శనివారం, ఆగస్టు 20, 2011

ఎలా చూడాలంటే...

రెండేళ్ళ క్రితం.. మే ఇరవై ఎనిమిదో తారీఖున, తెలుగు వాళ్ళంతా ఒకప్పుడు వెండితెరనేలిన నందమూరి తారకరాముడి జయంతి జరుపుకుంటూ ఉండగా 'అభినవ మాయాబజార్' గా బహుళ ప్రచారం జరుపుకున్న చలన చిత్రరాజమొకటి ఆంధ్ర రాష్ట్రం నలుమూలలా థియేటర్లలో విడుదలయ్యింది. మరీ రిలీజ్ షో కాదు కానీ, రిలీజ్ రోజున రెండో ఆట చూశాను, కష్టార్జితం ఓ వందరూపాయలు ఖర్చు పెట్టీ, ఆమాత్రం విలువైనా చేస్తుందో చెయ్యదో అని అప్పుడప్పుడూ వైరాగ్యంగా అనుకునే నా ప్రాణాన్ని పణంగా పెట్టీ.. ఆ సినిమాకి కథ, మాటలు, పాటలు, పద్యాలు, స్క్రీన్ ప్లే, బొమ్మలు, సంగీతం, నేపధ్య గానం, ఆభరణాల డిజైనింగ్, నిర్మాత, దర్శకుడు మరియు కథానాయకుడు శ్రీ సుమన్. సినిమా పేరు 'ఉషా పరిణయం.'

ఇదే సినిమా రేపు అనగా, శ్రావణ బహుళ అష్టమి ఆదివారం ('సఖులారా చేరరే.. శ్రావణ బహుళాష్టమి...' అని గోపికలు భక్తిగా పాడుకునే రోజు) సాయంత్రం ఐదుగంటలకి ఈటీవీలో ప్రసారం కాబోతోంది. పౌరాణికాలు, అందునా.. ఆద్యంతమూ హాస్యరసంతో నిండిన భక్తి, జ్ఞాన, వైరాగ్య చిత్రాలు బొత్తిగా నల్లపూసలై పోతున్న ఈ రోజుల్లో రాబోతున్న ఈ సినిమాలో వింతలూ విశేషాలని సుమనాభిమానులతో పంచుకోడానికే ఈ టపా. ఈ సినిమా మీకు ఈటీవీలో తప్ప ఎక్కడా రాదు కనకా, ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కనకా, పనులన్నీ పక్కన పెట్టి ముందుగానే టైం కేటాయించుకుని చూడాల్సిందే.

ముందుగా మీదగ్గర అలనాటి విజయావారి 'మాయాబజార్' జ్ఞాపకాలేవైనా ఉంటే వాటిని సమూలంగా తుడిచేసి, అప్పుడు ఈ సినిమా చూడడానికి సిద్ధం అవ్వండి. 'ఈతరం మాయాబజార్' గా అనేకమంది ప్రముఖుల ప్రశంశలు అందుకున్న ఈ సినిమా (నిజంగా నిజం.. ఈటీవీలోనే చెప్పారు దర్శకుడు యస్వీ - యశస్వి అని కూడా అభిమానులు అంటూ ఉంటారు - కృష్ణారెడ్డి తదితరులు) చూస్తున్నప్పుడు ఆ సినిమా గుర్తు రావడం అంత బాగోదు. అలాగే, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన "చేసెడి వాడనూ, చేయించెడి వాడనూ అంతా నేనే" అనే గీతాసారాన్ని వంటబట్టించుకోండి. ఎందుకంటే ఈ సినిమాలో కూడా చేసే వాడూ, చేయించే వాడూ ఒక్క శ్రీకృష్ణుడే. అనగా అవసరానికి మించి కుంచం ఎక్కువ నీలిరంగు పూసుకున్న శ్రీ సుమన్ బాబే.


ప్రారంభ సన్నివేశంలో బారెడు పొద్దెక్కినా బంగారు శేష పాన్పుమీద, పట్టు బట్టలు మరియు నిలువెల్లా ఆభరణాలతో నిద్ర నటించే శ్రీకృష్ణుడి అర్ధ నిమీలిత నేత్రాలతో మొదలు పెడితే చివర్లో బాణాసురుడితో యుద్ధం సన్నివేశంలో అదే కళ్ళతో కృత్యదవస్థ మీద కురిపించిన క్రోధం వరకూ ఆసాంతమూ ఎన్నెన్ని భావాలో. ఎన్టీఆర్ కిరీటం బరువు రికార్డుని బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని డిజైన్ చేసుకున్నారో ఏమో తెలియదు కానీ, శ్రీకృష్ణుడు ధరించే కిరీటం బరువుని ప్రేక్షకులు కూడా అంచనా వేసేయగలరు. ఆ కిరీటం జారిపోకుండా బ్యాలన్స్ చేసుకుంటూనే, సందర్భానుసారంగా అభినయించగలిగినన్ని కళలు అభినయించారు సుమన్ బాబు. ముఖ్యంగా నునుసిగ్గు, చిలిపిదనం, అమాయకత్వం లాంటివి అభినయించడాన్ని చూడాలంతే.

శ్రీకృష్ణుడికి పదహారువేలమంది గోపికలున్నా, ఈ సినిమాలో శ్రీ సుమన్ కి ఒక్క నాయికా లేదు. అయితేనేం? చెలికాడు వసంతకుడితో జరిపే సంభాషణని చూసినప్పుడు, సదరు వసంతకుడు మారురూపంలో ఉన్న అష్టవిధ నాయికల్లో ఒకరేమో అనిపించక మానదు. కృష్ణ పాత్రలో అంతగా లీనమై నటించారు సుమన్. మామూలుగా పౌరాణిక సినిమా అంటే సంభాషణలు గ్రాంధికంలో ఉంటాయి. ఫలితంగా ఈతరం ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఇంకా ఇంగ్లిష్ మీడియంలో చదివిన వాళ్ళూ వాటిని అర్ధం చేసుకోలేరు. స్వయంగా రచయిత అయిన సుమన్, కొంచం గ్రాంధికంలో కొంచం వ్యావహారికం కలిపి రచించిన సంభాషణలనీ, మరీముఖ్యంగా ఆయన స్వయంగా వాటిని పలికిన తీరునీ వినాలే తప్ప చెప్పలేం.

మళ్ళీ ఓసారి నందమూరిని తల్చుకుందాం. 'మాయాబజార్' లో కృష్ణుడిగానూ, 'నర్తనశాల' లో బృహన్నలగానూ కనిపించాడు. మహాభారతం ప్రకారం బృహన్నలగా మారింది అర్జునుడు. కానీ, శ్రీ సుమన్ స్వయంగా ఎన్నో పాత్రలకి సృష్టికర్త కాబట్టి, ఈ సినిమాలో శ్రీకృష్ణుడే బృహన్నలగా కనిపిస్తాడు కొన్ని సన్నివేశాలలో. బృహన్నలగా సుమన్ బాబు నటన (?) చూడాలంటే సినిమా రెండో సగం వరకూ ఓపిక పట్టాలి. ఈ సినిమాలో మాయలూ, మంత్రాలకి లోటే లేదు. సుదీర్ఘంగా సాగే వసంతకుడి పెళ్ళి చూపుల ప్రహసనంలో ఎవరికి వారు చక్కిలిగిలి పెట్టుకుని నవ్వుకోవాలి కానీ, శ్రీకృష్ణుడే అన్నీ అయిన సన్నివేశాల్లో నవ్వులకి లోటుండదు. అలాగే ఘటోత్కచుడి మీద ఓ కార్య భారం మోపినా, దానిని అతగాడు సరిగా నిర్వహించగలడో లేదో అని పరిశీలనకి తనే సాయంగా వెంట వెళ్తారు స్వామి.

ఇతర నటీనటులు మరీ ముఖ్యంగా బలరాముడిగా ఈశ్వరరావు, రేవతిగా నాగమణి శక్తికి మించి నటించడానికి చేసిన ప్రయత్నాలని గమనించవచ్చు. ప్రతిపాత్రా కృష్ణుడి యెడల భయం కనబరచడం అన్నది తప్పక గమనించాల్సిన మరో విషయం. కథ ప్రకారం అనిరుద్ధుడు అందగాడే అయినప్పటికీ, శ్రీకృష్ణుడిని మించి అందంగా ఉండని విధంగా తీసుకున్న శ్రద్ధ, అలాగే ఉష-చిత్రరేఖ మధ్యనా, బాణాసురుడికీ, కృష్ణుడికీ మధ్యన జరిగిన సంభాషణలు ఇవేవీ మిస్సవ్వాల్సినవి కాదు. అప్పట్లో నాకు తెల్సిన ఓ అమ్మాయి -అప్పటికి అమ్మ అయ్యింది- "'ఉషా పరిణయం' డీవీడీ దొరికితే బాగుండును, వెయ్యి రూపాయలైనా కొనేస్తాను" అంది నాతో. వాళ్ళబ్బాయి, రెండేళ్ళ వాడు, అన్నం తినడానికి పూటా మారాం చేస్తున్నాట్ట. "ఓ డీవీడీ ఇంట్లో పెట్టుకుంటే, తింటావా? సినిమా పెట్టనా? అని వాడిని బెదిరించడానికి బాగుంటుంది కదా" అని తనే రహస్యం విప్పింది. కాబట్టి, కావాల్సిన వాళ్ళు రికార్డు చేసుకోండి బహుళార్ధ సాధకమైన ఈ నిరుపమాన పౌరాణిక చిత్ర రాజాన్ని.

27 కామెంట్‌లు:

  1. హహహ!మురళి గారూ అసలు అప్పట్లో మీరే first సుమన్ బాబు సినిమాల మీద రివ్యూ లకి మీరే ఓ pioneer.అప్పట్లొ మీ రివ్యూ చదివిన గుర్తే. ఆ లింక్ కూడా ఇవ్వాలిసింది. అప్పటికి రాజ్ బ్లాగుల్లో లేడనుకుంటా!

    రిప్లయితొలగించండి
  2. ఎంతైనా ఎంటివోడు తరువాత కిట్టయ్య వేషం కట్టాలి అంటే అది సుమన్ బాబే, అదీ సుమన్ బాబు లేటుగా పుట్టాడు కాబట్టి, లేకపోతే, సుమన్ బాబు తరువాతే ఎంటీవోడు

    రిప్లయితొలగించండి
  3. నేను సుమారు ఒక 10 రోజుల కిందటే ఈ అద్భుతం గురించి చాటింపు వేసేసాను మురళిగారు(http://kakaalu.blogspot.com/2011/08/blog-post_11.html)..

    దానికి బులుసు గారి కామెంటు అత్యద్భుతం.. :)

    రిప్లయితొలగించండి
  4. నర్తన శాల చదివిన బ్లాగులో ఇది బాగో లేదు. ఈ సుమన్ గురించి మీరు అదీ ' మీరు' వ్రాయాలా? డిజప్పాయింటింగ్ గా ఉంది మీ బ్లాగులో అతని గోల.

    I am sorry if you don't like this comment.

    రిప్లయితొలగించండి
  5. ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తున్నారా?? అదీ డబ్బులిచ్చి. జోహార్! జోహార్!

    ఉన్నమాట చెప్పుకోవాలి. నాకు సుమన్ బాబు నిర్వికారం గా ఆర్ద్రత నటిస్తూంటే ముచ్చటేసేసి మూర్చ వచ్చేస్తూ ఉంటుంది. "నిర్వికార నట పిశాచి" అనుకుని మురిసి ముక్కలైపోతూ ఉంటాను. జీవితం మరీ స్తబ్దుగా ఉందనిపిస్తే అలజడి కోసం అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాను కానీ మీలా తెగించి వెండి తెర మీద చూసే సాహసం చెయ్యలేదు. చెయ్యను.

    Ina Garten (Barefoot Contessa)అని గూగుల్ చెయ్యండి. సదరు మహిళామణి చూడడానికి మన సుమన్ బాబు అక్కలా ఉండడమే కాదు. ఆయనకీ ఈవిడకీ బోలెడు పోలికలున్నాయ్. మాంచి ప్రైం టైంలో "మా ఆయన దగ్గర డబ్బులున్నాయ్. నాకు కిచెన్ ఉంది. నాకు తోచినది వండుతా. మధ్యలో గుసగుసలాడతా. వింటే వినండి. లేదా మీ ఖర్మ." అన్నట్టు కుకరీ షో చేస్తూ ఉంటుంది. ఈవిడని చూసినప్పుడల్లా నాకు ఓ "సుమని" ని చూసినట్టే ఉంటుంది.

    పాపం వెర్రితల్లి సినిమాలు చెయ్యలేదు లెండి. సుమని అనడం ఘోరాపరాధమేమో!

    రిప్లయితొలగించండి
  6. మురళిగారూ....టపా ఆసాంతం సుమనుడిమీద మీ ప్రేమ చెప్పకనే చెప్పినా...ఆ చివరిలో ఇచ్చిన పంచ్ మాత్రం అదిరిందండి :))
    >>ఓ డీవీడీ ఇంట్లో పెట్టుకుంటే, తింటావా? సినిమా పెట్టనా? అని వాడిని బెదిరించడానికి బాగుంటుంది కదా
    ఈ ఐడియా చాలా విషయాల్లో ఉపయొగించుకోవచ్చండోయ్!
    ఉదా:నా రివర్స్ సేమ్యా ఉప్మా తింటావా? సుమనుడి ఉషాపరిణయం డీవిడి పెట్టనా? ;)
    ఇలాగన్నమాట :) థాంక్స్ మంచి అవిడియా అప్పిచ్చినందుకు :)

    రిప్లయితొలగించండి
  7. మురళిగారు, మీ టపాతో ధియేటర్లో విడుదలయినప్పటికన్నా టీవీలో సినిమాకు ఎక్కువ కలక్షన్ వచ్చేటట్టు ఉందండి. ఎంత అభిమానం అండి సుమన్ బాబు అంటే మీకు.

    రిప్లయితొలగించండి
  8. ఇంతకూ మీకు ఆయన అంటే ఇష్టమా? ద్వేషమా?
    ఈ రెంటిలో ఏదో ఒకటి లేకుండా ఆయనపై ఇన్ని టపాలు వ్రాయరు.

    ఈ కామెంటు కూడా మీ టపా చదవకుండానే వ్రాస్తున్నా. ఎందుకంటే నేను చదవలేను.

    రిప్లయితొలగించండి
  9. @రాధిక (నాని): :-) :-) ధన్యవాదాలండీ..
    @సునీత: అయ్యో.. ఇచ్చాను కదండీ.. మొదటి పేరాలోనే ఉంది.. అదీ కాకుండా, ట్యాగుల్లో సుమన్ బాబు కి ప్రత్యేకంగా ఒక ట్యాగు ఉంది కూడా :-) ..ధన్యవాదాలు.
    @తార: అది కూడా ఎన్టీవోడు ముందు పుట్టాడు కాబట్టి.. భలే.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  10. @రవికిరణ్: అయ్యో నేను మిస్సయ్యానండీ.. మొత్తానికి బులుసు గారు భలేగా చెప్పారు.. అంతే అంతే.. ధన్యవాదాలు.
    @శ్రీరాధ: రాయకుండా ఉండలేక పోతున్నానండీ.. :( ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: నిజమేనండోయ్.. ఆవిడెవరో అచ్చం మన హీరోకి అక్కలాగానే ఉందండీ.. చూడగానే మీకు సుమనుడు భలేగా గుర్తొచ్చాడు మొత్తానికి.. నేను కూడా అలజడి కోసమే చూస్తూ ఉంటానండీ.. కాకపొతే ఈమధ్య కాలంలో స్తబ్ధత మరీ పెరిగిపోవడం వల్ల థియేటర్లకి కూడా వెళ్ళాల్సి వస్తోంది :( 'సుమని' ఎన్ని చేసినా మన సుమన్ బాబులాగా పౌరాణికాలు చేయలేదు కదండీ.. కాబట్టి మనవాడే గ్రేటు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @ఇందు: అవునండీ.. మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించు కోవచ్చు.. ఒక్కమాటలో చెప్పాలంటే పాశుపతాస్త్రం.. ఇంతకీ సినిమా చూశారా? పాపం తొలి పాటలో ప్రభాకర్ ని చూపించలేదు.. సినిమాలో అయితే ప్రభాకర్ మేలుకొలుపు పాడాక సుమన్ బాబు నిద్ర లేచాడు.. నిన్నేమో, మొదట సుమన్ బాబు లేవడాన్నే చూపించేశారు.. ఏదో కుట్ర ఉందని అనుమానం వేస్తోంది.. ...ధన్యవాదాలు.
    @శ్రీ: చూస్తే మీరూ విడిచిపెట్టర్లెండి.. అంత కామెడీ మరి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @టాలీవుడ్ స్పైస్: :-) :-) ధన్యవాదాలండీ..
    @బోనగిరి:Of late, he remained a source of entertainment for me.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  13. నిన్న ప్రతి ఐదు నిమిషాలకి ఒక అరగంట స్వచ్చంద విరామంతీసుకుంటూ తొమ్మిదిదాక అతికష్టంమీద బాదించుకున్నానండి, మీరు హాల్లో ఎలా చూశారండీ బాబూ! ఆఖరులో ఆ బాణాల యుద్ద్హం, అందులో సుమనుని దరహాసాలు మటుకు అదరహో!

    సినిమా అంతా ధగధగలాడుతుంటే కళాదర్శకుడెవరబ్బా అనుకున్నా - అది కూడ ఆయన కళనేనన్నమాట.

    శివుడిగా వేసిందెవరండీ - మన సకలకళావల్లభుడేనా? చివరలో హరిహరులని కలిపి చూపించారుకదా!

    రిప్లయితొలగించండి
  14. @జేబీ: అబ్బే శివుడు సుమనుడు కాదండీ.. కొంచం సన్నగా లేడూ.. సుమన్ చాలు కదా అని మిగిలిన వాళ్ళని పట్టించుకోలా.. ఈశ్వర్రావంటే 'శ్రీకృష్ణ బలరామ యుద్ధం' లో కూడా బలరాముడే కదా.. అలా గుర్తు పెట్టానన్న మాట... అసలు కృష్ణుడు యెంత అలవోకగా యుద్ధం చేసేశాడండీ, మన హీరోలు క్రాఫ్ (విగ్గు) చెదరకుండా ఫైట్ చేసినట్టు!! ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. ఏ ఒక్కర్నీ వదలకుండా జవాబిస్తాతే మీరు :-)
    పనిలో పనిగా క్రిష్ణగారి కురుక్షేత్రం సినిమాపై మీరో రివ్యూ రాసి పడెయొచ్చునుగా, మొన్నో సీన్ చూసే గుండాగినంత పని అయ్యింది, సినిమా చుస్తే ఉంటానో పోతానో...కనీసం మీ రివ్యూ ఐనా చదివితే అదో తుత్తి.

    రిప్లయితొలగించండి
  16. మీ సుమనాభిమానానికి నా పాదాభివందనాలు. ఈ క్రింది లంకె ఓ సారి చూడండి. https://plus.google.com/113069614515937193289/posts/EYvtrJF1YpY

    రిప్లయితొలగించండి
  17. @తార: 'మ్రోగింది కళ్యాణ వీణ..' పాట ఉన్నందుకు కురుక్షేత్రాన్ని క్షమించేస్తానండీ నేను!! సుమన్ బాబు 'ట్విస్ట్' రాబోతోంది త్వరలో.. ఈ పరిస్థితుల్లో 'కురుక్షేత్రం' అంటే... నా పరిస్థితి కూడా కొంచం ఆలోచించండి :-) :-) ... సుమన్ సినిమాలేవీ లేనప్పుడు అలాగే రాస్తానండీ, మీ మాట ఎందుకు కాదనాలి? అసలే నట శేఖరుడి సినిమా ఏదీ ఇంకా బోణీ కాలేదు కూడాను :)))
    @మురళి: అయ్యయ్యో.. అదేమీ లేదండీ.. నన్ను మించి అభిమానులు చాలామందే ఉన్నారు.. అసలు నన్ను అభిమాని అనడం చాలా పెద్ద మాట అవుతుందేమో అనిపిస్తూ ఉంటుదని కూడాను.. సుమనుడు మరోసారి బజ్జెక్కాడన్న మాట!! చూస్తానండీ, అభిమానులు ఏమంటారో :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. రామోజీ అంత డబ్బులు లేకపోవడం వలన కిట్టయ్యగారు మరో పౌరాణిక చిత్రరాజం తియ్యలేకపొయ్యారు, లేదంటే మరో విశ్వామిత్ర, శ్రీనాధ కవి సార్వభౌముడు, కిట్టయ్యగారు హీరో కం నిర్మాత, విజయనిర్మల హీరోవిన్ కం డవిరెక్షన్ ఐతే ప్చ్, మహేషు బాబు సినిమాలు సంవత్సరానికి నాలుగైదు రాకపోయేవా..

    సర్లేండి మీ ఆరోగ్యం మాకు, సుమన్ బాబుకి ముఖ్యం సుమన్ బాబు ఏకైక ప్రేక్షకుడు మీరే కదా మరి..

    రిప్లయితొలగించండి
  19. @తార: డబ్బొక్కటే కాదులెండి.. ప్రచారానికి పత్రికలు, థియేటర్లు, టీవీ చానళ్ళు...ఇవన్నీ కూడా లేవు పాపం... అయినప్పటికీ బహువిధాలైన సినిమాలు తీయడం గ్రేట్ కదూ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. మీకు ఇంకో నెమలికన్ను గెలుచుకొనే అవకాశం.
    http://parihaasam.blogspot.com/2011/08/blog-post.html

    రిప్లయితొలగించండి
  21. @శ్రీ: ఇంకో నెమలికన్నా!! ఇది చాలండీ నాకు..

    రిప్లయితొలగించండి
  22. మురళి గారు , నిజం గా చాల ఓపిక కావాలండి.ఏదో మీరు చెప్పారని http://ap7am.com/ap7am_show_detail_videos.php?newsid=39369 , ఈ లింక్ కోసం వెతికి మరి చూడడం మొదలు పెట్టా. బాగా బట్టి పట్టి,చెప్పకపోతే మర్చిపోతానేమో అని అనేట్టు డైలాగు చెప్పి..బలదేవుడి తో మాటాడుతూ ..ముందొక అన్నయ్య ,వేనుకోక అన్నయ్య చేర్చి చిత్ర వధ చేస్తుంటే ఓపిక పట్టా. కాని బాణాసురుడు ని శివుడు "బాణా " అని ముద్దు గా పిలిచేసరికి నా ఓపిక చచ్చిపోయింది. ఆఫీసు లో ఉన్నానన్న సంగతి మర్చిపోయి ఎవరినన్నా ఎమన్నా చేస్తానేమో అని భయపడి నిగ్రహించుకున్నాను. మహా ప్రభో , ఇది సినిమా ఏమిటి నా శ్రార్ధం. పొట్టి ప్రసాద్ చెప్పినట్టు నవ రంద్రాల్లో సీసం పోస్తున్నంత ఆనందం గా ఉంది . వీళ్ళంతా అంటుంటే ఏమిటో అనుకున్న...మీరు దేముడు....

    రిప్లయితొలగించండి
  23. లక్ష్మినరేష్ గారు, నేను మీతో ఏకీభవిస్తున్నాను, మురళిగారు ఇంతలా చెప్తున్నారు కదా అని, నిన్న ఆదివారం youtube లో వెతుక్కొని మరీ ఈ సినిమా చూడటం మొదలెట్టాను, మొదట్లో ఏదోలా ఉంది కొంత ఫార్వార్డ్ చేశాను, కృష్ణుడు వసంతకుడు పాచికలాడి తెగ హింసించేసారు. ఇంక నావల్ల కాలేదు. ఇంక ఎప్పుడన్నా జీవితం మీద విరక్తి కలిగి, వేరే దారి లేకపోతే ఈ సినిమా చూడాలి :)


    మురళిగారు సాహసం చెయ్యచ్చు కాని, మరీ దుస్సాహసాలు కూడదండి

    రిప్లయితొలగించండి
  24. @లక్ష్మీనరేష్: అయ్యబాబోయ్.. అదేం లేదండీ.. ఏదో కొంచం కామెడీ దొరుకుతుంది కదా అని.. అంతే... ధన్యవాదాలు.
    @శ్రీ: మీరు మరీనండీ.. అందరు కృష్ణులూ ఒకేలా ఉండాలంటే ఎలా చెప్పండి? బాబేదో వెరైటీ ప్రయత్నించాడు.. అదో సరదా.. :-) :-)

    రిప్లయితొలగించండి