినా, పాలనా వ్యవహారాలన్నీ చెన్నమ్మే నిర్వహిస్తుంది.


ఉన్నసమస్యలు చాలనట్టుగా, అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకే శివలింగ రుద్రసర్జ అనారోగ్యం పాలవుతాడు. అతనికి సంతానం లేకపోవడంతో, మరణించబోయే ముందు ఓ బాలుడిని దత్తత తీసుకుంటాడు. అయితే, అప్పటి బ్రిటిష్ కలక్టర్ థాక్రే ఈ దత్తతని అంగీకరించడు. దత్తతకి ముందస్తు అనుమతి లేదన్నది అతడి అభ్యంతరం. కిత్తూరు ఆంగ్లేయులతో స్నేహం మాత్రమే నెరపుతోందనీ, వారికి లోబడి లేదన్నది చెన్నమ్మ వాదన. కిత్తూరుని ఆంగ్లేయుల ఏలుబడిలోకి తెచ్చి తీరాలని సంకల్పించిన థాక్రే, ఖజానాకి కావలి వాళ్ళని పంపడం మొదలు, అంతఃపుర స్త్రీల ప్రతి కదలిక మీదా నిఘా పెట్టడం వరకూ అనేక అభ్యంతరకరమైన పనులకి పాల్పడతాడు. మొదట థాక్రే కి చెప్పి చూసిన చెన్నమ్మ, అతని పై అధికారులకీ లేఖలు రాస్తుంది. వారినుంచి స్పందన లేకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో తిరుగుబాటు చేస్తుంది.

థాక్రే మరణం ఆంగ్లేయుల్లో పట్టుదల పెంచుతుంది. ఎలాగైనా కిత్తూరుని స్వాధీనం చేసుకోవాల్సిందే అని నిర్ణయించుకుని సేనల సమీకరణ మొదలు పెడతారు. ఓ పక్క చెన్నమ్మతో సంధి ప్రతిపాదనలు చేస్తూనే మరోపక్క యుద్ధానికి ఏర్పాట్లు చేసుకుంటారు. తిరుగుబాటుకి పర్యవసానం తీవ్రంగా ఉంటుందని చెన్నమ్మకీ తెలుసు. ఆమెకూడా, పొరుగు సంస్థానాల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తుంది. అయితే, అనేక కారణాల వల్ల తనకి కావాల్సిన మద్దతుని పొందలేకపోతుంది చెన్నమ్మ. అయినా, వెనకడుగు వేయకుండా పోరాటానికి సిద్ధ పడుతుంది. తన వాళ్ళే చివరి నిమిషంలో వెన్నుపోటు పొడిచినా వెనుదీయకుండా ఒంటరి పోరాటం చేసిన ధీర చెన్నమ్మ. భారత స్వతంత్ర పోరాటంలో కిత్తూరు తిరుగుబాటు ఓ అధ్యాయం. సదాశివ వడయార్ అక్షరబద్ధం చేశారీ తిరుగుబాటుని.


తిరుగుబాటుకి ఉన్న చారిత్రిక నేపధ్యం, మల్లసర్జ పాలన, చెన్నమ్మ వ్యక్తిత్వం, తిరుగుబాటుకి దారితీసిన పరిస్థితులు, తర్వాతి జరిగిన పరిణామాలని ఎన్నో శ్రమదమాదులకోర్చి ఎంతో పరిశోధన చేసి, చారిత్రిక ఆధారాల సహితంగా గ్రంధస్థం చేశారు వడయార్. వ్యవసాయం, కుటీర పరిశ్రమలకి ఆలవాలమైన, సిరిసంపదలతో తులదూగే కిత్తూరు వైభవాన్ని అక్షరాలా కళ్ళకి కట్టారు. ఇక, చెన్నమ్మ నైతే పాఠకుల కళ్ళముందు నిలబెట్టేశారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ 132 పేజీల ఇంగ్లిష్ పుస్తకం వెల రూ. 35. కిత్తూరు తిరుగుబాటుని ఇతివృత్తంగా తీసుకుని 'క్రాంతివీర సంగొల్లి రాయన్న' అనే సినిమా నిర్మితమవుతోంది కన్నడనాట. తెలుగుతార జయప్రద రాణీ చెన్నమ్మ గా నటిస్తున్న ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతోంది.

8 వ్యాఖ్యలు:

వనజవనమాలి చెప్పారు...

చరిత్ర లో ధీర వనిత గురించి చక్కని పరిచయం
అభిమాన నటీమణి స్టిల్ రెండు బావున్నాయి. :)
చాలా బాగుంది. మురళీ గారు. ధన్యవాదములు.

Karuna చెప్పారు...

బాగుంది మురళి గారు. నేను ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదు.
అన్నట్టు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, నేను కూడా ఒక బ్లాగ్ మొదలు పెట్టాను. చూసి మీ అభిప్రాయం చెప్పండి ప్లీజ్
here is the url:
http://nenukaruna.blogspot.com

the tree చెప్పారు...

chnnamma malli chaalakalaniki kanipinchindi, bhagundi.

అజ్ఞాత చెప్పారు...

nice intro to a good book.

నిషిగంధ చెప్పారు...

నేను రాణీ చెన్నమ్మ పేరు విన్నాను కానీ ఇంత వివరంగా తెలుసుకోవడం ఇదే మొదలు! ఝాన్సీ లక్ష్మీబాయికి ఎక్కడా తగ్గని ధైర్య సాహసాలు కనబడుతున్నాయి కదా!!

పుస్తక పరిచయం యధావిధగా బావుంది కానీండీ, మీరిలా పదే పదే కొత్త పుస్తకాలు చదివేస్తుంటే ఇక్కడ మేము మా లిస్ట్ ని అప్‌డేట్ చేసుకోలేక అయిపోతున్నాం.. :-)

మురళి చెప్పారు...

@వనజ వనమాలి: ధన్యవాదాలండీ..
@కరుణ: చూశానండీ మీ బ్లాగు.. చక్కని ప్రారంభం.. ఇలాగే కొనసాగించండి.. ధన్యవాదాలు.
@ది ట్రీ: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@పురాణపండ ఫణి: ధన్యవాదాలండీ..
@నిషిగంధ: ఎన్నాళ్ళకెన్నాళ్ళకి?!!పునస్వాగతం మీకు.. నిజమేనండీ ఝాన్సీ లక్ష్మికి ఏమాత్రం తగ్గదు చెన్నమ్మ.. ధన్యవాదాలు.

త్రివిక్రమ్ Trivikram చెప్పారు...

>>కిత్తూరు సంస్థానంలో తొలిసారిగా ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిగింది.
>>భారత స్వతంత్ర పోరాటానికి సంబంధించి తొలి తిరుగుబాటు ఇది.
కిత్తూరు చెన్నమ్మ తిరుగుబాటు 1824లో జరిగింది. వీరపాండ్య కట్టబొమ్మన్ ఈమె కంటే ముందే 1792లో తిరగబడ్డాడు కదా? మరి చెన్నమ్మది భారత స్వతంత్ర పోరాటానికి సంబంధించి తొలి తిరుగుబాటు ఎలా ఔతుంది? నాకు తెలిసినంత వరకు కుంఫిణీ పాలన మీద తిరుగుబాట్లు జరిగిన క్రమం ఇది:
1763లో మొదలైన సన్న్యాసి/ఫకీర్ ఉద్యమం
1792 వీరపాండ్య కట్టబొమ్మన్
1793 కేరళ వర్మ
1794 విజయరామ రాజు (పద్మనాభ యుద్ధం)
1799 చువార్
1804 ఫజారీ
1806 వేలూరు సిపాయిలు(Vellore Mutiny). ఈ టపా ప్రారంభంలో మీరు 1857 అనో మీరట్ లో మొదలైనదనో చెప్పకుండా "సిపాయిల తిరుగుబాటు ఓ మరపురాని ఘట్టం" అన్నారు కానీ ఇలాంటి "సిపాయిల తిరుగుబాట్లు" మొత్తం ఆరో ఏడో జరిగాయి. వాటిలో వేలూరు తిరుగుబాటు మొదటిది. :-).
1808 వేలుతంబి
1813 పాగల్ పంథి
1814 దయారాం
1816 రావు భారమల్
1820 వహాబీ
1822 రామోసీ
------------------------------------------------------
1824 కిత్తూరు చెన్నమ్మ
------------------------------------------------------
1827 వీరభద్రరాజు (విశాఖపట్నం)
1835 గంజాం
1839 శతవంది
1840 డూండీ
1840 ధర్ రావు
1842 బుందేలా
1844 గఢ్కారీ
1844 సావంత్ వాదీ
1845 కుకా
1846 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
1857 కోరుకొండ సుబ్బారెడ్డి

-----------------------------------
>>చరిత్ర లో ధీర వనిత గురించి చక్కని పరిచయం
1. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ధీర వనితల్లో పదమూడేళ్ళ వయసులోనే కదనరంగంలోకి దూకిన రాణీ గైడిన్లియు(en.wikipedia.org/wiki/Rani_Gaidinliu)ది ప్రత్యేక స్థానం.
2. చరిత్రలో - ప్రత్యేకించి 19వ శతాబ్దానికి చెందిన - ధీరవనితల పేర్లు చెప్పమంటే నేను పండితా రమాబాయి(http://en.wikipedia.org/wiki/Pandita_Ramabai)తో మొదలుపెడతాను. (ఎందుకంటే ఆమె గురించి నాకు ఈమధ్యే లేటుగా, లేటెస్టుగా తెలిసింది కాబట్టి.:-)) కానీ ఇలాంటి వనితల ధీరత్వం గురించి ఎవరూ సినిమాలు తీయ(లే)రు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి