మంగళవారం, జూన్ 05, 2012

సరదాకి

తెలుగు సినిమా వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అది చూసిన రాజకీయ నాయకులకి తాము కూడా అలాంటి వేడుక ఒకటి ఎందుకు జరుపుకోకూడదు అనిపించింది. అనుకున్నదే తడవుగా ముఖ్యమంత్రి వైఎస్ అఖిలపక్ష ఇష్టా గోష్టి ఏర్పాటు చేశారు. తర్జనభర్జనల అనంతరం 'రాజకీయ జీవిత రజతోత్సవం'  పార్టీలకి అతీతంగా  భారీగా జరపడానికి ఏకాభిప్రాయం కుదిరింది. అన్నిపార్టీల నాయకులూ ఒకేలాంటి దుస్తులు ధరించి ధీమ్సాంగ్ కూడా పాడుకున్నారు. హైటెక్స్ లో ఘనంగా జరిగిన వేడుకలో, సన్మానాల దగ్గరికి వచ్చేసరికి వైఎస్ ని 'లెజెండ్' అవార్డుతో సత్కరించి, మిగిలిన అందరినీ 'సెలబ్రిటీస్' జాబితాలో వేశారు కేవీపీ.

ఆవేశం ఆపుకోలేని పి. జనార్ధన్ రెడ్డి వేదిక మీదకి సర్రున దూసుకొచ్చి, మైకందుకుని ప్రసంగం మొదలెట్టారు. "అసలు లెజెండ్ అంటే ఏమిటి? సెలబ్రిటీ అంటే ఏమిటి? ఈ రెండు పదాలకు అర్ధాలతో ఓ పుస్తకం రాశారా? సాధారణ కార్మికుడిగా జీవితం ప్రారంభించి, ఆ కార్మిక శాఖకే మంత్రిగా పని చేసిన నేను లెజెండ్ ని కానా? రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం ఖైరతాబాద్ నుంచి వరసగా ఎన్నో సార్లు గెలిచిన నేను లెజెండ్ ని కానా?" అంటూ ఆగ్రహంగా ఊగిపోయారు. "నా మాట సరే.. సాక్షాత్తూ ఇందిరమ్మకే సలహాలిస్తూ ఢిల్లీలో రాజకీయ చక్రం తిప్పిన ఎమ్మెస్ లెజెండ్ కాదా? గల్లీ స్థాయి నాయకుడిగా జీవితం ప్రారంభించి ఢిల్లీ స్థాయికి ఎదిగిన వి. హనుమంతరావు లెజెండ్ కాదా?... దయచేసి నన్నుమన్నించండి... ఈ సెలబ్రిటీ అవార్డుని నేను తిరస్కరిస్తున్నాను."

భయంకరమైన నిశ్శబ్దం ఆవహించిన సభలో, వైఎస్ లేచి మైకందుకుని "నాలుగే నాలుగు ముక్కలు మాట్లాడతా! ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మన గురించి కాదు. మనల్ని ఈ స్థితికి తీసుకు వచ్చిన రాజకీయ కళామతల్లి గురించి మాట్లాడుకోవాలి..ఏడీ.. పిజేఆర్ ఎక్కడ?.. సరే.. నేను చదివిన డాక్టర్ చదువుకీ, ఇప్పుడు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి హోదాకీ.. నా సామాజిక నేపధ్యానికీ ఎక్కడా పొంతన లేదు.. ఈ స్టేటస్, ఈ ప్రశంసలు.. ఈ హోదాలు మనకి ఎవరిచ్చారు? ఆ రాజకీయ కళామతల్లి ఇచ్చింది. ఒరే నాయనా.. ఎదగండ్రా అంది.. ఎదిగిపోయాం.. పత్రికా సోదరులు రాసేవాటికి మనం ఉప్పొంగిపోకూడదు. పేపర్లో ఫోటో వేసి ఇంత ఆర్టికల్ రాసేసరికి ప్రతివారూ పేపర్ కి ఎక్కేస్తున్నారు.." ఆగి అలుపు తీర్చుకుని, ఉదయం హాజరైన పెళ్లిని జ్ఞాపకం చేసుకున్న వైఎస్, చివరికి తన 'లెజెండ్' అవార్డుని కాలనాళికలో వేసేశారు.


కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ కాలనాళిక ని ఎక్కడ ఉంచాలి అన్నది అసలు సమస్య అయికూర్చుంది. సెక్రటేరియట్, పార్టీ ఆఫీసుల్లోనూ కుదరదు. చివరికి ఎమ్మెస్ లేచి ఆ నాళికని ఎక్కడ ఉంచాలో చెప్పడం, 'ఈ వేడుక చాలా హాట్ గురూ' గల్ఫికకి ముగింపు. వైఎస్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఏడాదికి మొదలై తర్వాత మూడేళ్ళ పాటు ఆదివారం ఆంధ్రజ్యోతిలోనిరంతరాయంగా కొనసాగిన కాలమ్ 'సరదాకి.' రచయిత మంగు రాజగోపాల్. అప్పట్లో ఈ కాలమ్ కోసం ప్రతివారం ఎదురు చూసిన అనేక మందిలో నేనూ ఒకడిని. ఆ వారంలో జరిగిన ఓ ముఖ్య సంఘటనకి హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ రంగరించి రాజగోపాల్ రాసే గల్ఫికలు నవ్వించేవి, గిలిగింతలు పెట్టేవి... ఆ హాస్యపు చక్కెరపూత కరిగిపోగానే, "వీళ్ళా, మన నాయకులు?" అన్న నిట్టూర్పుని మిగిల్చేవి.

మావోయిస్టులతో చర్చలు జరపడానికి హొంమంత్రి జానారెడ్డి అడవులకి వెళ్ళడంతో మొదలు పెట్టి, సిపిఐ నారాయణ కోడికూర దీక్షకి ముగింపు వరకూ మొత్తం నూట పన్నెండు గల్ఫికలు. ఏవారానికి ఆ వారం అప్పటి పరిస్థితులకి అనుగుణంగా రాసినవే అయినా, వీటిలో చాలావరకూ కాల పరిక్షకి నిలబడేవే. అందుకే వీటిని పుస్తక రూపంలో తీసుకొచ్చారు హైదరాబాద్ కి చెందిన సహజ పబ్లికేషన్స్ వారు. మావోయిస్టులకి మద్దతు పలికే ప్రజాగాయకుడు ఉన్నట్టుండి 'భక్త గద్దరు' గా మారిన వైనం, ఎంతలేదు వచ్చేస్తోంది అంటూనే ఎందరో నాయకులకి, ఆశావహులకి సుదీర్ఘ ఎదురు చూపులు మిగిల్చిన 'చిరుబుకు చిరుబుకు రైలు' కబుర్లూ, అధికారం పోగొట్టుకున్న సుగ్రీవుడు ఏర్పాటు చేసుకున్న 'మహాగోడు' లో సాటి వానరుల ప్రసంగాలు... ఒక్క పార్టీ, ఒక్క నాయకుడూ అని కాదు.. ఏ ఒక్కరినీ వదలలేదు రాజగోపాల్.

నాయకుల రూపు రేఖా విలాసాలనూ, వారి మాటతీరు, అలవాట్లనీ రచయిత ఎంత శ్రద్ధగా పరిశీలించారో సులభంగానే అర్ధమవుతుంది. ఆయా నాయకులని తన అక్షరాలతో పాఠకుల కళ్ళ ఎదుట నిలపడం కేవలం రచయిత ప్రతిభ. శ్రీకాకుళంలో పుట్టి, విశాఖలో పెరిగిన రాజగోపాల్ కి ఉత్తరాంధ్ర నుడికారం మీద మాంచి పట్టు ఉంది. బొత్స సత్యనారాయణ ని చిత్రించడానికే కాదు, పూసల కోటు సవరించుకుంటూ కేయే పాల్ చేసే టీవీ ప్రసంగాలని కట్టెదుట నిలపడానికీ సాయపడింది ఈ పట్టు. అంతేనా? మన్యంలో విష జ్వరాలు ప్రబలినప్పుడు చూడడానికి వెళ్ళిన ఆరోగ్య మంత్రి రోశయ్యతో మన్యం ప్రజల సంభాషణ, రోశయ్యకి వ్యతిరేకంగా విశాఖ మన్యం దోమల మహాసభ, ఆపరేషన్ గజ కి వ్యతిరేకంగా ఒరిస్సా ఏనుగుల ఉద్యమం...వీటన్నింటి లోనూ ఉత్తరాంధ్ర నుడికారాన్ని మెరిపించారు.

చంద్రబాబు ప్రసంగాలలో వినిపించే రాయలసీమ మాండలీకం, కేసీఆర్, నరేంద్రల భాషలో తెలంగాణ మాండలీకం వీటన్నింటినీ బహుచక్కగా పట్టుకోవడంతో గల్ఫికలకి కొత్త సొగసు అమరింది. బాపూ కవర్ పేజీ, ముళ్ళపూడి ముందు మాటా అదనపు అలంకారాలు ఈ పుస్తకానికి. ఆసాంతమూ చదివి పక్కన పెట్టేసి ఊరుకోకుండా, అప్పుడప్పుడూ తిరగేసి చూసుకునే పుస్తకం ఇది. (పేజీలు 388, వెల రూ.150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

8 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

అప్పట్లో ఆ శీర్షికను క్రమం తప్పకుండా చదివే వాణ్ణి. అధిక్షేప శైలిలో రాజగోపాల్ సరదాగా చెప్పిన కబుర్లను గుర్తు చేసిన మీకు ధన్యవాదాలు.

Vasu చెప్పారు...

మొదట మీరు రాసారేమో అనుకున్నా ఆ వజ్రోత్సవాలది .

మొత్తం చదివాకా తెలిసింది .. మీరు రాసే ప్రతీ పుస్తకం వెంటనే కొని చదివేయాలనిపిస్తుంది ..

Pantula gopala krishna rao చెప్పారు...

శ్రీ రాజగోపాల్ ఫీచర్ ప్రతివారం ఆంధ్రజ్యోతిలో తప్పకుండా చదివే వాడిని . కొన్ని కటింగ్స్ కూడా నాదగ్గర భద్రంగా ఉన్నాయి. మంచి సెటైర్ రైటర్.మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

vrao చెప్పారు...

అవునండి. అప్పట్లో నేను కూడా ఈ శీర్షికని ఫాలో అయ్యేవాణ్ణి

మురళి చెప్పారు...

@పురాణపండ ఫణి: ప్రతివారం క్రమం తప్పకుండా, ఆసక్తి చెడకుండా రాయడం నిజంగా కత్తిమీద సామేనండీ.. ధన్యవాదాలు.
@వాసు: అబ్బే.. లేదండీ.. ఆ టపా చాలా బాగుందనిపించి దానితో మొదలు పెట్టాను.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@పంతుల గోపాల కృష్ణారావు: నాదగ్గర కూడా కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయండీ.. 'భక్త గద్దరు' లాంటివి :-) అన్నీ ఓ చోట చదువుకోవచ్చు కదా అని పుస్తకం తీసుకున్నా.. ధన్యవాదాలు.
@విరావు: ధన్యవాదాలండీ..

Mangu Rajagopal చెప్పారు...

మురళి గారికి,

పెద్ద గొప్పలా ఒక సామెత తో ఇది మొదలు పెట్టబోయి , మరీ బొత్తిగా నీచోపమానాలు ఉభయులకీ తగదని మౌసు కరుచుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ...

పాయింట్ లోకి వచ్చేస్తున్నా ..

నా `సరదాకి ` పుస్తకం మీ నెమలి కంట్లో పడిందని ఇవాళే తెలిసింది. గత జూన్ లో మీరు రివ్యూ రాస్తే ఆర్నెల్ల తర్వాత నేను చూశానన్నమాట. (ఇప్పుడు నేను రాయబోయిన సామెత మీకు అర్ధమై ఉంటుంది.)

మీ సొంతంగా పుస్తకాన్ని సంపాదించి, ఓపిగ్గా సమీక్ష రాసి, కవర్ పేజీతో సహా మీ బ్లాగులో పెట్టినందుకు శతథా ధన్యవాదాలు.
ఆ సమీక్షకి స్పందించి వ్యాఖ్యలు రాసిన పాఠకులకు సహస్రథా కృతఙ్ఞతలు .

అదిదా విషయం.

-- మంగు రాజగోపాల్

మురళి చెప్పారు...

@మంగు రాజగోపాల్: మీ పుస్తకాన్ని గురించి రాసిన టపా చదివి మీరు స్పందించడం చాలా సంతోషంగా ఉందండీ... ధన్యవాదాలు...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి