బుధవారం, ఆగస్టు 17, 2011

కొత్తావకాయా అన్నం

ఆకలి దంచేస్తోంది. ఫ్రిజ్ తీసి చూస్తే అచ్చం అయ్యవారి నట్టిల్లులాగా ఉంది. "మర్చిపోకుండా కూరలు తెచ్చుకోండి" ఇల్లాలి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఏం చేస్తాం, టూ లేట్. మామూలుగా అయితే రాత్రి భోజనం పెద్ద సమస్య కాదు. ఉపద్రవాలేవీ రావు కాబట్టి ఏదో ఒక ద్రవం తాగి నిద్రపోవచ్చు. కానైతే ఇవాళ ఉదయం నుంచీ భోజనం లేదు. రాత్రైనా నాలుగు మెతుకులు నోట్లో వేసుకోక పోతే కష్టం. ఆకలి వేసే కేకలకి, నాలో నిద్రపోతున్న నలుడు నిద్ర లేచాడు. పట్టు వదలకుండా ఫ్రిజ్ వెతికితే, నాలుగే నాలుగు బీన్స్, ఒకే ఒక్కొక్క కేరట్, టమాటా కనబడ్డాయి. ఉల్లిపాయల బుట్టలో ఓ ఉల్లిపాయతో పాటు, ఓ బంగాళా దుంప కూడా దర్శనమిచ్చింది. పచ్చిమిర్చీ, కొత్తిమీరా మాత్రం బుట్టెడు బుట్టెడు ఉన్నాయి.

ఓ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి, రెండో స్టవ్ మీద బాండీ పెట్టాను. వంట ముందుగా ప్లాన్ చేయకుండా అప్పటికప్పుడు చేసేయడం నా అలవాటు. బాండీ లో కొంచం నూనె పోసి, ఉల్లిపాయ, కేరట్, బంగాళాదుంప, బీన్స్ లతో పాటు రెండు పచ్చి మిరపకాయలని చకచకా తరిగేశాను. ఉప్మా పోపులాంటి పోపు వేసేసి, తరిగిన కూర ముక్కల్ని ఒక్కొక్కటిగా దించేసి, మూత పెట్టేసి వచ్చి కంప్యూటర్ ముందు కూర్చున్నాను. 'కొత్తావకాయ..ఘాటుగా' బ్లాగులో 'ప్రేమలో నేను-అరడజను సార్లు' టపా కనిపించగానే కూరలు తరిగినట్టే, చకచకా చదవడం మొదలు పెట్టేశాను. ఎనభైల్లో వచ్చిన యండమూరి నవలల భాషలో చెప్పాలంటే నేనెంత తప్పు చేస్తున్నానో ఆ క్షణంలో నాకు తెలీదు.

ఇంతకుముందోసారి రాధాకృష్ణుల ప్రేమ గురించి మాంచి టపా రాశారు కదా, అలాగే ప్రేమ గురించి అయి ఉంటుందని అపార్ధం చేసుకుంటూ చదవడం మొదలెట్టగానే తెలిసిపోయింది, ఇది ఇంకో రకం ప్రేమని. ఈవిడ టపాలతో సమస్య ఏమిటంటే, ఓ సారి చదవడం మొదలు పెట్టాక, మళ్ళీ ఇంకోసారొచ్చి చదువుదాంలే అనిపించదు, వెంటనే పూర్తి చేసేయాల్సిందే. "పెనం మీద నుంచి నూనె పూసుకొని పొంగి ఆవిరి వదులుతూ ఘుమఘుమలాడే చపాతీ సరాసరి ప్లేట్లోకి దూకు"తున్న సమయంలోనే ఆవిడకి ఏమాత్రం ఇష్టం లేని వంటింట్లోనుంచి ఏదో వాసన తగిలింది. ఆ వాసన నా వంటింట్లోనుంచి అని అర్ధమైన మరుక్షణం, ఒక్క పరుగందుకున్నాను.

బాండీలో కూర మాడుదామా అనుకుంటోంది. కదిపి, కాసిన్ని నీళ్ళు పోసి మూతపెట్టి, మళ్ళీ బ్లాగులోకి వచ్చా. అసలు కొత్తావకాయ పేరేమిటో అనుకుంటూ ఉండగానే 'గంగాబొండం' కూడా ఉందిగా అని గుర్తొచ్చి, నవ్వొచ్చేసింది. ఇన్నాళ్ళూ నోబెల్ శాంతి బహుమతికి అన్ని అర్హతలూ ఉన్న వాళ్ళ నాన్నగారినే మనసులో మెచ్చుకుంటూ ఉన్నాను కానీ, పనసపొట్టు కూర చేయడంలో రాజగోపాల్ మావయ్య ప్రతిభ చదువుతూ ఉండగా ఆయనక్కూడా వీరతాడు వేసేయాల్సిందే అని నిర్ణయించేసుకున్నాను. "తింటున్నంత సేపు ప్రపంచం ఇంద్రధనుస్సు మీద ఊయలలూగడం" దగ్గరికి వచ్చేసరికి వంటగది మళ్ళీ పిల్చింది. అబ్బా.. మల్టీ టాస్కింగ్. మిగిలిన ముక్కలు ఉడికినట్టే ఉన్నాయి కానీ, బీన్సూ, బంగాళాదుంపా కొత్తల్లుళ్ళలా బెట్టు చేస్తున్నాయి.

'అబ్బా.. నాలుగు వంకాయలున్నా బాగుండేది.. సులువుగా కూరో, వేపుడో అయిపోయేది' అనుకుంటూ బాండీలో మరి కాసిని నీళ్ళు పోసి, బ్లాగు దగ్గరికి వచ్చేశా.. విజీనారం ఆడపడుచూ, పసలపూడి కోడలూ అయినటువంటి శ్రీమతి కొత్తావకాయగారు ఏ టాపిక్కైనా ఎంత అలవోకగా రాసేస్తారో కదా అనుకుంటూ. అసలే బ్లాగురాసే విషయంలో మా ఇద్దరి అభిప్రాయాలూ అచ్చంగా ఒకటే కూడాను. ఇటాలియన్ పీజా గురించి కూడా చదివేసి, వ్యాఖ్య రాసి పోస్ట్ చేయగానే మళ్ళీ నా కూర గుర్తొచ్చింది. ఓ సారి కదిపి, కొంచం ఖోపంగా ఉప్పేశా. రుచి చూడబోతే కళ్ళు తడయ్యాయి. ఈ టపా చదివినప్పుడు అయిన తడి లాంటిది కాదు, కూర వేడి మరియు కొంచం ఖారం ఎక్కువ అవ్వడం వల్ల కలిగిన చెమ్మ.

'ఈ వంట అనవసరంగా పెట్టుకున్నా. కొంచం కాఫీ తాగి పడుకుంటే సరిపోయేది' అనుకున్నాను, గరం మసాలా పొడి, పంచదార లాంటివి ఎన్ని కలిపినా కూర రుచి బాగు పడక పోగా మరికొంచం క్షీణించినప్పుడు. కుక్కర్లో మల్లెపువ్వులా తెల్లగా ఉడికిన అన్నాన్ని విడిచిపెట్ట బుద్ధి కాక, ఇల్లాలికి ఫోన్ చేసి "కొత్తావకాయ ఎక్కడుందీ?" అని హడావిడిగా అడిగాను, అటు నుంచి మరి ప్రశ్నలకి తావు లేకుండా. అడ్రస్ దొరగ్గానే టక్కున ఫోన్ పెట్టేసి, బుజ్జి జాడీని పట్టేశా. నేనొండుకున్న కూర నాకేసి జాలిగా చూస్తుండగా, వేడన్నంలో నేను కలుపుకున్న కొత్తావకాయని చూసీ చూడగానే మళ్ళీ నాక్కలిగిన ఆశ్చర్యార్ధకం ఒక్కటే.. "ఈ అక్షరాలు నా చెలికత్తెలు" అని ఎంత చక్కగా చెప్పుకోగలిగారో కదా! అని.

27 కామెంట్‌లు:

  1. వేడిగా పొగలు కక్కుతూ, కొత్తిమీర ఘుమఘుమలతో నోట్లోకి ప్రవేశించిన ఆ మసాలా ఏమేం చేస్తుందో తెలుసా.. నాలుక మీద రుచుల విస్ఫోటనం!!! (మాకు విస్పోటనం మీద విస్పోటనం అవుతోందండి బాబూ)

    "అరవై ఆరు కళల్లో పనసపొట్టు కొట్టడం ఒకటి" అని నేను నమ్ముతాను.(ఎందుకు నమ్మం ఇంత చెపాకా కూడా,అంతేసి తిన్నాక కూడా)

    హ్హహ్హహ్హ వర్ణనాతీతం అండి బాబూ సువర్ణాతీతం ఈ బ్లాగ్.ఆ పేరు(కొత్తావకాయ)తలుస్తేనే నాలుకమీద రసాయనిక చర్య ప్రారంభం అయిపోతుంది,ఇంక ఇలా రాసేస్తూ ఉంటే ఎలా లావాలా పొంగిపొర్లడమే మరి.

    రిప్లయితొలగించండి
  2. వావ్ మురళీగారూ....మా కొత్తావకాయగారి గురించి భలే టపా రాసారు :) నాకు వారి భాష బాగా నచ్చుతుంది. ఇంకా టపామొత్తంలో ఎక్కడా అప్పుతచ్చులు ఉండవ్! పొందిగ్గా అమరిన మంచి ముత్యాల దండలాగా ఉంటుంది వారి బ్లాగ్! ఇంకా చిట్టి-పొట్టి కథలు భలే చెప్తారు! ఎంత మీ కూర మాడిపోయినా ఆ లేటెస్ట్ రుచుల టపా చదువుతూ ఒఠ్ఠి అన్నమైనా తినేయొచ్చులెండి :)

    రిప్లయితొలగించండి
  3. మంచి బ్లాగ్ గురించి బహుకమ్మగా పరిచయం చేశారు మురళి గారు :-) తన పోస్టుల గురించి మీరు చెప్పిన ప్రతిమాటా అక్షర సత్యమే.. నేను ఒకోసారి పోస్ట్ చూసి చాలా పెద్ద పోస్ట్ తర్వాత చదువుదాంలే అనుకుని ఉండబట్టలేక ఒక పేరా మొదలుపెడతాను.. పూర్తిచేశాక కానీ మొత్తం చదివేశానని తెలియదు :-)

    రిప్లయితొలగించండి
  4. నిద్రకళ్ళతో ఉదయాన్నే తలుపు తెరిచి ఆవులిస్తూ, గుమ్మంలో పడి ఉన్న న్యూస్ పేపర్ తీసి తెరవగానే మొదటి పేజీలో మన ఫోటో వేసేసి, ఆహా.. ఓహో.. అని రాసేస్తే ఒక్క క్షణం ఏమైపోతాం! హాచ్చెర్యం... మహదానందం.. మాటల్లేవ్.

    ఎస్.పీ బాలు ని అరువడిగి ఓ మాట తెచ్చుకున్నా మీకు చెప్దామని.."చిర ఋణగ్రస్తురాలిని." థాంక్ యూ మురళి గారూ!

    "ఉపద్రవాలు.. యండమూరి.. కొత్తల్లుళ్ళూ .." కిసుక్కున నవ్వించారు.

    రిప్లయితొలగించండి
  5. :) మీరు భోజనం సమయం లో చదివారు. నేను పొద్దున్నే లేచి టీ తాగేముందు చదివా.. దానితో వెంటనే.. కోతాస్ కాఫీ పాకెట్ కోసి.. కనీసం ఒకటి ఎంజాయ్ చేశాను ..

    రిప్లయితొలగించండి
  6. కొత్తావకాయ గారి బ్లాగు ఎంత బావుందో , మీ పరిచయం కూడా అంత బావుంది ! ఆవిడ రాసిన పోస్టల్లో నాకు బాగా నచ్చింది , "మా నాన్నగారికి నోబెల్ శాంతి బహుమతి? " అంటే మిగిలినవి తక్కువ అని కాదు , అది కొంచెం ఎక్కువ అని :))))

    రిప్లయితొలగించండి
  7. మురళిగారు, ఇన్నాళ్ళు 'కొత్తావకాయ' వ్యాఖ్యలను అనేకానేక బ్లాగులలో చూసి ఎవరో అబ్బాయికి ఆవకాయంటే మోజు అనుకునే వాడిని. మంచి బ్లాగును పరిచయం చేశారు.

    కొత్తావకాయ జాడిలో చాలా ఉన్నాయి రుచి చూడవలసినవి. శెలవే మరి :)

    రిప్లయితొలగించండి
  8. ఆహా.. నిజంగా కొత్తావకాయ వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తిన్నట్లుగా ఉంది, కొత్తావకాయ గారి టపాలు చదువుతున్నా, ఆ బ్లాగు గురించి మీ వ్యాఖ్యానం చదువుతున్నా కూడానూ.. అద్భుతమైన పరిచయం.

    రిప్లయితొలగించండి
  9. కొత్తావకాయని బాగా పరిచయం చేసారు, భేష్!

    రిప్లయితొలగించండి
  10. సెబాస్ సెబాస్...బాగా రాసారు.
    కొత్తవకాయ్....నా ఫ్రెండివి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందోయ్!

    రిప్లయితొలగించండి
  11. ముందుగా కొత్తావకాయ గారూ నన్ను క్షమించాలి . ఇంతవరకూ మీ బ్లాగు రుచి చూడలేకపోయినందుకు . వచ్చేస్తున్నా .....పళ్ళెం సర్దెయ్యండి .
    మురళీ గారు బ్లాగు పరిచయం భలేవుందండీ . ఉమ్మ్....కమ్మగా ఖారంగా ...

    రిప్లయితొలగించండి
  12. కొత్తావకాయ (టపాల)రుచులు మీ (ఉపమానాల)నేతితో కలిసి.. మరింత నోరూరించాయి మురళిగారు..

    రిప్లయితొలగించండి
  13. నేను తరచుగా చూసే మంచి బ్లాగుని మీ తరహాలో చేసిన పరిచయం చాలా బాగుంది.

    కొన్ని బ్లాగుల్లోకి అడుగుపెడితే వేరే పనులున్నా పోస్ట్ చదవడం అయ్యేదాకా బ్లాగులోంచి కాలు బయటపెట్టలేం. అలాంటి బ్లాగుల్లో ముందుండేది కొత్తావకాయ..

    Nice post..

    రిప్లయితొలగించండి
  14. ఇప్పుడే చూసి వస్తున్నా వారి బ్లాగును. భలేవుంది. జాడి అని, లొట్టలేయించిన పోస్టులని, శనగలు అని..... ఇక చదవడం మొదలుపెట్టాలి....చక్కటి బ్లాగు పరిచయం చేశారు మురళిగారు.

    రిప్లయితొలగించండి
  15. మురళిగారు,
    చాలా బాగుంది కొత్తకాయ అన్నం
    నేను ఈ మద్య చూశాను కొత్తావకాయ ని..తెగ నచ్చేసింది నాకు...మీరు నమ్ముతారో లేదోచుసిన మొదటిరోజు మూడువంతుల బ్లాగ్ ఏకబిగిని చదివేశాను..మర్నాడే మిగతా పావు చదివేశా.. అన్ని పదార్ధాలు సమతూకంగా పడితే ఆ రుచే వేరు కదా అదే కొత్తావకాయ!!నేను చదివిన మొదటి పోస్ట్ తోనే అభిమానసంఘపెట్టేయాలని డిసైడ్ అయిపోయాను...

    రిప్లయితొలగించండి
  16. @శ్రీనివాస్ పప్పు: ఆయా ఆహార పదార్ధాల రుచుల కన్నా, అక్షరాల రుచి మిన్నగా అనిపిస్తూ ఉంటుందండీ చాలాసార్లు.. ధన్యవాదాలు.
    @హరేకృష్ణ: ధన్యవాదాలండీ..
    @ఇందు: నిజమండీ. మీరు చెప్పినవన్నీ నేనుకూడా గమనించా.. కూర గురించి నో రిగ్రెట్స్, కొత్తావకాయ ఉందిగా :-) :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @వేణూ శ్రీకాంత్: అవును వేణు గారూ, నా అనుభవమూ అదే.. ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: మీ వ్యాఖ్య చూసి నాక్కూడా మాటల్లేవండీ.. బాలూని బతిమాలితే పాత కక్షలు కడుపులో పెట్టుకుని కుదరదనేశాడు.. నేనే ఏదోలా గొంతు పెగుల్చుకుని చెబుతున్నా.. I am honoured.
    @కృష్ణప్రియ: మీకు కనీసం కొత్తాస్ కాఫీ అన్నా అందుబాటులో ఉంది.. అది కూడా లేనివారి పరిస్థితి ఆలోచించండీ కొంచం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @శ్రావ్య వట్టికూటి: నేను కొంచం ఎక్కువసార్లు చదివానండీ ఆ పోస్టుని, నా వోటూ దానికే అని ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి? :-) ..ధన్యవాదాలు.
    @శ్రీ: ఈపాటికి రుచి చూడడం అయిపోయే ఉంటుంది కదండీ.. భుక్తాయాసంతో ఉండి ఉంటారు :-) ధన్యవాదాలు.
    @మనసు పలికే: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  19. @సునీత: రుచి చూసేయండి కొత్తావకాయని :-) ..ధన్యవాదాలు.
    @శ్రీ: ధన్యవాదాలండీ..
    @ఆ.సౌమ్య: హబ్బో..హబ్బో... ;)) ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  20. @లలిత: వెళ్లి వచ్చేశారా ఇంతకీ? ధన్యవాదాలు.
    @రవికిరణ్: నెయ్యే!! పెద్ద ప్రశంశే అయితే.. ధన్యవాదాలండీ.
    @గీతిక: నిజమండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @నాగార్జున: ఇంకెందుకాలస్యం? చదివేయండి మరి.. ధన్యవాదాలు.
    @సుభద్ర: సేం పించండీ ఇక్కడ కూడా. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. బ్లాగులోని టపాలని మీరు చెప్తున్న మాటల్లో కలిపేసి, ఎక్కడా కూడా ఈ టపా గురించి చెప్పడం కోసం ఈ వాక్యాన్ని చొప్పించారు అన్న చిన్న ఫీల్ కూడా చదివేవారికి కలుగనీయకుండా ప్రతి బ్లాగునీ 'అనగనగా' కథలా పరిచయం చేస్తారు చూశారా. మీ ఆ శైలికి జోహార్లు.
    ఇక కొత్తావకాయ గారి గురించి - నాకు కొత్తావకాయ కంటే కొత్తావకాయ బ్లాగరు రచనా శైలి ఎక్కువ ఇష్టమేమో అనిపిస్తుంటుంది ఆ బ్లాగు చదివిప్పుడు.

    రిప్లయితొలగించండి
  23. @శిశిర: "నాకు కొత్తావకాయ కంటే కొత్తావకాయ బ్లాగరు రచనా శైలి ఎక్కువ ఇష్టమేమో అనిపిస్తుంటుంది ఆ బ్లాగు చదివిప్పుడు." యెంత బాగా చెప్పారు!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. గత పదిహేను రోజులగా బ్లాగులు రెగ్యులర్ గా చూడడం కుదరలేదు. ఇది మిస్ అయిపోయాను. అందరూ కామెంటు టపాకాయలు పేల్చేసిన తరువాత మళ్ళీ కాకరపూవ్వొత్తు సాధారణంగా వెలిగించను. కానీ ఈ పాత టపాలో ఇప్పుడు కామెంటు పెట్టకుండా ఉండలేకపోయాను.

    ముందుగా నేను ఆ.సౌమ్య గారికి థాంక్స్ చెప్పుకుంటాను, కొత్తావకాయ గారి బ్లాగును పరిచయం చేసినందుకు. చదవడం మొదలు పెట్టినప్పటినుంచి నేను ఆ బ్లాగు కు వీరాభిమాని నై పోయాను. ఆవిడ శైలి, పదాల కూర్పు , సునిశిత హాస్యం అన్నీ నాకు బాగా నచ్చుతాయి. మీరు పరిచయం చేసిన విధానం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  25. @బులుసు సుబ్రహ్మణ్యం: శైలి, పదాల కూర్పు, సునిశిత హాస్యం... నాది కూడా ఓ డిట్టో వేసుకోండి!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి