మంగళవారం, జూన్ 12, 2012

హరిణి గెలిచింది...

గోదారమ్మాయ్ ఇవటూరి హరిణి 'పాడుతా తీయగా' తాజా సిరీస్ విజేతగా నిలిచింది. సెమి-ఫైనల్స్ వరకూ ఈ కార్యక్రమ సరళిని గమనించినప్పుడు రోహిత్ లేదా తేజస్విని ప్రధమ బహుమతి అందుకుంటారని ఊహించాన్నేను. వ్యాఖ్యాత మరియు న్యాయనిర్ణేత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ ఇద్దరి మీదా కొంచం ఎక్కువగా దృష్టి పెట్టడం, ఒకానొక ఎపిసోడ్ లో తేజస్వినికి నూటికి నూరు మార్కులు ఇవ్వడం ఈ అంచనాకి కొంతవరకూ దోహదం చేసింది. ఎప్పటిలాగే, ఈసారి కూడా ఫలితం ఆశ్చర్య పరిచింది నన్ను.

హరిణి (కాకినాడ)ప్రధమస్థానంలో నిలిచి మూడు లక్షల రూపాయల బహుమతి అందుకోగా, తేజస్విని (నల్గొండ) ద్వితీయ స్థానం పొంది లక్ష రూపాయల నగదు బహుమతి అందుకుంది. హైదరాబాద్ అబ్బాయిలు రోహిత్, సాయి చరణ్ లది తృతీయ స్థానం. చేరి యాభైవేల రూపాయల నగదునీ అందుకున్నారు. హరిణి, తేజస్వినిల మార్కుల తేడా కేవలం పాయింట్ మూడు శాతం. అత్యంత క్లిష్టమైన 'నీ లీల పాడెద దేవా' పాటని ఫైనల్స్ కి ఎంచుకోవడం తేజస్వినికి మైనస్ గా మారిందేమో అనిపించింది.

'పాడుతా తీయగా' కార్యక్రమాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మొదటగా గమనింపుకి వచ్చే విషయం తెలుగులో వేలాది సినిమా పాటలు ఉన్నా, కేవలం రెండు మూడొందల పాటలు మాత్రమే పునరావృతమవుతున్నాయి ఈ కార్యక్రమలో. అంటే, ప్రతిసారీ పాడే గాయనీ గాయకులు మారుతున్నా పాటలు అవే ఉంటున్నాయి. ఉదాహరణకి ఫైనల్స్ నే తీసుకుంటే, నాటి ఉష మొదలు నేటి హరిణి వరకూ పాడిన పాట 'సువర్ణ సుందరి' నుంచి 'హాయి హాయిగా...' ...అదే సినిమాలో 'జగదీశ్వరా..' 'పిలువకురా..' లాంటి మంచి పాటలున్నా అవి వినిపించడంలేదు.


కొన్ని పాటలైతే ప్రతి సిరీస్ లోనూ వినిపించి తీరుతున్నాయి. అవి గొప్ప పాటలే.. కాదనలేం. కానీ, ఎప్పుడూ అవే పాటలా? పోను పోను ఏమవుతోందంటే, 'ఫలానా' పాటలు ప్రాక్టిస్ చేసేస్తే 'పాడుతా తీయగా' కి అప్లై చేసేయొచ్చు అనే భావన కలుగుతోంది. ఓ సిరీస్ లో పాడిన పాటలు, తర్వాత వచ్చే కనీసం రెండు సిరీస్ లలో పాడకూడదు లాంటి నిబంధన విధించడం ద్వారా, మనకున్న అనేక మంచి పాటలని ఈ వేదిక నుంచి వినే అవకాశం కలుగుతుంది కదా.

ఈమధ్య కాలంలో ఇబ్బంది పెడుతున్న మరో అంశం అతిధుల ఎంపిక. గతంలో కేవలం సంగీత, సాహిత్య రంగాలకి చెందిన వారిని మాత్రమే ఆహ్వానించి, వారిచేత కూడా మార్కులు వేయించేవారు. బాలూ, వారూ వేసిన మార్కుల సగటు ఆధారంగా విజేతల ఎంపిక జరిగేది. ఎప్పుడైతే మార్కుల బాధ్యత మొత్తం బాలూకి అప్పగించడం జరిగిందో, అప్పటినుంచీ అతిధికి సంగీత సాహిత్యాలు తెలిసి ఉండాలి అన్న నిబంధన మాయమైపోయింది. ఫలితంగా, మంచు లక్ష్మి లాంటివాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి అతిధులైపోయారు. ఫైనల్స్ కి వచ్చే అతిధులు కూడా చిరంజీవి, దాసరి, మోహన్ బాబుగా మార్పు చెందారు.

వచ్చే అతిధులు, ఎస్పీ బాలూల పరస్పర పొగడ్తలు రాన్రానూ పంటికింద రాయిలాగా అనిపిస్తున్నాయి. ఏదీ శృతి మించరాదనే విషయం బాలూకి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. మరి ఏ మోమాటాలు తనని ఇబ్బంది పెడుతున్నాయో తెలియదు మనకి. పాట గురించో, పాడిన విధానం గురించో మాట్లాడితే అందరికీ బాగుంటుంది. కానైతే, వారివారి అభిమానాలు 'ప్రదర్శించుకోడానికి' ఈ వేదికని ఉపయోగించుకోవడం నచ్చడం లేదు. వచ్చే వారం నుంచి మొదలవ్వబోతే కొత్త సిరీస్ లో ఎలాంటి మార్పులు చేస్తున్నారో చూడాలి. (ఫోటో కర్టెసీ: 'కాకినాడ' శంకర్ గారు)

18 కామెంట్‌లు:

 1. మీరన్నవన్నీ నిజం.. నేను కూడా తేజస్విని తప్పక నెగ్గుతుంది అనుకున్నాను, ఆ అమ్మాయి చాలా బాగా పాడింది అని ఆ అభిప్రాయం. ఎవ్వరి ప్రతిభనీ తక్కువ చెయ్యడం అని కాదు కానీ, నలుగురిలోనూ నాకెందుకో ఆ అమ్మాయి పాడే విధానం ఎప్పుడూ రెండు మెట్లు పైనే ఉందని అనిపించేది. అతిధుల ఎంపిక, వారి అక్కరలేని ప్రసంగాలు, మీరన్నట్టు పరస్పర పొగడ్తలు కొంత శ్రుతి మించుతున్నాయేమో అని తప్పకుండా అనిపిస్తోంది. అస్తమానూ అవే పాటలు పాడితే కొన్నాళ్ళకి ఈ మంచి కార్క్యక్రమం మీద ఆసక్తి తప్పక తగ్గిపోతుంది.. ఇప్పటికే చాలా రిపిటీషన్ అవుతోంది. ఇవన్నీ తప్పక బాలూ గారు గమనించ వలసిన విషయాలు..

  రిప్లయితొలగించండి
 2. బాగా చెప్పారండి .ఇప్పటికి ప్రతీ finalso శివశంకరి,హాయి హాయిగా నీ లీల పాడుతున్నారు.తెలుగులో ఇంక పాటలు లేవేమో అనిపిస్తుంది
  ముందు ముందు పాటల విషయంలొ శ్రద్ధ తీసుకోకపొతే మాటలు కోసమే చూడాల్సి వస్తుందేమో.
  ఈ మధ్య మాటలు ఎక్కువై పాటలు తక్కువ అవుతున్నాయి.మరీ onemanshow la తయారు అవుతోంది ప్రొగ్రాం.
  కానీ ఏమి చేస్తాం మొత్తం అన్ని చానెల్స్లొ standard ఉన్న ప్రోగ్రాం ఇది ఒక్కటే

  రిప్లయితొలగించండి
 3. నేను రాద్దామనుకున్న పోస్ట్ మీరు రాసేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది :)


  (అన్నట్టు ఆ ఫోటో నేను కూడా నెట్ లోంచే తీసుకున్నానండీ)

  రిప్లయితొలగించండి
 4. నిజమే.. మోహన్‌బాబు భయంతోనే నేను ఈ ఫైనల్స్ సరిగ్గా చూడలేకపోయాను. :)

  రిప్లయితొలగించండి
 5. హరిణికి అభినందనలు.. కానీ నా ఫేవరెట్ మాత్రం రోహిత్!

  'హాయి హాయిగా...' లిప్సిక పాడినట్లుంది కదండీ!? లేకపోతే తను ఉన్న సిరీస్ లో ఎవరన్నా పాడారా!? నాకు బాగా గుర్తు..

  రిప్లయితొలగించండి
 6. కాకినాడ అమ్మాయి గెలిచాక శంకర్ గారి కామెంట్లు, పోస్ట్ లేదేంటని వెతుకుతున్నాను, ఫొటో తెచ్చిపెట్టింది ఆయనేనా! బాగు బాగు :)
  ముందునుంచి కూడా హరిణి, తేజస్వి, రోహిత్‌ లలో ఎవరో ఒకరు గెలుస్తారు అనుకున్నా కాని సెమీఫైనల్స్, ఫైనల్స్ వచ్చేసరికి తేజస్వి లేకపోతే రోహిత్ గెలుస్తారెమో అనిపించింది. anywayz congrats to her :)


  ఇకపోతే పాటల పునరావృత్తం గురించి మురళిగారు, వేల పాటలున్నా అందులో మంచిపాటలు, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు, కనీసం ఒక్కసారైనా వినదగ్గ పాటలు ఎన్ని ఉన్నాయంటారు. రిపీట్ వద్దనుకుంటే ఎవరో ఒకరు 'ఇప్పటింకా నా వయసు...' లాంటివి పాడటం బాలు బాధపడిపోవడం, ఎందుకొచ్చిన తలనొప్పి చెప్పండి.

  రిప్లయితొలగించండి
 7. మంచి టపా వ్రాసారు మరళి గారు.

  చివరి పాట అద్భుతంగా పాడి, కాకినాడ అమ్మాయి హరిణి గెలిచింది.

  "నీ లీల పాడెద దేవా" అన్న పాటకి సన్నాయి ఘోరంగా ఉంది. ఆ పాటకి ఆ వాయిద్యం చాలా ముఖ్యం కదా!

  మోహన్ బాబు, బాలుల చిలిపితనం వెకిలితనానికి దగ్గరగా ఉంది.

  రిప్లయితొలగించండి
 8. "అంటే, ప్రతిసారీ పాడే గాయనీ గాయకులు మారుతున్నా పాటలు అవే ఉంటున్నాయి. "

  కరెక్ట్ గా చెప్పారు .
  అందులో ఎక్కువగా విశ్వనాధ్ సినిమా లో కొన్ని హిట్ పాటలు లేకపోతె నలుపు తెలుపు చిత్రాల్లోనివి ..
  అదీ కాకుండా ఒక సినిమా పాట కానిది పాడే వృత్తం - జానపదం కానీ , కీర్తన కానీ ఉంటే బావుంటుంది ఎప్పుడూ అనిపిస్తుంది నాకు ..
  ఎప్పుడూ సినిమా పాటలకే అతుక్కు పోతే .. చివరికోచ్చినా గాయకుల పరిధి పెరగదు వాళ్ళకి సినిమా ప్లే బ్యాక్ సింగింగ్ తప్ప వేరే వాటి మీద ఆసక్తి పెరగదు ..
  బాలు ఇది పోటీ కాదని ఎంత చెప్పినా , తేజస్విని కాకుండా హరిణి గెలవడం నాకు అంత నచ్చలేదు (హరిణి గోదావరి అమ్మాయి అయినా :)) ..
  వారం వారం చూసినప్పుడల్లా తేజస్విని కి దగ్గరలో కూడా ఎవరూ లేరు అనుకుంటూ వచ్చా (ఆమె కూడా అదే అనుకుందేమో .. కళ్ళల్లో ఆశ్చర్యం , బాధ కనిపించాయి :)).
  అలాటిది ఈ వారం కొంచం తడబడడంతో హరిణి పట్టుకుపోయింది మొదటి స్థానం
  పాటలు మాత్రం భలే పాటలు ఎంచుకున్నారు ఫైనల్స్ కి ..

  రిప్లయితొలగించండి
 9. హరిని కంటే తేజస్విని musical గా ఒక మెట్టు ఎక్కువే! And she is too confident కూడా అనిఅనిపించ్చింది. ఆ confidence lO may be కొన్ని తప్పులు చేసినట్టుంది. కాని హరిణి మొదట్లో పాడినదానికి, final performance కి చాల చాల తేడా ఉంది. అందుకేనేమో,తను విజేత అయ్యింది.

  రిప్లయితొలగించండి
 10. నిషిగంధ గారూ.. అవునండి.. హాయి హాయి గా పాటను లిప్సిక పాడింది.. అలాగే చిన్నపిల్లల సీరీస్ లొ అంజనీ నిఖిల నీ లీల పాడెద దేవా పాడింది.. కొన్ని పాటలు రకరకాల సీరీస్ లలో రిపీట్ అవుతూనే ఉన్నాయి.

  రిప్లయితొలగించండి
 11. ఫైనల్స్ రోజు అరగంట ముందు మాకు కరెంటు లేదు .పల్లెటూరి వాళ్ళకు కరెంటు కష్టాలు ఎక్కువే .మీ ద్వారా రిజల్టు తెలిసి కొంచం డీలా అయ్యింది. నాకు తేజస్విని బాగా పాడగలదు అనిపించేది . ఇంకోక్కమాట ఇదీ చెబితే ఏమంటారో తెలియదు. బాలు ఎప్పుడూ జానకిగార్నే ఎక్కువ పొగుడుతారు....ఘంటసాల పాటకు కామెంట్లు ..పొగడ్తలు తక్కువ అనిపించేది. ఇదీ ఎవ్వరు ఫీల్ కాలేదా?
  బాలు అంటే గౌరవముంది కానీ.......
  లక్ష్మీ రాఘవ

  రిప్లయితొలగించండి
 12. బాగా విశ్లేషించారు మురళిగారు, నేను కూడా తేజస్వినే గెలుస్తుంది అనుకున్నాను.
  అప్పుడెప్పుడో కూడా ఇలానే జరిగింది, కడప సబీహాను కాదని భాష్యం లిప్సిక కు ప్రధమ బహుమతి ఇచ్చారు.

  >>వచ్చే అతిధులు, ఎస్పీ బాలూల పరస్పర పొగడ్తలు రాన్రానూ పంటికింద రాయిలాగా అనిపిస్తున్నాయి.

  ముఖ్యంగా ఆ "వయసు" గోల..
  ఆ వందరూపాయల విషయం లో, "నువ్వు చూడని డబ్బా ..నేను చూడని డబ్బా.." అని బాలు, మోహన్బాబును అనడం శ్రుతిమించింది అనే అనిపించింది.

  రిప్లయితొలగించండి
 13. రోహిత్ లేదా తేజస్విణి గెలవాల్సింది. రోహిత్ మీద క్రితం వారం మోహన్ బాబు కామెంటు చేసి కంపు చేశాడు. తేజస్విణి చివరి ఎపిసోడ్ లో ’నీ లీల పాడెద’ తప్పు పాట ఎంపిక చేసుకుంది. బాలు మధ్యలో మోహన్ బాబు పెట్టే టెన్షన్ తట్టుకోలేక తప్పుడు మార్కులేసి తేజస్విణికి రోహిత్ కీ అన్యాయం చేశాడు. :))

  రిప్లయితొలగించండి
 14. ఓవరాల్ తేజస్విని మంచి గాయిని, కానీ ఒక్క ఫైనల్స్ మాత్రం చూసుకుంటే, హరిణి ఎంపిక కరక్ట్.

  రిప్లయితొలగించండి
 15. మీ పోస్ట్ పుణ్యామా అని యూట్యూబ్లో ఆ పాటలన్నీ విన్నానిప్పుడే. అతిధులుగా సంగీతం పరిజ్ఞానం ఉండేవార్ని పిలిస్తే ఇంకా బావుండేది :-(

  రిప్లయితొలగించండి
 16. ఆలస్యంగా జవాబిస్తున్నందుకు మన్నించాలి. అభిప్రాయాన్ని పంచుకున్న మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి